పది తర్వాత పయనమెటు?

పది తర్వాత పయనమెటు?


‘పది’ అడుగులు తడబడకుండా వడివడిగా పడ్డాయి.. మరి మలి అడుగు ఎక్కడేస్తే అది మేలిమి భవిష్యత్తుకు పునాది అవుతుంది? చదువుల పయనంలో తొలి దశ అయిన పదో తరగతి పూర్తయిన తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, ప్రవేశ మార్గాలు, కెరీర్ ప్రస్థానం తదితరాలపై విశ్లేషణ..





ఇంటర్మీడియెట్

ఇంజనీరింగ్‌కు ఎంపీసీ:

ఇంజనీరింగ్ దిశగా కెరీర్‌ను మలచుకోవాలనుకునే వారు ఇంటర్ ఎంపీసీ గ్రూపులో చేరవచ్చు. గణితం అంటే బాగా ఆసక్తి ఉండే, ఒక అంశాన్ని వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు సరైన గ్రూప్ ఎంపీసీ. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్‌తోపాటు అనేక అవకాశాలు ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరొచ్చు. జేఈఈ-మెయిన్ ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్‌ద్వారా ఐఐటీ, ఐఎస్‌ఎం ధన్‌బాద్‌లో చేరొచ్చు. ఇప్పుడు సైన్స్ పరిశోధనలకు ప్రాధాన్యం పెరగడంతో ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి, తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అందుకోవచ్చు.



బైపీసీతో వైద్యం:

పరిశోధనలంటే బాగా ఆసక్తి ఉండి, వృక్ష, జీవశాస్త్ర సబ్జెక్టులపై ఇష్టం ఉన్నవారికి సరిపడే గ్రూప్ బైపీసీ. బైపీసీ సిలబస్ విస్తృతంగా ఉంటుంది కాబట్టి కష్టపడి చదివే తత్వం ఉండాలి. ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల ప్రాక్టికల్ అప్రోచ్, ఎప్పటికప్పుడు చదివిన అంశాన్ని ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత కూడా అవసరం. ఇక.. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్, జిప్‌మర్, సీఎంసీ తదితర పరీక్షల ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్‌గా జీవితంలో స్థిరపడటం సుదీర్ఘ ప్రక్రియనే చెప్పాలి. రెండేళ్ల పాటు ఇంటర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ మెడిసిన్ (సూపర్ స్పెషాలిటీ) కోర్సు చేయాలి. దీనర్థం బైపీసీలో చేరొద్దని కాదు.. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఆసక్తి వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. బైపీసీ తర్వాత బీడీఎస్, పారామెడికల్, అగ్రికల్చర్, హోమియోపతి తదితర కోర్సుల్లో కూడా చేరొచ్చు. లేదంటే వినూత్న కాంబినేషన్లతో డిగ్రీ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తినిబట్టి వాటిలో చేరొచ్చు.



ఆసక్తి ప్రధానం

పదో తరగతి పరీక్షలు ముగిశాయి. అంటే విద్యార్థులు తమ విద్యా జీవితంలో ఒక భాగాన్ని పూర్తిచేశారు. దీని తర్వాత మరో రెండు దశలుంటాయి. అవి.. ఇంటర్ విద్య; ప్రొఫెషనల్ కోర్సు లేదా డిగ్రీ కోర్సు. ఇంటర్మీడియెట్ విద్య.. విద్యార్థి భావి జీవితాన్ని నిర్దేశించే దశ. ఇందులో ఎంపిక చేసుకునే గ్రూపు ఆధారంగానే భవిష్యత్తు కెరీర్ ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. 9, 10వ తరగతులలో ఉన్నప్పుడు విద్యార్థులు తాము ఎక్కువగా ఏ సబ్జెక్టులను ఇష్టపడేవారో చూసుకోవాలి. ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్‌లపై ఆసక్తి కనబరిచారా? లేదంటే జీవరసాయన శాస్త్రాలపై అభిరుచి కనబరిచారా? విశ్లేషించుకోవాలి. వీటి ఆధారంగానే ఇంటర్‌లో గ్రూపును ఎంపిక చేసుకోవాలి. గ్రూపు ఎంపిక విషయంలో తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ పిల్లల స్వీయ అభిరుచికి అనుగుణంగా మార్గనిర్దేశనం చేయాలి. లేదంటే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముంది. ఒక ప్రణాళిక ప్రకారం, నిజాయితీగా కష్టపడితే ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఏ గ్రూప్‌లో చేరినా, భవిష్యత్తులో పుష్కలంగా par అవకాశాలున్నాయి.ఙ- ఎం.ఎన్.రావు, సీనియర్ ఫ్యాకల్టీ.



సీఈసీ, ఎంఈసీ:

సమస్యను విశ్లేషణాత్మక దృష్టితో చూసే లక్షణం; కొత్త విషయాల అభ్యాసంపై ఆసక్తి, నిరంతర అధ్యయన దృక్పథం, గణాంకాలను విశ్లేషించే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ. అంతేకాకుండా ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కామర్స్‌లో నైపుణ్యాలు పొందిన వారికోసం అన్వేషణ సాగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సులు సీఈసీ, ఎంఈసీ అని చెప్పొచ్చు. అరతేకాకుండా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ. ఏ కోణంలో చూసినా ఇవి అవకాశాలకు వేదికగా నిలుస్తున్నవే.



ఈ గ్రూప్‌లను ఎంపిక చేసుకునే విద్యార్థులకు అత్యంత ఆవశ్యకంగా ఉండాల్సిన లక్షణం సహనం. చిట్టా పద్దుల్లో చిక్కుముడులను విప్పే క్రమంలో ఒక్కోసారి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏమాత్రం సహనం కోల్పోయినా నిర్దిష్ట అంశంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా వ్యాపార రంగానికి సంబంధించి ప్రభుత్వ పరంగా జరిగే చట్టాల్లో మార్పులు, వాటి పర్యవసానాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకునే నైపుణ్యం కావాలి. ఇక సీఈసీ, ఎంఈసీ తర్వాత చాలా మంది బీకాంలో చేరతారు. ఇప్పుడు బీకాంలో కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. (ఉదా: బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ఫారిన్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్). బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో త్వరగా స్థిరపడొచ్చు.



హెచ్‌ఈసీ:

హెచ్‌ఈసీ గ్రూప్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు.. రైటింగ్ స్కిల్స్, నిరంతర అధ్యయనం. విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే సునిశిత పరిశీలన దృష్టి. అంతేకాకుండా సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో నిరంతరం చోటు చేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్న వారికి ఎంతో చక్కని గ్రూప్ హెచ్‌ఈసీ. ఇంటర్ హెచ్‌ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నతవిద్యాపరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్‌ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖాయం చేసుకుని ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఉన్నత విద్య కోణంలోనూ హెచ్‌ఈసీ తర్వాత అనేక అవకాశాలున్నాయి. ఒకప్పుడు హెచ్‌ఈసీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరడమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీఏలోనూ విభిన్నమైన స్పెషలైజేషన్లు (ఉదా: హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, సోషల్ వర్క్ తదితర వృత్తి విద్య స్పెషలైజేషన్లు) అందుబాటులోకి వచ్చాయి.



సైన్స్ గ్రూప్‌లకు పోటీగా..

ఎంఈసీ, సీఈసీ గ్రూపులను హ్యుమానిటీస్ గ్రూపులని కూడా అంటారు. సైన్స్ గ్రూప్‌ల స్థాయికి ఏమాత్రం తగ్గని గ్రూపులివి. వ్యాపార, వాణిజ్య రంగాలలో (బ్యాంకు, బీమా..) ఉజ్వల భవిష్యత్తుకు ఇవి దారిచూపుతాయి. చార్టర్డ్ అకౌంటెంట్లుగా, ఫైనాన్షియల్ అడ్వయిజర్స్ వంటి ఉన్నత స్థాయి కొలువులు అందుకునేందుకు ఎంఈసీ, సీఈసీ గ్రూపులను వేదికలుగా చేసుకోవచ్చు.



ఏపీఆర్‌జేసీ



ఆశ్రమ తరహాలో.. ఆహ్లాదకర వాతావరణంలో.. విద్యార్థులను ఉన్నత శిఖరాల దిశగా నడిపించే వేదికలు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు. ముఖ్యంగా గ్రామీణ, పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి తోడ్పాటునందించేందుకు ఏర్పాటైన ఈ కళాశాలలను ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ సొసైటీ నిర్వహిస్తోంది. వీటిలో ప్రవేశానికి ఏటా ఏపీఆర్‌జేసీ సెట్ జరుగుతుంది. పదో తరగతి తర్వాత ఇందులో మంచి ర్యాంకు సాధించి రెసిడెన్షియల్ కాలేజీలలో చేరొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 15 ఏపీ రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,465 సీట్లున్నాయి.

ఆఫర్ చేస్తున్న గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ. వొకేషనల్ కోర్సులు: ఈఈటీ, సీజీడీటీ (కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు కాలేజీ మాత్రమే ఈ కోర్సులను ఆఫర్ చేస్తుంది).



ప్రవేశాలు:

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీఆర్‌జేసీ సెట్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఎంచుకున్న గ్రూపును బట్టి మూడు సబ్జెక్ట్‌లలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు.



అంతా ఆహ్లాదకరం:

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు నాణ్యమైన లేబొరేటరీలు, చక్కటి లైబ్రరీలు, విశాలమైన రీడింగ్ రూమ్‌లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అన్ని వసతులతో కూడిన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కూడా ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు తొలిరోజు నుంచే సిద్ధం చేస్తారు. అదేవిధంగా ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులను సీఏ, ఐసీడబ్ల్యూఏ వంటి కోర్సుల్లో రాణించే తరహాలో శిక్షణనిస్తారు. ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు సీపీటీ మాదిరి పరీక్షలను కూడా నిర్వహిస్తారు.



ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సరైన వేదికలు



రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ కళాశాలలు (5), కో-ఎడ్యుకేషన్ కళాశాలలు (2), మహిళా కళాశాలలు (3), బాలుర కళాశాలలు(5), కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్.. మొత్తం 15 కళాశాలల్లో 1,465 సీట్లకు ఏపీఆర్‌జేసీ ఎంట్రన్స్ నిర్వహించనున్నాం. ఈ కళాశాలల్లో విద్యార్థులను కేవలం ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కే పరిమితం చేయకుండా.. వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా మరెన్నో అనుబంధ కోర్సుల్లో శిక్షణ కూడా లభిస్తుంది. కళాశాలల్లో విద్యార్థుల చదువుతో పాటు క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి.



- పి.జగన్మోహన్ రెడ్డి,

కన్వీనర్, ఏపీఆర్‌జేసీ సెట్-2014.

వొకేషనల్ కోర్సులు



ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ.. సాధారణంగా ఇంటర్మీడియెట్ అంటే విద్యార్థులకు టక్కున గుర్తొచ్చే గ్రూపులివే. వీటితోపాటు అనేక ఇతర గ్రూపులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియెట్‌లో వొకేషనల్ గ్రూపులకు ఇటీవల కాలంలో ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిలో క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్స్‌షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వంటి అనేక గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం కూడా ఇంటర్మీడియెట్ వొకేషనల్ గ్రూపుల్లో టెక్నికల్ గ్రూప్ ఉత్తీర్ణులకు లభిస్తుంది. కానీ ఈ వొకేషనల్ కోర్సులను అందించే కళాశాలల సంఖ్య పరిమితంగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తమకు అనుకూలమైన వొకేషనల్ గ్రూప్, దాన్ని అందించే కళాశాలలను అన్వేషించాలి. ఈ వొకేషనల్ గ్రూపుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రాక్టికల్ అప్రోచ్, క్షేత్రస్థాయిలో పనిచేసే సన్నద్ధత అవసరం.



- కురుహూరి రమేష్,

సీనియర్ ఫ్యాకల్టీ



వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులు



వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు.. అత్యధిక మందికి జీవనాధారాలు! పొలాన సిరుల పంట పండి, అన్నదాత ఆనందంగా ఉండాలన్నా, అందరికీ ఆహార భద్రత లభించాలన్నా మెరుగైన సాగు పద్ధతులు అవలంబించాలి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చేరువ కావాలి! దీన్ని గుర్తెరిగిన ప్రభుత్వాలు వివిధ పథకాలకు జీవం పోశాయి. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఒంటబట్టించుకునే వ్యవసాయ నిపుణులకు డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్లు వ్యవసాయ కోర్సులూ యువతకు దగ్గరవుతున్నాయి.



వ్యవసాయ పాలిటెక్నిక్‌లు:

గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతోనూ; ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో పనిచేసేందుకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేశారు. ఇవి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. పాలిటెక్నిక్‌లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొ మా ఇన్ సీడ్ టెక్నాలజీ,అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా (2013-14) సీట్ల వివరాలు..

కోర్సు    {పభుత్వ    {పైవేటు

అగ్రికల్చర్     700     1,010

సీడ్ టెక్నాలజీ    85    150

ఇంజనీరింగ్     90     2,400

    డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు.



అర్హత, ప్రవేశాలు:

పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.కరిక్యులంలో సేద్య విజ్ఞాన శాస్త్ర అంశాలు, నేల సారం, చీడపీడలు-వాటి యాజమాన్యం, వ్యవసాయ శక్తివనరులు, యంత్ర పరికరాల వాడకం, సాగు పద్ధతులు తదితర అంశాలుంటాయి.



అవకాశాలు:

దేశంలో ఆహార భద్రత సవాలుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని బాగా పెంచాల్సి న అవసరం ఏర్పడింది. దీంతో శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను నేర్చుకునే వారికి కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవసాయ క్షేత్రాలు,టీ గార్డెన్లు, రబ్బర్ ప్లాంటేషన్లలోనూ అవకాశాలుంటాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ ఉద్యోగులుగా స్థిరపడొచ్చు. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు.



వేతనాలు:

ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది. అనుభవం, తగిన అర్హతలుంటే రూ.30 వేల వరకు ఆర్జించవచ్చు.



పాలిటెక్నిక్ కోర్సులు



పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అందుబాటులో ఉన్న మరో మార్గం పాలిటెక్నిక్ కోర్సులు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డిప్లొమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు రాచబాటలు వేస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నాయి.



అర్హత:

పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.



కోర్సులు: రాష్ట్రంలో ఏయూ రీజియన్, ఓయూ రీజియన్, ఎస్‌వీయూ రీజియన్‌లలో కలిిపి దాదాపు 500 వరకు పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి.

మూడేళ్ల కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్‌కండీషనింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అపై్లడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ (షుగర్ టెక్నాలజీ), కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. మూడున్నరేళ్ల కోర్సులు: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ (ఆయిల్ టెక్; పెట్రో కెమికల్స్; ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ.



కెరీర్:

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.

వేతనాలు:

చేరిన సంస్థనుబట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.



కోర్సులు- ఉపాధి వేదికలు:

సివిల్ ఇంజనీరింగ్: ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్లు, రైల్వే లు, సర్వే, వాటర్ సపై్ల తదితరాలతో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో అవకాశాలుంటాయి. కాం ట్రాక్టర్లుగా, డ్రాఫ్ట్‌మెన్‌గా స్వయం ఉపాధి పొందొచ్చు.

మెకానికల్ ఇంజనీరింగ్: మెషినరీ, ట్రాన్స్‌పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్స్, సేల్స్‌తో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. యాన్సిలరీ యూనిట్లు, సేల్స్ ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు.

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల్లో అవకాశాలుంటాయి. ఎలక్ట్రిక్ టెక్నీషియన్లు, వైండర్లుగా స్వయం ఉపాధిని పొందొచ్చు.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ తదితరాల్లో అవకాశాలు. సేల్స్, సర్వీసెస్ విభాగాల్లో స్వయం ఉపాధిని పొందొచ్చు.

కంప్యూటర్ ఇంజనీరింగ్: కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ వంటి వాటితో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవకాశాలుంటాయి. కంప్యూటర్ సేల్స్, సర్వీసింగ్ విభాగాల్లో స్వయం ఉపాధిని పొందొచ్చు.



డిప్లొమాలు.. అవకాశాలకు వారధులు



పాలిటెక్నిక్ కోర్సులు మధ్య తరగతి విద్యార్థులకు వరం. ఈ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల బయట పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతున్నాయి. డిప్లొమా కోర్సులు యువతకు విస్తృత ఉపాధి అవకాశాలకు వారధులుగా నిలుస్తున్నాయి. ఉత్తీర్ణులను పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. ఉదాహరణకు వారి వారి బ్రాంచ్‌లను బట్టి రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు. ఉన్నత విద్యపరంగా అవకాశాలు చూస్తే ఈసెట్ ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా బీఈ/ బీటెక్ కోర్సుల్లో రెండో సంవత్సరంలో par చేరొచ్చు.ఙ- కె.రాములు, ప్రిన్సిపాల్,

గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, హైదరాబాద్.



ఐటీఐ/ఐటీసీ



మేలిమి వృత్తి నైపుణ్యాలున్న మానవ వనరులు.. దేశ ఆర్థికాభివృద్ధికి అసలుసిసలైన సారథులు! ఆర్థిక పురోగతిని పరుగులుపెట్టించడంలో కీలకమైన పారిశ్రామిక రంగానికి నైపుణ్యాలున్న శ్రామిక శక్తి ఎంతో అవసరం. ఇలాంటి శక్తిని అందించే ఇంజిన్లు ఐటీఐలు! తొలుత దేశంలో పారిశ్రామికీకరణకు ఊపిరిలూదే క్రమంలో పుట్టిన ఇవి నేడు యువతకు ఉపాధి చూపడంలోనూ, పరిశ్రమల అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి.



ఉపాధికి నిచ్చెనలు:

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. పదో తరగతి తర్వాత వీటిలో చేరి, తక్కువ ఖర్చుతో వివిధ విభాగాల్లో శిక్షణ పొందొచ్చు. అనంతరం చిన్న వయసులోనే ఉపాధిని సొంతం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 800కుపైగా ఐటీఐ/ఐటీసీలు ఉన్నాయి.



అర్హత:

ఐటీఐ/ఐటీసీలలో అందుబాటులో ఉన్న చాలా ట్రేడ్లలో పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు. జిల్లా స్థాయిలో ప్రత్యేక ఎంపిక కమిటీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. జూన్‌లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.



కోర్సులు:

ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అభ్యర్థులు తమకు అనువైన వాటిలో చేరవచ్చు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్, ప్లంబర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, పెయింటర్, బుక్ బైండింగ్, కటింగ్ అండ్ స్యూయింగ్ తదితర కోర్సులున్నాయి.



కెరీర్:

కోర్సులు పూర్తిచేసిన తర్వాత మెరిట్ ప్రాతిపదికన అప్రెంటీస్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థి వేతనం (స్టైఫండ్) లభిస్తుంది. వివిధ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలుంటాయి. వీటికోసం ఎప్పటికప్పుడు ప్రకటనలు వెలువడుతుంటాయి. రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వయం ఉపాధి దిశగా కూడా అడుగులు వేయొచ్చు. ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారు ప్రవేశ పరీక్ష ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరవచ్చు.



వేతనాలు:

ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం పొందొచ్చు. తర్వాత అనుభవం ద్వారా రూ.20 వేల వరకు సంపాదించవచ్చు.



బహుముఖ నైపుణ్యాలు.. అపార అవకాశాలు

‘‘ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ వంటి సంప్రదాయ ట్రేడ్లతో ప్రారంభమైన ఐటీఐలు నేడు ఆధునికతను సంతరించుకొని ఎన్నో నిత్యనూతన కోర్సులను అందిస్తున్నాయి. ఐటీఐలలో చేరి, బహుముఖ వృత్తి నైపుణ్యాలు సొంతం చేసుకున్న యువతకు 20 ఏళ్ల లోపే మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఓ చిన్న వర్క్‌షాప్ నుంచి ఆర్‌ఐఎన్‌ఎల్ (విశాఖపట్నం స్టీల్ ప్లాంట్) వంటి పెద్ద సంస్థల వరకు ఐటీఐలలో కోర్సులు పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలకు వేదికలవుతున్నాయి. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిశ్రమలు నడుస్తున్నాయి కాబట్టి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులలో నైపుణ్యాలు పెంచేందుకు ఐటీఐలు కృషిచేస్తున్నాయి’’.

- వి.పరమేశ్వరరావు, ప్రిన్సిపాల్,

ప్రభుత్వ ఐటీఐ, విజయనగరం.



స్వయం ఉపాధికి ఎదురుండదు

నైపుణ్యాలను అలవరచుకోవాలన్న తపన, కష్టపడి పనిచేసే తత్వం.. ఐటీఐ చదవాలనుకునే విద్యార్థులకు అవసరం. ఐటీఐలో థియరీ కంటే ప్రాక్టికల్స్‌కే ప్రాధాన్యత ఉంటుంది. ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) చేసిన వారికి ఆర్ అండ్ బీలో సివిల్ వర్క్స్, ల్యాండ్ సర్వేయర్లుగా; డీజిల్ మెకానిక్ చేసిన వారికి రైల్వే, ఆర్టీసీ, డాక్‌యార్డ్‌ల వంటి వాటిలో అవకాశాలు లభిస్తాయి. ఇలా మిగిలిన వారికి ఆయా ట్రేడ్లను బట్టి ఉపాధి లభిస్తుంది. ఐటీఐలో కోర్సులు పూర్తిచేసిన వారికి స్వయం ఉపాధికి కూడా ఢోకా ఉండదు. కోర్సు పూర్తయ్యాక అప్రంటీస్‌కు వెళ్లొచ్చు. ఫ్యాక్టరీల యాజమాన్యాలు అప్రంటీస్‌లో ప్రతిభ చూపిన వారికి పూర్తిస్థాయి ఉద్యోగాలు par ఇస్తున్నాయి.ఙ- వై.శివరామకృష్ణ, ప్రిన్సిపాల్,

ప్రభుత్వ ఐటీఐ, విజయవాడ.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top