లోటుపాట్లు సరిదిద్దాలి


ఎప్పుడూ అంతంతమాత్రంగానే ఉన్న భారత్-పాక్ సంబంధాలు ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత మరింత క్షీణిస్తున్నాయి. అంతక్రితం పఠాన్‌కోట్ దాడి సమయంలో భారత్ స్పందించిన తీరు చూశాకైనా మారని పాకిస్తాన్ వైఖరిని ఉడీ దాడి మరింత ప్రస్ఫుటం చేసింది. కేంద్ర మంత్రులూ, వివిధ పార్టీల నాయకులకు మీడియా కూడా తోడై ‘ఏదో ఒకటి చేయకపోతే కుదరద’న్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.



ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వరస చర్యలను ప్రకటి స్తున్నది. కేరళలోని కోజికోడ్‌లో  బీజేపీ జాతీయ మండలి సమావేశం సందర్భంగా శనివారం జరిగిన బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరంగా పాక్‌ను ఏకాకి చేయడానికి ప్రయత్నిస్తామని ప్రతినబూనారు. ఆ తర్వాత పాక్‌ను ఏకాకిని చేయడానికి, దాన్ని ఇతరత్రా మార్గాల్లోనూ ఇరకాటంలో పెట్టడానికి చర్యలు ప్రారంభమయ్యాయి.

 

 పాకిస్తాన్‌తో 1960లో కుదిరిన సింధునదీ జలాల ఒప్పందం అమలును పునఃసమీక్షించాలన్న నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉగ్రవాదం సంగతి తేలేవరకూ సింధు నదీజలాల కమిషన్ సమావేశాలను నిలిపి వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే పాకిస్తాన్‌కు ప్రస్తుతం మనం ఇస్తున్న అత్యంత సానుకూల దేశం(ఎంఎన్‌ఎఫ్) హోదాను తొలగించే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దీటుగా జవాబిచ్చారు. తాము చెలిమిని కోరుతుంటే పాక్ పఠాన్‌కోట్, యుడీలతో జవాబిచ్చిందని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొచ్చారు.

 

 1971 యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ విడివడి బంగ్లాదేశ్‌గా ఏర్పడిన నాటి నుంచీ రగిలిపోతున్న పాకిస్తాన్ ఏదో రకంగా భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. కశ్మీర్‌లో తాజాగా ఏర్పడ్డ పరిస్థితులను సాకుగా తీసుకుని ఉడీలో దాడికి తెగబడి...అక్కడి పరిణామాలే అందుకు కారణం తప్ప తాము కాదని తప్పించుకోజూస్తున్నది. అయితే పాక్ ఏకాకవుతున్న జాడలు చిన్న గానే అయినా కనిపిస్తూనే ఉన్నాయి. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) సమావేశాలకు హాజరు కావడంలేదని మన దేశం ప్రకటించిన నేపథ్యంలో అవి వాయిదా పడతాయని బుధవారం నేపాల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

 

 మనకన్నా ముందే భూటాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ దేశాలు పాక్ వైఖరికి నిరసనగా సార్క్ సమావేశాలను బహిష్కరి స్తున్నట్టు ప్రకటించాయి. ఎనిమిది సభ్య దేశాల్లో సగం దేశాలు గైర్హాజరు కావాలని నిర్ణయించుకోవడంతో సార్క్ సమావేశాలు వాయిదా పడటం మినహా గత్యం తరం లేదు. ప్రపంచంలో తాము ఏకాకులమవుతున్నామన్న కథనాల్లో నిజం లేదని పాకి స్తాన్ చేస్తున్న తర్కాన్ని ఈ పరిణామం ఎండగడుతుంది.

 

 అయితే సార్క్ సమావేశాల సంగతలా ఉంచి ఇతర చర్యలు ఆశించినంత ఫలి తాలనిస్తాయా అన్నది అనుమానమే. సింధు నదీ జలాల ఒప్పందంలోని క్లాజుల ప్రకారం దాన్నుంచి ఇరు దేశాల్లో ఏ ఒక్కటీ ఏకపక్షంగా వైదొలగడం సాధ్యం కాదు. దాన్లో మన వాటా జలాలను పూర్తిగా వినియోగించుకోలేక పాక్‌కే వదిలి పెడుతున్న విషయం వాస్తవమే అయినా దాన్ని సవరించుకోవడం ఇప్పటికిప్పుడు సాధ్య మయ్యే పనికాదు. రిజర్వాయర్లు నిర్మించడం భారీ వ్యయంతో కూడుకున్న పని. అందుకు ఏళ్లకేళ్లు పడుతుంది. దానివల్ల తక్షణ ఫలితాలు సమకూడవు. అయితే కమిషన్ సమావేశాలను నిలిపివేయాలన్న నిర్ణయం వల్ల అనిశ్చిత వాతా వరణం ఏర్పడుతుంది. దానివల్ల పాక్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

 

 మన దేశం ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించిన వెంటనే పాక్ విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్ ఉలిక్కిపడటాన్ని గమనిస్తే సింధు నదీ జలాలు ఆ దేశ ఆర్ధిక వ్యవస్థతో ఎంతగా ముడిపడి ఉన్నాయో అర్ధమవుతుంది. ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ అయితే సింధు నదీజలాల్లో భాగమైన చీనాబ్ నదిపై ఉన్న ఆనకట్టలనుంచి భారీ పరిమాణంలో నీళ్లు విడుదల చేయడం లేదా అడ్డుకోవడం ద్వారా వాయువ్య పంజాబ్‌ను సర్వనాశనం చేయ డానికి భారత్ చూస్తున్నదని హెచ్చరించాడు. పాక్‌కు ఎంఎన్‌ఎఫ్ ప్రతిపత్తిని ఉప సంహరించడం వల్ల అక్కడి నుంచి మన దేశానికి జరిగే ఎగుమతులు ఆగిపోతాయి గనుక ఆ మేరకు ఎంతో కొంత నష్టం ఉంటుంది. పాక్‌కు మనం ఇచ్చినట్టుగా

 అది మనకు ఎంఎన్‌ఎఫ్ ప్రతిపత్తి ఇవ్వకపోయినా మన నుంచి అది దిగుమతి చేసుకునే సరుకుల విలువ ఎక్కువే ఉంది.

 

 ప్రస్తుతం మన దేశంనుంచి పాకిస్తాన్‌కు సాగు తున్న ఎగుమతులు దాదాపు 217 కోట్ల డాలర్లు. అక్కడి నుంచి దిగు మతులు50 కోట్ల డాలర్లు మించి లేవు. అంటే ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒడి దుడుకులు ఏర్పడితే పాక్‌కన్నా మనమే ఎక్కువగా నష్టపోతాం.అయితే ఇందులో లాభనష్టాల సంగతలా ఉంచి ఆ చర్య వెనకున్న ఉద్దేశాలపై అందరి దృష్టి పడుతుంది. పాక్‌ను భారత్ అంటరాని దేశంగా ఎందుకు పరిగణిస్తున్నదన్న అంశంపై చర్చ జరుగుతుంది. వీటన్నిటితోపాటు భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు అవసరమవుతాయి.

 

 2001లో పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, 2008లో ముంబైపై ఉగ్రదాడి తర్వాత పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరపాలని కొందరు సూచించారు. ఆ సమయాల్లో ప్రధానులుగా ఉన్న వాజపేయి, మన్మోహన్ సింగ్ త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. దాడులు జరపడంలోని మంచి చెడ్డల సంగతలా ఉంచి మన దళాలకు అందుకు అవసరమైన హెలికాప్టర్లయినా, ఇతర రక్షణ సామగ్రి అయినా తగిన స్థాయిలో లేదని ఆ రెండుసార్లూ వెల్లడైంది. ఆ రెండు ఉదంతాలకూ మధ్య ఏడేళ్ల వ్యవధి ఉంటే ఇప్పుడు మరో ఎనిమిదేళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ రక్షణ సామగ్రి విషయంలో మన దళాలు వెనకబడే ఉన్నాయి. ఇది మంచిది కాదు. ఇలాంటి లోటుపాట్లన్నిటిపైనా కూడా దృష్టి సారిస్తే తప్ప మెరుగైన ఫలితాలు కలగవు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top