మీరా ఎంపిక చెప్పేదేమిటి?

మీరా ఎంపిక చెప్పేదేమిటి? - Sakshi


చాలామంది ఊహించినట్టే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ ఎంపికయ్యారు. మీరాకుమార్‌ అభ్యర్థిత్వంపై మొద ట్లోనే ఊహాగానాలొచ్చినా వామపక్షాలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మనుమడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌నూ లేదా పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ రాజ్‌ మోహన్‌గాంధీ పేర్లను ప్రతిపాదిస్తున్నాయని కథనాలు వెలువడ్డాయి. తమ అభ్యర్థి రాజ్‌నాథ్‌ కోవింద్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించమని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేసినా మొదట్లోనే కాంగ్రెస్, వామపక్షాలు తిరస్కరించాయి.


అభ్యర్థి ఎవరో ముందుగా చెబితే మద్దతు విషయం ఆలోచిస్తామని అంతక్రితం తమను కలిసిన బీజేపీ నేతలకు చెప్పినా ఏకపక్షంగా కోవింద్‌ పేరును ప్రతిపాదించా రన్నది విపక్షాల ప్రధాన విమర్శ. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లలో అధిక శాతం ఎన్‌డీఏ ఖాతాలోనే ఉంటాయని తేలిపోయింది కనుక రాష్ట్రపతి ఎన్నిక లాంఛనప్రాయమే అవుతుంది. విపక్షాలు ఇది ‘సిద్ధాంత సమరం’అంటున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకొచ్చాక దేశవ్యాప్తంగా దళితులపై పెరిగిన దాడులకు నిరసనగానే పోటీ చేయాలని నిర్ణయించామని చెబుతున్నాయి.


కనుక ప్రచార పర్వంలో ఈ అంశాలన్నిటిపైనా చర్చలు, వాగ్యుద్ధాలు జోరుగానే ఉంటా యనుకోవచ్చు. బరిలో నిలవనున్న ప్రధాన పక్షాల అభ్యర్థులిద్దరూ దళితులే. పైగా మీరాకుమార్‌ దళిత మహిళ. దళితుల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన జగ్జీవన్‌రాం కుమార్తె. అటు కోవింద్‌ పెద్దగా ఎవరికీ తెలియని నాయ కుడు. రాజకీయ నేపథ్యం లేని, సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇద్దరూ రాజకీయాల్లోకి రాకముందు ఉన్నతాధికారులుగా పనిచేశారు.



రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినంతవరకూ విపక్షాలు వెనకబడ్డాయనే చెప్పాలి. నెల్లాళ్లక్రితం సమావేశమైనప్పుడు ఆ పార్టీలు పాలకపక్షం వైఖరేమిటో చెప్పాలని ప్రకటించి ఊరుకున్నాయి. నిజంగా ‘సిద్ధాంత సమరం’ అనుకున్న ప్పుడు విపక్షాలే తొలుత అభ్యర్థిని ప్రకటించి ఉండాలి. ఆ పని ఎందుకు చేయ లేకపోయాయి? బీజేపీ నిర్ణయం కోసం ఎందుకంత ఎదురుచూశాయి? ఒకవేళ ముందే తమ అభ్యర్థిని ప్రకటించిన పక్షంలో అవి ఇప్పట్లాగే మీరా కుమార్‌ను ఎంపిక చేసేవా? అనుమానమే. తాను ప్రతిపాదించిన అభ్యర్థి గెలిచి తీరడం ఖాయమనుకున్నప్పుడు కాంగ్రెస్‌కు మీరాకుమార్‌ గుర్తుకురాలేదు. తమ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆమె తండ్రి జగ్జీవన్‌రామ్‌ గుర్తుకురాలేదు.


అప్పుడు అనామకురాలేకాక వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిభాపా టిల్‌ను రాష్ట్రపతిని చేసింది. ఓటమి ఖాయమని స్పష్టంగా తెలిసిన ప్రస్తుత తరుణంలో, బీజేపీ దళిత అభ్యర్థిని ప్రకటించాక మాత్రం మీరాకుమార్‌ను నిలిపింది. ఆమె ప్రతిభ, సామర్థ్యాల విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు. మీరా కుమార్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అయిదు దఫాలు ఎంపీగా గెలి చారు.కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తి. దేశంలో ఇతర దళిత నేతలకన్నా అణగారిన వర్గాల్లో మీరాకుమార్‌ కున్న ఆదరణ కూడా అధికమే. నిజానికి విపక్షాలు ఎన్‌డీఏ కన్నా ముందుగా మీరాకుమార్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ ఇప్పటిలా వేరు దారిలో వెళ్లే సాహసం చేసేవారు కాదు.



మీరా ఎంపిక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్‌డీఏను కానీ, దానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీని కానీ కంగారు పెట్టలేదు. కానీ ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిం దన్నట్టు నితీష్‌ కుమార్‌నూ, ఆయన పార్టీ జేడీ(యూ)నూ కాస్త ఇరకాటంలోకి నెడుతుంది. బిహార్‌ గవర్నర్‌ కనుక కోవింద్‌ను సమర్ధిస్తున్నానని ఇప్పటికే నితీష్‌ ప్రకటించారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ‘బిహార్‌ గవర్నర్‌’గా పనిచేసిన వ్యక్తిని సమర్థించడం సరైందో, ‘బిహార్‌ పుత్రిక’కు మద్దతునివ్వడం సరైందో తేల్చుకోవాల్సిన స్థితి ఆయనకు ఎదురైంది.


తమ నిర్ణయంలో మార్పు లేదని జేడీ(యూ) ఇప్పటికే ప్రకటించింది. కానీ మహా దళితుల్లో ఆ పార్టీ వ్యతిరేకత చవిచూడక తప్పదు. బిహార్‌లో జేడీ(యూ)–ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమికి తక్షణం వచ్చే ప్రమాదం లేకపోవచ్చుగానీ రాష్ట్రపతి ఎన్నిక తర్వాత అది మునుపటిలా మనుగడ సాగించలేదు. అయితే నితీష్‌కున్న అసలు సమస్య వేరు. ఆర్జేడీ అధి నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కూ, ఆయనకూ మధ్య నానాటికీ దూరం పెరుగు తోంది. లాలూ ఇద్దరు కుమారుల్లో ఒకరైన తేజస్వి యాదవ్‌ ఉపముఖ్యమంత్రిగా ఉంటే, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ మంత్రిగా పనిచేస్తున్నారు.



తండ్రితోనే కాదు... వీరిద్దరితోనూ నితీష్‌కు సమస్యలున్నాయి. ఇవి చాల వన్నట్టు ఈమధ్యే లాలూ సతీమణి రాబ్డీ దేవి ఒక ఇంటర్వ్యూలో వృద్ధ నేతలు తప్పుకుని యువతకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఆమె ఎవరిని ఉద్దే శించి ఆ మాటలన్నారో వేరే చెప్పనవసరం లేదు. నిజానికి బిహార్‌లో తన చిరకాల ప్రత్యర్థి లాలూతో రాజీపడి ఆయనతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించింది నితీష్‌కుమారే. అప్పట్లో నరేంద్రమోదీతో తీవ్రంగా విభేదించి రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం ఆయన ఆ ఎత్తుగడ వేశారు. ఆ బలహీనతను లాలూ అవకాశం వచ్చినప్పుడల్లా చక్కగా వినియోగిం చుకుంటున్నారు. అప్పుడప్పుడు పరోక్షంగా బెదిరిస్తున్నారు.


ఈ సమస్యల న్నిటివల్లా ఏదో ఒకనాడు మహాకూటమి బద్దలవడం ఖాయమని నితీష్‌ చాన్నాళ్లక్రితమే అంచనా వేసుకున్నారు. అందువల్లే ఆయనకు నచ్చజెబుతా మని, ఆ పార్టీ నిర్ణయం మారే అవకాశం ఉన్నదని లాలూ అంటున్నా జేడీ (యూ) మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనబడటం లేదు. నిజానికి ఎలక్టోరల్‌ కాలేజీలో ఆ పార్టీకున్న ఓట్ల శాతం 1.89 మాత్రమే. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బిహార్‌ రాజకీయాలపై ఈ కొత్త చెలిమి చూపే ప్రభావం ఎక్కువ. మొత్తానికి రాష్ట్రపతి ఎన్నిక మాటెలా ఉన్నా విపక్షాల ఐక్యత మాత్రం ఇబ్బందుల్లో పడిందని బిహార్‌ పరిణామాలు రుజువు చేశాయి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top