మళ్లీ చెలరేగిన తుపాకి

మళ్లీ చెలరేగిన తుపాకి - Sakshi


ఉన్మాదం ఎంతగా ప్రకోపిస్తున్నా, అది జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నా అమెరికా నిస్సహాయంగానే మిగిలిపోదల్చుకున్నదని మరోసారి రుజువైంది. తుఫానులు చెలరేగినప్పుడూ, వరదలు ముంచెత్తినప్పుడూ నిరోధించలేనట్టే ఈ వైపరీత్యానికి కూడా విరుగుడేమీ ఉండదని అక్కడి సమాజం భావిస్తోంది.


 


నాలుగు రోజులక్రితం సాయుధుడొకరు ఒరెగన్ రాష్ట్రంలోని రోజ్‌బర్గ్‌లో ఉన్న కళాశాలలోకి ప్రవేశించి ఒక ప్రొఫెసర్‌తోసహా 9మందిని కాల్చిచంపాడు. మరో 20మందిని తీవ్రంగా గాయపరిచాడు. అందరినీ వరసలో నించోమని ఆదేశించి ఒక్కొక్కరి మతమే అడుగుతూ అతను ఈ దురాగతానికి పాల్పడ్డాడు. క్రైస్తవులమని చెప్పిన వారిని తలలో.... మిగిలినవారిని కాళ్లపై కాల్చుకుంటూ పోయాడు. చివరకు అతన్ని పోలీసులు మట్టుబెట్టారు.



అమెరికాలో ఇలాంటి ఉన్మాద ఘటనలు కొత్తగాదు. ఇంచుమించు నెలకోసారి ఏదో మూల ఇలాంటి వార్తలు వినబడుతుంటాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాస్త నిష్టూరంగా చెప్పినట్టు ఈ మాదిరి ఉదం తాలు జరగడం... అవి మీడియాలో రావడం... సమాజం నిర్ఘాంతపోవడం... నివా ళులర్పించడం...తాను సందేశం ఇవ్వడం -ఇదంతా షరా మామూలుగా సాగిపో తుంటుంది. మళ్లీ నెలరోజులో, రెండు నెలలో అయ్యాక ఇదే పునరావృతమవు తుంది. ఒబామా చెప్పినదాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. ఆ దేశంలో ఏటా ఇలా ఉన్మాదుల తుపాకులకు వేలాదిమంది బలవుతుంటారు.



2001 సెప్టెంబర్‌లో అక్క డ ఉగ్రవాద దాడులు జరిగి 3,000మంది మరణించాక ఈ 14 ఏళ్లల్లో అక్కడ మరో 74మంది ఉగ్రవాద ఘటనల్లో చనిపోయారు. కానీ తుపాకులతో చెలరేగే ఉన్మాదుల వల్ల ఇదే కాలంలో దేశవ్యాప్తంగా లక్షన్నర మంది కన్నుమూశారు. 2012లో ఒబామా రెండోసారి అధికారంలోకొచ్చాక అమెరికాలో 993 కాల్పుల ఉదంతాలు చోటుచేసుకున్నాయి. అందులో 300 ఉదంతాలు ఈ ఏడాది జరిగినవే. ఈ జనవరి నుంచి ఇంతవరకూ విద్యా సంస్థల్లో 45 కాల్పుల ఉదంతాలు సంభవించాయి.



ఈ ఉన్మత్త ఘటనలకు సంబంధించి నిజానికి ఒబామాను తప్పుబట్టడానికేమీ లేదు. శాంతిభద్రతల వ్యవహారం ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించింది గనుక అధ్యక్షుడిగా ఆయనకుండే అధికారాలు పరిమితం. అయినా  2008లో తొలిసారి గద్దెనెక్కినప్పటినుంచి ఈ తుపాకుల సంస్కృతిని ఏదో మేరకు నియంత్రిద్దామని ఆయన ప్రయత్నించారు. కానీ ప్రత్యర్థి పక్షమైన రిపబ్లికన్ పార్టీతోపాటు ఆయన పార్టీలో కూడా అందుకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 2012లో కనెక్టికట్‌లో ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపాల్‌తోపాటు 27మంది పిల్లల్ని ఒక ఉన్మాది పొట్టనబెట్టుకున్నప్పుడు తుపాకులు యథేచ్ఛగా అమ్ముడవుతున్న తీరుపై విస్తృత చర్చ జరిగింది.



ఒక దశలో నియంత్రణ కోసం ఒక చట్టం వస్తుందేమోనన్న ఆశ కలిగింది. కానీ అది అడియాసే అయింది. సెనేట్‌లో ప్రవేశపెట్టిన బిల్లు చివరకు వీగిపోయింది. ఆ ఉదంతానికి ముందూ, తర్వాతా ఎన్నో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. మొన్న జూన్ నెలలో సౌత్ కరొలినాలో ఉన్న నల్లజాతీయుల చర్చిలోకి జొరబడి దుండగుడు 9మందిని  కాల్చి చంపాడు. ఆగస్టులో వర్జీనియాలో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్న చానెల్ యాంకర్‌నూ, వీడియో జర్నలిస్టునూ మరో దుండగుడు కాల్చిచంపాడు. కూరగాయలు దొరికినంత సులభంగా అక్కడ తుపాకులు దొరకడమే ఈ బెడదకు ప్రధాన కారణం.



ఒరెగన్‌లో కాల్పులు జరిపిన యువకుడు అయిదు పిస్తోళ్లు, ఒక రైఫిల్ పట్టుకొచ్చి నరమేథం సాగించాడు. ఆ తర్వాత అతనుండే నివాసగృహంలో సోదాలు చేయగా మరో రెండు పిస్తోళ్లు, నాలుగు రైఫిళ్లు, ఒక షాట్‌గన్, ఒక హ్యాండ్ గన్ దొరికాయని పోలీసులు ప్రకటిం చారు. ఇన్ని మారణాయుధాలను పోగేసుకున్న ఆ యువకుడికి ఇంతవరకూ ఎలాం టి నేర చరిత్రా లేదని అంటున్నారు. కనీసం అతని మానసిక స్థితిపై ఎవరికీ అను మానం కూడా కలగలేదట! అన్నివిధాలా సవ్యంగా ఉన్నట్టు కనబడినవాడు ఇన్ని మారణాయుధాలు ఎందుకు పోగేశాడన్నది వారికి అంతు చిక్కని పజిల్‌గా ఉంది.



ప్రతిసారిలానే ఇప్పుడు కూడా అమెరికాలో తుపాకుల బెడద గురించి చర్చ మొదలైంది. యథాప్రకారం అలాంటి చర్చను మొగ్గలో తుంచే ప్రయత్నం సాగు తోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్, జెబ్ బుష్‌లు తుపాకుల నిషేధం డిమాండ్‌ను అవహేళన చేశారు. ‘సమస్య పరిష్కారం తుపాకుల నిషేధంలో లేదు...మరిన్ని తుపాకులను తీసుకు రాకపోవ డంలో ఉంది. ఒరెగన్‌లో విద్యార్థుల వద్ద తుపాకులున్నా, కళాశాల ప్రాంగణలో షార్ప్ షూటర్లు అందుబాటులో ఉన్నా ఆ ఉన్మాది అంతమందిని చంపగలిగేవాడు కాద’ని తర్కం లేవదీశారు.



నిజానికి ఈ తర్కం వీరిది కాదు. ఆ దేశంలో అత్యంత బలమైన సంస్థ నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్‌ఆర్‌ఏ)ది. అది చేసే లాబీయింగ్‌కు రాజకీయ నాయ కులంతా దాసోహమంటున్నారు. ఎవరేమి మాట్లాడినా చివరకు అది చేసే వాదనే నెగ్గుతుంది. తుపాకి కలిగి ఉండటం ప్రాథమిక హక్కుగా పరిగణించే రెండో రాజ్యాంగ సవరణ ఆ సంస్థ పుణ్యమే. తుపాకుల అమ్మకాన్ని నియంత్రించినా, క్రమబద్ధీకరించినా పౌరుల హక్కులకు భంగం కలుగుతుందని ఆ సంస్థ ప్రచారం చేయడమే కాదు...అందుకు సంబంధించి ఎలాంటి బిల్లు వచ్చినా గట్టిగా ప్రతిఘ టిస్తుంది. చట్టసభల్లో సభ్యులను కూడగడుతుంది.



రెండేళ్లక్రితం సెనేట్‌లో తుపా కుల నియంత్రణ బిల్లు వీగిపోయేలా చేసింది ఈ సంస్థే. ఏమిటి దీనికున్న బలం? తుపాకులు, తూటాల తయారీ పరిశ్రమ టర్నోవర్ 1,350 కోట్ల డాలర్లు(రూ. 85,000 కోట్లు). ఆ పరిశ్రమ వార్షిక లాభాలు 150 కోట్ల డాలర్లు(రూ.9,783 కోట్లు). ఇలాంటి పరిశ్రమ లాబీకి ఎవరైనా తలొగ్గడంలో...దాని వాదనను బలపరచడంలో వింతేమి ఉంటుంది? సమాజానికి చీడలా మారిన తుపాకుల సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితమై పోరాడితే తప్ప ఈ దుస్థితి మారదు. తాజా ఉదంతం అందుకు దోహదపడాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top