చెన్నై నగరానికి 375 వసంతాలు

చెన్నై నగరానికి 375 వసంతాలు


 క్రీడలు

 యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిపతకం

 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల వెంకట రాహుల్ చైనాలోని నాన్‌జింగ్‌లో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించాడు. భారత్‌కు దక్కిన తొలి పతకం ఇదే. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆగస్టు 21న రాహుల్ 77 కిలోల విభాగంలో రజతం సాధించాడు. అమెరికాకు చెందిన హాకోబ్‌కు స్వర్ణం, కజకిస్థాన్‌కు చెందిన కలియన్‌కు కాంస్యం దక్కాయి.

 

 బెల్జియం గ్రాండ్ ప్రి విజేత  రికియార్డో

 బెల్జియం గ్రాండ్‌ప్రిని రెడ్‌బుల్ డ్రైవర్ డానియల్ రికియార్డో గెలుచుకున్నాడు. రోస్‌బర్గ్ (మెర్సిడెజ్)కు రెండో స్థానం దక్కింది.

 

 ఫెదర ర్, సెరెనాలకు సిన్సినాటి టైటిళ్లు

 సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల విభాగంలో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) విజేతగా నిలిచాడు. మహిళల టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) సొంతం చేసుకుంది.

 

 ఆసియా పురుషుల వాలీబాల్ చాంప్ దక్షిణకొరియా

 నాలుగో ఏవీసీ క్లబ్ కప్ వాలీబాల్ టోర్నమెంట్ టైటిల్‌ను దక్షిణకొరియా గెలుచుకుంది. కజకిస్థాన్‌లో ఆల్‌మాటీలో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.

 

 జాతీయం

 పంచాయత్ సశస్తికరణ్ అభియాన్

 రాజీవ్ గాంధీ పంచాయత్ సశస్తికరణ్ అభియాన్ కింద  2013, 2014లకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌తో పాటు 5 రాష్ట్రాలకు అవార్డులు ప్రకటించింది. దీనికి రూ. కోటి చొప్పున నిధులు అందిస్తారు.

 

 యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కమోర్తా జాతికి అంకితం

 జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కమోర్తాను రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ ఆగస్టు 23న జాతికి అంకితం చేశారు. భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో కమోర్తాను తయారు చేసింది. ఈ యుద్ధనౌక సముద్రంలో నిశ్శబ్దంగా కదిలే శత్రు జలాంతర్గాములను కనిపెట్టగలదు. తొలిసారి ఉపరితల, వాయు నిఘా కోసం రేవతి అనే స్వదేశీ రాడార్‌ను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఐఎన్‌ఎస్ కమోర్తాను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ రూపొందించింది. కొర్వెట్టీ తరహాలో నిర్మిస్తున్న నాలుగు అత్యాధునిక యుద్ధనౌకల్లో ఇది మొదటిది.

 

 డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఆమోదం

 కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 20న డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. దీని కింద ప్రభుత్వ సేవలను ప్రజలకు ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ప్రజలు తాజా సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. దీన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2018 వరకు దశలవారీగా అమలు చేస్తారు. అన్ని మంత్రిత్వ శాఖల ప్రాజెక్టులు ఈ ప్రోగ్రామ్ పరిధిలోకి వస్తాయి.

 

 చెన్నైకు 375 వసంతాలు

 తమిళనాడు రాజధాని చెన్నై ఆగస్టు 22 నాటికి 375వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1639 ఆగస్టు 22న ఈ నగరం ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని తమకు అప్పగించేలా నాటి రాజులతో బ్రిటీషర్లు ఒప్పందం కుదుర్చుకోవడంతో నాటి మద్రాస్ ఆవిర్భవించింది. ఆ తర్వాతి ఏడాదే...అంటే 1640లో బ్రిటీషర్లు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించి తమ ఈస్ట్ ఇండియా కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. నేటి చెన్నై నగరాన్ని మొదట చెన్నప్పనాయకన్ అని పిలిచేవారు. ఆ తర్వాతి కాలంలో అదే చెన్నపట్నంగా, మద్రాస్‌గా మారి చివరకు చెన్నైగా స్థిరపడింది.1996లో నాటి డీఎంకే సర్కారు ఈ నగరం పేరును మద్రాస్ నుంచి చెన్నైగా మార్చింది. ప్రపంచంలోనే రెండో అతిపొడవైన మెరీనా బీచ్ చెన్నైలోనే ఉంది.

 

 ఆగ్రాలో ప్రపంచంలోనే అతి ఎత్తై గుడి

 ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో 70 అంతస్థులతో 213 మీటర్ల ఎత్తై చంద్రోదయ మందిర నిర్మాణ పనులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ ఆగస్టు 18న ప్రారంభించారు. ఆలయనిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తై గుడిగా చంద్రోదయ మందిరం ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

 

 నివాసయోగ్య ప్రాంతాల్లో ఢిల్లీకి 111వ స్థానం

 అంతర్జాతీయ నివాసయోగ్య ప్రాంతాల్లో దేశ రాజధాని ఢిల్లీ111వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్లోబల్ లివబులిటి సంస్థ సర్వే పేర్కొంది. మొదటి స్థానాన్ని వరుసగా నాలుగోసారి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరం సొంతం చేసుకొంది. తర్వాతి స్థానంలో వియన్నా (ఆస్ట్రియా) నిలిచింది.

 

 ఉమ్మడి యంత్రాంగం ఏర్పాటు

 సరిహద్దు వివాదంపై హింస చెలరేగకుండా అరికట్టేందుకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయానికి ఉమ్మడి యంత్రాంగం ఏర్పాటుకు అసోం, నాగాలాండ్ ఆగస్టు 21న నిర్ణయించాయి. వివాదాస్పద ప్రాంతంలో హింసాత్మక సంఘటనలకు కారణమవుతున్న చారిత్రక సమస్యలను పరిష్కరించుకోవాలని అంగీకరించాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సమక్షంలో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, నాగాలాండ్ ముఖ్యమంత్రి టి.ఆర్.జెలియాంగ్ ఆ మేరకు అంగీకారానికి వచ్చారు. ఆగస్టు 12-13 తేదీల్లో వివాదాస్పద ప్రాంతంలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో గోలాఘాట్ జిల్లాలో తొమ్మిది మంది అస్సామీలు మరణించారు.

 

 రాష్ట్రీయం

 రూ. 1,11, 824 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్


 రాష్ట్ర విభజన తర్వాత తొలి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 20న 2014-15 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: మొత్తం బడ్జెట్: రూ. 1,11,824 కోట్లు, ప్రణాళికేతర వ్యయం: రూ.85,151 కోట్లు, ప్రణాళికా వ్యయం: రూ. 26,673 కోట్లు, మొత్తం రెవెన్యూ వసూళ్లు: రూ. 92,078 కోట్లు, మొత్తం రె వెన్యూ వ్యయం: రూ. 98, 142 కోట్లు, రెవెన్యూ లోటు: రూ.6,064 కోట్లు. అదే విధంగా 2014-15 సంవత్సరానికి రూ. 13,110 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయశాఖ మంత్రి పి.పుల్లారావు ఆగస్టు 22న శాసనసభకు సమర్పించారు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ. 6,736 కోట్లుకాగా, ప్రణాళికేతర వ్యయం రూ.6,373.95 కోట్లు.

 

 ఆంధ్రప్రదేశ్ 2013-14 ఆర్థిక సర్వే

 2013-14 సామాజిక, ఆర్థిక సర్వేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 20న శాసనసభకు సమర్పించింది. ముఖ్యాంశాలు: రాష్ట్ర మొత్తం జనాభా: 4.94 కోట్లు. ఇది దేశ జనాభాలో 4.08 శాతం. అధిక జనాభాగల రాష్ట్రాల్లో పదో స్థానం. పురుషులు: 2.47 కోట్లు (50.1 శాతం), మహిళలు: 2.46 కోట్లు (49.9 శాతం), గ్రామీణ జనాభా: 70.42 శాతం. పట్టణ జనాభా: 29.58 శాతం. స్త్రీ, పురుష నిష్పత్తి: 996: 1000, అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల జిల్లా: విజయనగరం (1,019), తలసరి ఆదాయం: రూ.76,041, అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లా: విశాఖపట్టణం (రూ. 1,13,860), అతి తక్కువ తలసరి ఆదాయం గల జిల్లా: శ్రీకాకుళం (రూ.53,203), జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం వాటా: 2013-14లో 23.33 శాతం. ఇది 2004-05లో 29.85 శాతం. సేవారంగం వాటా: 2013-14 లో 55.96 శాతం. ఇది 2004-05లో 48.54 శాతం.

 

 వేంపల్లి గంగాధర్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఆతిథ్యం

 రాష్ట్రపతి భవన్‌లో విశిష్ట ఆతిథ్యానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కడప జిల్లాకు చెందిన రచయిత వేంపల్లి గంగాధర్ ఎంపికయ్యారు. ఈయన సెప్టెంబర్ 8 నుంచి 26 వరకు రాష్ట్రపతి భవన్‌లో విడిది చేస్తారు. గంగాధర్ రైతులు, మహిళలు, రాయలసీమ కరువుపై పలు రచనలు చేశారు. ఆయన రాసిన మొలకల పున్నమికి 2011లో యువ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

 

 రాజమండ్రి విమానాశ్రయానికి టంగుటూరి పేరు

 రాజమండ్రి విమానాశ్రయానికి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 23న ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి జయంతిని ప్రభు త్వం ఆగస్టు 23న అధికారిక పండుగగా నిర్వహించింది.

 

 అంతర్జాతీయం

 థాయ్‌లాండ్ ప్రధానిగా ప్రయూత్ చాన్ - ఓచా థాయ్‌లాండ్ సైనికాధిపతి ప్రయూ త్ చాన్-ఓచా ఆగస్టు 21న ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. 197 మంది సభ్యులున్న నేషనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 191 మంది మద్దతు ఆయనకు లభించింది.

 

 మొదటి పర్యావరణ హిందూ దేవాలయం

 ప్రపంచంలో మొట్టమొదటి ఎకో హిందూ దేవాలయం శ్రీ స్వామి నారాయణన్ మందిర్‌ను ఇంగ్లండ్‌లోని వాయువ్య లండన్‌లో కింగ్స్‌బరీ అనే ప్రాంతం లో ఆగస్టు 19న ప్రారంభించారు. ఈ గుడి పైకప్పును సోలార్ ప్యానల్స్‌తో నిర్మించారు. వాన నీటిని పొదుపు చేసే పలు ప్రత్యేకతలతో కూడిన ఈ దేవాలయ నిర్మాణానికి 20 మిలియన్ పౌండ్లను వెచ్చించారు.

 

 ఆఫ్ఘనిస్థాన్‌లో 95వ స్వాతంత్య్ర దినోత్సవాలు

 ఆఫ్ఘనిస్థాన్ 95వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఆగస్టు 19న నిర్వహించింది. 1919లో బ్రిటీష్ ప్రభుత్వంతో కుదుర్చు కున్న ఆంగ్లో-ఆఫ్ఘాన్ ఒప్పందంతో ఆఫ్ఘనిస్థాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

 

 అవార్డులు

 భారత శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గ్రాంటు

 మానవ మెదడును మ్యాప్ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించిన కార్యక్రమం కింద భారత నాడీ శాస్త్రవేత్త పార్థా మిత్రాకు గ్రాంట్ లభించింది. నాడీశాస్త్రానికి సంబంధించిన ఆధునిక సాధనాలను రూపొందించడానికి గ్రాంటు కింద రెండేళ్లలో 3 లక్షల డాలర్లు అందుతాయి. దీని కింద వర్చువల్ న్యూరో అనాటమిస్ట్‌ను రూపొందించాలి. గ్రాంటు దక్కినవారిలో మిత్రాతోపాటు ఫ్లోరిన్ ఆల్బీన్ అనే మరో శాస్త్రవేత్త ఉన్నారు. ఎలుక మెదడులో అనుసంధానాలను మ్యాప్ చేయడానికి ఉద్దేశించిన ప్రయోగాత్మక ప్రాజెక్టుకు మిత్రా వ్యవస్థాపకుడిగా ఉన్నారు.

 

 తెలుగు వారికి సాహిత్య అకాడమీ అవార్డులు

 2014 సంవత్సరానికి సాహిత్య అకాడమీ.. యువ, బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. తెలుగు రచయిత అప్పిరెడ్డి హరి హర్‌రెడ్డి యువ పురస్కారానికి ఎంపికవగా, మరో రచయిత దాసరి వెంకట్రామన్‌కు బాల సాహిత్య పురస్కారం లభించింది.

 

 స్వామినాథన్‌కు పాకిస్థాన్ వర్సిటీ డాక్టరేట్

 వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆగస్టు 21న యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

 

 వార్తల్లో వ్యక్తులు

 పీఏసీ చైర్మన్‌గా థామస్ పార్లమెంట్ ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) కొత్త చైర్మన్‌గా కాంగ్రెస్ నాయకుడు కె.వి.థామస్ నియమితులయ్యారు. కాగ్ నివేదికలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత వాటి ని పీఏసీనే పరిశీలిస్తుంది. ఇక పీఏసీలో గరిష్టంగా 22 మం ది సభ్యులు ఉంటారు. వీరిలో 15 మందిని లోక్‌సభ, ఏడుగురిని రాజ్యసభ ఎన్నుకుంటుంది. కాగా పార్లమెంట్ అంచనాల కమిటీ అధ్యక్షుడిగా భాజపా సీనియర్‌నేత మురళీ మనోహర్ జోషి ఆగస్టు 22న బాధ్యతలు స్వీకరించారు.

 

 స్టాక్ కంగ్రి శిఖరాన్ని అధిరోహించిన జాహ్నవి

 ప్రపంచంలోని ఎత్తై శిఖరాల్లో ఒకటైన స్టాక్ కంగ్రిని హైదరాబాద్‌కు చెందిన జాహ్నవి (12) అధిరోహించింది. 6,125 మీటర్ల ఎత్తున్న ఈ శిఖర అధిరోహాన్ని ఆగస్టు 13న ప్రారంభించి 14న పూర్తి చేసింది.

 

 ఐబీఏ చైర్మన్‌గా టీఎం భాసిన్

 ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్‌గా ఇండియన్ బ్యాంక్ చైర్మన్, చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ టీఎం భాసిన్ ఎన్నికయ్యారు.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top