స్మార్ట్‌గా చదవండి..బెస్ట్‌గా నిలవండి!

స్మార్ట్‌గా చదవండి..బెస్ట్‌గా నిలవండి!


పరీక్షల కాలం మొదలైంది. ఏడాదిపాటు పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాలు.. వాటి ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు, మంచి మార్కులు సొంతం చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో ఎంత కాదనుకున్నా ఒత్తిడికి గురవడం సహజం. క్లాస్‌రూంలో అద్భుతంగా రాణించిన విద్యార్థులు సైతం.. ఒత్తిడికి చిత్తయి వార్షిక పరీక్షల్లో డీలా పడిన సందర్భాలెన్నో. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు. పరీక్ష రోజు వరకు నిశ్చింతగా, ఉల్లాసంగా ఉండొచ్చు. కావల్సిందల్లా.. స్మార్ట్‌గా వ్యవహరించడమే.



పదో తరగతి మొదలు ప్రొఫెషనల్‌ డిగ్రీ విద్యార్థుల వరకు సహజంగా ఎదురయ్యే సమస్య.. ఒత్తిడి! ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల్లో ఈ సమస్య కొంత ఎక్కువ. ఈ సమస్య పరిష్కారం అనేది విద్యార్థుల చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు. దీనికి చేయాల్సింది.. దినచర్య ప్రారంభం నుంచి.. నిద్రించే వరకు ‘స్మార్ట్‌’గా కదలడమే అంటున్నారు.



ఆరోగ్యం.. ప్రథమం

ఇప్పుడు విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం. పరీక్షల భయంతో ఒత్తిడి, ఆందోళనలను మనసులోకి వచ్చేలా వ్యవహరిస్తే ఆరోగ్యం పాడవుతుంది. అది పూర్తిగా చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ముందుగా ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నూనె ఎక్కువగా ఉన్న, కొవ్వు పదార్థాలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. జంక్‌ ఫుడ్స్‌కు కొద్ది రోజులు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. వేసవి కాలం వచ్చేసింది కాబట్టి పరిమితంగా ఘనాహారం తీసుకుంటూనే, ద్రవాహారం (జ్యూస్‌లు, మజ్జిగ వంటివి) తీసుకోవాలి. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి.



ఎలా చదవాలి

ఏడాదిపాటు తరగతి గదుల్లో పుస్తకాలను ఔపోసన పట్టి.. ఫార్మేటివ్‌ అసైన్‌మెంట్స్, స్లిప్‌ టెస్ట్‌ల్లో రాణించిన విద్యార్థులు సైతం ఆఖరి నిమిషంలో ఎలా చదవాలి.. ఎప్పుడు చదవాలి? అంటూ ఆందోళన చెందుతుంటారు. ఎలా చదవాలి? అనే విషయంలో విద్యార్థులకు పనికొచ్చే సూత్రం చదువుకుంటూనే ఆ అంశాలను రాసుకోవడం. అదే విధంగా ఒక పుస్తకంలో చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను అండర్‌లైన్, మార్కింగ్‌ చేసుకోవడం వంటివి చేయాలి. దీనివల్ల పరీక్షలకు కొద్ది రోజుల ముందు పునశ్చరణ పరంగా మేలు కలుగుతుంది.



ఎప్పుడు చదవాలి?

ఈ ప్రశ్నకు సమాధానం విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తి, సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి వేకువజామున లేచి చదవడం అలవాటు. మరికొంత మందికి రాత్రి వేళల్లో చదవడం అనుకూలం. ఈ విషయంలో ఎలాంటి విద్యార్థులైనా.. తమకు అలవాటుగా ఉన్న సమయంలో చదవడం ప్రారంభించినప్పుడు.. ముందుగా ఇష్టమైన సబ్జెక్టుతో మొదలు పెట్టాలి. తర్వాత నెమ్మదిగా ఇతర సబ్జెక్టులపై దృష్టిసారించాలి.



బోర్‌ కొడితే.. రిలాక్స్‌

చదువుతున్న సమయంలో ఒక టాపిక్‌ కష్టంగా ఉన్నా.. లేదా బోర్‌గా అనిపించినా.. వెంటనే దానికి విరామం ఇవ్వాలి. పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇష్టమైన వ్యాపకంతో రిలాక్స్‌ కావాలి. అంతే తప్ప కష్టంగా అనిపించినా, బోర్‌గా ఫీల్‌ అయినా చదవాల్సిందే అనే ధోరణితో సాగితే మొదటికే ప్రమాదం. ఎంతసేపు చదివాం అనే దానికంటే చదివిన అంశాలు గుర్తుండేలా చదవడం ముఖ్యమని గుర్తించాలి. గంటలకొద్దీ చదువుతూ కూర్చున్నా మెదడుకు ఎక్కని అంశాలు ఒత్తిడికి గురి చేస్తాయి.



దశల వారీగా..

రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రకు కేటాయిస్తే మిగిలిన సమయాన్ని చదవడం కోసం విడతల వారీగా విభజించుకోవాలి. ఉదయాన్నే చదవడం వల్ల బాగా గుర్తుంటాయనేది వాస్తవమే. దీన్ని తప్పనిసరిగా ఆచరించడం వల్ల మెరుగైన ఫలితాలు ఆశించొచ్చు. ఈ సమయంలో తేలికైన ఆహారం తీసుకోవాలి.



ప్రిపరేషన్‌ సమయంలో ఒత్తిడికి గురవుతున్నారనడానికి ముందుగానే సంకేతాలు కనిపిస్తాయి. చెమట పట్టడం; చేతులు, కాళ్లలో వణుకు, తలనొప్పి వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఈ సంకేతాలు కనిపించగానే కొంత సమయాన్ని ఇష్టమైన పనులు చేయడానికి కేటాయించాలి.ఆ తర్వాత తిరిగి చదువుపై దృష్టిసారించాలి.



చేతి రాత మెరుగుపర్చుకోండి

చేతి రాత అందంగా ఉండేలా చూసుకోవాలి. పరీక్షలో ఇది ఎంతో కీలకం. చేతి రాత.. మూల్యాంకన చేసే వారికి ఆహ్లాదకరంగా కనిపించాలి. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి. అలా కాకుండా సమయం సరిపోదనో లేదా చేతి రాత మార్చుకోలేకనో.. గజిబిజిగా రాస్తే.. సమాధానంలో విలువైన సమాచారం ఉన్నప్పటికీ మార్కులకు గండి పడే ప్రమాదం ఉంది. అందువల్ల రోజూ కొంత సమయాన్ని రైటింగ్‌ ప్రాక్టీస్‌కు కేటాయించాలి.



ఏకాగ్రతకు భంగం లేకుండా

పిల్లల ఏకాగ్రతకు భంగం కలగకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. వారికి ప్రత్యేకంగా ఒక గది కేటాయించాలి. ఈ అవకాశం లేని వారు.. విద్యార్థులు చదువుకునే సమయంలో టీవీ చూడటం, లేదా ఇతరులతో మాట్లాడటం వంటివి చేయకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలి. ఎన్ని చిట్కాలు పాటించినా పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే భరోసా అత్యంత ప్రభావం చూపుతుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రిపరేషన్‌ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించాలి. వారికి మానసికంగా భరోసా ఇవ్వాలి.



పరీక్ష ముందు రోజు ప్రశాంతంగా ఉండాలి. పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమకు కేటాయించిన సెంటర్లను ముందుగానే చూసుకోవాలి. హాల్‌ టికెట్, పెన్, ప్యాడ్‌ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి.



పరీక్ష హాల్లో

పరీక్ష హాల్లో తొలుత 10–15 నిమిషాల పాటు ప్రశ్నపత్రాన్ని ఆసాంతం చదవాలి. ఆ తర్వాత బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ క్రమంలో ముఖ్యమైన పాయింట్లు ఉంటే వాటిని అండర్‌లైన్‌ చేయడం, సబ్‌ హెడింగ్స్‌ పెట్టడం వంటివి మార్కుల సాధన పరంగా ఉపయోగపడే అంశాలు. అదే విధంగా పరీక్ష ముగిసే సమయానికి పది నిమిషాల ముందుగానే సమాధానాలు రాయడాన్ని పూర్తిచేయాలి. మిగిలిన పది నిమిషాల్లో అప్పటికే రాసిన సమాధానాలను ఒకసారి సరిచూసుకోవాలి.



ప్రస్తుతం పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇతరులతో ముఖ్యంగా స్నేహితులతో పోల్చుకోవడం మానుకోవాలి. ముఖ్యంగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు దీన్ని కచ్చితంగా పాటించాలి. లేకుంటే మానసిక ఒత్తిడికి గురై, అది శారీరక అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది.

– డాక్టర్‌ సి.హెచ్‌.వెంకట్,

 క్లినికల్‌ సైకాలజిస్ట్‌




విద్యార్థులు పరీక్షల కాలాన్ని సానుకూల దృక్పథంతో ఆస్వాదించాలి. ఏడాది పాటు చదివిన అంశాలను పొందుపర్చి మంచి మార్కులు సాధించేందుకు ఉపకరణాలుగా పరీక్షలను భావించాలి. దీనికి విరుద్ధంగా పరీక్షలంటే ముందుగానే మానసిక ఒత్తిడికి గురవడం వల్ల పలు రకాల సమస్యలు ఎదురవుతాయి. ఇక పిల్లల సంసిద్ధత దిశగా తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో కీలకంగా నిలుస్తుంది. ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం కొంత సమయం కేటాయించడం వల్ల వారికి మనోధైర్యం లభిస్తుంది.

– డాక్టర్‌ ఎం.ఎస్‌.రెడ్డి, సైకియాట్రిస్ట్‌.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top