ప్రకరణ–22 దేన్ని వివరిస్తుంది?

ప్రకరణ–22 దేన్ని వివరిస్తుంది?


ప్రకరణ–22: అక్రమ నిగ్రహణ (అరెస్ట్‌), నిర్బంధం (డిటెన్షన్‌) నుంచి రక్షణ, అక్రమ అరెస్టులకు, నిర్బంధాలకు వ్యతిరేకంగా రక్షణ. ఈ ప్రకరణ ప్రకారం చట్టబద్ధంగా అరెస్ట్‌ చేయడానికి కొన్ని ప్రాతిపదికలు పాటించాలి. అవి..



ప్రకరణ–22(1)

ఎ) ప్రతి అరెస్టుకూ కారణం ఉండాలి లేదా కారణాన్ని తెలపాలి. న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశం ఇవ్వాలి.



బి) నిందితుణ్ని అరెస్టు చేసిన 24 గంటల్లోపు (ప్రయాణ సమయాన్ని మినహాయించి) సమీప న్యాయస్థానంలో హాజరుపర్చాలి.



ప్రత్యేక వివరణ

24 గంటల సమయాన్ని లెక్కించేటప్పుడు ప్రయాణ సమయాన్ని మినహాయిస్తారు. అయితే సెలవు దినాలను మినహాయించరు. అరెస్టయిన వ్యక్తిని సమీప మేజిస్ట్రేట్‌ నివాసంలో హాజరుపర్చాలి.



పై రక్షణలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ప్రకరణ–22(3) ప్రకారం ఈ రక్షణలు శత్రు దేశ పౌరులకు, ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాల కింద అరెస్టయినవారికి వర్తించవు.



ప్రకరణ–22(4) ప్రకారం ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాల కింద అరెస్టయినవారిని మూడు నెలలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. అయితే ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాల కింద ఏర్పాటైన అడ్వైజరీ బోర్డు సూచన మేరకు మూడు నెలల కన్నా ఎక్కువ నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ బోర్డులో హైకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియామకానికి అర్హత కలిగిన వ్యక్తులు సభ్యులుగా ఉంటారు.



ప్రకరణ–22 (5) ప్రకారం ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ కింద అరెస్టయినవారికి అరెస్టుకు గల కారణాలను సాధ్యమైనంత త్వరగా తెలపాలి. తద్వారా బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్‌ వేసుకునే అవకాశాన్ని పొందుతారు.



ప్రకరణ–22(6) ప్రకారం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రివెంటివ్‌ అరెస్టుకు గల కారణాలను వెల్లడించకుండా ఉండేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది.



ప్రకరణ–22(7) ప్రకారం పైన పేర్కొన్న క్లాజులతో సంబంధం లేకుండా మూడు నెలల కన్నా ఎక్కువ కాలం నిర్బంధించేలా పార్లమెంట్‌ శాసనాలు చేయొచ్చు.



ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాలు–వివరణ

సాధారణంగా నిర్బంధాలు రెండు రకాలు.



1. శిక్షించే చట్టాలు 2. నివారక చట్టాలు.

శిక్షించే చట్టాల్లో ముద్దాయి నేరం నిరూపితమై కోర్టు విధించిన శిక్షను అమలుచేయడానికి నిర్బంధిస్తారు. నివారక చట్టాల్లో నిందితుణ్ని/అనుమానితుణ్ని నేరం చేస్తాడేమో అనే అనుమానంతో విచారణ లేకుండా ముందుగానే నిర్బంధిస్తారు. దేశ రక్షణ, శాంతిభద్రతల దృష్ట్యా ఇలా చేస్తారు.



ముఖ్య ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాలు

నివారక నిర్బంధ చట్టాన్ని 1950లో చేశారు. కానీ, దాన్ని 1969లో రద్దు చేశారు.



‘అంతర్గత భద్రతా చట్టం (మెయింటనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌: ఎంఐఎస్‌ఏ: మిసా)–1971’ని 1978లో రద్దు చేశారు.



విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, దొంగ వ్యాపార నిరోధక చట్టం–1974.



అత్యవసర సరకుల దొంగ మార్కెట్‌ నిరోధక నిర్వహణ చట్టం–1980

‘జాతీయ భద్రతా చట్టం–1980’ని 1984లో సవరించారు.



ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి రెగ్యులేషన్‌ నిర్బంధాలు; స్మగ్లర్, ఫారెన్‌ ఎక్సే్ఛంజ్‌ నిరోధక చట్టం–1976

‘ఉగ్రవాద, కల్లోల కార్యక్రమాల నివారక చట్టం(టాడా)–1985’ను 1995లో రద్దు చేశారు.

‘ఉగ్రవాద నిరోధక చట్టం (పోటా)–2002’ను 2004లో రద్దు చేశారు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top