బ్రిటన్ ఎన్నికల్లో కామెరూన్ విజయం


 అంతర్జాతీయం

 బ్రిటన్ ఎన్నికల్లో కామెరూన్ విజయం

 బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ విజయం సాధించారు. బ్రిటన్ పార్లమెంటులోని 650 స్థానాలకు మే 7న ఎన్నికలు జరగ్గా, కామెరూన్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 331 స్థానాల్లో విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్ష లేబర్ పార్టీ 232 స్థానాలు గెలుపొందింది. ఎడ్ మిలిబండ్ నాయకత్వంలో పోటీచేసిన లేబర్ పార్టీ గతంలో కన్నా 26 స్థానాలు తక్కువగా సాధించింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునేందుకు తీసుకున్న చర్యలు, కొత్తగా రెండు మిలియన్ల ఉద్యోగాలు కల్పించడం వంటివి కన్సర్వేటివ్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. ఎస్‌ఎన్‌పీకి చెందిన 20 ఏళ్ల హైరీ బ్లాక్ ఎంపీగా ఎన్నికైంది. బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైన పిన్న వయస్కురాలిగా ఆమె గుర్తింపు సాధించారు. పార్లమెంట్‌కు ఎన్నికైన 10 మంది భారత సంతతికి చెందిన వారిలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ఉన్నారు.

 

 ఫ్రెంచ్ వ్యంగ్యపత్రిక చార్లే హెబ్డోకు పెన్ అవార్డు

 ఫ్రెంచ్ వ్యంగ్య పత్రిక చార్లే హెబ్డోకు పెన్ అమెరికన్ సెంటర్ అవార్డును మే 5న న్యూయార్క్‌లో ప్రదానం చేశారు. ఫ్రీడమ్ ఎక్స్‌ప్రెషన్ కరేజ్ అవార్డును హెబ్డో పత్రిక చీఫ్ ఎడిటర్ గెరార్డ్ బివార్డ్ స్వీకరించారు.

 

 భూవాతావరణంలో మండిపోయిన రష్యా వ్యోమనౌక

 రష్యాకు చెందిన మానవరహిత వ్యోమనౌక ప్రోగ్రెస్-59 భూవాతావరణంలో ప్రవేశించి మే 8న మండిపోయింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు సరుకులు తీసుకెళ్తూ మధ్యలో విఫలమై కొన్ని రోజులుగా కక్ష్యలో తిరుగుతోంది. ఈ నౌకను సోయజ్ రాకెట్ ద్వారా ఏప్రిల్ 28న కజకిస్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇది 418 కి.మీ. ఎత్తులో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి చేరుకోలేకపోయింది. ప్రయోగించిన 9 నిమిషాలకు రాకెట్ నుంచి వేరుపడి సంబంధాలు కోల్పోయింది.

 

 ఇద్దరు రాయబారులు మృతి

 పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హెలికాప్టర్‌ను తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉగ్రవాదులు మే 8న కూల్చివేయడంతో ఇద్దరు రాయబారులు మరణించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మరణించగా వీరిలో ఫిలిప్పిన్స్, నార్వే రాయబారులు, మలేసియన్, ఇండొనేషియన్ రాయబారుల భార్యలు ఉన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రయాణిస్తున్నారని భావించి, క్షిపణితో ఉగ్రవాదులు హెలికాప్టర్‌ను కూల్చివేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రాజెక్టులు ప్రారంభించడానికి పాక్ ప్రధానితో పాటు రాయబారులు మూడు హెలికాప్టర్లలో బయలుదేరివెళ్లారు. ప్రధాని షరీఫ్ సురక్షితంగా ఇస్లామాబాద్ చేరుకున్నారు.

 

 జాతీయం

 నౌకా స్థావరం ‘ఐఎన్‌ఎస్ సర్దార్ పటేల్’ ప్రారంభం

 వ్యూహాత్మకంగా ప్రాధాన్యత గల కొత్త నౌకా స్థావరం ఐఎన్‌ఎస్ సర్దార్ పటేల్‌ను గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ మే 9న ప్రారంభించారు. ఇది గుజరాత్‌లో రెండో నౌకా స్థావరం. ఓఖా సమీపంలో ఉన్న ఐఎన్‌ఎస్ ద్వారక మొదటి స్థావరం. 1,600 కి.మీ. కోస్తా తీరం గల గుజరాత్‌లో కొత్తగా ప్రారంభించిన రెండో నౌకా స్థావరం మరింత భద్రతను పెంపొందిస్తుందని భారత నౌకాదళ ఉన్నతాధికారులు తెలిపారు. గుజరాత్‌లోని ఓడరేవుల నుంచి ఏడాదికి 300 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది.

 

 సైన్యానికి ఆకాశ్ క్షిపణి అప్పగింత

 దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణిని మే 5న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సైన్యానికి అప్పగించారు. 20 కి.మీ. ఎత్తులో 25 కి.మీ. వరకు గగనతలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్‌కు ఉంది. ఈ క్షిపణి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించేందుకు, ఎక్కడికైనా తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆకాశ్‌లో అత్యాధునిక రాడార్లు, కంట్రోల్ వ్యవస్థలు ఉండడంతో క్షిపణిని లక్ష్యం వైపు నడిపిస్తాయి. ఏ రకమైన వాతావరణ పరిస్థితిలోనైనా ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగలదు. ఆకాశ్‌ను భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. మూడు దశాబ్దాల కృషితో భారత్ ఆకాశ్‌ను రూపొందించింది. 1984 నుంచి డీఆర్‌డీఓ రూపొందించిన ఐదు క్షిపణుల్లో ఆకాశ్ ఒకటి. వైమానిక రంగానికి చెందిన క్షిపణి కంటే.. సైన్యానికి చెందిన ఆకాశ్ క్షిపణి ఎటువంటి ప్రమాదాల వైపైనా వేగంగా కదిలే సామర్థ్యం కలిగి ఉంటుంది.

 

 ఎడ్యూక్లౌడ్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్

 క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత సేవలు ఎడ్యూక్లౌడ్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియా మే 5న ప్రారంభించింది. దీనిద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత డిజిటల్ విద్యా సేవలను అందిస్తారు. డిజిటల్ తరగతి గదులు, వర్చువల్ లెర్నింగ్ ఉంటుంది. ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి కంప్యూటర్ పరికరాల ద్వారా విద్యా బోధన సాగుతుంది. దేశంలో వచ్చే 18 ఏళ్లలో 1500 విద్యా సంస్థల ద్వారా 60 లక్షల విద్యార్థులు, 10 లక్షల బోధకులకు ఈ విధానాన్ని అందిస్తారు.

 

 వస్తు, సేవల బిల్లుకు ఆమోదం

 వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభ మే 6న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాష్ట్రాలు, కేంద్రం వస్తు, సేవల పన్ను వసూలుకు వీలుకల్పిస్తుంది. సేవల పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంప్ డ్యూటీ, ఎంట్రీ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్‌లను వస్తు, సేవల పన్నులో కలిపేస్తారు. దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్ను వ్యవస్థ అమలు చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ఆమోదం తర్వాత 29 రాష్ట్రాల్లో.. సగం రాష్ట్రాలు ఈ బిల్లుకు ఆమోదం తెలపాలి. 2016 ఏప్రిల్ నుంచి జీఎస్‌టీని అమల్లోకి తేవాల్సి ఉంది. నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన జీఎస్‌టీ పన్ను రేటు 27 శాతం కంటే పన్ను రేటు తక్కువగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

 

 మూడు సామాజిక భద్రత పథకాలు ప్రారంభం

 కోల్‌కతాలో మే 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు సామాజిక భద్రత పథకాలను ప్రారంభించారు. ఇందులో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), అటల్ పించన్ యోజన(ఏపీవై)లు ఉన్నాయి. ఈ పథకాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పీఎంఎస్‌బీవై: ఇది వ్యక్తిగత బీమా పథకం. 18-70 ఏళ్ల మధ్య వయసున్న వారు ఇందులో చేరవచ్చు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా, శాశ్వతంగా వికలాంగులైనా రూ.రెండు లక్షల పరిహారం లభిస్తుంది. బ్యాంకు ఖాతా నుంచి సంవత్సరానికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. ప్రతి సంవత్సరం రెన్యూవల్ కోవాల్సి ఉంటుంది. పీఎంజేజేబీవై: ఇది జీవిత బీమా పథకం. రూ.2 లక్షల బీమా కవరేజీ ఉంటుంది. 18-50 ఏళ్ల వయసు వారికి వర్తిస్తుంది. బ్యాంకు సేవింగ్స్ ఖాతా ద్వారా ఈ పథకంలో చేరాలి. వార్షిక ప్రీమియం రూ.330. బీమాదారుడు మరణిస్తే ఈ పాలసీ నుంచి రూ.2 లక్షలు అందుతుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఏపీవై: అసంఘటిత రంగంలోని వారికి ఉద్దేశించిన పించన్ పథకం. బ్యాంకు ఖాతా ఉన్నవారందరికీ ఇది వర్తిస్తుంది. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం 20 సంవత్సరాల పాటు పథకంలో కొనసాగాలి. 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.1000 పించన్ పొందాలంటే ప్రతి నెల రూ.42, నెలకు రూ.5,000 పొందాలంటే రూ.210 చెల్లించాలి.

 

 భూ సరిహద్దు ఒప్పంద బిల్లుకు ఆమోదం

 బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు ఒప్పందం బిల్లుకు రాజ్యసభ మే 6న ఆమోదం తెలిపింది. లోక్‌సభ మే 7న ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణ (119) బిల్లు-2013 భారత బంగ్లాదేశ్ భూ సరిహద్దు ఒప్పందం-1974 అమల్లోకి వచ్చేందుకు తోడ్పడుతుంది. ఇది పార్లమెంట్ ఆమోదం పొందిన 100వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర, అసోంలోని కొన్ని భూభాగాలను బంగ్లాదేశ్‌కు ఇచ్చి కొన్నింటిని ఆ దేశం నుంచి భారత్ పొందుతుంది. భూ సరిహద్దులను ఖరారు చేసుకోవడం వల్ల అక్రమ వలసలను నిరోధించవచ్చని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.

 

 బాలనేరస్థుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

 హేయమైన నేరాలకు పాల్పడే 16-18 వయసు వారిని జువెనైల్ చట్టం కింద కాకుండా భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద విచారించి శిక్షించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ మే 7న ఆమోదం తెలిపింది. హత్య, మానభంగం వంటి నేరాలు హేయమైన/క్రూర నేరాల కిందికి వస్తాయి. కొత్త చట్టం ప్రకారం బాల నేరస్థులకు జీవిత ఖైదు, మరణశిక్ష విధించరు. బాలనేరస్థుడికి ఎలాంటి శిక్ష విధించినప్పటికీ 21 ఏళ్లు నిండేవరకు బాల నేరస్థుల కేంద్రంలో ఉంచుతారు. 21 ఏళ్ల తర్వాత ప్రవర్తనను అంచనా వేసి పరివర్తన ఉందని భావిస్తే శిక్షలో మార్పు చేస్తారు. లేకుంటే శిక్షను కొనసాగిస్తారు.

 

 క్రీడలు

 క్విటోవాకు మాడ్రిడ్ ఓపెన్ టైటిల్

 మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను పెట్రా క్విటోవా మే 9న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వెత్లానా కుజనెత్సోవాను ఓడించి గెలుచుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే.. ఫైనల్లో రఫెల్ నాదల్‌ను ఓడించి గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను రోహన్ బోపన్న (భారత్), ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా).. ఫైనల్లో నెనాద్ జిమోంజిక్ (సెర్బియా), మార్సిన్ మట్‌కోవిక్సీ (పోలండ్)లను ఓడించి గెలుచుకున్నారు. బోపన్నకు ఇది మూడో మాస్టర్స్ సిరీస్ టైటిల్.

 

 హాకీ సిరీస్ భారత్ కైవసం

 జపాన్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. భువనేశ్వర్‌లో మే 9న జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో భారత్‌కు 3-0 తేడాతో సిరీస్ దక్కింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

 

 రోస్‌బర్గ్‌కు స్పెయిన్ గ్రాండ్‌ప్రి

 మెర్సిడస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఫార్ములా వన్ స్పెయిన్ గ్రాండ్ ప్రిని గెలుచుకున్నాడు. బార్సిలోనాలో మే 10న జరిగిన రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలవగా, లూయిస్ హామిల్టన్ రెండో స్థానం సాధించాడు.

 

 ఏటీపీ చాలెంజర్ టోర్నీ

 భారత టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాబ్రీ స్పెయిన్‌కు చెందిన ఆడ్రియన్ మెనాడస్ మెసిరాస్‌తో కలిసి ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. వీరు మే 9న కర్షి (ఉజ్బెకిస్తాన్) లో జరిగిన ఫైనల్లో సెర్గి బెటోవ్ (బెలారస్), మిఖాయిల్ ఎల్గిన్ (రష్యా)లను ఓడించారు.

 

 వార్తల్లో వ్యక్తులు

 రాష్ట్రపతి ప్రణబ్‌కు రష్యా గౌరవ డాక్టరేట్

 భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రష్యా మే 8న మాస్కోలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రష్యా విక్టరీ డే పెరేడ్‌లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రష్యాలో పర్యటించారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన 26 మిలియన్ల మందికి ఈ పెరేడ్‌లో నివాళులు అర్పిస్తారు. విక్టరీ డేలో పాల్గొనాలని రష్యా 60 దేశాలకు ఆహ్వానం పంపగా కేవలం 25 దేశాల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. ఉక్రెయిన్‌లో రష్యా చర్యలకు, గత సంవత్సరం క్రిమియాను ఆక్రమించినందుకు నిరసనగా అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు విక్టరీ డే వేడుకలను బహిష్కరించాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు చైనా, క్యూబా, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

 బ్రిక్స్ బ్యాంకు అధ్యక్షునిగా కె.వి.కామత్

 బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలు ఏర్పాటుచేస్తున్న న్యూ డెవలప్‌మెంటల్ బ్యాంకుకు ప్రముఖ బ్యాంకరు కె.వి.కామత్‌ను భారత్ మే 11న నామినేట్ చేసింది. ఆయన ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌లలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో ఉన్నారు. ఒక సంవత్సరంలో బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. కామత్ అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగవచ్చు.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top