తృతీయ ప్రకృతి!


సృష్టి గీసిన గీత ఒకటుంది. అందరూ ఆ గీతకు అటో, ఇటో ఉంటారన్నది...ఉండాలన్నది అధిక సంఖ్యాకుల్లో పాతుకుపోయిన భావన. అయితే ఆడ లేకపోతే మగ అన్నది ఈ భావన సారాంశం. అటూ ఇటూ కానివారున్నారని... దేహం ఒకలా, మనసు వేరేలా ఉండి ఆ తరహా పౌరులు సతమతమవుతున్నారని గుర్తించరు. అసలు వారిని మనుషులుగానే పరిగణించరు. అలాంటివారిని విపరీత మనస్తత్వం ఉన్నవారిగా, వికృత పోకడలకు పోతున్నవారిగా అవమానిస్తారు. శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. సర్వోన్నత న్యాయస్థానం మొట్టమొదటిసారి ఇలా వివక్షకు గురవుతున్నవారి మనోవేదనను గుర్తించింది. లింగ వర్గీకరణలో ఇంతవరకూ పరిగణిస్తున్న స్త్రీ, పురుష కేటగిరీలను మాత్రమే కాక ఇకపై హిజ్రాలను మూడో కేటగిరీకింద గుర్తించాలని తీర్పునిచ్చింది. అంతేకాదు...అలాంటి పౌరులను సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలుగా గుర్తించి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమాజంలో వారెదుర్కొంటున్న అన్ని రకాల వివక్షనూ తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పత్రాల్లోనూ ఇంతవరకూ ఇలాంటివారంతా తమ అభీష్టానికి భిన్నంగా స్త్రీ అనో, పురుషుడనో మాత్రమే గుర్తింపుపొందుతున్నారు. అందువల్ల వారి వాస్తవ జనాభా ఎంతో, వారి అవసరాలేమిటో, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో ప్రభుత్వాలకు తెలియకుండా పోయింది. వాస్తవానికి సమాజంలోని భిన్నవర్గాల సమస్యలను గుర్తించి, వారి అభ్యున్నతికి, సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడం పాలకుల ధర్మం. వారి బాధ్యత. తాము గుర్తించడం మాట అటుంచి, హిజ్రాలనుంచి వచ్చిన వినతులను కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందువల్లే సర్వోన్నత న్యాయస్థానం జోక్యం అవసరమైంది.

 

  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేకవిధాల విశిష్టమైనది. మన రాజ్యాంగం ఎవరినీ వారి పుట్టుక ఆధారంగా వివక్షకు గురిచేయకూడదని చెబుతున్నది. కానీ, జన్యుపరమైన లోపాలతో జన్మించే ఈ మాదిరి పౌరులు అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్నారు. ఆ వర్గాలవారికి రాజ్యాంగపరమైన, చట్టపరమైన హక్కులేమీ ఉండటంలేదు. అందువల్లే వారు బహిరంగ ప్రదేశాల్లో, ఇళ్లలో, జైళ్లలో...ఆఖరికి రక్షక భటుల చేతుల్లో లైంగిక దాడులకు గురవుతున్నారని సుప్రీంకోర్టు సరిగానే గుర్తించింది. అల్పసంఖ్యాకులే అయినా వారూ మనుషులేనని, అందరికీ ఉండే మానవహక్కులు వారికీ వర్తిస్తాయని స్పష్టంచేసింది. జన్యుపరమైన లోపాల కారణంగా శారీరక సౌష్టవాన్నిబట్టి పురుషులుగానే కనబడ్డా వారు మానసికంగా వారు ఆ కేటగిరీలో చేరరని...అలాగే స్త్రీల మాదిరిగా కనబడ్డా వారికి ఆ శరీర ధర్మాలేవీ ఉండవని చెబుతూనే అలాగని దీన్ని కేవలం వైద్యపరమైన సమస్యగా మాత్రమే పరిగణించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. వీరిలో కొందరు శస్త్ర చికిత్స అనంతరం పురుషులుగానో, స్త్రీలగానో మారినప్పుడు వారు కోరిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని తెలిపింది.

 

  మన దేశంలో పరిమిత ప్రయోజనాలకోసం హిజ్రాలను గుర్తించే పని చాన్నాళ్లక్రితమే మొదలైంది.  2005లో పాస్‌పోర్టు దరఖాస్తుల్లో అలాంటివారిని ‘ఈ’ కేటగిరీగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల సంఘం గతానికి భిన్నంగా ఈసారి ఇలాంటివారిని ‘ఇతరులు’ అనే కేటగిరీలో పెట్టింది. జనాభా లెక్కల్లోనూ విడిగా సూచించారు. ఈ చర్యల తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం తనపరంగా చేయాల్సిన విధానపరమైన చర్యలను ప్రారంభించాల్సింది. కానీ, తొమ్మిదేళ్లయినా ఎలాంటి చలనమూ లేకపోయింది. తమిళనాడువంటి రాష్ట్రాలు హిజ్రాలకు సంబంధించి సంక్షేమ బోర్డును ఏర్పాటుచేయడం, ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, రేషన్ కార్డుల మంజూరులాంటి చర్యలు తీసుకున్నాయి. కానీ, ఇవి మాత్రమే సరిపోవు. మొత్తంగా ఆ వర్గానికి సంబంధించిన పౌరుల కోసం సమగ్రమైన విధానం, కార్యాచరణ అవసరం. ముఖ్యంగా వైద్యపరమైన సౌకర్యాలు, ఇళ్ల మంజూరు... విద్యారంగంలోనూ, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లువంటివన్నీ ఉంటేనే అలాంటివారు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారు. ఆత్మగౌరవంతో బతుకుతారు. సామాజిక పురోగమనంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించగలుగుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు బిచ్చమెత్తుకునేవారిగా, వ్యభిచారులుగా బతుకులు వెళ్లదీయాల్సివస్తోంది. హిజ్రాల్లో అత్యధికులకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌వంటి సాంక్రమిక వ్యాధుల బారిన పడటం ఈ దుస్థితివల్లే. మన పొరుగునున్న, మనతో పోలిస్తే అన్నివిధాలా చిన్న దేశాలైన నేపాల్, పాకిస్థాన్‌వంటివి హిజ్రాల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి, వారికోసం చాలా ఏళ్లక్రితమే చట్టాలు చేశాయి.

 

 సమానత్వ సాధనలోనూ, మానవహక్కులపరంగానూ సుప్రీంకోర్టు తీర్పు కీలకమైనదే. అయితే, ఈ విషయంలో ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది. ప్రస్తుత తీర్పు భిన్నమైన లైంగిక భావనలుండేవారందరికీ రక్షణనివ్వదు. ఇది కేవలం హిజ్రాలకు మాత్రమే పరిమితమని...స్వలింగ సంపర్కులకు, ద్విలింగ సంపర్కులకు వర్తించదని ధర్మాసనం తెలి పింది. నిరుడు డిసెంబర్‌లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను కొట్టేసేందుకు సుప్రీంకోర్టులోని మరో బెంచ్ నిరాకరించింది. ఈ విషయమై నిర్ణయం తీసుకోవాల్సింది శాసనవ్యవస్థేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పులు రెండింటినీ గమనిస్తే ఈ విషయంలో విస్తృత అవగాహన, విశాల దృక్పథం మరింత అవసరమని అర్ధమవుతుంది. అందుకు సంబంధించిన బీజాలు ప్రస్తుత తీర్పులో ఉండటం హర్షించదగ్గ విషయం.

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top