గగన వీధిలో విహరించే కెరీర్‌కు ఎయిర్ హోస్టెస్!

గగన వీధిలో విహరించే కెరీర్‌కు ఎయిర్ హోస్టెస్!


ఆకాశయానం, అధిక వేతనం.. వీటికి అవకాశం కల్పించే గ్లామరస్ కెరీర్ ఎయిర్ హోస్టెస్. విమానాల్లో ప్రయాణికులకు స్వాగతం పలికి, వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే గగన సఖిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నవారెందరో ఉంటారు. ప్రపంచ దేశాలను సందర్శించే అవకాశం, ఉన్నత స్థాయి జీవనం దీనిద్వారా సాధ్యమవుతుంది. మనదేశంలోకి నూతన ఎయిర్ లైన్స్ సంస్థల ఆగమనంతో ఎయిర్ హోస్టెస్‌లకు అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎన్నో ఉద్యోగాలు వీరికి అందుబాటులో ఉన్నాయి.

 

 హోదాను బట్టి వేతనం

 ఎయిర్ హోస్టెస్‌లకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. తాము పనిచేస్తున్న విమానాల్లో ప్రయాణికులకు అవసరమైన సూచనలు ఇవ్వాలి. భోజన వసతి కల్పించాలి. వారు క్షేమంగా ప్రయాణించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ప్రథమ చికిత్స అందించాలి. అత్యవసర పరిస్థితుల్లో విమానం నుంచి భద్రంగా బయటపడేలా సహాయపడాలి. ఈ పనులన్నీ చేయడానికి శిక్షణ పొందాలి. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో భారత్‌లో విమానయాన సంస్థల సంఖ్య పెరుగుతోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం ఎయిర్‌పోర్టులు ఏర్పాటవుతున్నాయి. విమాన ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి వస్తోంది.

 

 ఎయిర్‌లైన్స్ సంస్థలు నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. దీంతో ఎయిర్ హోస్టెస్‌లకు ఉద్యోగావకాశాలు రెట్టింపవుతున్నాయి. కెరీర్‌ను ప్రారంభించిన రెండు మూడేళ్లలో సీనియర్ కేబిన్ అటెండెంట్ స్థాయికి చేరుకోవచ్చు. హోదాను బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. అనుభవం ఆధారంగా అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ విభాగంలోకి ప్రవేశించొచ్చు. ఆసక్తి ఉంటే టెక్నికల్, కస్టమర్ సర్వీసెస్ ట్రైనర్‌గా కూడా పనిచేయొచ్చు. ఈ వృత్తిలో ఒత్తిళ్లు, సవాళ్లు అధికంగా ఉంటాయి. రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. సోషల్ లైఫ్‌ను కోల్పోతున్నామనే భావన అప్పుడప్పుడు కలుగుతుంది. సవాళ్లను ఎదుర్కోగల గుండె నిబ్బరం ఉన్నవారికి ఇది సరైన కెరీర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్ హోస్టెస్ అంటే మహిళలే గుర్తుకొస్తారు. కానీ, ఇటీవలి కాలంలో పురుషులు కూడా ఈ రంగంలో పనిచేస్తున్నారు. వీరికీ మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

 

 కావాల్సిన నైపుణ్యాలు: ఎయిర్ హోస్టెస్‌లకు విధుల్లో ఎన్ని ఒత్తిళ్లనైనా ఎదుర్కొని ప్రశాంతంగా పనిచేయగల ఓర్పు, సహనం తప్పనిసరిగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. కంటిచూపు మెరుగ్గా ఉండడం అవసరం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు ఉండాలి. సంక్లిష్ట పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం కావాలి. నిత్యం ఆత్మవిశ్వాసంతో కనిపించాలి.

 ముఖంపై చిరునవ్వును చెదరనివ్వకూడదు.

 

 వేతనాలు: ఎయిర్ హోస్టెస్‌లకు తమ అనుభవం, పనిచేస్తున్న సంస్థ, విధులను నిర్వర్తించిన సమయాన్ని బట్టి వేతనం అందుతుంది. ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ ఆదాయం ఉంటుంది. ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు పొందొచ్చు. సీనియారిటీ ఆధారంగా ఇందులో పెరుగుదల ఉంటుంది. హెడ్ ఫ్లైట్ అటెండెంట్ నెలకు రూ.60 వేలు సంపాదించుకోవచ్చు. కొన్ని అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఎయిర్ హోస్టెస్‌లకు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా వేతనాలు చెల్లిస్తున్నాయి.

 

 అర్హతలు

 ఎయిర్ హోస్టెస్‌గా మారాలనుకుంటే కనీసం ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ హోస్టెస్ అకాడమీలో చేరి తగిన శిక్షణ పొందిన తర్వాత విధుల్లో చేరొచ్చు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను అభ్యసించినవారు కూడా ఇందులోకి అడుగుపెడుతున్నారు. స్థానిక భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా పరిజ్ఞానం ఉంటే మంచి అవకాశాలను దక్కించుకోవచ్చు. ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అకాడమీలు విదేశీ భాషల్లో శిక్షణ ఇస్తున్నాయి.

 

 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు

     ఫ్రాంక్‌ఫిన్ ఎయిర్  హోస్టెస్ ట్రైనింగ్ అకాడమీ-హైదరాబాద్

     వెబ్‌సైట్: www.frankfinn.com

     అప్‌టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ

     వెబ్‌సైట్: www.aptechaviationacademy.com

     సృష్టీస్ ఏవియేషన్

     వెబ్‌సైట్: www.sristysaviation.com

     ఐఐ ఫ్లై ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్

     వెబ్‌సైట్: http://iifly.in/

     మాస్టర్ ఏవియేషన్ అకాడమీ

     వెబ్‌సైట్: www.masteraviationacademy.com

     ఫ్లై ఎయిర్ ఏవియేషన్ అకాడమీ

     వెబ్‌సైట్: www.flyairaviationacademy.in

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top