యుద్ధనౌక ‘విశాఖపట్నం’ జల ప్రవేశం


 అంతర్జాతీయం

  ప్రధాని జర్మనీ పర్యటన

 మూడు దేశాల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 14న బెర్లిన్‌లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో మోదీ, మెర్కెల్ పాల్గొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందంపై ఒక నిర్ణయానికి రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భారత్-ఐరోపా కూటమి (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందంపై రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన ప్రక్రియను పునరుద్ధరించాలన్నారు. మోదీ హనోవర్‌లో ఇండో జర్మన్ బిజినెస్ సమ్మిట్‌లో భారత పెవిలియన్‌ను ప్రారంభించారు.

 

 యురేనియం సరఫరాకు కెనడా-భారత్ ఒప్పందం

 ప్రధాని నరేంద్ర మోదీ కెనడా పర్యటనలో ఏప్రిల్ 15న ఒటావాలో భారత్‌కు యురేనియం సరఫరాపై ఒప్పందం కుదిరింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రధాన ఒప్పందం 2013లో కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం కెనడా ఈ ఏడాది నుంచి ఐదేళ్ల పాటు 3000 టన్నుల యురేనియం భారత్‌కు సరఫరా చేస్తుంది. దీని విలువ సుమారు రూ. 1524 కోట్లు ఉంటుంది. ఇప్పటికే భారత్ యురేనియం సరఫరాకు రష్యా, కజికిస్థాన్‌లతో ఒప్పందం చేసుకుంది. ఇరు దేశాల మధ్య నైపుణ్యాభివృద్ధికి సంబంధించి 13 ఒప్పందాలు, అంతరిక్ష సహకారానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది.

 

 నేపాల్ మాజీ ప్రధాని బహదూర్ థాపా మృతి

 నేపాల్ మాజీ ప్రధాన మంత్రి సూర్య బహదూర్ థాపా (87)అనారోగ్యంతో ఏప్రిల్ 15న మరణించారు. ఆయన ఐదు సార్లు (1963-64, 1965-69, 1979-83, 1997-98, 2003-04) నేపాల్ ప్రధాన మంత్రిగా విధులు నిర్వర్తించారు.

 

 జాతీయం

 జాతీయ న్యాయ కమిషన్ అమలు

 జాతీయ న్యాయ నియామకాల కమిషన్(నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్-ఎన్‌జేఏసీ)ను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 13న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్‌జేఏసీకి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ సవరణ చట్టాన్ని (99వ రాజ్యాంగ సవరణ) కూడా అమల్లోకి తెచ్చింది. న్యాయమూర్తులను నియమించేందుకు 1993లో ఏర్పడిన కొలీజియం వ్యవస్థ స్థానంలో ఎన్‌జేఏసీ పనిచేస్తుంది. ఈ కమిషన్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీలను చేపడుతుంది.

 

 మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం 5.17 శాతం

 వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ పెరుగుదల రేటు వార్షికంగా మార్చిలో 5.17 శాతంగా నమోదైంది. సీపీఐ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.37, జనవరిలో 5.19 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ధరలు ముఖ్యంగా పాలు, కూరగాయల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం మూడు నెలల్లో కనిష్ట స్థాయికి చేరింది.

 

 ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన

 ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ సు యోంగ్ ఏప్రిల్ 12 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌లో పర్యటించారు. కొరియా ప్రాంతంలో శాంతిని, సుస్థిరతను భారత్ కోరుకుంటుందని ఆమె, రీ యోంగ్‌కు తెలిపారు. ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

 

 విజయవంతమైన అగ్ని-3 పరీక్ష

 అణ్వస్త్రాలను మోసుకుపోగల క్షిపణి అగ్ని-3ని భారత్ ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్‌లో గల పరీక్షా కేంద్రం నుంచి ఏప్రిల్ 16న విజయవంతంగా పరీక్షించింది. క్షిపణి పనితీరును నిర్ధారించేందుకు సైన్యం ఈ పరీక్ష నిర్వహించింది. అగ్ని-3 క్షిపణి 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 1.5 టన్నుల ఆయుధాలను మోసుకుపోగలదు. ఇందులో ఘన ఇంధనంతో పనిచేసే రెండంచెలు ఉంటాయి. పొడవు 17 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు, బరువు 50 టన్నులు. ఈ క్షిపణిలో హైబ్రిడ్ నేవిగేషన్, దిశానిర్దేశ నియంత్రణ వ్యవస్థలు, అధునాతన ఆన్‌బోర్డు కంప్యూటర్ వ్యవస్థలు ఉన్నాయి.

 

 ద్రవ్యోల్బణంలో -2.33 శాతం తగ్గుదల

 టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలో 2014 మార్చితో పోల్చితే 2015లో -2.33 శాతం తగ్గుదల నమోదైంది. వరుసగా ఐదు నెలల నుంచి టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. 2014 నవంబర్‌లో -0.17, డిసెంబర్‌లో -0.50, 2015 జనవరిలో -0.39, ఫిబ్రవరిలో -2.06 శాతంగా ఉంది. తయారీ వస్తువులు, చమురు, కూరగాయల ధరలు తగ్గడంతో వరుసగా ఐదో నెల ద్రవ్యోల్బణం తగ్గింది. 2014 మార్చిలో ఇది 6 శాతంగా నమోదైంది.

 

 2015-16 వృద్ధి 7.5 శాతం: ఐఎంఎఫ్

 భారత వృద్ధి రేటు 2015-16లో 7.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇది 2014లో 7.2 శాతం. చైనా వృద్ధి రేటును భారత్ అధిగమిస్తుందని ఐఎంఎఫ్ ఏప్రిల్ 14న విడుదల చేసిన అంచనాల్లో తెలిపింది. ఇందుకు కనిష్ట చమురు ధరలు, సానుకూల డిమాండ్, పెట్టుబడుల పెరుగుదల అంశాలు భారత్ వృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు కూడా స్థూల దేశీయోత్పత్తి 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. పెట్టుబడుల్లో వృద్ధి వల్ల 2017-18 నాటికి 8 శాతం వృద్ధి రేటు సాధించవచ్చని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన దక్షిణాసియా ద్వైవార్షిక నివేదికలో పేర్కొంది.

 

 యుద్ధనౌక ‘విశాఖపట్నం’ జల ప్రవేశం

 ఆధునిక యుద్ధనౌక విశాఖపట్నాన్ని ఏప్రిల్ 20న ముంబైలో నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ సతీమణి మిను ధోవన్ జల ప్రవేశం చేయించారు. దీన్ని 2018లో లాంఛనంగా నౌకాదళంలో చేరుస్తారు. ఒక యుద్ధనౌకకు విశాఖపట్నం పేరు పెట్టడం ఇదే తొలిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ విశాఖపట్నం కోల్‌కత తరగతికి చెందింది. పి-15బి స్టెల్త్ డెస్ట్రాయిర్ల శ్రేణిలో మొదటిది. ఇందులో ఉపరితలం నుంచి ఉపరితలంలోకి లక్ష్యాలను ఛేదించగల సూపర్‌సోనిక్ క్షిపణులను అమరుస్తారు.

 

 హిందుజా బ్రదర్స్ ఆసియా బిజినెస్ లీడర్స్

 వ్యాపార రంగంలో అపార ప్రతిభ చూపినందుకు హిందుజా సోదరులు ఎస్.పి.హిందుజా, జి.పి.హిందుజాలకు ‘ఆసియా బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్-2015’ అవార్డు దక్కింది. ఏప్రిల్ 18న జరిగిన 5వ ఆసియా ఆవార్డుల ఫంక్షన్‌లో ప్రదానం చేశారు. బిజినెస్‌లో గొప్ప విజయాలు సాధించినందుకు ఈ అవార్డు లభించింది.

 

 క్రీడలు

 జోర్డాన్ స్పీథ్‌కు మాస్టర్స్ గోల్ఫ్ టైటిల్

 మాస్టర్స్ గోల్ఫ్ టైటిల్‌ను జోర్డాన్ స్పీథ్ (అమెరికా) గెలుచుకున్నాడు. ఆగస్టాలో ఏప్రిల్ 12న ముగిసిన పోటీలో స్పీథ్ టైటిల్ సాధించగా, ఫిల్ మైకెల్‌సన్ (అమెరికా) రెండో స్థానంలో నిలిచాడు. ఈ మాస్టర్ టైటిల్ స్పీథ్ గెలవడం ఇదే తొలిసారి.

 

 హామిల్టన్‌కు బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ

 మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ టైటిల్ గెలుచుకున్నాడు. మనామా (బహ్రెయిన్)లో ఏప్రిల్ 19న జరిగిన పోటీలో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, రైకోనెస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

 

 యువ క్రికెటర్ అంకిత్ కేసరి మృతి

 మైదానంలో యువ క్రికెటర్ అంకిత్ కేసరి (20) మరణించారు. బెంగాల్ డివిజన్-1 నాకౌట్ పోటీల్లో భాగంగా ఏప్రిల్ 17న ఈస్ట్ బెంగాల్, భవానీపూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన బంతిని పట్టుకోవడంలో మరో క్రికెటర్ సౌరవ్ మొండెల్ ఒకరికొకరు ఢీకొనడంతో గాయపడ్డాడు. మూడు రోజుల అనంతరం కోల్‌కతలో చికిత్స పొందు తూ ఏప్రిల్ 20న మరణించాడు. అంకిత్ బెంగాల్ అండర్-19 జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

 

 లారెస్ ప్రపంచ క్రీడా అకాడెమీలో సచిన్

 భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ప్రముఖ లారెస్ ప్రపంచ క్రీడా అకాడెమీలో సభ్యత్వం దక్కింది. సచిన్‌తో పాటు చైనా బాస్కెట్‌బాల్ స్టార్ యావో మింగ్, జిమ్నాస్ట్ షియాపింగ్, స్కేటర్ యాంగ్ యాంగ్, కెన్యా మారథాన్ రన్నర్ టెగ్లా లోరోప్‌లు కూడా ఏప్రిల్ 15న ప్రకటించిన లారెస్ అకాడెమీ జాబితాలో ఉన్నారు. భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్‌లకు ఈ గౌరవం దక్కింది.

 

 లారెస్ ఉత్తమ క్రీడాకారులుగా జొకోవిచ్, దిబాబా

 16వ లారెస్ క్రీడా అవార్డులను ఏప్రిల్ 15న షాంఘైలో ప్రదానం చేశారు. పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా సెర్బియాకు చెందిన నొవాక్ జొకోవిచ్ (టెన్నిస్) ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా ఇథియోపియాకు చెందిన గెంజెబె దిబాబా(లాంగ్ డిస్టెన్స్ రన్నర్) ఎంపికయ్యింది. వరల్డ్ టీం ఆఫ్ ది ఇయర్‌గా జర్మనీ ఫుట్‌బాల్ టీం నిలిచింది.

 

 కార్తికేయన్‌కు మూడో స్థానం

 సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్‌లో భారత రేసింగ్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్ మూడో స్థానంలో నిలిచాడు. సుజుకాలో ఏప్రిల్ 19న జరిగిన రేసులో అండ్రీ లోటెరర్ మొదటి స్థానం, కజుకి నకజిమా రెండో స్థానం సాధించారు. ఫార్ములా వన్ కాకుండా సింగిల్ సీటర్ సిరీస్‌లో టాప్-3కి చేరడం ఇదే తొలిసారి.

 

 ఆసియా ఓషియానియా గ్రూప్-2లో భారత్ విజయం

 ఫెడ్ కప్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏప్రిల్ 18న జరిగిన ఆసియా ఓషియానియా గ్రూప్-2 మహిళల టెన్నిస్ టోర్ని ఫైనల్ ప్లే ఆఫ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ ఫైనల్లో ఫిలిప్పీన్స్‌ను భారత్ ఓడించింది. దీంతో భారత్‌లో 2016లో జరిగే ఆసియా ఓషియానియా గ్రూప్-1కు అర్హత సాధించింది.

 

 రాష్ట్రీయం

 సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాంఏచూరి

 సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి విశాఖపట్నంలో జరిగిన పార్టీ 21వ జాతీయ మహా సభల్లో ఏప్రిల్ 19న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతవరకు ఈ పదవిలో ప్రకాశ్‌కారత్ ఉన్నారు.

 

 ఎస్పీ బాలుకు హరివరసనం అవార్డు

 ప్రముఖ నేపధ్య సంగీత గాయకుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యానికి 2015కు గానూ ప్రతిష్టాత్మకమైన హరివరసనం అవార్డును కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 17న ప్రకటించింది. లౌకిక వ్యాప్తికి, శాంతికి, శబరిమల అయ్యప్ప స్వామిపై పలు భాషల్లో గీతాలు ఆలపించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద రూ. లక్ష నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక బహూకరిస్తారు.

 

 సంగీత దర్శకుడు శ్రీ మృతి

 ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ (49) హైదరాబాద్‌లో అనారోగ్యంతో ఏప్రిల్ 18న మరణించారు. ఆయన పూర్తి పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. నాటి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడు. పోలీస్ బ్రదర్స్‌తో సంగీత దర్శకుడిగా పరిచయమైన శ్రీ, మనీ మనీ, సింధూరం, అనగనగా ఒక రోజు, గాయం, ఆవిడా మా ఆవిడే, చంటిగాడు, చక్రం వంటి ఆదరణ పొందిన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.

 

 వార్తల్లో వ్యక్తులు

  నోబెల్ బహుమతి గ్రహీత గుంటర్ గ్రాస్ మృతి

 జర్మనీకి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత, రచయిత, కవి, నాటక రచయిత గుంటర్ గ్రాస్ (87) లూబెక్‌లో ఏప్రిల్ 13న మరణించారు. 1959లో ‘ద టిన్ డ్రమ్’ నవల ఆయనకు ప్రపంచ ఖ్యాతి తెచ్చి పెట్టింది. తర్వాత క్యాట్ అండ్ మౌస్, డాక్ ఇయర్స్ వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. 1999లో ఆయనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.

 

 ఒడిశా మాజీ సీఎం మృతి

 ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, అసోం మాజీ గవర్నర్ జానకీ వల్లభ్ పట్నాయక్ ఏప్రిల్ 21న మరణించారు. తిరుపతిలో రాష్ట్రీయ విద్యాపీఠ్ కార్యక్రమానికి హాజరైన ఆయన తీవ్ర గుండెనొప్పితో స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జేబీ పట్నాయక్ కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఆయన ఒడిశాకు 14 ఏళ్లు సీఎంగా పరిపాలించారు. కేంద్ర మంత్రిగా, అసోం గవర్నర్‌గా ఆయన పనిచేశారు.



 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top