మరోసారి ‘కొలీజియం’


జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం, అందుకు సంబంధిం చిన 99వ రాజ్యాంగ సవరణ చెల్లవంటూ సుప్రీంకోర్టు నిరుడు అక్టోబర్‌లో మెజారిటీ తీర్పు వెలువరించాక దాదాపు కనుమరుగవుతుందనుకున్న కొలీజియం చర్చ కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, కొలీజియం సభ్యుడు అయిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కొలీజియం సమావేశంలో పాల్గొనడానికి నిరాకరిం చడం ప్రస్తుత చర్చకు ప్రధాన కారణం. న్యాయమూర్తుల నియామకం, బదిలీ ప్రక్రియల్లో పారదర్శకత లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌కు ఆయన లేఖ రాశారని వెలువడి కథనాలు సంచలనం కలిగిం చాయి.

 

 కొలీజియం సమావేశాల మినిట్స్‌ని నమోదు చేయాలని, అంతవరకూ తాను అందులో పాల్గొనలేనని కూడా ఆయన ఆ లేఖలో చెప్పారు. కొలీజియంకు సంబంధించి ఆయన అభిప్రాయమేమిటో నిరుడు మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ జస్టిస్ చలమేశ్వర్ విడిగా ఇచ్చిన తీర్పులోనే వెల్లడైంది. అయితే ఇప్పుడాయన నిర్దిష్టంగా కొలీజియం సమావేశాల తీరును, అందులో పారదర్శకత లేకపోవడాన్ని ప్రశ్నించారు. అంతేకాదు... కొలీజియంలో జస్టిస్ ఠాకూర్‌తోసహా మిగిలిన నలు గురు న్యాయమూర్తుల అభిప్రాయాలు తన వద్దకు వస్తే తన అభిప్రాయాన్ని కూడా చేరుస్తానని తెలియజేశారు. ఇలా అనడం ద్వారా కొలీజియం సభ్యుల అభిప్రా యాలు లిఖితపూర్వకంగా ఉండాలన్న తన మనోగతాన్ని ఆయన విస్పష్టంగా చెప్పినట్టయింది. జస్టిస్ చలమేశ్వర్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించుకుంటామని  జస్టిస్ ఠాకూర్ చెప్పారుగానీ అదంత సులభమేమీ కాదు.

 

 కొలీజియం పని తీరుపై అసంతృప్తి కొత్తగాదు. న్యాయ వ్యవస్థలో పనిచేసిన వారినుంచే అలాంటి అభిప్రాయాలు లోగడ కూడా వ్యక్తమయ్యాయి. ఇరవైయ్యేళ్ల క్రితం కొలీజియం విధానం ఏర్పడటానికి ఆద్యుడైన జస్టిస్ జేఎస్ వర్మ అది సరిగా పని చేయడంలేదని అనంతరకాలంలో భావించారు. జస్టిస్ మార్కండేయ కట్జూ, జస్టిస్ కె జి బాలకృష్ణన్ వంటివారు కూడా అలానే అనుకుంటున్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తులుగానో, న్యాయమూర్తులుగానో పని చేసి రిటైరయ్యాకే వీరంతా కొలీజియం గురించి విమర్శించారు. పదవుల్లో ఉండగా ఆ పని చేయలేదు.

 

 పైగా ఈ విధానంలో కొందరు అనర్హులు న్యాయమూర్తులు కాగలిగారని ఆరోపిం చారు తప్ప ఆ కొలీజియం పనితీరు ఎలా ఉంటున్నదో వెల్లడించలేదు. అందువల్లే జస్టిస్ చలమేశ్వర్ లేఖ రాసిన లేఖ అంత సంచలనం కలిగించింది. వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉండటం, కొన్నిచోట్ల ప్రధాన న్యాయమూర్తులు లేకపోవడం ఈ మధ్యకాలంలో బాగా చర్చనీయాంశమైంది. ఎన్‌జేఏసీ చట్టాన్ని, రాజ్యాంగ సవరణను కొట్టేసి పది నెలలు గడుస్తున్నా కొలీ జియం విధానానికి అనుగుణంగా న్యాయమూర్తుల నియామకం జరగకపోవడంపై ఇటీవల జస్టిస్ ఠాకూర్ ఒకటి రెండు సందర్భాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

 

 మార్చిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాతీయ సదస్సు జరిగినప్పుడు జడ్జీల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే ఆయన కంటతడి పెట్టారు. న్యాయమూర్తుల కొరతపై దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకునే స్థితి కల్పించవద్దని కూడా హెచ్చ రించారు. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీ ప్రసంగం పూర్తయ్యాక అందులో జడ్జీల నియామకం ప్రస్తావన లేకపోవడాన్ని జస్టిస్ ఠాకూర్ ఎత్తి చూపారు. నియామకాలు పూర్తయి కేసుల పెండింగ్ సమస్య తీరాలన్న ఆయన ఆత్రుతను ఇవన్నీ తెలియజేస్తున్నాయి. కొలీజియం విధానానికి అనుగుణంగా కేంద్రం విధాన పత్రం(ఎంఓపీ) విడుదల చేయకపోవడమే నియామకాలకు ఇప్పు డున్న అడ్డంకి. ఇలాంటి దశలో జస్టిస్ చలమేశ్వర్ లేఖ రాశారు.

 

 కొందరంటున్నట్టు ఈ లేఖ వల్ల జడ్జీల నియామకం అంశం మరింత జటిలం అయి ఉండొచ్చు. న్యాయవ్యవస్థ వైపు వినవస్తున్న వాదన బలహీనపడి ఉండొచ్చు. అయితే ఆయన ఎత్తి చూపిన అంశాలు సాధారణమైనవేమీ కాదు. కొలీజియం వ్యవస్థే అన్నివిధాలా అత్యుత్తమైనదని భావించినప్పుడు అది అందుకు తగ్గట్టుగా ఉండాలి. ఎంఓపీ విషయంలో కేంద్రానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య ప్రధానంగా రెండు అంశాలపై తీవ్ర విభేదాలున్నాయి. కొలీజియం సమావేశాల మినిట్స్ నమోదు చేయాలన్నది అందులో మొదటిది కాగా, అసమ్మతి వ్యక్తంచేసిన న్యాయ మూర్తి అభిప్రాయాన్ని కూడా అందులో చేర్చాలని కేంద్రం పట్టుబడుతోంది.

 

 ఒకరకంగా జస్టిస్ చలమేశ్వర్ లేఖ సైతం దాన్నే సూచిస్తున్నది. ఈ రెండు అంశాలూ న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ మరింత ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ఉండేందుకు దోహదం చేస్తాయి తప్ప దానికి విఘాతం కలిగించవు. న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీయవు. అలాంటప్పుడు న్యాయ వ్యవస్థకు అభ్యంతరం ఉండవలసిన అవసరమేమిటో సామాన్యులకు బోధ పడదు. ఇంతకు ముందు సంగతేమోగానీ... న్యాయమూర్తుల నియామకాలు, బది లీల ప్రక్రియకు సంబంధించిన రికార్డు ఉండదని జస్టిస్ చలమేశ్వర్ లేఖ తర్వాత స్పష్టమైంది.

 

 జడ్జీల నియామకంలో వివిధ దేశాల్లో వేర్వేరు విధానాలున్నాయి. బ్రిటన్‌లో స్వతంత్రంగా పనిచేసే న్యాయ నియామకాల కమిషన్ ఉంటుంది. దాని సిఫార్సులను పునఃపరిశీలించమని కోరవచ్చు. లేదా తిరస్కరించవచ్చు. అమె రికాలో అయితే సెనేట్‌లో చర్చిస్తారు. జాబితాలోని వారిని పిలుస్తారు. లోతుగా ప్రశ్నిస్తారు. అభ్యర్థుల మంచి చెడ్డల గురించి బహిరంగ చర్చ జరుగుతుంది. ఇవన్నీ అయ్యాకే తుది నిర్ణయం ఉంటుంది. చాలా తక్కువ సందర్భాల్లోనే కావొచ్చుగానీ మన దేశంలో న్యాయమూర్తులపై ఆరోపణలు రావడం, అవి అభి శంసన వరకూ వెళ్లడం గతంలో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఎటూ కొలీజియం వ్యవస్థే అమల్లో ఉంటుంది. జస్టిస్ చలమేశ్వర్ లేఖ నేపథ్యంలో దాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా రూపొందించాల్సిన అవసరం ఉన్నదని గుర్తిం చడం మంచిది.

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top