పారిస్‌లో 2024 ఒలింపిక్స్‌

పారిస్‌లో 2024 ఒలింపిక్స్‌


చైనాలో బ్రిక్స్‌ దేశాల కార్మిక మంత్రుల సమావేశం

రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్‌ దేశాల కార్మిక మంత్రుల సమావేశాలు ౖచైనాలోని చాంగ్‌కింగ్‌లో జూలై 26న ముగిశాయి. ఈ సమావేశాల్లో మన కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. సమావేశంలో ప్రసంగించిన ఆయన బ్రిక్స్‌ దేశాల కార్మిక సంస్థల మధ్య సమాచార మార్పిడి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పరస్పర సహకారాన్ని పెంచుకోవచ్చన్నారు. సుస్థిర ఉద్యోగ కల్పన, జీవన ప్రమాణాల నాణ్యతను పెంచేందుకు పరస్పర సహకారంతో పనిచేస్తామని సమావేశాల ముగింపు సందర్భంగా బ్రిక్స్‌ దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. సెప్టెంబర్‌ మొదటి వారంలో చైనాలోని షియామెన్‌లో బ్రిక్స్‌ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు.



రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు

రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలపై ఆర్థిక ఆంక్షలు విధించే బిల్లును జూలై 25న అమెరికా దిగువసభ(ప్రతినిధుల సభ) భారీ మెజారిటీతో ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 419 మంది, వ్యతిరేకంగా ముగ్గురు ఓటు వేశారు. అమెరికా, దాని మిత్ర దేశాలను చిన్నచూపు చూస్తూ వాటికి వ్యతిరేకంగా ఈ మూడు దేశాలు ప్రమాదకర, యుద్ధోన్మాద కార్యకలాపాలు చేపడుతున్నాయని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. దిగువ సభ ఆమోదంతో బిల్లు సెనేట్‌(ఎగువ సభ) పరిశీలనకు వెళ్లనుంది.  బిల్లును రూపొందించిన ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ ఎడ్‌ రాయిస్స్‌ మాట్లాడుతూ ఈ మూడు దేశాలు అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించడంతోపాటు పొరుగు దేశాల్లో అస్థిరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు.



2040 నుంచి బ్రిటన్‌లో పెట్రోల్, డీజిల్‌ వాహనాలు నిషేధం

డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు, వ్యాన్ల అమ్మకాలను 2040 నుంచి నిషేధిస్తున్నట్లు యూకే పర్యావరణ సెక్రటరీ మైఖేల్‌ గోవ్‌ ప్రకటించారు. ఈ మేరకు ‘ఎయిర్‌ క్వాలిటీ ప్లాన్‌’ను జూలై 26న బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. 2040 నుంచి అన్ని వాహనాలు పూర్తిగా విద్యుత్‌తో నడిచేలా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు హైబ్రిడ్‌ వెహికల్స్‌తో సహా ఇతర అన్ని రకాల ఇంజిన్లతో నడిచే వాహనాలపై నిషేధం విధించనుంది. 2040 నుంచి జీరో ఉద్గార వాహనాలే రోడ్లపై నడిచేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం బ్రిటన్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 2040 తర్వాత ఉద్గార రహిత వాహనాలనే అమ్మాలని 2011లో బ్రిటన్‌ ప్రభుత్వం కార్బన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది.



చైనా ఆర్మీ 90వ వార్షికోత్సంలో ఆయుధాల ప్రదర్శన

చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) 90వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 30న ఇన్నర్‌ మంగోలియాలోని ఝరిహెలో భారీ పరేడ్, ఆయుధాల ప్రదర్శన నిర్వహించారు. దీనికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరయ్యారు. ఇందులో 12 వేల దళాలు పాల్గొన్నాయి. 100కు పైగా యుద్ధవిమానాలు, 600 రకాల ఆయుధాలను ప్రదర్శించారు. వీటిలో సగం ఆయుధాలు కొత్తగా రూపొందించినవే. 1927, ఆగస్టు 1న మావో జెడాంగ్‌ నేతృత్వం లోని చైనా కమ్యూనిస్టు పార్టీ పీఎల్‌ఏను స్థాపించింది.



కనీస వేతనాల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

నాలుగు కార్మిక చట్టాలను సమ్మిళితం చేస్తూ రూపొందించిన నూతన వేతనాల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం జూలై 26న ఆమోదం తెలిపింది. అన్ని రంగాల్లోని కార్మికులకు కనీస వేతనం చెల్లించేందుకు దీన్ని తీసుకొచ్చారు. దీంతో దేశంలోని నాలుగు కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది. కనీస వేతనాల చట్టం–1948, వేతనాల చెల్లింపుల చట్టం–1936, బోనస్‌ చెల్లింపుల చట్టం–1965, సమాన ప్రతిఫలం చట్టం–1976లను విలీనం చేస్తూ నూతన కార్మిక స్మృతిని రూపొందించారు. దీని ద్వారా దేశంలోని అన్ని రంగాల్లో కనీస వేతనాన్ని నిర్ణయించే అధికారం కేంద్రానికి సంక్రమించనుంది. అయితే నిర్దిష్ట కనీస వేతనం కంటే అధికంగా చెల్లించే వెసులుబాటు(అధికారం) రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రస్తుతం నెలకు రూ.18 వేల జీతం పొందుతున్న కార్మికులకే కనీస వేతన చట్టాలు వర్తిసున్నాయి. ఇకపై ఇవి జీతంతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయి. రెండో కార్మిక కమిషన్‌ సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించారు.



వీలర్‌ ఐలాండ్‌కు అబ్దుల్‌ కలాం పేరు

ఒడిశా తీరంలోని వీలర్‌ దీవికి (ఐలాండ్‌) ఆ రాష్ట్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరు పెట్టింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ జూలై 27న అధికారికంగా ప్రకటించారు. అబ్దుల్‌ కలాం క్షిపణి శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో ఒడిశాలోని భద్రక్‌ జిల్లా ఛాంద్‌బలిలోని క్షిపణి ప్రయోగశాలను పలుమార్లు సందర్శించారు. ఆ సమయంలో బంగాళాఖాతంలోని వీలర్‌ దీవిని గుర్తించి..క్షిపణి ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుందని సూచించారు. అనంతరం ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ మిస్సైల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసి క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.



భూకంప తీవ్రత పరిధిలో 29 నగరాలు

దేశ రాజధాని, తొమ్మిది రాష్ట్ర రాజధానులతో సహా దేశంలోని మొత్తం 29 నగరాలు, పట్టాణాలు భూకంప తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో (జోన్లు) ఉన్నాయి. ఈ మేరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటించింది. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ, పాట్నా, శ్రీనగర్, కోహిమా, పుదుచ్చేరి, గువహటి, గ్యాంగ్‌టక్, సిమ్లా, డెహ్రాడూన్, ఇంఫాల్, చండీఘర్‌ తదితరం ఉన్నాయి. ఇవి సెస్మిక్‌ జోన్‌–4, 5లో ఉన్నాయి.



విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీశ్‌

బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ జూలై 27న ప్రమాణస్వీకారం చేశారు. 2015లో ఆర్జేడీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్‌ జూలై 26న  సీఎం పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో రాజీనామా చేయించాలనే ప్రయత్నం ఫలించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ మద్దతివ్వడంతో నితీశ్‌ కుమార్‌ తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీలో జూన్‌ 28న జరిగిన విశ్వాస పరీక్షలో 131–108 ఓట్ల తేడాతో గెలుపొందారు.



కరెంట్‌ అఫైర్స్‌

పారిస్‌లో 2024 ఒలింపిక్స్‌


2024లో జరిగే ఒలింపిక్స్‌ క్రీడలకు పారిస్‌(ఫ్రాన్స్‌) ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) జూలై 31న ప్రకటించింది. అలాగే 2028లో ఈ క్రీడలకు వేదికగా లాస్‌ ఏంజిల్స్‌(అమెరికా)ను ఎంపికచేసినట్లు ఐఓసీ పేర్కొంది. గతంలో పారిస్‌లో రెండుసార్లు (1900, 1924) ఒలింపిక్స్‌ జరిగాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత ‘సిటీ ఆఫ్‌ లవ్‌’ మళ్లీ ఒలింపిక్స్‌కు సిద్ధం కానుండటం విశేషం. లాస్‌ ఏంజిల్స్‌ (1932, 1984) కూడా ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్‌ నిర్వహించింది. 2020లో జపాన్‌ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్‌ జరగనున్న సంగతి తెలిసిందే.



అవార్డులు

వెటెల్‌కు హంగేరీ గ్రాండ్‌ ప్రి టైటిల్‌


ఫార్ములావన్‌ రేసులో హంగేరీ గ్రాండ్‌ ప్రి టైటిల్‌ను ఫెరారీ జట్టు డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ గెలుచుకున్నాడు. బుడాపెస్ట్‌లో జూలై 30న జరిగిన రేసులో వెటెల్‌ మొదటి స్థానంలో నిలవగా, రైకోనెన్‌కు రెండో స్థానం లభించింది.



రామన్‌ మెగసెసే అవార్డులు–2017

ఆసియా నోబెల్‌గా పిలిచే మెగసెసే అవార్డుకు 2017 సంవత్సరానికి గాను ఆరుగురు ఎంపికయ్యారు. ఈ మేరకు రామన్‌ మెగసెసే ఫౌండేషన్‌ జూలై 27న ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ప్రకటన చేసింది. ఈ అవార్డులను ఆగస్టు 31న మనీలాలో ప్రదానం చేయనున్నారు. 1957లో మరణించిన ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రామన్‌ మెగసెసె పేరుతో ఈ అవార్డును నెలకొల్పారు.



అవార్డు గ్రహీతలు విశేషాలు

యోషియాకీ షిజావా– జపాన్‌కు చెందిన ఈయన కాంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్‌ ఆలయం పరిరక్షణకు కృషి చేశారు; గెథ్సీ షణ్ముగం–శ్రీలంకలోని తమిళ కమ్యూనిటీకి చెందిన ఉపాధ్యాయురాలు; అబ్దోన్‌ నబాబన్‌– ఇండోనేసియాలోని సుమత్రా దీవికి చెందిన ఈయన ప్రభుత్వ ఆధీనంలోని భూమి స్థానిక సమాజాలకు దక్కేలా పోరాడారు; టోని టే–సింగపూర్‌కి చెందిన వ్యాపార వేత్త, వృద్ధులు, అల్పాదాయ కుటుంబాల ఆకలిని తీర్చడం కోసం వారికి ఆహార పొట్లాలను అందించేందుకు స్వచ్ఛంద కార్యకర్తలను తీర్చిదిద్దారు; లిలియా డీ లీమా–ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈమె ఎకనమిక్‌ జోన్‌ అథారిటీ అధిపతిగా ఉపాధి కల్పనకు దేశ మంతటా వందలాది ఎక్స్‌పోర్ట్‌ జోన్లను ఏర్పాటు చేశారు; ఫిలిప్పీన్స్‌ ఎడ్యుకేషనల్‌ థియేటర్‌ అసోసియేషన్‌(సంస్థ).



వంటగ్యాస్‌పై ప్రతి నెలా రూ.4 పెంపు

సబ్సిడీపై అందించే వంట గ్యాస్‌(ఎల్‌పీజీ) సిలిండర్ల ధరలను ఇక నుంచి ప్రతి నెలా రూ.4 చొప్పున పెంచాలని ఆయిల్‌ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 2018, మార్చి నాటికి ఎల్‌పీజీపై అన్ని రకాల సబ్సిడీలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 31న లోక్‌సభలో తెలిపారు.



పన్నుల రంగంలో బ్రిక్స్‌ దేశాల మధ్య ఒప్పందం

పన్నుల రంగంలో సహకారం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బ్రిక్స్‌ దేశాలు జూలై 27న బీజింగ్‌లో నిర్ణయించాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్‌) దేశాల పన్నుల విభాగాల అధిపతుల ఐదో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కూటమికి చెందిన తొలి విధాన పత్రం ఇదే.





 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top