శ్వేత సౌధాధీశుడు!

శ్వేత సౌధాధీశుడు! - Sakshi


ఇంటా, బయటా అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ డోనాల్డ్ ట్రంప్ అమెరికా శ్వేత సౌధాన్ని చేజిక్కించుకున్నారు. రోడ్డు రోలర్‌ను తలపించే ప్రచార సరళితో, వ్యక్తిగత దూషణలతో, పురుషాహంకార ధోరణులతో, జాత్యహంకార జాడ్యంతో ఏడాదిన్నరగా అందరినీ విస్మయపరుస్తున్న ట్రంప్... విజయాన్ని అందుకోగానే తన స్వభావానికి విరుద్ధమైన ప్రసంగాన్ని చేశారు. ‘ఇకపై అందరి వాడను...’ అంటూ స్నేహ హస్తాన్ని అందించారు. ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. 18 నెలలక్రితం వరకూ ఆయన అనామకుడు. రాజకీయాలకు బయటివాడు. సంపన్న వర్గాలు నివసించే సౌధాలను నిర్మించి అమ్ముకునే కంపెనీకి అధిపతి.


ఏం చేసైనా సంస్థను లాభాల బాట పట్టించడానికి వెనకాడని ఫక్తు వ్యాపారవేత్త. అలాంటివాడు చాలా సునాయాసంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని తెచ్చుకోవడమే ఆశ్చర్యకరం. అందుకోసం ఆయనతో పోటీపడినవాళ్లు సామాన్యులు కాదు. డెమొక్రటిక్ పార్టీ పాలననూ, దాని విధానాల్లోని అపసవ్యతనూ, అవి దేశానికి కలగజేస్తున్న నష్టాన్నీ గంటలకొద్దీ చెప్పగలవారు. తమను అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తారో, వాటి విశిష్టతలేమిటో విశదీకరించ గలవారు. ట్రంప్ వీరికి పూర్తి భిన్నం. ఆయనకంటూ ఒక ఎజెండా లేదు. విధానా ల్లేవు. ఉన్నదల్లా దూకుడు. ఒక దుర్వ్యాఖ్యతో, ఒక ఈసడింపుతో ప్రత్యర్థిని దిగ్భ్ర మలో ముంచెత్తడమే ఆయనకు తెలుసు.


ఆ క్రమంలో సభాగౌరవాన్నీ, మర్యాదనూ బేఖాతరు చేసే వ్యక్తిత్వం ఆయనది. అందుకే అందరూ ఆయన్ను వినోదంగా చూశారు. కాలక్షేపంగా పరిగణించారు. ‘ఆటలో అరటిపండు’గా కొట్టిపడేశారు. తీరా డోనాల్డ్ ట్రంప్ పార్టీ అభ్యర్థి అయ్యేసరికి ‘ఔరా...’అంటూ ఆశ్చర్యపోయారు. సంప్రదాయవాదుల పార్టీగా ముద్రపడిన రిపబ్లికన్ పార్టీలో చాలామంది దీన్ని జీర్ణించుకోలేకపోయారు. కానీ చిత్రంగా ఎన్నికల్లో సైతం ఆయన అదే బాణీ కొన సాగించి జనామోదాన్ని కూడా పొందారు. 


 ఏమైంది అమెరికా సమాజానికి...ఎందుకిలా జరిగిందని ప్రపంచ ప్రజానీకం అనుకోవడంలో వింతేమీ లేదు. కానీ దాదాపు అమెరికా మీడియా సమస్తం ఇప్పు డలాగే భావిస్తోంది. కొమ్ములు తిరిగిన రాజకీయ విశ్లేషకులు సైతం బిత్తర పోతున్నారు. సగటు అమెరికన్ పౌరుల నాడి పట్టుకోలేక బోల్తా పడ్డామేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా అమెరికాను మాత్రమే కాక వర్తమాన ప్రపంచ పరిణామాలను కూడా అధ్యయనం చేస్తే వారికి భవిష్యత్తు అర్ధమయ్యేది. పొరుగునున్న లాటిన్ అమెరికా దేశాల పోకడలు మాత్రమే కాదు... బ్రిటన్‌లో నిన్న మొన్నటి ‘బ్రెగ్జిట్’ విజయం వరకూ కొనసాగుతున్న ధోరణి వెల్లడయ్యేది.


2008లో పుట్టుకొచ్చి విస్తరించిన ఆర్ధిక మాంద్యం పర్యవసానమిది. అమెరికా దీన్నుంచి కోలుకున్నదని, ఒబామా ఎంతో సమర్ధంగా ఆర్ధిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించా రని డెమొక్రటిక్ పార్టీ స్వోత్కర్షకు పోయి ఉండొచ్చు. అది నిజమేనని ఆర్ధిక నిపు ణులు విశ్లేషించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సగటు అమె రికా పౌరుణ్ణి ఆర్ధిక మాంద్యం పీడ ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ వీడలేదు. వారం దరినీ అది నిరాశానిస్పృహల్లోకి నెట్టింది. ఉపాధి కోల్పోయినవారు, ఆదాయం స్తంభించినవారు, భవిష్యత్తేమిటో అర్ధంకాక అయోమయలో పడినవారు, నీడను చూసి కూడా నిలువెల్లా వణికేవారు... అందరికందరూ ఏకమయ్యారు.


‘ఇక్కడంతా క్షేమమ’ని చెప్పే డెమొక్రటిక్ పార్టీనీ, హిల్లరీని వారు ఏవగించుకున్నారు.  యధా తథ స్థితిని కోరుకోవడమంటే కొరివితో తలగోక్కున్నట్టేనని భావించారు. ఈ క్రమంలో కుటుంబ విలువలను మంటగలిపే ట్రంప్ ప్రవర్తననూ, మాటలనూ వారు పట్టించుకోలేదు. జాత్యహంకారాన్ని రెచ్చగొట్టే ఆయన వ్యాఖ్యలను పరిగ ణనలోకి తీసుకోలేదు. ముస్లింలను ద్వేషిస్తున్న తీరును చూసీచూడనట్టు వదిలే శారు. మహిళల గురించీ, వారి దేహ ధర్మాల గురించి ఇష్టానుసారం వదరినా సరిపెట్టుకున్నారు. ట్రంప్‌కు 20 శాతానికి మించి మహిళల ఓట్లు పడవని సర్వేలన్నీ కోడై కూస్తే... 42 శాతంమంది ఆయన వెనక దృఢంగా నిలబడి విజయాన్ని ఖాయం చేశారు. చెప్పాలంటే 99 శాతంమంది శ్వేతజాతీయులు పైనున్న ఒక్క శాతాన్నీ గట్టిగా వ్యతిరేకించారు.


అలాగని అట్టడుగు శ్వేతజాతీయుల కోసం ఏం చేయదల్చుకున్నదీ ట్రంప్ చెప్పలేదు. మెక్సికోనుంచి వలస వస్తున్నవారిని రేపిస్టు లుగా అభివర్ణించి ఆ దేశ సరిహద్దుల్లో గోడ కడతానన్న ట్రంప్ మాటల్ని నమ్మారు. పొట్టతిప్పల కోసం దేశదేశాలనుంచీ వచ్చినవారే మీ అసలు శత్రువులంటూ ఆయన చేసిన ప్రచారాన్ని విశ్వసించారు. కెమెరాల సాక్షిగా అన్న మాటల్ని కూడా అనలేదని ట్రంప్ బుకాయిస్తే జనం అదే నిజమనుకున్నారు. కార్పొరేట్లపై పన్ను భారాన్ని తగ్గిస్తానని ఒకటికి రెండుసార్లు చెప్పినా ఆయనను శ్రీమంతుల మనిషిగా భావిం చలేదు. ప్రత్యర్థి రష్యాతో చేతులు కలిపి ముప్పు తెస్తున్నాడని హిల్లరీ మొత్తుకున్నా వినలేదు. ‘నేను శాంతిభద్రతల అభ్యర్థిని. వచ్చే ఏడాది జనవరి 20న దేశా ధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక మీ భద్రత మీకు మళ్లీ దక్కుతుంది’ అని ట్రంప్ నాలుగు నెలలక్రితం ప్రకటిస్తే చప్పట్లు చరిచారు.


 అమెరికా సమాజం ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు రెండు శిబిరాలుగా చీలింది. 2001 ఉగ్రవాద దాడి... జార్జి బుష్ వైపరీత్య పాలన సైతం సాధించలేని విధ్వంసమది. ‘నేను అందరివాడన’ని ఇప్పుడు ట్రంప్ అనొచ్చుగానీ... అంత మాత్రాన ఆ చీలిక మంత్రించినట్టు మాయమైపోదు. అమెరికాయే సారథ్యం వహించి ప్రపంచంపై రుద్దిన నయా ఉదారవాద విధానాలు అన్ని దేశాల్లాగే అమెరికాను సైతం పీల్చి పిప్పి చేశాయి. సంపద కేంద్రీకరణను పెంచి మెజా


 రిటీ ప్రజానీకాన్ని అభద్రతలో పడేశాయి. ఈ వాతావరణంలో పెల్లుబికిన ఆగ్రహా నికిక తర్కంతో పనిలేదు. వాస్తవాలతో సంబంధం లేదు. ఇన్ని దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఏమవుతాయన్న బెంగ ఉండదు. అలాంటి చోట ట్రంప్‌లాంటివారే విజేతలు. ‘అమెరికాను గొప్పగా చేద్దామ’ంటూ ఆయనిచ్చిన పిలుపులోని ఆంతర్యం, దాని పర్యవసానాలు రాగలకాలంలో వెల్లడ వుతాయి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top