ఆస్పత్రులా... బలి పీఠాలా?


పేదల పాలిట ఖర్మాసుపత్రులుగా అపకీర్తి గడించిన సర్కారీ ఆస్పత్రుల రోగిష్టి వాలకం సామాన్య జనానికి తెలియనిదేమీ కాదు. సకల రుగ్మతలతో లుకలుకలాడుతున్న ఈ ఆస్పత్రుల్లో ఇప్పుడు మూషికాలు కూడా ప్రాణాలు తీస్తున్నాయని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగిన తాజా ఘటన నిరూపిస్తున్నది. ఇన్నాళ్లూ వైద్యులు లేకనో, ప్రాణావసరమైన ఆక్సిజన్ వంటివి అందుబాటులో లేకనో, మందులు అందకో, రోగికి అవసరమయ్యే గ్రూపు రక్తం లభించకనో మరణాలు సంభవించేవి. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మన అవ్యవస్థను మరింత కళ్లకు కట్టేలా ఇప్పుడక్కడ ఎలుకలు కూడా కొరికి చంపేస్తున్నాయి! ఆ నవజాత శిశువు కళ్లు తెరిచి ఎన్నాళ్లో కాలేదు. అమ్మ ఒడిలోని వెచ్చదనం ఆ శిశువునింకా తాకలేదు. మూత్రనాళంలో వచ్చిన సమస్యకు మెరుగైన చికిత్స లభిస్తుందన్న ఆశతో అమ్మానాన్నలిద్దరూ ఆ బాబును అక్కడికి తీసుకెళ్లారు. రోగి పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షించడానికి తోడ్పడే ఐసీయూలోనే చేర్చారు.



కానీ ప్రాణాలు కాపాడాల్సిన ఐసీయూ ఆ శిశువుకు నరకం చూపింది. సిబ్బంది మినహా బయటివారెవరినీ రానీయకుండా, ఎంతో జాగ్రత్తగా వైద్యం అందించాల్సిన ఆ ఐసీయూలో మూషికాలు యథేచ్ఛగా సంచరిస్తున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్ మొదలుకొని వార్డు బాయ్ వరకూ ఎవరికీ పట్టలేదు. బాబుపై మూషికాలు దాడి చేయడాన్ని చూసిన బాలింత ఆర్తనాదాలు చేసినా ఎవరి చెవికీ సోకలేదు. మూషికాల దాడిలో చేతి వేళ్లు, కాలి వేళ్లు పూర్తిగా దెబ్బతిని...ఛాతిపైనా, బుగ్గపైనా గాయాలై నెత్తుటి ముద్దగా మిగిలిన ఆ శిశువు దాదాపు పది గంటలపాటు మృత్యు వుతో పోరాడి నిస్సహాయంగా కన్నుమూశాడు. అన్ని గంటలసేపూ సాధారణ సిబ్బందిగానీ, వైద్యులుగానీ అటుపక్క చూడలేదంటే, చిన్న ప్రయత్నమైనా చేయలేదంటే సర్కారీ ఆస్పత్రులు ఎంతగా బండబారిపోయాయో, అక్కడ పనిచేసేవారిలో మానవాంశ ఎంతగా హరించుకుపోయిందో అర్థమవుతుంది.



ఏ సంఘటన జరిగినా ముక్తసరిగా మాట్లాడటం లేదా మౌనంవహించడంతో కాలక్షేపం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హృదయ విదారక ఉదంతంపై స్పందించారు. ‘ప్రభుత్వం ఎంత చేసినా’ ఒక్క తప్పిదంతో జనంలో నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఎంత చేసింది ఈ ప్రభుత్వం? ఈ పదిహేను నెలల్లో జరిగిన తప్పిదాలు ఎన్ని ఒకట్లు? తప్పు చేస్తే కఠిన చర్యలుంటాయన్న కనీస స్పృహనైనా కలిగించగలిగిందా? తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన దురంతంలో బాధ్యుడైన అస్మదీయుడికి ఇంతవరకూ ఏం కాలేదు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్యా సంస్థలోకి అడుగుపెట్టిన రిషితేశ్వరిని తోడేళ్ల మంద చుట్టుముట్టి ప్రాణం హరిస్తే, అందులో ప్రిన్సిపాల్ బాధ్యత కొట్టొచ్చినట్టు కనిపించినా ఇంతవరకూ అతను అరెస్టు కాలేదు. నారాయణ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు సంభవించినా చర్యలు లేవు. ఇవన్నీ కళ్లముందు కనిపిస్తుంటే ఎవరికైనా ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? గుంటూరు ఘటనలో చంద్రబాబు కేవలం సిబ్బంది నిర్లక్ష్యాన్ని మాత్రమే చూస్తున్నారు.



ఆ నిర్లక్ష్యంలో పరోక్షంగా తమ బాధ్యత ఉందన్న సంగతిని కప్పెడుతున్నారు. తాను ఎప్పటికప్పుడు ఆస్పత్రులను తనిఖీ చేస్తూనే ఉన్నానని ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ చెబుతున్నారు. అలా చెప్పారు గనుక ఆయన తప్పూ లేదన్న మాట! జరిగిన ఘోరానికి ఏవో చర్యలున్నట్టు కనబడాలి గనుక పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించే ఆర్‌ఎంఓ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌నూ, మరో ఉన్నత స్థాయి అధికారిని బదిలీ చేశారు. బాధిత కుటుంబానికి పరిహారం అందజేశారు. ఈ చర్యలన్నీ తీసుకోవాల్సిందేగానీ ఇవి మాత్రమే సరిపోవని సీఎం గుర్తించడంలేదు. ఇది ఒక్క గుంటూరు ఆస్పత్రికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఏపీలో శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకూ అన్ని ఆస్పత్రులూ ఇలాగే అఘోరిస్తున్నాయని సమాచారం అందుతున్నది. కొన్నిచోట్ల సగం సిబ్బందైనా లేకుండానే...అవసరమైన పరికరాలు, యంత్రాలు, పడకలు అందుబాటులో లేకుండానే ఆస్పత్రులు నడుస్తున్నాయి. మరికొన్నిచోట్ల పేరుకు వైద్యులున్నా పని సాగటం లేదు. 1,100 పడకలున్న ఆస్పత్రులు మొదలుకొని 100 పడకలున్న ఆస్పత్రుల వరకూ అన్నీ సమస్యలతోనే సావాసం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎలుకలు, పందికొక్కులు, పాములు, తేళ్లు ఉంటున్నాయని ఫిర్యాదులే. గుంటూరు ఘటన ప్రముఖంగా మీడియాలో వచ్చింది గనుక తాను సిగ్గుతో తలవంచుకుంటున్నానని మంత్రి కామినేని అన్నారు. కానీ ఆయన తలెత్తి చూస్తే... పట్టించుకోదల్చుకుంటే ప్రభుత్వాస్పత్రులన్నీ కొద్దో గొప్పో తేడాతో ఇలాగే ఉన్నాయని అర్థమవుతుంది. అప్పుడు కేవలం సిబ్బందిని మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదని, తమలో కూడా లోపం ఉన్నదని ఆయనకు తెలిసే అవకాశం ఉంటుంది.



ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసే బాధ్యతనుంచి ప్రభుత్వాలు క్రమేపీ తప్పుకుంటున్నాయి. ఈమధ్యే నీతి ఆయోగ్ సీఈఓ సింధుశ్రీ ఖుల్లార్ ప్రజారోగ్య వ్యవస్థలో బీమా ఆధారిత సేవలను అందజేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఇందులో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఉచిత వైద్యం, ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందులు వగైరాలకు కాలం చెల్లిందని హితవు చెప్పారు. విధాన నిర్ణేతలు, పాలకులు ఇలా ఉంటే ఇక ప్రభుత్వాసుపత్రులు కోలుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడే ప్రభుత్వాసు పత్రుల్లో యూజర్ చార్జీల విధానానికి శ్రీకారం చుట్టి చంద్రబాబు ఈ విషయంలో చాలా ముందుకెళ్లారు. కనుక రోగానికి మూలం ఎక్కడున్నదో... ప్రభుత్వాస్ప త్రులు ఎలుకలకు, పందికొక్కులకు, పందులకు ఎందుకు నిలయాలవుతున్నాయో సులభంగానే బోధపడుతుంది. నిర్లక్ష్యం, నిర్దయ వంటివి కట్టగట్టుకుని ప్రభుత్వా స్పత్రుల్లోనే ఎందుకు తిష్టవేశాయో అర్థమవుతుంది. పేద రోగుల పాలిట బలిపీఠాలవుతున్న ప్రభుత్వాసుపత్రులు సరిగా సాగాలంటే పాలకుల మెదళ్లకు ముందుగా చికిత్స చేయాలి. వారి ఆలోచనల్ని సరిచేయాలి. జనం మేల్కొని ఆ పని చేసేంత వరకూ దవఖానాలు బాగుపడవు గాక పడవు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top