MBA డిస్టెన్స్‌ vs ఎగ్జిక్యూటివ్‌

MBA డిస్టెన్స్‌  vs ఎగ్జిక్యూటివ్‌


ఉద్యోగం చేస్తూ.. కెరీర్‌లో ఉన్నతంగా ఎదిగేందుకు వీలుగా ఎంబీఏ చదవాలంటే.. రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ, డిస్టెన్స్‌ ఎంబీఏ. అయితే ఈ రెండు మార్గాల్లో ఏది బెస్ట్‌? ఏ విధానంలో సర్టిఫికెట్‌ పొందితే తన ప్రొఫైల్‌ విలువ పెరుగుతుంది? తదితర ప్రశ్నలకు సమాధానంగా ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ, డిస్టెన్స్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌ల విధివిధానాలపై విశ్లేషణ..



ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ, డిస్టెన్స్‌ ఎంబీఏ.. ఈ రెండు ప్రోగ్రామ్‌ల ఉద్దేశం ఒకటే. ప్రవేశం పొందిన విద్యార్థులు క్లాస్‌లకు పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు పేర్కొన్న నిర్ణీత రోజులు, సమయాల్లో తరగతులకు హాజరైతే సరిపోతుంది. అయితే ఈ విషయంలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌లకు, డిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌లకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది.



ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ..

దేశంలో ఐఐఎంలు సహా ప్రముఖ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌.. పీజీ ప్రోగ్రామ్‌ ఫర్‌ వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పేరుతో ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధి గల ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. అన్ని స్పెషలైజేషన్లలోనూ ఈ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ప్రవేశానికి పని అనుభవం తప్పనిసరి. సాధారణంగా.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల నిబంధనల మేరకు కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టంగా పదేళ్ల పని అనుభవం కనీస అర్హతగా నిర్దేశిస్తున్నాయి.



ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏలో బోధన పరంగా ఇన్‌స్టిట్యూట్‌లు వివిధ విధానాలను అనుసరిస్తున్నాయి. అధిక శాతం సంస్థలు పార్ట్‌–టైం పేరుతో ఈవెనింగ్‌ తరగతులు నిర్వహిస్తుండగా.. ఐఐఎంలు, మరికొన్ని ప్రముఖ బి–స్కూల్స్‌ వారాంతాల్లో తరగుతులు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఒక సెమిస్టర్‌ వ్యవధిలో తప్పనిసరిగా కొన్ని రోజులు ఇన్‌స్టిట్యూట్‌లో క్లాస్‌రూం లెక్చర్స్‌కు హాజరుకావాలన్న నిబంధనను పాటిస్తున్నాయి. ఈ విషయంలో ఉద్యోగులు కొంత ఇబ్బంది పడుతున్నారు. పార్ట్‌–టైం క్లాస్‌లకు నిర్దేశిస్తున్న సమయానికి తమ విధులు ముగియకపోవడం లేదా తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూట్‌ లెక్చర్స్‌కు హాజరవ్వాల్సిన సమయంలోనే ఉద్యోగ రీత్యా అసైన్‌మెంట్స్‌ ముందుగానే షెడ్యూల్‌ కావడం వంటివి ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి.



డిస్టెన్స్‌ ఎంబీఏ

వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్స్, తాజా గ్రాడ్యుయేట్స్‌ ఎవరైనా సరే ప్రవేశించేందుకు ఆస్కారం కల్పిస్తున్న మార్గం డిస్టెన్స్‌ ఎంబీఏ. ప్రస్తుతం దేశంలో అన్ని యూనివర్సిటీలు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విధానంలో రెండు లేదా మూడేళ్ల వ్యవధిలో ఉండే ఎంబీఏ కోర్సులు అందిస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌లతో పోల్చితే డిస్టెన్స్‌ ఎంబీఏలో ఉండే సౌలభ్యత.. ఫ్లెక్సిబుల్‌ లెర్నింగ్‌ విధానం. డిస్టెన్స్‌ ఎంబీఏ కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు సంప్రదాయ కాంటాక్ట్‌ క్లాసెస్‌ విధానాన్ని అమలు చేస్తూనే.. ఓపెన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో ఆన్‌లైన్లో లెక్చర్స్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి.



ఫలితంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ రెగ్యులర్‌ షెడ్యూల్స్‌కు ఆటంకం కలగని రీతిలో క్లాస్‌లు వినే అవకాశం లభిస్తోంది.ఎగ్జిక్యూటివ్‌లోనూ ఆన్‌లైన్‌ లెక్చర్స్‌: ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏలోనూ ఇన్‌స్టిట్యూట్‌లు ఆన్‌లైన్‌ లెక్చర్స్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. కొన్ని ప్రముఖ బి–స్కూల్స్‌ మరో అడుగు ముందుకేసి ఆన్‌లైన్‌ లైవ్‌ లెక్చర్స్‌ సదుపాయం కల్పిస్తున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు నేరుగా నిర్దేశిత వెబ్‌సైట్‌ ద్వారా ఒక ప్రొఫెసర్‌ చెప్పే పాఠాన్ని లైవ్‌ మెథడ్‌లో వినొచ్చు. అదే విధంగా ఆన్‌లైన్‌ చాట్‌ సెషన్స్‌ పేరుతో ప్రొఫెసర్లతో సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.



స్పెషలైజేషన్‌ ఎంపికలో జాగ్రత్తగా

ఎగ్జిక్యూటివ్, డిస్టెన్స్‌ ఈ రెండు విధానాల్లో ఎంబీఏ ప్రోగ్రామ్‌ల ఔత్సాహికులు ఎంపిక చేసుకునే స్పెషలైజేషన్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణంగా వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఉద్యోగరీత్యా అప్పటికే తాము పనిచేస్తున్న విభాగానికి సంబంధించిన స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకుంటారు. అయితే వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు సదరు కోర్సుల స్వరూపం, వాటిలో స్వయం సన్నద్ధత దిశగా తమ బలాలను బేరీజు వేసుకోవాలి. తప్పనిసరిగా నిర్దిష్టంగా ఒక స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవాల్సిన నేపథ్యంలో ఇతర శిక్షణ అవకాశాల (ప్రైవేటు  ట్యూషన్స్, ఈ–ట్యూషన్స్‌ తదితర)ను చూసుకోవాలి. వాస్తవానికి డిస్టెన్స్‌ ఎంబీఏ విద్యార్థులు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తేనే తాము చేరిన స్పెషలైజేషన్‌కు సంబంధించి స్పెషలైజ్డ్‌ నైపుణ్యాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.



రెగ్యులర్‌ కోర్సు తరహాలోనే డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విధానంలోనూ నైపుణ్యాలు పొందే అవకాశాలు ఇప్పుడు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌ లెక్చర్స్, మూక్స్‌ వంటి వాటిని వీటికి ఉదాహరణలుగా పేర్కొనొచ్చు. అభ్యర్థులు ఒక ఇన్‌స్టిట్యూట్, కోర్సును ఎంపిక చేసుకునే ముందు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ గుర్తింపు, సదరు ఇన్‌స్టిట్యూట్‌కు ఏఐసీటీఈ గుర్తింపు ఉందో లేదో తెలుసుకోవాలి.

– ప్రొఫెసర్‌ కె.రమేశ్, డిప్యూటీ డైరెక్టర్, ఇగ్నో

హైదరాబాద్‌ రీజనల్‌ సెంటర్‌.




 గుర్తింపుపై అప్రమత్తంగా

ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ, డిస్టెన్స్‌ ఎంబీఏ.. విధానమేదైనా అభ్యర్థులు ప్రధానంగా ఆరా తీయాల్సిన అంశం సదరు కోర్సు పూర్తయ్యాక ఇన్‌స్టిట్యూట్‌ ఇచ్చే సర్టిఫికెట్‌కు జాబ్‌ మార్కెట్లో, ఇండస్ట్రీ వర్గాల్లో లభిస్తున్న గుర్తింపు. ఐఐఎంలు, ఇతర బి–స్కూల్స్‌ అందించే ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్స్‌కు ప్రభుత్వ నియంత్రణ సంస్థల గుర్తింపు లేకపోయినా.. ఇండస్ట్రీ వర్గాల్లో గుర్తింపు ఉంటోంది. అంతేకాకుండా ఈ కోర్సులను అప్పటికే వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నవారికే పరిమితం చేయడం కారణంగా ఉద్యోగాలు పొందే విషయంలోనూ వారికి ఇబ్బందులు ఎదురవడం లేదు. కానీ, డిస్టెన్స్‌ ఎంబీఏ విధానంపై మాత్రం భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ నియామక ప్రకటనల్లో తప్పనిసరిగా ఫుల్‌టైం ఎంబీఏ చదివిన విద్యార్థులే అర్హులని పేర్కొంటున్నాయి.



డిస్టెన్స్‌ విధానంతో పోల్చితే  ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ కోర్సుల ఫీజులు కొంత అధికంగా ఉంటున్నాయి. ఇవి కనిష్టంగా రూ. లక్ష నుంచి రూ. మూడు లక్షల మధ్యలో ఉంటున్నాయి. కానీ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విధానంలో మాత్రం రూ. లక్షలోపే కోర్సు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తోంది.



ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో చేరే అభ్యర్థులు సంబంధిత ప్రోగ్రామ్‌ల బోధన పరంగా నిర్దేశించిన సమయ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈవెనింగ్‌ క్లాసెస్‌ ఉండే పార్ట్‌ – టైం ఎంబీఏ కోర్సుల్లో చేరే అభ్యర్థులు తమ రెగ్యులర్‌ విధులకు ఇబ్బంది లేని ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులను ఎంపిక చేసుకోవడం మేలు. ఇక.. జాబ్‌ మార్కెట్లో గుర్తింపు విషయంలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేదు.

– ప్రొఫెసర్‌ ఎ.ప్రభుకుమార్, డైరెక్టర్, ఎస్‌ఎంఎస్,

జేఎన్‌టీయూ–హెచ్‌.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top