నెత్తుటి చరిత్రకు ముగింపు

నెత్తుటి చరిత్రకు ముగింపు - Sakshi

దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులని చెప్పుకునే జాతీయ రహదారులకు సమీపంలో బార్లు, రెస్టరెంట్లు ఉండటానికి వీల్లేదంటూ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టంగా చెప్పిన తీరు ఆ సమస్య తీవ్రతను చాటింది. నిరుడు విడుదల చేసిన 2015 నాటి రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం రహదారుల్లో జాతీయ రహదారుల వాటా 1.5 శాతం మాత్రమే. కానీ 28 శాతం ప్రమాదాలకు, 33 శాతం మరణాలకు జాతీయ రహదారులే కారణమవుతున్నాయి. వాహనాలను నిర్లక్ష్యంగా, వేగంగా నడపటం వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 2015లో రోడ్డు ప్రమా దాలు రెండున్నర శాతం పెరిగాయి. 

 

దాదాపు అయిదున్నర లక్షల రోడ్డు ప్రమా దాల్లో లక్షా 42 వేల మంది మరణిస్తే అందులో మద్యం సేవించడం పర్య వసానంగా జరిగిన ప్రమాదాలే ఎక్కువ. ఈ ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై శాశ్వతంగా వికలాంగులవుతున్నవారు మరిన్ని లక్షలమంది ఉంటున్నారు. ఈ ప్రమాదాల కారణంగా లక్షలాది కుటుంబాలు ఆసరా కరువై చెప్పనలవికాని ఇబ్బం దులు పడుతున్నాయి. వీధిన పడుతున్నాయి. నాలుగు వరసలు, ఆరు వరసలుగా విస్తరించి కళ్లు చెదిరే స్థాయిలో కనబడే ఈ జాతీయ రహదారుల వెంబడే అనేక చోట్ల బార్‌లు, రెస్టరెంట్లు ధాబాలు కొలువుతీరుతున్నాయి. వచ్చే పోయే వాహ నాల్లోని డ్రైవర్లు వాటి దగ్గర ఆగి కావలసినంత కిక్కు ఎక్కించుకుని వెళ్తున్నారు. పర్యవసానంగా ప్రమాదాలు అనివార్యమవుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఏటా రూ. 60,000 కోట్లు నష్టపోతున్నామని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడి స్తున్నాయి.

 

నిజానికి ఈ సమస్యపై ప్రభుత్వాలు తమంత తామే దృష్టిసారించి ఉండాలి. ఎందుకంటే సమస్య ఏర్పడినప్పుడు ప్రజలు ముందుగా ప్రభుత్వాలకు చెప్పు కుంటారు. తప్పక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తారు. వారు అడిగినా అడగక పోయినా విస్తృతమైన యంత్రాంగం ఉన్న ప్రభుత్వాలకు ఆ సమస్య గురించి తెలియాలి. దాన్ని తీర్చడానికి అమలు చేయాల్సిన విధానాన్ని రూపొందించాలి. కానీ మన దేశంలో జరుగుతున్నది వేరు. సమస్యకు ఎంతకీ పరిష్కారం లభించక పోవడం, అది సాధ్యమవుతుందన్న నమ్మకం కొరవడటం పర్యవసానంగా న్యాయ స్థానాలను ఆశ్రయించక తప్పనిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పుడు జాతీయ రహ దారుల పొడవునా మద్యం దుకాణాలనూ, బార్లనూ, రెస్టరెంట్లనూ మూసేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం కూడా ఆ విధంగా వచ్చిందే.

 

పంజాబ్‌కు చెందిన హర్మాన్‌ సిద్ధూ పదేళ్లక్రితం ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్రమంలో అత్యవసర చికిత్స కోసం వచ్చే అధిక శాతంమంది రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నవారేనని అతను గ్రహించాడు. ఎంతో పరిశోధన తర్వాత వీటిని ఆపడానికి ప్రభుత్వాల పరంగా చర్యలేమీ ఉండటం లేదని తెలుసుకున్నాడు. ఆ తర్వాత న్యాయస్థానం తలుపుతట్టాడు. అతని పిటిషన్‌పై 2014 మార్చిలో పంజాబ్‌ హర్యానా హైకోర్టు తీర్పునిస్తూ జాతీయ రహదారి సమీపంలో మద్యం దుకాణాలు ఉండరాదని చెప్పడం... దానిపై అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం పర్యవసానంగా తాజా ఆదేశాలు వెలువడ్డాయి. జాతీయ రహదారులపై మద్యం విక్రయాలు ఎంత విచ్చలవిడిగా సాగుతున్నాయో హర్మాన్‌ సేకరించిన సమాచారమే చెబుతుంది. పానిపట్‌–జలంధర్‌ మధ్య ఉన్న 290 కిలోమీటర్ల రహదారిపై 185 చోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నాయని సిద్ధూ కోర్టుకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాలు, బార్లలో 57 శాతం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల సమీపంలోనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు ఏ రాష్రమూ ఇందుకు మినహాయింపు కాదు. 

 

ఈ కేసు విచారణ సందర్భంగా, ఆ తర్వాత సడలింపులు ఇవ్వాలంటూ కోరిన సమయంలోనూ సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వాదనలు వింత గొలుపుతాయి. మద్యం దుకాణాలు, బార్లు వగైరాలవల్ల తమకు వేల కోట్ల ఆదాయం వస్తున్నదని, వాటిపై లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారని ప్రభు త్వాలు లెక్కలు చెప్పాయి. ఈ నిషేధం వల్ల రూ. 50,000 కోట్ల ఆదాయం కోల్పోతామని, 10 లక్షలమంది ఉపాధి దెబ్బతింటుందని వివరించాయి. కానీ ప్రమాదాల కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో, ఎన్ని కుటుంబాలు అధోగతిపాలవుతున్నాయో... ఇందువల్ల ఎన్ని వేల కోట్లు నష్టపోవలసి వస్తున్నదో విస్మరించాయి. నిరుడు డిసెంబర్‌లో వెలువరించిన తీర్పులో జాతీయ రహదా రులు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం విక్రయాలు ఉండరాదన్న ఆదేశాలకు వక్ర భాష్యం చెప్పుకుని ఆ తీర్పు చిల్లర మద్యం దుకాణాలకు మాత్రమే వర్తిస్తుందన్నవారికి తాజా ఆదేశాలు మరింత స్పష్టతనిచ్చాయి. జాతీయ రహ దారులపై ఉండే బార్లు, పబ్‌లు, రెస్టరెంట్లూ, ధాబాలకు సైతం తమ ఉత్తర్వులు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 20,000 వరకూ జనాభా ఉండే ప్రాంతాల్లో మద్యం విక్రయ జోన్‌ పరిధిని 500 మీటర్లనుంచి 220 మీటర్లకు తగ్గించింది. 

 

అయితే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల వల్లనే అంతా సర వుతుందని భావించకూడదు. ఈ నిషేధంతో అక్రమ విక్రయాల జోరు పెరు గుతుంది. కొత్త కొత్త మాఫియా ముఠాలు పుట్టుకొస్తాయి. వీటిని అరికట్టాలంటే జాతీయ రహదారులపై ముమ్మరంగా తనిఖీలు జరిపే ప్రత్యేక బృందాలను ఏర్పరచవలసి ఉంటుంది. అవి పనిచేస్తున్న తీరుపై గట్టి పర్యవేక్షణ తప్పనిసరి. తాగి వాహనం నడిపినట్టు తేలితే లైసెన్స్‌ రద్దు చేయడంవంటి చర్యలు తీసు కోవాల్సి ఉంటుంది. మోటారు వాహనాల చట్టాన్ని కఠినం చేస్తూ కేంద్రం ఎటూ సవరణలు తీసుకురాబోతోంది. తాగి వాహనం నడిపి ఎవరి మరణానికైనా కారకు లైన పక్షంలో అలాంటివారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడం, పదేళ్లవరకూ కఠిన శిక్ష పడేలా చూడటం వాటిలో కొన్ని. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రయోజనం సంపూర్ణంగా నెరవేరేలా చూడటం, ప్రజల ప్రాణాలకు పూచీ పడటం ప్రభుత్వాల కర్తవ్యం. 
Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top