లండన్‌లో అవినీతి వ్యతిరేక సదస్సు

లండన్‌లో అవినీతి వ్యతిరేక సదస్సు


క్రీడలు


ఆండీ ముర్రే, సెరెనా విలియమ్స్‌లకు రోమ్ మాస్టర్స్ టైటిల్స్

 రోమ్ మాస్టర్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే గెలుచుకున్నాడు. రోమ్‌లో మే 15న జరిగిన ఫైనల్లో నొవాక్ జకోవిచ్‌ను ముర్రే ఓడించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో మాడిసన్ కీస్‌ను ఓడించి  సెరెనా విలియమ్స్ టైటిల్ దక్కించుకుంది. మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ల జోడీ గెలుచుకుంది.

 

 మాక్స్ వెర్ స్టాపెన్‌కు స్పెయిన్ గ్రాండ్ ప్రి

 ఫార్ములావన్ స్పెయిన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ జట్టుకు చెందిన పద్దెనిమిదేళ్ల మాక్స్ వెర్‌స్టాపెన్ గెలుచుకున్నాడు. దీంతో చిన్న వయసులో ఫార్ములావన్ టైటిల్ నెగ్గిన డ్రైవర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు గతంలో ఇటలీ గ్రాండ్ ప్రి నెగ్గిన వెటల్ (21 సం.) పేరుపై ఉండేది. బార్సిలోనాలో మే 15న జరిగిన రేసులో వెర్‌స్టాపెన్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, రైకోనెన్, వెటల్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

 

  ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్

 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్ మనోహర్ మే 12న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశ క్రికెట్ బోర్డ్‌తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎన్నికైన మొదటి వ్యక్తిగా శశాంక్ మనోహర్ నిలిచారు.

 

 రాష్ట్రీయం

  హైదరాబాద్‌లో అతిపెద్ద కార్గో విమానం

 ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఆంటోనోవ్ ఏఎన్-225 మ్రియా..మే 13న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఇది భారత్‌కు రావడం ఇదే తొలిసారి. 240 ప్రపంచ రికార్డులు కలిగిన ఏఎన్ -225 మ్రియా భారత్ గుండా ప్రయాణిస్తూ ఇంధనం నింపుకునేందుకు హైదరాబాద్‌లో దిగింది.

 

 సుప్రీంకోర్టు జడ్జిగా  నాగేశ్వరరావు ప్రమాణం

 ఏపీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మే 13న ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది.  నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బార్ నుంచి కొలీజియం సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసిన నాలుగో సభ్యుడు జస్టిస్ నాగేశ్వరరావు.  గతంలో ఆయన మూడుసార్లు అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.

 

 వార్తల్లో వ్యక్తులు

 జమాతే ఇస్లామీ అధినేత నిజామీకి ఉరి

 బంగ్లాదేశ్ ప్రభుత్వం జమాతే ఇస్లామీ పార్టీ అధినేత మొతీర్ రహ్మాన్ నిజామీ (73)తో పాటు మరో నలుగురిని మే 10న ఉరితీసింది. 1971 నాటి యుద్ధనేరాల కేసులో ఆయనకు 2014లో ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పు రద్దుకు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడా ఆయనకు చుక్కెదురైంది.

 

  ఇస్రో మాజీ చైర్మన్ యు.ఆర్.రావుకు ఐఏఎఫ్ అవార్డు

 ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఎఫ్) హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు- 2016కు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యు.రామచంద్రరావు ఎంపిక య్యారు. ఖగోళశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషికి గానూ ఐఏఎఫ్ అవార్డుకు ఎంపిక చేసింది.

 

 అంతర్జాతీయం

 

  లండన్‌లో అవినీతి వ్యతిరేక సదస్సు

 లండన్‌లో మే 12న ప్రపంచ అవినీతి వ్యతిరేక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అవినీతిని అంతమొందిస్తామని వివిధ దేశాధినేతలు ప్రతినబూనారు. ఈ సదస్సులో 40 దేశాల అధినేతలు, ఆర్థిక, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

  బ్రెజిల్ అధ్యక్షురాలు రౌసెఫ్ సస్పెన్షన్

 బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ను ఆ దేశ సెనెట్ మే 12న సస్పెండ్ చేసింది. బడ్జెట్  నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఆమెపై అభిశంసన ప్రక్రియ చేపట్టారు. ఈ తీర్మానానికి సెనెట్ ఆమోదం లభించింది. దీంతో ఉపాధ్యక్షుడు మిచెల్ టెమర్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

 

  ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో డుటెర్టే విజయం

 ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డుటెర్టే ఎన్నికయ్యారు. మే 9న జరిగిన ఎన్నికల్లో పీడీపీ-లబాన్ పార్టీ నాయకుడు డుటెర్టే భారీ మెజారిటీతో విజయం సాధించారు.

 

  భారత్- అమెరికా రెడ్‌ఫ్లాగ్ విన్యాసాలు

 భారత్-అమెరికా వాయు సేనల రెడ్‌ఫ్లాగ్ విన్యాసాలు అమెరికాలోని అలస్కాలో మే 13న ముగిశాయి. నాలుగు వారాల పాటు సాగిన  ఈ విన్యాసాల్లో భారత్‌కు చెందిన 10 యుద్ధ విమానాలు, 170 మంది సిబ్బంది పాల్గొన్నారు.

 

 జాతీయం

  బల నిరూపణలో నెగ్గిన హరీశ్‌రావత్

 ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మే 10న జరిగిన బల పరీక్షలో కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ సాధించిన విజయానికి సుప్రీంకోర్టు మే 11న ఆమోదముద్ర వేసింది. రావత్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా రాష్ట్రపతి పాలన ఎత్తివేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్ర హోం శాఖ ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తేస్తున్నట్లు మే 11న ప్రకటించింది. మొత్తం 61 (ఎమ్మెల్యేలు) ఓటు వేయగా రావత్‌కు 33 ఓట్లు లభించినట్లు కోర్టు ప్రకటించింది. అనర్హత కారణంగా 9 ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు.

 

  కాల్‌డ్రాప్స్ పరిహారానికి సుప్రీం నో

 కాల్‌డ్రాప్స్‌కు సంబంధించి వినియోగదా రులకు పరిహారం చెల్లించాలన్న టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఆదేశాలను సుప్రీంకోర్టు మే 11న తోసిపుచ్చింది. ఈ నిబంధన ఏకపక్షం, చట్టవిరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఒక్కో కాల్‌డ్రాప్‌కు రూ.1 చొప్పున వినియోగదారులకు చెల్లించాలని గత ఏడాది అక్టోబర్ 16న ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై భారత టెలికం సర్వీస్ ప్రొవైడర్ల అత్యున్నత సంస్థ సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 

 దివాలా బిల్లుకు పార్లమెంటు ఆమోదం

 దివాలా బిల్లుకు రాజ్యసభ మే 11న ఆమోదం తెలిపింది. మే 5నే దీనికి లోక్‌సభ ఆమోదం లభించడంతో తాజాగా ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. దివాలాకు సంబంధించి 12 విభిన్న చట్టాల స్థానంలో కేంద్రం దీన్ని తీసుకొచ్చింది. దివాలా వ్యవహారం మొత్తం 180 రోజుల్లో పూర్తవ్వాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది.

 

 కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ

 ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ 11వ స్థానం లో నిలిచింది. ఢిల్లీలో కాలుష్య సూచీ ఏడాదికి సగటున 122 మైక్రో పర్ గ్రామ్ క్యూబిక్ మీటర్‌గా ఉంది. 20 అత్యంత కాలుష్య నగరాల్లో 10 భారత్‌లోనే ఉన్నాయి.

 

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి

 కరెంట్ అఫైర్స్ నిపుణులు,

 ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top