సింధు, సాక్షి మాలిక్‌లకు పతకాలు

సింధు, సాక్షి మాలిక్‌లకు పతకాలు


కాంపిటీటివ్ గెడైన్స్ కరెంట్ అఫైర్స్

  అంతర్జాతీయం

  ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌ల్యాండర్ -10

 ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్ ల్యాండర్-10.. ఆగస్టు 17న ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. 85 ఏళ్ల కిందట 1930 అక్టోబర్‌లో ఇదే ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్‌షిప్-ఆర్101 ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ సంఘటనలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రిటన్‌లో ఎయిర్‌షిప్‌లను రూపొందించడం ఆపేశారు. తాజాగా 302 అడుగుల పొడవైన ఎయిర్ ల్యాండర్-10ను అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ (హెచ్‌ఏవీ) రూపొందించింది.

 

  భారత్‌లో ఆమ్నెస్టీ ఆఫీసులు తాత్కాలికంగా మూసివేత

 అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ భారత్‌లో తన ఆఫీసులను తాత్కాలికంగా మూసివేసింది. బెంగళూరు, పుణె, న్యూఢిల్లీ, చెన్నై ఆఫీసులను మూసివేయడంతోపాటు తమ ఈవెంట్లను వాయిదా వేస్తున్నట్లు ఆగస్టు 17న వెల్లడించింది. బెంగళూరులో కశ్మీర్ అంశంపై ఆ సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేశారనే ఆరోపణలతో ఆమ్నెస్టీపై దేశ ద్రోహ కేసు నమోదైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని ప్రోత్సహించారని ఆరోపిస్తూ.. కొందరు ఈ సంస్థకు వ్యతిరేకంగా ఆగస్టు 16, 17 తేదీల్లో ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమ్నెస్టీ ఆఫీసుల మూసివేత నిర్ణయం తీసుకుంది.

 

 ఆర్థికం

  జూలైలో 3.55 శాతానికి టోకు ద్రవ్యోల్బణం

 2016 జూలైలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3.55 శాతంగా నమోదైంది. కూరగాయలు, పప్పు దినుసులు వంటి ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్టానికి చేరింది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రెండంకెలను దాటి 11.82 శాతానికి పెరిగింది. పప్పు దినుసులు 35.76 శాతం, కూరగాయలు 28.05 శాతం, తృణ ధాన్యాల ధరలు 7.03 శాతం అధికమయ్యాయని ఆగస్టు 16న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. నిత్యావసరాల్లో ఒకటైన బంగాళా దుంపల ధరలు 58.78 శాతం పెరిగాయి. పంచదార, పండ్ల ధరలు వరుసగా 32.33 శాతం, 17.30 శాతం చొప్పున పెరిగాయి. జూన్‌లో 1.62 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం.. 2015 జూలై లో -4.00 శాతంగా నమోదు కావడం గమనార్హం.

 

 సైన్స్ అండ్ టెక్నాలజీ

  తొలి క్వాంటమ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

 అంతరిక్షం నుంచి భూమికి కాంతి కంటే వేగవంతమైన, హ్యాకింగ్‌కు అవకాశం లేని కమ్యూనికేషన్లను సాగించడానికి వీలు కలిగించే క్వాంటమ్ ఉపగ్రహాన్ని చైనా ఆగస్టు 16న విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా ఇటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం గా నిలిచింది. గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-2డి రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ఉపగ్రహం బరువు 600 కిలోలు. ఇది రెండేళ్లపాటు సేవలు అందిస్తుంది.

 

  భూమిపై అత్యంత వేడి నెలగా జూలై

 ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమిపై అత్యంత వేడి నెలగా ఈ ఏడాది జూలై నిలిచింది. గత 137 ఏళ్ల గణాంకాలతో పోల్చితే జూలైలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ (ఎన్‌ఓఏఏ) ఆగస్టు 16న ప్రకటించింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రత 1.57నిఇ అధికంగా ఉంది. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఉష్ణోగ్రత 0.11నిఇ ఎక్కువ. శిలాజ ఇంధనాల వినియోగం మరింత పెరగడం, వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నెలా భూమిపై ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయని నివేదిక తెలిపింది.

 

 వార్తల్లో వ్యక్తులు

  పంజాబ్, అసోం, అండమాన్‌లకు కొత్త గవర్నర్లు

 మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా, పంజాబ్ గవర్నర్‌గా రాజ్యసభ మాజీ సభ్యుడు వీపీ సింగ్ బద్నోర్, అసోం గవర్నర్‌గా ది హితవాద దినపత్రిక ఎండీ బన్వారీలాల్ పురోహిత్‌ను నియమించారు. ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ జగదీశ్ ముఖి అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎంపికయ్యారు.

 

  కోస్ట్‌గార్డ్ అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా వి.ఎస్.ఆర్.మూర్తి

 భారత సముద్ర తీర రక్షణ దళం అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా తెలుగు వ్యక్తి వీఎస్‌ఆర్ మూర్తి ఆగస్టు 18న బాధ్యతలు స్వీకరించారు.

 

 రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్

 ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ (52) ఆగస్టు 21న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా, ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణం విభాగాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ పదవీ కాలం మూడేళ్లు. డిప్యూటీ గవర్నర్‌గా ఉంటూ గవర్నర్ బాధ్యతలు చేపడుతున్న ఏడో వ్యక్తి పటేల్.

 

 క్రీడలు

  సానియా జంటకు సిన్సినాటి టైటిల్

 బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి సానియా మీర్జా.. సిన్సినాటి ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఆగస్టు 22న జరిగిన ఫైనల్లో ఈ జంట.. మార్టినా హింగిస్ - కోకో వాండెవెగె జోడీపై విజయం సాధించింది.

 

  2016 క్రీడా అవార్డులు

 కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2016కు ఆగస్టు 22న అవార్డులను ప్రకటించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, షూటర్ జీతూరాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర దక్కింది. అవార్డు కింద రూ.7.5 లక్షల నగదు ఇస్తారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య పురస్కారాలను కూడా కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డు పొందినవారికి రూ.5 లక్షలు, ప్రశంస పత్రం బహూకరిస్తారు.రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర: పూసర్ల వెంకట సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మాలిక్ (రెజ్లిం గ్), దీపా కర్మాకర్ (జిమ్మాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్).

 

 అర్జున అవార్డ్: అజింక్య రహానే (క్రికెట్), రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బాబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్ (హాకీ), వి.ఆర్.రఘునాథ్ (హాకీ), గురు ప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వీ చండేలా (షూటింగ్), సౌమ్యజిత ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్‌కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్‌మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేందర్ సింగ్ (రెజ్లింగ్) ద్రోణాచార్య అవార్డు: నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాల్ (బాక్సిం గ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్మాస్టిక్స్), ఎస్.ప్రదీప్‌కుమార్ (స్విమ్మింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్).

 

 ధ్యాన్‌చంద్ అవార్డ్: సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్రప్రసాద్ షెల్కే (రోయింగ్).

 

  సింధు, సాక్షి మాలిక్‌లకు పతకాలు

 రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు రజత పతకం సాధించి రికార్డ్ సృష్టించింది.  ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రజతం గెలిచిన తొలి మహిళగా నిలిచింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) బంగారు పతకం గెలిచింది. మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 58 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.

 

 అగ్రస్థానంలో అమెరికా

 దేశం    స్వర్ణం    రజతం    కాంస్యం    మొత్తం

 అమెరికా    46    37    38    121           బ్రిటన్    27    23    17    67   

 చైనా    26    18    26    70

 రష్యా    19    18    19    56

 జర్మనీ    17    10    15    42 జపాన్    12    8    21    41 ఫ్రాన్స్    10    18    14    42 కొరియా    9    3     9    21

 ఇటలీ     8    12    8    28 ఆస్ట్రేలియా    8    11    10    29 భారత్    0    1    1    2

 (భారత్ స్థానం 67)

 

  ముగిసిన ఒలింపిక్స్

 బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు జరిగిన ఒలింపిక్స్ -2016 ముగింపు వేడుకల్లో రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ భారత పతాకధారిగా వ్యవహరించింది. 31వ ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 5న ప్రారంభమయ్యాయి. మొత్తం 206 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొన్నాయి. 32వ ఒలింపిక్ క్రీడలు 2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతాయి.

 

 రాష్ట్రీయం

  విశాఖపట్నంలో రోడ్డు భద్రతపై వర్‌‌కషాప్

 దేశంలో 30 శాతం బోగస్ డ్రైవింగ్ లెసైన్స్‌లు ఉన్నాయని, వాటిని తొలగించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై విశాఖపట్నంలో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ఆగస్టు 18న నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. 18 రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, దాదాపు వంద మంది దేశ, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. రహదారుల భద్రతపై వారు 69 రకాల సిఫార్సులు చేశారు. రవాణా శాఖలో అవినీతి మూలంగా ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోందని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు.

 

 ఈ సంఖ్యను బ్రెజీలియా డిక్లరేషన్ ప్రకారం 2020 నాటికి 50 శాతానికి తగ్గించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రోడ్డు భద్రతకు సంబంధించి ఎడ్యుకేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ, ఎన్విరాన్‌మెంట్ అనే అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను 2025 నాటికి 50 శాతానికి తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

 

  ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి

 కరెంట్ అఫైర్స్ నిపుణులు,

 ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్


 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top