గ్రీస్‌లో వామపక్ష విజయం

గ్రీస్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన అలెక్సిస్ సిప్రాస్ - Sakshi


 ప్రపంచ దేశాలు... ప్రత్యేకించి యూరోప్ దేశాలు కొంతకాలంగా గ్రీసుపైనే ధ్యాసపెట్టి దిగాలుగా ఊహించిందే చివరకు నిజం అయింది. ఆ దేశ పార్లమెంటుకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో వామపక్ష సిరిజా పార్టీ విజయకేతనం ఎగరేసింది. ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోయినా 300 స్థానాలున్న చట్టసభలో అది 149 స్థానాలు సాధించింది. ఫలితాలు వెలువడిన వెంటనే సిరిజా పార్టీ నాయకుడు అలెక్సిస్ సిప్రాస్ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అంతకుముందే ‘విధ్వంసక పొదుపు చర్యల ఘట్టం భూస్థాపితమైనట్టేన’ని ప్రకటించారు. దీనర్ధం యూరోపియన్ కమిషన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు (యూరో త్రయం) గ్రీస్ ప్రభుత్వంతో అమలుచేయిస్తున్న కఠిన చర్యలకు కాలంచెల్లినట్టేనని చెప్పడమే. ఓట్ల లెక్కింపుకన్నా ముందే ఎగ్జిట్ పోల్స్ మోసుకొచ్చిన ‘దుర్వార్త’తో కుదేలై ఉన్న ప్రపంచ మార్కెట్లు తాజా పరిణామంతో మరింత కుంగిపోతాయని వెలువడుతున్న అంచనాల్లో అతిశయోక్తి ఏమీ లేదు.



 కోటికి పైగా జనాభాతో, అత్యుత్తమ జీవనప్రమాణాలతో పచ్చగా బతికిన చరిత్రగల గ్రీస్ గత ఏడేళ్లుగా రుణ ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడుతున్నది. దీన్నుంచి బయటపడేయటానికంటూ 2010లో ఒకసారి, 2012లో మరోసారి... మొత్తం రెండుసార్లు 24,000 కోట్ల యూరోలను (దాదాపు రూ. 16లక్షల 60,000 కోట్లు) యూరోత్రయం గ్రీస్‌కు అప్పుగా ఇచ్చాయి. అందుకు ప్రతిగా ‘పొదుపు చర్యలు’ తీసుకోవాలని సూచించాయి. వినసొంపుగా ఉన్న ఈ చర్యలు ఆచరణలో సామాన్య పౌరులకు చుక్కలు చూపించాయి. కడుపులో చల్లకదలకుండా హాయిగా బతకడం అలవాటైన లక్షలాదిమంది ఉద్యోగులకు జీతాలు కోతబడ్డాయి. అటు తర్వాత వారి ఉద్యోగాలు ఊడాయి. వారు ఒక పూట తింటే మరో పూట పస్తులతో గడపవలసివచ్చింది. ఆత్మగౌరవంతో బతికిన కుటుంబాలు రోడ్డున పడవలసి వచ్చింది. పారిశుద్ధ్యంసహా పలు సేవలు మూలనబడ్డాయి. యువతలో నిరుద్యోగం అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా గ్రీస్ ఆందోళనలతో అట్టుడికింది. దుకాణాలు లూటీ అయ్యాయి. ఏథెన్స్ నగరం విధ్వంసాన్ని చవిచూసింది. ఒక దశలో పోలీసులు కూడా నిస్సహాయులయ్యారు. గ్రీస్ ఇంత సంక్షోభాన్ని చవిచూడటానికి మూల కారణం అక్కడి పాలకుల అస్తవ్యస్థ విధానాలు మాత్రమే కాదు...యూరో జోన్ దేశాల బాధ్యతారహిత ఆర్థిక విధానాలు కూడా. ఉత్పాదకతను పెంచడంద్వారా ఉపాధి అవకాశాలనూ, ఆదాయాలనూ... తద్వారా ప్రజల కొనుగోలు శక్తిని ముమ్మరం చేయడానికి బదులు బ్యాంకుల ద్వారా భారీగా రుణాలిప్పించి కృత్రిమంగా కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నంచేశారు. వినియోగ వస్తు వ్యామోహంలో కొట్టుకు పోయిన జనం వెనకా ముందూ చూడకుండా క్రెడిట్ కార్డులతో ఎడా పెడా కొనుగోళ్లు చేశారు. రేపన్న రోజు కోసం పొదుపు చేసుకోవాలన్న ఆత్రుత అడుగంటింది. ఇదంతా 2008కి ముందు ముచ్చట. అప్పట్లో అమెరికా మొదలుకొని చాలా పాశ్చాత్య దేశాలు ద్రవ్య నియంత్రణను గాలికొదిలి కరెన్సీ నోట్ల జాతర జరిపాయి. ఆర్థిక మాంద్యం చుట్టుముట్టి ప్రజలు రుణాలు చెల్లించడం సాధ్యంకాని పరిస్థితులు ఏర్పడ్డాక ‘ఉత్పత్తికి ప్రోత్సాహం’ అంటూ పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వాలు పన్ను రాయితీలివ్వడం ప్రారంభించాయి. ఫలితంగా ఆదాయం కరువై లోటు బడ్జెట్లతో కాలక్షేపం చేయడం ప్రారంభించాయి. ఈ విషవలయాన్ని అధిగమించడమెలాగో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయిన దేశం ఒక్క గ్రీస్ మాత్రమే కాదు...యూరో జోన్‌లో స్పెయిన్ మొదలుకొని ఐర్లాండ్, ఇటలీ, జర్మనీ వరకూ ఎన్నో ఉన్నాయి. సంక్షోభంలో కాస్త హెచ్చుతగ్గులుండొచ్చుగానీ... ఒక్కో దేశానిది ఒక్కో కథ.  


 1974లో సైనిక పాలన అంతమయ్యాక గ్రీస్‌లో అధికారం అనుభవిస్తున్న రెండు ప్రధాన స్రవంతి పార్టీలకూ సిరిజా పార్టీ విజయంతో నూకలు చెల్లాయి. సరిగ్గా ఇప్పుడేర్పడిన పరిస్థితే 2012 ఎన్నికల్లో ఎదురుకావొచ్చని యూరోజోన్ నేతలు భయపడ్డారు. సిరిజా పార్టీ నెగ్గి యూరోజోన్‌నుంచి తప్పుకుంటే తాము సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆ దేశానికి భారీగా అప్పులిచ్చిన జర్మనీ, ఫ్రాన్స్‌వంటివి ఆందోళనపడ్డాయి. యూరోపియన్ బ్యాంకులతో వ్యాపార బంధం ఉన్న అమెరికా కూడా ఈ సంక్షోభ ప్రభావం తనపైకి ఎక్కడ వస్తుందోనని హడలింది. కానీ, అప్పట్లో గ్రీస్ ప్రజలు మధ్యేవాద మితవాద పక్షం న్యూ డెమొక్రసీ పార్టీనే ఎన్నుకున్నారు. అయితే, ఆ పార్టీపై పెట్టుకున్న ఆశలన్నీ కుప్పకూలడంతో ఇప్పుడు ప్రజలు సిరిజా పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఆర్థిక సంక్షోభం పర్యవసానంగా ఉద్భవించిన పార్టీకి అతి తక్కువ కాలంలో ఆదరణ లభించి...అది అధికారానికి ఎగబాకటం యూరోప్‌లో ఇదే ప్రథమం. సిరిజా విజయం ప్రభావం వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న స్పెయిన్‌పై ఉండటం ఖాయమని యూరోజోన్ నేతలు ఆందోళనపడుతున్నారు. ఇది మిగిలిన సంక్షోభ దేశాల్లో సైతం రాగలకాలంలో ప్రభావం చూపగలదన్న అంచనావేస్తున్నారు. వచ్చే నెల 28తో గ్రీస్‌కిచ్చిన బెయిలవుట్ ప్యాకేజీల గడువు ముగుస్తుంది. దాని సంగతేమి చేయాలో, ఈయూలో ఉండనని గ్రీస్ మొండికేస్తే ఎలా వ్యవహరించాలో అర్ధంకాక యూరోజోన్ నేతలు తలలు పట్టుకున్నారు. దానిపై చర్చించేందుకు వచ్చేనెల 12న బ్రస్సెల్స్‌లో శిఖరాగ్ర సదస్సు జరపాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌లతోపాటు గ్రీస్ కొత్త ప్రధాని సిప్రాస్ కూడా దానికి హాజరుకాబోతున్నారు. పొదుపు చర్యలన్నీ భూస్థాపిత మైనట్టేనని ఇప్పటికే ప్రకటించివున్న సిరిజాను వారు ఏమేరకు బుజ్జగించగలరో, ఒప్పించగలరో అనుమానమే. పొదుపు చర్యల ప్రసక్తి లేకుండా పాత బకాయిల్లో కొంత భాగం రద్దుకూ లేదా రీషెడ్యూల్‌కు సిప్రాస్ పట్టుబట్టే అవకాశం లేకపోలేదు. జన సంక్షేమాన్ని మరిచి సంస్కరణల అమలుకు తహతహలాడే దేశదేశాల పాలకులకూ గ్రీస్ ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయనడంలో సందేహం లేదు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top