ఇంటర్వ్యూలో అభ్యర్థి అడగకూడని అంశాలు

ఇంటర్వ్యూలో అభ్యర్థి అడగకూడని అంశాలు


జాబ్ స్కిల్స్: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ స్థాయిల్లో నెగ్గి మౌఖిక పరీక్షకు పిలుపు అందుకుంటే కొలువు కల సగం నెరవేరినట్లే. అయితే ఇంటర్వ్యూ అంత సులువేమీ కాదు. ఏ మాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా అవకాశం చేజారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి సంస్థ/ఉద్యోగం గురించి అభ్యర్థులు అడిగే ప్రశ్నలే కొత్త చిక్కులు  తెచ్చిపెడతాయి. అలా అని అడగకుండా ఉంటే  సంస్థ గురించి కనీస అవగాహన లేదనుకునే అవకాశం ఉంది. కాబట్టి జాబ్ ఇంటర్వ్యూలో అడగకూడని ప్రశ్నలు...

 

 ఇంటర్వ్యూల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటికి అభ్యర్థులు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందే. అందులో భాగంగా ఇంటర్వ్యూ యర్‌లు అడిగే ప్రశ్నలకు ఏ సమాధానాలు చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే అంశాలే ప్రధానం. వాటి ఆధారంగానే అభ్యర్థుల పరిజ్ఞానం, వ్యక్తిత్వం, అంకితభావాన్ని అంచనా వేస్తారు. అయితే ఒక్కోసారి ఇంటర్వ్యూ చేసే వారే.. ‘ఏమైనా అడగాలనుకుంటున్నారా?’ అని అభ్యర్థులను ప్రశ్నిస్తారు. ఆ సమయంలో అడగకూడని అంశాలను ప్రస్తావిస్తే కొలువు చేజారే ఆస్కారం ఉంది.

 

  కంపెనీ ఏం చేస్తుంది?

 ఉద్యోగంలో చేరాలనుకుంటున్న కంపెనీ కార్యకలాపాలు, ఉత్పాదకత గురించి ప్రాథమిక అవగాహన లేని వారు అడిగే ప్రశ్న ఇది. ఒక వేళ ఈ ప్రశ్నను అభ్యర్థి ఇంటర్వ్యూ సమయంలో అడిగితే నూటికి 90 శాతం అవకాశం చేజారినట్టే. ఎందుకంటే తమ కంపెనీలో చేరాలనుకునే అభ్యర్థులకు సంస్థ గురించి కనీస సమాచారం, దాని లక్ష్యాలు తెలుసుకుని ఉండాలని ఇంటర్వ్యూయర్ భావిస్తారు. కాబట్టి మౌఖిక పరీక్షకు ముందుగానే సంస్థ గురించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలి. చేరాలనుకుంటున్న ఉద్యోగ విధులపై అవగాహన ఏర్పరచుకోవాలి.

 

  వేతనం ఎంత చెల్లిస్తారు?

 ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు ఎంత వేతనం ఆశిస్తున్నారనే దాన్ని ఇంటర్వ్యూ మేనేజర్లే అడుగుతారు. అభ్యర్థుల ప్రతిభ, నిజాయతీకి ప్రాధాన్యతనిస్తారు. ఈ విషయం తెలియక చాలా మంది అభ్యర్థులు ఎంతవేతనం చెల్లిస్తారని ప్రశ్నించి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఇంటర్వ్యూ చేసే వారే వేతన విషయాన్ని ప్రస్తావించే వరకు ఓపిగ్గా ఉండాలి.

 

  ఎన్ని రోజులు సెలవులు లభిస్తాయి?

 ఇంటర్వ్యూలో అడగకూడని ముఖ్యమైన ప్రశ్న ఇది. అభ్యర్థులు ఉద్యోగం కంటే సెలవులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే భావనను ఈ ప్రశ్న ఏర్పరుస్తుంది. అంతే కాకుండా అభ్యర్థులను పనిపై శ్రద్ధ లేనివారిగా, సోమరులుగా భావిస్తారు. అయితే కొలువు ఖరారైన తర్వాత లేదా ఆఫర్ లెటర్ చేతికి అందిన తర్వాత అడగొచ్చు.

 

  ప్రశంసలొద్దు..

 కొందరు ఇంటర్వ్యూ జరిగే సమయంలో ఇంటర్వ్యూయర్‌తో ‘యు ఆర్ గ్రేట్’, ‘మీ చొక్కా చాలా బాగుంది’ అంటూ ప్రశంసిస్తుంటారు. ఇంటర్వ్యూ చేసే వారిని మొదటిసారి కలిసినప్పుడే పొగ డటం సరైన విధానం కాదు. సొంత ప్రయోజనాలను ఆశించి ప్రశంసిస్తున్నారని భావించే అవకాశం ఉంది. నిజంగా ఏదైనా చెప్పాలనుకుంటే ఇటీవల కాలంలో సంస్థ సాధించిన విజయాలను ప్రస్తావించి ఇంటర్వ్యూయర్‌ను ఆకట్టుకోవచ్చు.

 

  ప్రశ్నించడానికి ఏం లేదు.

 ఇంటర్వ్యూలో ‘ఏమైనా అడగాలనుందా?’ అని అభ్యర్థులనే ప్రశ్నించినప్పుడు చాలా మంది ‘ఐ డోంట్ హావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ యు’ అని చెబుతుంటారు. ఇలా చెప్పడం వల్ల అభ్యర్థులకు ఉద్యోగంపై అంతగా ఆసక్తి లేదని, కంపెనీ గురించి ఏమాత్రం పరిశోధించలేదని అనుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో అడగడానికి కొన్ని ప్రశ్నల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఏం లేవనుకుంటే ‘మీ కంపెనీలో పనిచేయడానికి ఏ విభాగం ఉత్తమమైంది?’ అని ప్రశ్నించొచ్చు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top