కేంద్ర మంత్రి మండలి సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ?

కేంద్ర మంత్రి మండలి సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ? - Sakshi


రాజ్యాంగం సర్వోన్నతమైంది. ప్రజాస్వామిక దేశాల్లో పరిపాలనకు పునాది ఇదే. ఏ దేశ రాజ్యాంగాన్నయినా దాని రచనా కాలంలో నెలకొని ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకనుగుణంగా రూపొందిస్తారు. అయితే ఎప్పటికప్పుడు వస్తున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సవరణ విధానాన్ని రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఈ సవరణ పద్ధతిని దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు.  రాజ్యాంగాలను సాధారణ లేదా ప్రత్యేక మెజార్టీతో సవరిస్తారు. దీనికి చాలా సరళమైన పద్ధతి ఉన్నప్పుడు రాజ్యాంగ స్థిరత్వం,  నిరంతరతకు విఘాతం కలుగుతుంది. అలాగని కఠినమైన పద్ధతిని ఎంచుకుంటే అవసరమైన మార్పులు చేయడానికి  అవకాశం ఉండదు. అందువల్ల రాజ్యాంగ నిర్మాతలు ఈ రెండు పద్ధతుల్లోని సమన్వయాన్ని ఎంపిక చేసుకుంటారు.

 

రాజ్యాంగ సవరణ పద్ధతి

సవరణ (Amendment) అంటే కొత్త ప్రకరణలు చేర్చడం, ఉన్న ప్రకరణలను తొలగించడం. ప్రస్తుతం ఉన్న అంశాలను మార్పులు చేయడం వేరు, సవరణ (Amend) వేరు. అదేవిధంగా ’Emend’ అంటే దోషాలను (Errors) తొలగించడం.

 

సవరణ పద్ధతులు - రాజ్యాంగ స్థానం

రాజ్యాంగంలోని 20వ భాగంలో ప్రకరణ 368లో రాజ్యాంగ సవరణ పద్ధతిని పొందుపర్చారు. రాజ్యాంగ ప్రకరణలను మూడు భాగాలుగా వర్గీకరించి, మూడు ప్రత్యేక పద్ధతులను నిర్దేశించారు. అవి:

 1. పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా జరిగే సవరణ పద్ధతి (Simple Majority)

 2. పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా జరిగే సవరణ పద్ధతి (Special Majority)

 3. పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ, సగాని కంటే ఎక్కువ రాష్ట్ర శాసనసభల ఆమోదం (States Satisfaction) ద్వారా జరిగే సవరణ పద్ధతి

 మౌలిక రాజ్యాంగంలో ప్రకరణ 368లో రాజ్యాంగాన్ని ‘సవరించే ప్రక్రియ’ (Procedure for Ammendment of Constitution) అని పేర్కొన్నారు. కానీ 1971 లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదబంధానికి బదులుగా ‘రాజ్యాంగాన్ని సవరించే అధికారం, ప్రక్రియ’గా (Power to amend and procedure thereof) మార్పు చేశారు.

 ప్రకరణ 368లోని అంశాలను రెండు పర్యాయాలు సవరించారు. 24వ రాజ్యాంగ సవరణ (1971), 42వ రాజ్యాంగ సవరణ (1976).

 ప్రకరణ 368లో ఐదు సబ్ క్లాజులు ఉన్నాయి. అవి:

 1.    పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం, ప్రక్రియ ఉంటుంది.

 2.    ప్రత్యేక మెజార్టీతో సవరించే అంశాల గురించి పేర్కొన్నారు.

 3.    ప్రకరణ 13లో పేర్కొన్న చట్ట నిర్వచనంలోని అంశాలు రాజ్యాంగ సవరణ నిర్వచనంలోకి రావు.

 4.    పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణను (ప్రాథమిక హక్కులు సహా) రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలు లేదు.

 5.    సవరణ అధికారాల్లో మార్పులు, చేర్పులు, రద్దు చేసే అంశంలో పార్లమెంటుపై ఏవిధమైన ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.

 క్లాజు 4, 5లోని అంశాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అయితే ఈ క్లాజులు చెల్లవని, రాజ్యాంగ విరుద్ధమని, మౌలిక నిర్మాణానికి విఘాతం కలిగిస్తాయని  1980లో మినర్వామిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

 

 సాధారణ మెజార్టీ పద్ధతి

 ఈ పద్ధతి ప్రకారం పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా కొన్ని ప్రకరణలను సవరిస్తుంది. సాధారణ చట్టాన్ని పార్లమెంటు ఏ విధంగా సవరిస్తుందో అదే పద్ధతిలో రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణలను సవరిస్తారు. సాధారణ మెజార్టీ అంటే హాజరై ఓటువేసిన వారిలో సగాని కంటే ఎక్కువ ఉండాలి.

 సాధారణ మెజార్టీ పద్ధతి గురించి ప్రకరణ 368లో ప్రస్తావించలేదు. అందువల్ల సాధారణ మెజార్టీ ద్వారా జరిగే సవరణలను రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు. కింద పేర్కొన్న అంశాలు ప్రకరణ 368లో తెలిపిన రాజ్యాంగ సవరణ పరిధిలోకి రావు. ఈ పద్ధతి ద్వారా సవరించే అంశాలు..

     కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్ర సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్లు మార్పు (ప్రకరణలు 1-4)

     రాష్ట్ర ఎగువసభ విధాన పరిషత్ ఏర్పాటు, రద్దు (ప్రకరణ 169)

     భారత పౌరసత్వంలో మార్పులు (ప్రకరణ

     5 -11)

     రెండో షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ పదవుల జీతభత్యాలు (ప్రకరణలు 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186, 221)

     పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియలు, శాసన సభ్యుల సాధికారాలు (ప్రకరణ 105, 194)

     సుప్రీంకోర్టు పరిధికి సంబంధించిన అంశాలు

     (ప్రకరణ 139)

     కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనమండలి, శాసనసభ ఏర్పాటు (ప్రకరణ 239)

     నియోజకవర్గాల పునర్విభజన (ప్రకరణ 82)

     పార్లమెంటులో ఉపయోగించే భాష

     (ప్రకరణ 120)

     ఐదు, ఆరో షెడ్యూల్‌లలో పేర్కొన్న అంశాలు

     సుప్రీంకోర్టు, న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించడం (ప్రకరణ 124)

 

 పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించే అంశాలు

 ప్రకరణ 368 ఈ పద్ధతి గురించి వివరిస్తుంది. రాజ్యాంగంలోని అత్యధిక భాగాలను ప్రత్యే మెజార్టీ ద్వారానే సవరిస్తారు. పార్లమెంట్ ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు మెజార్టీని సాధించాలి. ఈ పద్ధతి ద్వారా కింది అంశాలను సవరిస్తారు.

 ఎ)    భారత రాజ్యాంగంలో మూడో భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు (ప్రకరణ 12-35)

 బి)    భారత రాజ్యాంగంలో నాలుగో భాగంలో పేర్కొన్న నిర్దేశిక నియమాలు (ప్రకరణ 36-51)

 సి)    మొదటి పద్ధతిలో, మూడో పద్ధతిలో పేర్కొనని ఇతర అన్ని అంశాలు

     

 ప్రత్యేక మెజార్టీ, రాష్ట్ర శాసనసభల ఆమోదం

 ఈ పద్ధతిలో పేర్కొన్న అంశాలను పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించిన తర్వాత సగానికి తగ్గకుండా రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగ సవరణ బిల్లు ను సాధారణ మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్రాల ఆమోదానికి నిర్ణీత సమయమంటూ ఉండదు. రాష్ట్రపతి నిర్ణయించిన గడువులోపల రాష్ట్ర  శాసనసభ తన అభిప్రాయాన్ని చెప్పాలి. ఈ పద్ధతి ద్వారా సవరించే అంశాలు:

 ఎ)    రాష్ట్రపతి ఎన్నిక విధానం (ప్రకరణ 54, 55)

 బి)    కేంద్ర కార్య నిర్వాహక పరిధిని విస్తృతం చేయడం (ప్రకరణ 73)

 సి)    రాష్ట్ర కార్య నిర్వాహక పరిధిని విస్తృతం చేయడం (ప్రకరణ 162)

 డి)    కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనపరమైన అధికారాల విభజన (ప్రకరణ 246)

 ఇ)    రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం

     (ప్రకరణ 80, 81)

 ఎఫ్) రాజ్యాంగ సవరణ పద్ధతి (ప్రకరణ 368)

 

 రాజ్యాంగ సవరణ పద్ధతి - నియమ నిబంధనలు

 ప్రకరణ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో కింది నియమాలను పాటించాలి.

 -    రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రతిపాదించవచ్చు. రాష్ట్ర శాసనసభలకు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించే అధికారం లేదు.

 -    రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రిగానీ, సాధారణ సభ్యుడుగానీ ప్రతిపాదించవచ్చు (ప్రభుత్వ బిల్లు లేదా ప్రైవేట్ మెంబర్ బిల్లు).

 -    రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు.

 -    రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభలు నిర్ణీత మెజార్టీ ప్రకారం వేర్వేరుగా ఆమోదించాలి. ఒక సభ ఆమోదించి,  మరో సభ తిరస్కరిస్తే, ప్రతిష్టంభన తొలగించడానికి సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు.  కాబట్టి బిల్లు వీగిపోతుంది.

 -    సమాఖ్య అంశాలకు సంబంధించిన ప్రకరణలను సవరించడానికి సగానికి పైగా తగ్గకుండా రాష్ట్ర శాసనసభలు కూడా తమ ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది.

 -    పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపిస్తారు.

 రాష్ట్రపతి తప్పనిసరిగా తన ఆమోదాన్ని తెలపాలి. తిరస్కరణకు లేదా పునఃపరిశీలనకు  అవకాశం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలనే నియమాన్ని 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

 -    రాష్ర్టపతి ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది. చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి రాజ్యాంగాన్ని సవరించినట్లుగా పరిగణిస్తారు.

 -    రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షకు గురవుతుంది.

 

 మాదిరి ప్రశ్నలు

 1.    71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చిన భాషలు?

     1) కొంకణి, సింధి     2) మణిపురి, సింధి

     3) నేపాలి, కొంకణి 4) సింధి, నేపాలి

 2.    సంస్థానాధీశుల బిరుదులు, ప్రత్యేక హక్కుల రద్దుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?

     1) 24వ సవరణ    2) 26వ సవరణ

     3) 42వ సవరణ    4) ఏదీకాదు

 3.    ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా

     షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారికి ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు?

     1) 85       2) 83     3) 92    4) 78

 4.    పదో ఆర్థిక సంఘం సూచనలు అమలుపరుస్తున్న రాజ్యాంగ సవరణ?

     1) 80    2) 81    3) 84    4) 94

 5.    1985లో చేసిన 52వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది?

     1)    పార్టీ ఫిరాయింపుల నిరోధం

     2)    పంచాయతీరాజ్ సంస్థలు

     3)    కొత్త రాష్ట్రాల ఏర్పాటు

     4)    ఏదీకాదు

 6.    కేంద్ర మంత్రి మండలి సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ?

     1) 90    2) 91    3) 92    4) 93

 7.    భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం

     1992 వర్తించని రాష్ట్రం?

     1) మిజోరాం    2) గోవా

     3) లక్షద్వీప్    4) పాండిచ్చేరి

 8.    కిందివాటిలో భిన్నమైంది ఏది?

     1) 8వ రాజ్యాంగ సవరణ, 1959

     2) 23వ రాజ్యాంగ సవరణ, 1970

     3) 45వ రాజ్యాంగ సవరణ, 1980

     4) 61వ రాజ్యాంగ సవరణ, 1989

 

సమాధానాలు

     1) 3;    2) 2;    3) 1;    4) 1;

     5) 1;    6) 2;    7) 1;    8) 4;

 

 బి. కృష్ణారెడ్డి- డైరెక్టర్ క్లాస్-1

 స్టడీ సర్కిల్,  హైదరాబాద్.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top