సరైన మార్గం

సరైన మార్గం - Sakshi


స్వచ్ఛమైన రాజకీయాలు నడపడంలో, నైతిక విలువలను పాటించడంలో తన కెవరూ సాటిలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి నిరూపించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరగబోతున్న ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం నుంచి తప్పుకుని తమతో చేయి కలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డితో ఆ పదవికి రాజీనామా చేయించి తన విశిష్టతను చాటారు. నంద్యాల ఉప ఎన్నికకే ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చారు.



అధికారమే పరమావధిగా, డబ్బే సర్వస్వంగా భావించే నేతలు అధికంగా కనబడుతున్న వర్తమానంలో... తనది విభిన్న మార్గమని నిరూపించారు. నంద్యాలలో తాము మూడేళ్లక్రితం గెలిపించిన నాయకుడు అర్ధాంతరంగా ఎందుకు మరణించారో, ఆ దురదృష్టకర ఉదంతానికి బాధ్యులెవరో, ఉపఎన్నిక అవసరం ఎందుకొచ్చిందో ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. రాజకీయాల్లో అనేక దుస్సంప్రదాయాలకు ఆద్యుడిగా, క్షీణ విలువలకు ప్రతీకగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకల వాటైన ఎత్తుగడలను, టక్కుటమార విద్యలను ఈ ఉపఎన్నికలో కూడా ప్రయోగిస్తూ అక్కడి ప్రజానీకానికి ఏవగింపు కలిగిస్తున్నారు.



ఇప్పటికే రెండుసార్లు ఆ ప్రాంతంలో పర్యటించి ఆయన చేసిందల్లా ఏమంటే... నా పెన్షన్‌ తీసుకుంటున్నారు, నా రేషన్‌ తింటున్నారు, నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు నాకెందుకు ఓటేయరని బెదిరించడం. ప్రశ్నించినవారిపై విరుచుకుపడి, వారిని భీతావహుల్ని చేసే ప్రయత్నం చేయడం. మనిషి అమరావతిలోనే ఉన్నా నంద్యాల ఏం కొంప ముంచుతుందోనని ఆయన అనుక్షణం హడలెత్తుతున్నారు. ఆ నియోజకవర్గంలో మంత్రివర్గాన్నంతటినీ మోహరించడం మాత్రమే కాదు... దాదాపు 70 మంది ఎమ్మెల్యేలను, మరికొందరు ఎమ్మెల్సీలను అక్కడికి తరలించారు. నంద్యాల పట్టణంలో వార్డుకో ఎమ్మెల్యేనూ... కొన్ని వార్డులకు కలిపి మంత్రిని బాధ్యులుగా పెట్టి అమరావతినుంచే సమీక్షిస్తున్నారు.



ఊరూరూ జల్లెడపడు తున్నారు. నంద్యాల నుంచి ఎప్పటికప్పుడు కబురందే ఏర్పాట్లు చేసుకుని అక్కడ చీమ చిటుక్కుమంటే ఉగ్రరూపం దాల్చి మంత్రుల్ని, ఎమ్మెల్యేలనూ ఉరకలెత్తిస్తు న్నారు. వెరసి ఎడాపెడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ ఉప ఎన్నికను చంద్రబాబు ఎందుకంత జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారో ఈపా టికే అందరికీ అర్ధమైంది. మూడేళ్లనాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేక ఎప్పటికప్పుడు మాయమాటలతో కాలక్షేపం చేస్తున్న బాబుకు ఈ ఉప ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. మూడేళ్లలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 35,000 ఇళ్ల నిర్మాణంతో సరిపెట్టిన బాబు ఇప్పుడు ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే 13,000 ఇళ్లు మంజూరు చేశారు. రోడ్ల వెడల్పు పేరు చెప్పి ఇళ్ల యజమానులకు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా కూలుస్తూ ఆదరాబాదరాగా పనులు జరిపిస్తున్నారు. కుట్టుమిషన్లు, సబ్సిడీకి ట్రాక్టర్లు, పసుపు–కుంకుమ పథకం ఒకటేమిటి... ఇప్పుడు నంద్యాల ప్రజానీ కాన్ని ‘అభివృద్ధి’ భ్రమలో ముంచెత్తి వారి ఓట్లు కొల్లగొట్టాలని నానా తిప్పలూ పడుతున్నారు. డబ్బు, మద్యం సైతం పారిస్తున్నారు.



విలువల రాజకీయాలను జగన్‌మోహన్‌ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికతోనే మొదలుపెట్టలేదు. కాంగ్రెస్‌ అధిష్టానం కుటిల ఎత్తుగడలకు నిరసనగా జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ ఆ పార్టీకి 2010లో రాజీనామా చేసినప్పుడు ఆ పార్టీ ద్వారా లభించిన ఎంపీ, ఎమ్మెల్యే పదవులను వదులుకున్నారు. వారిద్దరూ మళ్లీ ప్రజాక్షేత్రంలో నిలబడి అధికారంలో ఉన్నవారు ఎన్ని కుయుక్తులు పన్నినా, కుతంత్రాలు అల్లినా ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత తమ పార్టీలో చేరడానికి వివిధ పార్టీల నుంచి వచ్చిన వారితో రాజీనామాలు చేయించి వారిలో అత్యధికులను ఉప ఎన్నికల్లో గెలిపించుకుని జాతీయ స్థాయిలో ఔరా అనిపించుకున్నారు. దివంగత నాయకుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టిన కొత్తలో కాంగ్రెస్‌ నుంచి తమ పార్టీలో చేరడానికి వచ్చినవారు రాజీనామా చేయాలన్న షరతు విధించారు.



అందుకు సిద్ధపడని వారిని పార్టీ నుంచి వెలివేశారు. ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకుని రాజకీయాల్లో చలామణి అవుతున్న చంద్రబాబు మాత్రం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన 21మంది శాసనసభ్యులను ప్రలోభాలు పెట్టి, కేసులతో బెదిరించి తన పార్టీలోకి ఫిరాయించేలా చేసుకున్నారు. వారిలో ఒక్కరంటే ఒక్కరితో రాజీనామా చేయించ లేదు సరిగదా... కొందరికి నిస్సిగ్గుగా మంత్రి పదవులు కూడా కట్టబెట్టి దిగ్భ్రమ పరిచారు. తెలంగాణలో తమ పార్టీ నుంచి ఫిరాయించిన తలసాని శ్రీనివాసయాదవ్‌కు మంత్రి పదవినిచ్చినప్పుడు ఉగ్రరూపం దాల్చిన చంద్ర బాబు స్వల్పకాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లో తానే అలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించారు.



ఇలాంటి విష పోకడలకు ప్రజా న్యాయస్థానంలో సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందన్న భీతితోనే నంద్యాల ఉప ఎన్నికను ఎలాగైనా తప్పించుకోవాలని బాబు తాపత్రయపడ్డారు. సంప్రదాయాన్ని గుర్తు చేసి, సెంటిమెంటును ఎర చూపి ఎన్నిక బెడదను నివారించుకోవాలని చూశారు. చనిపోయిన ఎమ్మెల్యే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెల్చినప్పుడూ, సాంకేతికంగా చివరివరకూ అదే పార్టీలో కొనసాగినప్పుడూ ఖాళీ అయిన స్థానం ఆ పార్టీదే అవుతుంది తప్ప మరో పార్టీది ఎలా అవుతుందని ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియక టీడీపీ తికమక పడింది. ఇక ఎన్నికలు తప్పనిసరని నిర్ధారణయ్యాక వికృత చేష్టలకు తెరలేపింది. మూడేళ్ల చంద్రబాబు పాలనపైనా, ఆయన వంచనాత్మక విన్యాసాలపైనా తీర్పునివ్వబోయే మహత్తరమైన అవకాశం నంద్యాల ఓటర్లకొచ్చింది. వారి నిర్ణయం చంద్రబాబుకు మాత్రమే కాదు... ఆ బాపతు రాజకీయాలు చేసే వారం దరికీ చెంపపెట్టు అవుతుందని, రాజకీయ ప్రక్షాళనకూ, నూతన పథానికీ నాంది పలుకుతుందని ప్రజాస్వామ్యప్రియులందరూ ఆశిస్తున్నారు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top