పని చేయండి, ఫలితం కోసం చూడొద్దు

పని చేయండి, ఫలితం కోసం చూడొద్దు


జాబ్ స్కిల్స్: సమయాన్ని వెచ్చించి, తగినంత కృషి చేస్తే కెరీర్‌లో అనుకున్న లక్ష్యాలను సాధించడం సులువే. చేస్తున్న పనిపై కాకుండా రాబోయే ఫలితంపైనే దృష్టి పెడితే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు.. మీ పని మీరు చేయండి, ఫలితాన్ని దైవానికి వదిలేయండి. పని ముందు, ఫలితం తర్వాత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

 

 పని చేయకుండానే విజయం వరిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. నిజంగా చాలా బాగుంటుంది. ఫలితం ముందు, పని తర్వాత అనే వెసులుబాటును ఎవరైనా ఇస్తే చాలా సమస్య లు, కష్టాలు ఉండవని అనిపిస్తుంది. కానీ, పని చేయకుండానే సక్సెస్ సాధించే అవకాశం ఎంత మాత్రం లేదు. కెరీర్‌లో, ఉద్యోగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే చెమటోడ్చాల్సిందే. మరో మార్గం లేదు. అయితే, చేస్తున్న శ్రమ సరిపోతుందా? లేదా? అనేది ఎప్పటికప్పుడు గుర్తించాలి. ఎంత కష్టపడినా ఆశించినది దక్కడం లేదు అని చింతిస్తూ కూర్చోవద్దు. ఇంకా ఎక్కువ శ్రమించాలి. దక్కబోయే ప్రతిఫలం కోసం చూడకుండా పనిచేసుకుంటూ ముందుకెళ్లాలి.

 

 కంఫర్ట్ జోన్.. క్షేమం కాదు  

 చాలామంది కష్టమైన దానికంటే సులభమైన దారిలోనే వెళ్లాలనుకుంటారు. చేదు కంటే తీపినే ఎక్కువగా కోరుకుంటారు. ఏదైనా కష్టపడకుండానే సులభంగా రావాలని ఆశిస్తారు. కానీ, హార్డ్‌వర్క్‌తోనే గొప్ప విజయం వస్తుందనేది ముమ్మాటికీ నిజం. కెరీర్‌లో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు ఎప్పుడైనా మొదట శ్రమించడం ద్వారానే వస్తాయి. ఎక్కువ పనిచేస్తేనే ఎక్కువ విజయం సాధ్యమవుతుంది. ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్‌లోనే ఉండాలనుకుంటే అక్కడే ఉండిపోతారు. కెరీర్‌లో ఎదగాలని కోరుకునేవారికి అది అంతగా క్షేమకరం కాదు. లక్ష్యానికి చేరువ కావాలనుకుంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి, కార్యాచరణ ప్రారంభించాలి. అలాచేస్తే ఎప్పటికైనా కోరుకున్న విజయం, ప్రశంసలు, పురస్కారాలు వాటంతట అవే వస్తాయి.

 

 శ్రమ ఫలించడం తథ్యం

 హార్డ్‌వర్క్‌కు మరో ప్రత్యామ్నాయం లేదు. దీన్ని చాలామంది అర్థం చేసుకొని, అంగీకరిస్తారు. కానీ, కొందరు అనుకున్నది కచ్చితంగా లభిస్తుందనే హామీ ఉంటేనే కష్టపడానికి ముందుకొస్తారు. అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటామో లేదో అనే కారణంతో  పనిచేయడం ఆపేస్తే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్ని సాధించేందుకు కష్టపడండి, అంతా మంచే జరుగుతుందనే ఆత్మవిశ్వాసంతో ఉండండి. రాబోయే దాని కోసం ఎదురు చూడకుండా పనిచేసుకుంటూ వెళ్లండి. అప్పుడు ఏదైనా జరగొచ్చు. ఎవరు చెప్పగలరు, మీరు కోరుకున్న దానికంటే ఎక్కువే లభించవచ్చు. హామీలు లేవు కాబట్టి, దేన్నో ఆశించి, అది రాకపోతే బాధపడొద్దు. మీలోని పూర్తి శక్తిని వెలికితీసి, పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చు. లక్ష్యాన్ని చేరుకునేదాకా శ్రమనే నమ్ముకోండి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయత్నాన్ని విరమించుకోవద్దు. శ్రమ ఎప్పటికైనా ఫలిస్తుంది.

 

విజయం... వెంటనే రాదు


 అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలనే అత్యాశ, తొందరపాటు ఉండొద్దు. విజయమనేది రమ్మని పిలవగానే వచ్చేయదు. దానికి కొంత సమయం పడుతుంది. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. సక్సెస్ వేగం తక్కువైనంత మాత్రాన అది ఇక ఎప్పటికీ రాదని అనుకోవద్దు అది నెమ్మదిగా రావడంలోనూ మంచి లాభాలే ఉంటాయి. పనిలో తప్పుల సంఖ్య తగ్గుతుంది. నైపుణ్యాలు, అనుభవం పెంచుకోవచ్చు. స్లో అండ్ స్టెడీ విన్స్ ద రేస్. ఆ పరుగు ఎంతసేపు జరుగుతుంది? ఎక్కడ ముగుస్తుంది? అనేది మీకు తెలియకపోవచ్చు. కానీ, పరుగును ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటే ఎక్కడో ఒకచోట గమ్యస్థానం తప్పకుండా తగులుతుంది.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top