ఉన్నత విద్యలో సమున్నత మార్పులు

ఉన్నత విద్యలో సమున్నత మార్పులు


 ప్రస్తుత గ్లోబలైజేషన్, డిజిటలైజేషన్ నేపథ్యంలో ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని కమిటీ పేర్కొంది.   జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఇది ప్రతి ఐదేళ్లకోసారి కరిక్యులం, బోధన, ఇతర అంశాలపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సలహాలు, సూచనలు అందించాలి.

 

  ఉన్నత విద్య నియంత్రణ సంస్థల్లో ఇండస్ట్రీ నిపుణులు, పూర్వ విద్యార్థులు, ఇతర విద్యావేత్తలు ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉండేలా చర్యలు తీసుకోవాలి. యూనివర్సిటీల స్థాయిలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్టడీస్‌ను సమీకృతం చేసే విధానాలు రూపొందించాలి.  విద్యా రంగంలో అకడమిక్, నిర్వహణ విభాగాల కోసం జాతీయ స్థాయిలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్‌ను రూపొందించాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం ఎడ్యుకేషన్ ట్రిబ్యునల్స్ ఉండాలి. వర్సిటీ పరిధిలో అనుబంధ కళాశాలలు వందకు మించకూడదు.

 

 ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి

 నియంత్రణ విధానాలు


 జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలు వేర్వేరు విధానాలతో నిర్వహణ సాగిస్తున్నాయి. వీటన్నిటినీ ఒకే విధానంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని కమిటీ పేర్కొంది.

 

  నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను సమర్థంగా పర్యవేక్షించేందుకు స్వతంత్ర వ్యవస్థను రూపొందించాలి. జాతీయ స్థాయిలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల సమాచార సేకరణ, సమీకృతం చేయడం కోసం సెంట్రల్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టికల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు తప్పనిసరిగా వర్సిటీలు, కళాశాలల నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి. ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా ఎన్‌బీఏ లేదా న్యాక్ గుర్తింపు పొందాలి. న్యాక్, ఎన్‌బీఏలను పునర్వ్యవస్థీకరించాలి. గ్లోబల్ ర్యాంకులు పొందేలా వర్సిటీల్లో నాణ్యత ప్రమాణాలు ఉండేలా న్యాక్, ఎన్‌బీఏలు చర్యలు తీసుకోవాలి.

 

 మూక్స్‌కు ప్రాధాన్యం.. ప్రత్యేక వ్యవస్థ

 అంతర్జాతీయంగా తాజా పరిణామాలపై అవగాహన, అంతర్జాతీయంగా సబ్జెక్ట్ నైపుణ్యాల వృద్ధి. ఈ క్రమంలో ప్రాచుర్యంలోకి వస్తున్న విధానం మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (మూక్స్). వీటిని విస్తరించేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. మూక్స్ నిర్వహణ, అభివృద్ధి, సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. మూక్స్, ఓడీఎల్ కోర్సుల్లో నిరంతరం మార్పులు చేర్పులు చేస్తుండాలి. స్కిల్ డవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఒకేషనల్ కోర్సులు అందించాలి.

 

 విదేశీ వర్సిటీలకు ఆహ్వానం.. పరస్పర ఒప్పందం

 అంతర్జాతీయ నైపుణ్యాలు పొందడానికి విద్యా వ్యవస్థను గ్లోబలైజ్ చేయాలని కమిటీ పేర్కొంది. అందులో ప్రధానంగా విదేశీ వర్సిటీలను ఆహ్వానించడం, లేదా వాటితో భారత్‌లోని యూనివర్సిటీలు ఒప్పందం చేసుకోవడం వంటివి కీలకం. ప్రపంచంలోని టాప్-200 జాబితాలో ఉన్న వర్సిటీలు భారత్‌లోని వర్సిటీలతో ఒప్పందం ద్వారా ఇక్కడ అడుగుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ ఇన్‌స్టిట్యూట్‌లు ఇచ్చే సర్టిఫికెట్లకు గుర్తింపు కల్పించాలి.

 

   భారత్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఇతర దేశాల్లో క్యాంపస్‌లు నెలకొల్పేందుకు అనుమతివ్వాలి. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే విధంగా కరిక్యులం రూపొందించాలి. విదేశీ ఫ్యాకల్టీ ఆకర్షితులయ్యేందుకు కృషి చేయాలి. టీచింగ్ పోస్టుల్లో బెస్ట్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. రీసెర్చ్‌వైపు ఆకర్షితులయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎంఫిల్, పీహెచ్‌డీ అభ్యర్థులను అకడమిక్ అసిస్టెంట్స్, అకడమిక్ అసోసియేట్స్‌గా పరిగణించాలి.

 

 కొత్తగా నియమితులైన ఫ్యాకల్టీకి విధుల్లో చేరే ముందుగా మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ట్రైనింగ్ అకాడమీల నేతృత్వంలో ఇండక్షన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలి. తర్వాత పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ అందించాలి. ఇండక్షన్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వాళ్లు ఫ్యాకల్టీగా నియమితులైన యూనివర్సిటీలో నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించాలి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీ నైపుణ్యాలను, అకడమిక్ పెర్‌ఫార్మెన్స్‌ను పరీక్షించేలా తప్పనిసరిగా మూల్యాంకన వ్యవస్థ ఉండాలి. సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల పదోన్నతుల క్రమంలో వారిలో లీడర్‌షిప్ నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్నత విద్యా సంస్థలు లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు నెలకొల్పి వీటిపై షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలి.

 

 ఆర్ అండ్ డీ కి అనువైన వాతావరణం

 మన దేశంలోని యువత రీసెర్చ్ దిశగా విదేశాలకు వెళుతున్న క్రమంలో ఇక్కడే ఆ అవకాశం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. పబ్లిక్, ప్రైవేట్ విభాగంలో రానున్న పదేళ్లలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా కనీసం 100 కొత్త రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఇన్నోవేషన్, క్రియేటివిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంపొందించేందుకు రానున్న ఐదేళ్ల కాలంలో ఉన్నత విద్యా సంస్థల్లో అదనంగా వంద ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, స్టడీస్‌కు ప్రాధాన్యమిస్తూ మానవ వనరులను అభివృద్ధి చేసేలా అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవాలి.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top