గణాంకాలు... వాస్తవాలు!


కొన్నాళ్లుగా లీకులకే పరిమితమై, లేనిపోని ఆందోళనలను సృష్టిస్తున్న మతవారీ గణాంకాలు అధికారికంగా వెల్లడయ్యాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా రూపొందించిన ఈ గణాంకాలను విడుదల చేయడానికి ఎన్నుకున్న సందర్భాన్ని తప్పుబడుతున్నవారు కొందరైతే...ఆ గణాంకాలతోపాటు అవి వెల్లడించే వాస్తవాలను వివిధ కోణాల్లో మరింత ప్రభావవంతంగా ఆవిష్కరించాల్సిన అవసరాన్ని విస్మరించారని మరికొందరు విమర్శిస్తున్నారు. చిన్న వదంతి కూడా పెను సమస్యలను సృష్టించే మన దేశంలో మతవారీ గణాంకాల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఇవి రూపొందినా సార్వత్రిక ఎన్నికల ముందు వెల్లడించడం చేటు తెస్తుందన్న భయంవల్ల కావొచ్చు... ఆ ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నది. ఇన్నాళ్లకుగానీ దానికి తీరిక దొరకలేదు. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన్ని చూసుకుని ఇప్పుడు విడుదల చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.



గణాంకాలను స్థూల దృష్టితో చూస్తే కనబడే అంశాలు వేరు. లోతుగా విశ్లేషిస్తే వెల్లడయ్యే వాస్తవాలు వేరు.  2001-2011 మధ్య దేశంలో ముస్లింల జనాభా 0.8 శాతం పెరిగిందనీ, అదే సమయంలో హిందూ జనాభా 0.7 శాతం తగ్గిందని మీడియాలో ప్రముఖంగా వచ్చింది. సెన్సెక్స్ హెచ్చుతగ్గుల్ని ఏకరువు పెట్టినట్టు దేశ జనాభాలో హిందువుల శాతం 80.5 శాతంనుంచి 79.8 శాతానికి తగ్గిందనీ, ముస్లింలు 13.4 శాతంనుంచి 14.2 శాతానికి ఎగబాకారని ఆ కథనాలు తెలిపాయి. అంతేకాదు...ముస్లింల పెరుగుదల రేటు 24.6 శాతం ఉంటే హిందువుల వృద్ధి రేటు 16.8 శాతం ఉన్నదని తేల్చాయి.



అయితే గడిచిన దశాబ్దం(1991-2001)తో పోలిస్తే ఈ దశాబ్దంలో ముస్లింల జనాభా గణనీయంగా తగ్గిన సంగతిని గుర్తించాల్సి ఉంది. ఆ దశాబ్దంలో వారి వృద్ధి రేటు 29.5 శాతంకాగా ఇప్పుడది 24.6కు వచ్చింది. అంటే అది 4.9 శాతం తగ్గింది. హిందూ జనాభా ఇదే కాలంలో 19.9 శాతం వృద్ధి రేటు నుంచి 16.8కి తగ్గింది. అలా చూస్తే వృద్ధిలో తగ్గుదల 3.1 శాతం మాత్రమే.  వీటి సంగతలా ఉంచి సారాంశంలో రెండు మతాల జనాభా వృద్ధి రేటులో వ్యత్యాసం క్రమేపీ తగ్గుతున్నదని గుర్తించాల్సి ఉంది. అంతేకాదు...గత 60 సంవత్సరాల్లో ముస్లిం జనాభా పెరుగుదల రేటు ఈ స్థాయికి తగ్గడం ఇదే ప్రథమమన్నది నిపుణుల మాట. ఒక మతానికి చెందినవారు కుట్రపన్ని జనాభాను పెంచుకుంటూ పోతున్నారనీ, మరొకరు దాన్ని గ్రహించలేక జనాభాను తగ్గించుకుంటున్నారని ఇటీవలికాలంలో కొందరు ప్రచారం లంకించుకున్నారు. మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనాలని సలహాలిచ్చారు.



ఆ బాపతు మాటల్లో వాస్తవం లేదని గణాంకాలు గమనిస్తే అర్థమవుతుంది. నిజానికి జనాభా పెరుగుదలవంటివి ప్రాంతాలవారీగా చూస్తే వాటివెనకున్న అసలు ధోరణి అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాలో జనాభా పెరుగుదల ఎక్కువుంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువుంటుంది. సమాజంలో అక్షరాస్యత, ఆరోగ్యం, కుటుంబంలో మహిళలకూ, వారి ఆరోగ్యానికి ఇచ్చే విలువ, పట్టణీకరణ, వలసలు వంటివి జనాభా పెరుగుదల, తగ్గుదలపై ప్రభావాన్ని కలిగిస్తాయి. సమాజంలో చదువుకునేవారి సంఖ్య పెరగడంతోపాటు వారి ఆదాయం కూడా ఇతోధికంగా ఉంటే...ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు, సమాచారం అందుతూ ఉంటే సహజంగానే చిన్న కుటుంబాలవైపు మొగ్గు చూపడం పెరుగుతుంది. సామాజిక, ఆర్థికాంశాల్లో ఉండే వెనకబాటుతనమే పెద్ద కుటుంబాల పెరుగుదలకు ప్రధాన కారణమని  నిపుణులు చాన్నాళ్లుగా చెబుతున్నారు. 15 శాతం ముస్లిం జనాభా ఉన్న బిహార్‌నూ, 25 శాతం ముస్లిం జనాభా ఉన్న కేరళనూ పోలిస్తే బిహార్‌లో మొత్తంగా జనాభా పెరుగుదల రేటు 25 శాతం ఉంటే...కేరళలో అది 5 శాతం మాత్రమే! అంతేకాదు...93శాతం ముస్లింలున్న లక్షద్వీప్ జనాభా పెరుగుదల రేటులో అట్టడుగున ఉంది.





ఇక బంగ్లాదేశ్‌నుంచి వస్తున్న వలసలు కూడా కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరుగుదలను ప్రభావితం చేస్తున్నాయి. 1971 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ-కశ్మీర్ తర్వాత  కేరళలోని మల్లాపురం, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాల్లో మాత్రమే ముస్లిం జనాభా అధికంగా ఉండగా...తాజా లెక్కల ప్రకారం బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాంలలోని దాదాపు 15 జిల్లాల్లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకు జననాల రేటు కంటే బంగ్లాదేశ్‌నుంచి వచ్చిన వలసలే ప్రధాన కారణమని గుర్తించాల్సి ఉంది. సిక్కు, బౌద్ధ మతాలవారి జనాభా గతంతో పోలిస్తే తగ్గడం ఆందోళన కలిగిస్తుంది. వలసలు అధికంగా ఉండటంవల్ల సిక్కుల జనాభా క్షీణత ఉండొచ్చన్నది సామాజిక శాస్త్రవేత్తలు చూపుతున్న కారణం. కానీ 2,500 ఏళ్లక్రితం ఈ దేశాన్ని ఎంతో ప్రభావితం చేసిన బౌద్ధ మతం అవలంబించేవారి జనాభా తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తుంది.



సమాజంలో అవిద్య, మూఢ నమ్మకాలు పారదోలితే...సామాజిక, ఆర్థిక అసమానతలను, లింగ వివక్షను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటే... మొత్తంగా జీవన ప్రమాణాలను పెంచగలిగితే జనాభా పెరుగుదల సహజంగానే నియంత్రణలో కొస్తుంది. మానవాభివృద్ధి సూచీల్లో మనకంటే చాలా ముందున్నందువల్లే బంగ్లాదేశ్, ఇండొనేసియా, శ్రీలంక వంటి దేశాలు జనాభాను నియంత్రించగలిగాయి. మతపరమైన గణాంకాలతోపాటు ఏ ఏ మతాల్లో అక్షరాస్యత స్థాయి ఎలా ఉన్నదో, ఎవరెవరి సామాజిక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో వెల్లడించి ఉంటే జనాభా పెరుగుదల, తగ్గుదల వెనకున్న కారణాలు ప్రజలకు మరింతగా తేటతెల్లమయ్యేవి. ఆయా వర్గాల అభ్యున్నతికి తీసుకోవాల్సిన, తీసుకుంటున్న చర్యలేమిటో చెబితే ఇంకా బాగుండేది. మొత్తంగా  గత రెండు దశాబ్దాల్లో జనాభా వృద్ధి రేటు నియంత్రణలోకి రావడాన్ని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అనవసర భయాందోళనలనూ, పరస్పర అపనమ్మకాలనూ నివారించడానికి ఇవి తోడ్పడితే అంతకన్నా కావలసిందేముంది?

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top