ఆరోగ్యశ్రీ చుట్టూ ఆంక్షలు

ఆరోగ్యశ్రీ చుట్టూ ఆంక్షలు - Sakshi


ఆపత్కాలంలో అమ్మ గుర్తుకొచ్చినట్టే తెలుగు రాష్ట్రాల్లో జబ్బుపడ్డ నిరుపేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ స్ఫురణకొస్తుంది. పదేళ్లక్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ పథకం ప్రారంభిం చినప్పుడు అందుకవసరమైన నిధులెలా అని సంశయించలేదు. జనావసరాలనే చూశారు తప్ప ఖజానా గురించి ఆలోచించలేదు. నిరుపేద రోగులను ఆప త్కాలంలో ఆదుకునేందుకు, వారికి కార్పొరేట్‌ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు రూపొందించిన ఈ పథకం లక్షలాది కుటుంబాలకు వరమైంది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా ఖరీదైన కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకొచ్చింది.



ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మిగిలిన ప్రజోపయోగ పథకాలను నీరుగార్చిన తరహాలోనే ఆరోగ్యశ్రీని కూడా అటకెక్కించే ప్రయత్నం మొద లుపెట్టింది. హైదరాబాద్‌లో వైద్య సేవలు పొందాలనుకునే రోగులకు ఆరోగ్యశ్రీ వర్తించబోదంటూ ఇటీవల తీసుకున్న నిర్ణయమే అందుకు తాజా ఉదాహరణ. ఒక్క కేన్సర్‌ చికిత్సకు మాత్రం దీన్నుంచి మినహాయింపునిచ్చారు. టీడీపీ ఏలుబడి మొదలయ్యాక ఈ పథకానికి అప్పటివరకూ ఉన్న రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీగా మార్చారు. పేరు ఏదైనా పథకం అమలైతే అదే పదివేలని అందరూ అనుకుంటున్న తరుణంలో తనకలవాటైన రీతిలో ఆ పథకానికి బాబు తూట్లు పొడుస్తున్నారు.



రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కొరత బాగా ఉంది. ముఖ్యంగా వైద్య రంగంలో అది మరీ ఎక్కువ. ప్రభుత్వాసుపత్రుల్లో లభించే సేవలు అంతంతమాత్రం. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ  పడకేసిందని సాక్షాత్తూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) వారం రోజులక్రితం దుయ్యబట్టింది. ప్రభుత్వాసుపత్రులు మొదలుకొని ఉప ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల వరకూ ఎక్కడా రోగులకు మెరుగైన సేవలు లభించడం లేదని కాగ్‌ గణాంకాలతో సహా వెల్లడించింది. జాతీయ హెల్త్‌ మిషన్‌ కింద కేంద్రం నుంచి గ్రాంటుగా అందుతున్న నిధుల్లో సగం కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయలేకపోయిందని తెలిపింది. జాతీయ గ్రామీణ హెల్త్‌ మిషన్‌ నిధులను దారి మళ్లించిందని స్పష్టం చేసింది. ఇన్ని పోకడలకు పోతూ, ప్రజారోగ్య వ్యవస్థను భ్రష్టు పట్టించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో చికిత్స చేయించుకుంటే తప్ప ఆరోగ్యశ్రీ పథకం వర్తించబోదంటూ చెప్పడం ఎంత దుస్సాహసం? అవసరమైన కేటాయింపులు లేకపోవడం, చేసిన కేటాయింపుల్లో అధికభాగం పాత బకాయిలకిందకు జమ కావడం తదితర కారణాలవల్ల ఆరోగ్యశ్రీ అసలే అంతంతమాత్రంగా నడుస్తోంది. ఇప్పుడీ నిబంధన పర్యవ సానంగా అది పేద ప్రజలకు మరింత దూరమవుతుంది. వ్యాధికి ఎక్కడ చికిత్స తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు రోగులు అనేక విధాల ఆలోచిస్తారు. ఆసుపత్రిలో ఉండే సౌకర్యాలనూ, అక్కడ చికిత్సనందించే వైద్యుల గురించి వాకబు చేస్తారు.



సురక్షితమైన, మెరుగైన వైద్యం లభిస్తుందన్న విశ్వాసం ఏర్పడిన ఆసుపత్రిలోనే చేరతారు. పైగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదేళ్లపాటు హైద రాబాద్‌ను రాజధానిగా ఉపయోగించుకోవచ్చునని హామీ ఇచ్చారు. ‘ఓటుకు కోట్లు’ కేసు తాకిడితో అర్ధాంతరంగా చంద్రబాబు ప్రభుత్వ విభాగాలనైతే తర లించుకున్నారు. కానీ మంచి వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండేలా చూడగలిగారా? పైగా విభజన జరిగి మూడేళ్లు దాటు తున్నా ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలామంది ఇప్పటికీ హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉంటున్నారు. స్వస్థలాల్లో ఉండే తమవారిని హైదరాబాద్‌ రప్పిం చుకుని తగిన చికిత్స ఇప్పించాలని ఆశించేవారికి తాజా నిబంధన ప్రతిబంధకంగా మారుతుంది.



పేద జనం అన్నా, వారి ప్రాణాలన్నా ఉండే నిర్లక్ష్యం నుంచే ఇలాంటి ఆలో చనలు పుట్టుకొస్తాయి. వైఎస్‌ ఈ పథకం ప్రారంభించినప్పుడు దీని పరిధిలోకొచ్చే వ్యాధుల సంఖ్య 135 వరకూ ఉండేది. ప్రజల ఆరోగ్యావసరాలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుని  ఈ పథకాన్ని ఆయన విస్తృతపరుచుకుంటూ వెళ్లారు. ఫలితంగా ఈ పథకం కింద అర్హమైన చికిత్సల సంఖ్య దాదాపు వేయికి చేరుకుంది. ఆయన కనుమరుగయ్యాక వచ్చిన ప్రభుత్వాలు దీనికి గ్రహణం పట్టించడం మొదలుపెట్టాయి. దాని పరిధిలో ఉన్న జబ్బులను కూడా కుదించడం ప్రారం భించాయి. కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 133 రకాల జబ్బులకు ప్రభు త్వాసుపత్రుల్లో మాత్రమే చికిత్స చేయించుకోవాలన్న నిబంధన విధించారు. బధిర, మూగ లోపాలున్న పిల్లలకు జరిపే కాక్లియర్‌ ఇంప్లాంటు చికిత్సకున్న వయో పరిమితిని తగ్గించారు. వైఎస్‌ ప్రభుత్వం మొదట్లో ఉన్న వయో పరిమితి ఆరేళ్లను 12 సంవత్సరాలకు మారిస్తే... కిరణ్‌ సర్కారు దాన్ని కాస్తా రెండేళ్ల వయసుకు కుదించింది. ఆ వయసులో పిల్లలకున్న మూగ, చెవుడు లోపాన్ని గుర్తించడం కష్టమని ఎవరెంతగా ప్రాథేయపడినా ప్రయోజనం లేకపోయింది. బాబు సర్కారు ఇలాంటి సమస్యలను సరిదిద్దకపోగా దాన్ని మరింత భ్రష్టు పట్టించాలని చూస్తోంది.



ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు ఎలా అఘోరిస్తున్నాయో కాగ్‌ నివేదిక తేటతెల్లం చేసింది. అక్కడ డాక్టర్లు, నర్సుల కొరత ఎక్కువని తెలిపింది. జ్వరానికి వాడే పారాసిటమల్‌తోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, గైనకాలజీ కిట్లు, గర్భనిరోధక మాత్రలు అందుబాటులో లేవని చెప్పింది. కాలం చెల్లిన మందుల్ని రోగులకిస్తున్నారని, వాటి నాణ్యతను తనిఖీ చేయడం లేదని వివరించింది. ప్రజా రోగ్య వ్యవస్థను ఇంతగా ధ్వంసం చేసింది చాలక వేరేచోట్ల వైద్యం చేయించు కుంటే ఆరోగ్యశ్రీ వర్తించబోదని అనడంలోని ఆంతర్యమేమిటి? ఇలాంటి ఎత్తు గడలకు చంద్రబాబు సర్కారు స్వస్తి పలకాలి. ఆ పథకానికి తగినన్ని నిధులు కేటా యించకపోతే, దాన్ని నీరుగారిస్తే ప్రజలు క్షమించరు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top