అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-750 పోస్టులు


కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఏసీఐవో) గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.

 

 ఖాళీల వివరాలు:

 యూఆర్    ఓబీసీ    ఎస్సీ    ఎస్టీ

 తాజా ఖాళీలు(413)    207    134    54    18

 బ్యాక్‌లాగ్ ఖాళీలు(337)    -    167    126    44

 మొత్తం (750)    207    301    180    62

 

 పే స్కేల్ రూ. 9,300- రూ.34,800, గ్రేడ్ పే రూ. 4,200. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు చెల్లిస్తారు.అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం అభిలషణీయం. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.వయసు: 18-27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. వితంతు, చట్టబద్ధంగా భర్త నుంచి విడిపోయి తిరిగి వివాహం చేసుకోని జనరల్ కేటగిరీ మహిళలకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు కాగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు 40 ఏళ్లు. డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు.

 

  శారీరక వైకల్యం ఉన్న అభ్యర్థులు అనర్హులు.

 ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ (ఆబ్జెక్టివ్ విధానం), రెండో పేపర్‌లోని ప్రశ్నలకు వివరణాత్మక (డిస్క్రిప్టివ్) సమాధానాలను ఇంగ్లిష్‌లో మాత్రమే రాయాలి. రెండు పేపర్లకు కలిపి 100 నిమిషాల సమయం ఉంటుంది.పేపర్ 1లో జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, కాంప్రెహెన్షన్, గణిత పరిజ్ఞానం తదితరాలపై ప్రశ్నలుంటాయి.పేపర్ 2 ద్వారా ఇంగ్లిష్‌లో రాయగలిగే సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి.

 

 సన్నద్ధతకు మార్గనిర్దేశనం:

 2013లో జరిగిన పరీక్షలో పేపర్-1లో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇచ్చారు. గణిత సామర్థ్యానికి సంబంధించి శాతాలు, కేలండర్, కాలం-పని, లాభనష్టాలు, నిష్పత్తులు, సంభావ్యత తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వీటితో పాటు సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, కసాగు, గసాభా ఆధారిత ప్రశ్నలు కూడా ఇస్తున్నారు. రీజనింగ్ నుంచి రక్త సంబంధాలు, దిశలు, సిరీస్, ర్యాంకులు తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. రోజూ దినపత్రికలు చదువుతూ ముఖ్యమైన అంశాలను నోట్స్‌గా రాసుకుంటే, ఈ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించగలరు. క్రీడలు, అవార్డులు, రాజకీయ పరిణామాలు-పర్యటనలు, సదస్సులు, ప్రభుత్వ పథకాలు, నియామకాలు వంటి వాటిపై దృష్టిసారించాలి. స్టాక్ జీకే నుంచి దేశాలు-రాజధానులు, కరెన్సీ; ఎత్తయినవి, పొడవైనవి, ప్రప్రథమ విజేతలు తదితరాలను చదవాలి. హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, సైన్స్, జాగ్రఫీ అంశాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై ప్రశ్నలు నేరుగా వస్తున్నాయి కాబట్టి ఈ దిశగా సిద్ధంకావాలి.

 

 పేపర్-2:

 ఈ విభాగం ద్వారా అభ్యర్థులు తమ భావాలను, పరిజ్ఞానాన్ని ఇంగ్లిష్‌లో ఎలా వ్యక్తం చేస్తున్నాడో తెలుసుకోవడమే లక్ష్యం. నాలుగు అంశాలు ఇచ్చి, ఒక దానిపై వ్యాసం రాయమంటారు. ఇంగ్లిష్‌లో బాగా రాయగల నేర్పు, సంబంధిత అంశంపై పరిజ్ఞానం ఉంటే ఎక్కువ మార్కులు సాధించొచ్చు. ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం ద్వారా వాక్యనిర్మాణం, భావ వ్యక్తీకరణలతో పాటు సబ్జెక్టు పరిజ్ఞానం సంపాదించొచ్చు.

 

 గత ప్రశ్నపత్రం విశ్లేషణ ఆధారంగా ప్రిపరేషన్

  గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే 100 ప్రశ్నల్లో 20 వరకు అర్థమెటిక్ నుంచి వచ్చాయి. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి. కసాగు, గసాభా, నిష్పత్తులు-అనుపాతాలు, కాలం-దూరం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. బేసిక్ న్యూమరసీ విభాగానికి ప్రాధాన్యమిచ్చారు. వీటిని దృష్టిలో ఉంచుకొని, ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి. రీజనింగ్‌కు సంబంధించి కోడింగ్ అండ్ డీకోడింగ్, సిరీస్, డెరైక్షన్స్, అనాలజీ, కేలండర్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. ప్రశ్నలు కాస్త క్లిష్టంగానే ఉంటున్నాయి. ఐబీపీఎస్ పీవో స్థాయిలో ప్రాక్టీస్ చేస్తే మెరుగైన స్కోర్ సంపాదించవచ్చు. బ్యాంకు పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

 - బి.రవిపాల్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ.

 

 దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

 దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 9, 2014.

 పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు

 రూ. 100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు లభించింది.

 పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ,

 బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్.

 వెబ్‌సైట్: www.mha.nic.in

 

 గత ప్రశ్నపత్రాలు, సబ్జెక్టులవారీగా వెయిటేజీ,

 సమగ్ర ప్రిపరేషన్ ప్రణాళిక

 www.sakshieducation.comలో...

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top