ప్రణబ్‌ హితవచనం

ప్రణబ్‌ హితవచనం - Sakshi


రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారం పదవినుంచి వైదొలగి రాంనాథ్‌ కోవింద్‌కు ఆ బాధ్యతలు అప్పజెబుతారు. పదవిలో ఉన్నప్పుడు చెప్పిన తరహా లోనే వీడ్కోలు ప్రసంగంలో సైతం ప్రణబ్‌ ముఖర్జీ కొన్ని కీలకమైన అంశాల్లో హితబోధ చేశారు. అటు పాలకులకూ, ఇటు ప్రతిపక్షాలకు కూడా కర్తవ్యాన్ని గుర్తుచేశారు. ‘స్వీయ సమర్ధన’ కంటే ‘స్వీయ సవరణ’ ప్రధానమని సూచించారు. వర్తమాన రాజకీయ రంగంలో ఇది అన్ని పార్టీలూ గ్రహించాల్సిన విషయం. తామో, తమ పార్టీ వారో, తమ పార్టీకి అనుబంధంగా ఉండే సంఘాలవారో తప్పు చేశారన్నప్పుడు వెనువెంటనే పార్టీ నేతల దగ్గర నుంచి వచ్చేది స్వీయ సమర్ధన. తప్పు చేయడం, దొరికిపోతే దబాయించి నోరు మూయించాలని చూడటం... ఏదీ చెప్పలేకపోతే జవాబు దాటేయడం ఇప్పుడు కనిపిస్తున్న ధోరణి.



పైగా వాళ్ల ఏలుబడిలో జరగలేదా అని ఎదురు ప్రశ్నించడం కూడా ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయిన ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి ‘మూక దాడుల’ వరకూ అన్నిటి విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. కనుకనే ప్రణబ్‌ చేసిన హితబోధకు ప్రాధాన్యముంది. రాష్ట్రపతి పదవిలో ఉండే వారికి పరిమితులుంటాయి. ఆ పదవి ఉత్త రబ్బరు స్టాంపులాంటిదని చాలామంది విమర్శిస్తారుగానీ సమర్ధులైనవారు ఆ పీఠంపై ఉంటే ఆ పరిమితుల్లోనే ఎంతో కొంత చేయగలుగుతారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి, లోటుపాట్ల గురించి పాలకులుగా ఉన్నవారు కలిసినప్పుడు నేరుగా వారివద్దే తన మనోగతాన్ని తెలియ జేయగలుగుతారు. బహిరంగంగా మాట్లాడేటపుడు రేఖామాత్రంగా మాత్రమే ప్రస్తావిస్తారు. ప్రణబ్‌ ఆదివారం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో చేసిన ప్రసం గాన్నిగానీ, జాతినుద్దేశించి సోమవారం చేసిన ప్రసంగాన్నిగానీ ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకుని చూడాలి.



గణతంత్ర వ్యవస్థ తన పౌరులందరిపట్లా బాధ్యత కలిగి ఉండాలని ఆయన గుర్తుచేశారు. పౌరుల్లో సౌహార్దతను పెంపొందించడం, వ్యక్తి గౌరవప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చూడటం, దేశ సమైక్యత కోసం పాటుపడటం ముఖ్యమని గుర్తుచేశారు. ఆ విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ సూచనలను పాలకులు మాత్రమే కాదు... బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సి ఉంటుంది. ఆయన పార్లమెంటు నడుస్తున్న తీరు గురించి కూడా ఆవేదన వ్యక్తపరిచారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలు కేవలం చట్టాలు చేసే సభలు మాత్రమే కాదు... అవి దేశ ప్రజల ఆకాంక్షలకూ, దేశంలో జరగాల్సిన సామాజిక మార్పులకూ సాధనాలుగా ఉండాలి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. కానీ మన సభలు ఘర్షణలకూ, బలప్రదర్శనలకూ వేదికలవు తున్నాయి. బాధ్యతాయుతమైన చర్చలు జరగాల్సిందిపోయి నేలబారు రాజకీ యాలే తాండవమాడుతున్నాయి. తటస్థ పాత్ర పోషించి అన్ని అభిప్రాయాలకూ చోటిస్తూ...ప్రభుత్వ పక్ష బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యం వర్థిల్లడానికి పనిచేయాల్సిన సభాధ్యక్షులు పాలక పక్షాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి, క్లిష్ట సమయాలు ఎదురైనప్పుడు ప్రభుత్వాలను గట్టెక్కించడమే తమ ధ్యేయమన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా చర్చలకు బదులు రచ్చే మిగులుతోంది. రోజుల తరబడి సభలు స్తంభించిపోవడం రివాజుగా మారింది. పార్లమెంటు మొద లుకొని శాసనసభల వరకూ ఈ తంతు నడుస్తోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా చట్టసభల సమావేశాలను ప్రత్యక్షంగా ప్రసారం చేసే సంప్రదాయం కూడా మొద లైంది. ఈ రభసనంతటినీ సాధారణ పౌరులు విస్తుపోయి చూస్తున్నారు.



ఎన్నో రకాల హామీలు గుప్పించి ప్రజాప్రతినిధులుగా ఎంపికవుతున్నవారు చేస్తున్న నిర్వా కం ఇదా అని దిగ్భ్రాంతి చెందుతున్నారు.

పాలకులుగా ఉన్నవారు ప్రతిపక్షాలను సభ నుంచి బయటకు గెంటేస్తే సమస్య ఉండదన్నట్టు వ్యవహరిస్తున్నారు. సభ సక్రమంగా జరగకపోతే అది ప్రధానంగా తమ వైఫల్యం కిందికొస్తుందన్న ఊహే వారికి రావడం లేదు. కొంత సంయమనం పాటిస్తే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి ఆస్కారం కలుగుతుందని ఇటు విపక్షాలు సైతం అనుకోవడం లేదు. సభను స్తంభింపజేయడం కాక ఏం చేసైనా చర్చ జరిగేలా చూడటం అవసరమని భావించడం లేదు. కీలకమైన సమస్యలు వచ్చిపడినప్పుడు ఏదో ఒక అంశంపై గొడవ జరిగేలా చూసి తప్పించుకోవచ్చునని ప్రభుత్వాలు ఎత్తులు వేస్తున్నాయి. ప్రణబ్‌ ప్రసంగించిన మర్నాడే లోక్‌సభ జరిగిన తీరు గమనిస్తే మన ప్రజా ప్రతినిధుల్లో ఎప్పటికైనా మార్పొస్తుందా అన్న అను మానం కలుగుతుంది. గోరక్షణ పేరిట దేశంలో సాగుతున్న హింసపై తక్షణ చర్చకు పట్టుబట్టిన విపక్షాలు నిరసన చెప్పడం వరకూ అర్ధం చేసుకోవచ్చు. కానీ స్పీకర్‌ టేబుల్‌పై ఉన్న కాగితాలను చించి పోగులు పెట్టడం ఏం మర్యాద? తన వాదనే మిటో ప్రభుత్వాన్ని చెప్పనిచ్చి, అందులోని లొసుగులను బయటపెడితే ఇంతకన్నా ఎక్కువ ప్రయోజనం సిద్ధించేది.



ప్రణబ్‌ ప్రసంగం మరో కీలకాంశాన్ని స్పృశించింది. అది చట్టసభల ప్రమేయం లేకుండా, చట్టాలు చేయకుండా దొడ్డిదోవన ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే ధోరణి పెరగడానికి సంబంధించింది. ఆయనన్నట్టు ఆర్డినెన్స్‌ మార్గాన్ని మన రాజ్యాంగంలో పొందుపరిచింది కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగ పడటానికి మాత్రమే. అదే రివాజుగా మారితే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధమే ముంటుంది? యూపీఏ పాలనలో అయినా, ఇప్పుడు ఎన్‌డీఏ పాలనలో అయినా జరుగుతున్నది ఇదే. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక భూసేకరణ చట్టంపై ఒకటికి రెండుసార్లు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. శత్రు ఆస్తుల చట్టంపై అయిదుసార్లు సవరణ ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. చట్టసభలు సజావుగా సాగకపోవడం, ఆర్డినెన్స్‌ జారీ, ప్రైవేటు బృందాల హింస ప్రజాస్వామ్యానికి అనారోగ్య సూచన. ఇలాంటి చెడు ధోరణులను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని అందరూ గుర్తెరగాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top