దినకరన్‌(శశికళ అక్కకొడుకు) రాయని డైరీ

దినకరన్‌(శశికళ అక్కకొడుకు) రాయని డైరీ - Sakshi

నాలుగు రోజులైంది నేను పోలీస్‌ కస్టడీలోకి వచ్చి ! మొదట నన్ను చెన్నై నుంచి ఢిల్లీ తీసుకెళ్లారు. తర్వాత ఢిల్లీ నుంచి చెన్నై తీసుకొచ్చారు. బీసెంట్‌ నగర్‌లోని రాజాజీ భవన్‌లో ఇంటరాగేషన్‌. చుట్టూ నలుగురైదుగురు పోలీసులు.
‘‘కొంచెంసేపు రెస్ట్‌ తీసుకుంటాను’’ అన్నాను. ‘‘అరెస్ట్‌ అయినవాళ్లకు రెస్ట్‌ ఉండదు’’ అన్నారు!
‘‘రెస్ట్‌ అంటే పెద్దగా ఏం కాదు, బీసెంట్‌ నగర్‌లోనే మా ఇల్లు. వాష్‌రూమ్‌లో కాసేపు రిలాక్స్‌ అయి వచ్చేస్తాను’’ అన్నాను.
‘‘ఇక్కడ ఉన్నవి వాష్‌రూమ్‌లు కాదా?’’ అన్నారు.
‘‘మా ఇంట్లో ఉన్నది నాకు అలవాటైన వాష్‌రూమ్‌. కంఫర్ట్‌గా ఉంటుంది’’ అన్నాను.
‘‘కస్టడీని ఇంకో ఐదు రోజులు పొడిగిస్తే ఇక్కడి వాష్‌రూమ్‌లు కూడా కంఫర్ట్‌గా ఉంటాయి’’ అన్నారు.
‘‘కావాలంటే మీరు కూడా నాతో వచ్చేయండి. పెద్ద బిల్డింగ్‌. కేరళ స్టయిల్‌లో కట్టించాను. మా వాళ్లు టీ పెట్టి ఇస్తారు. టీవీ పెట్టి రిమోట్‌ చేతికిస్తారు’’ అని చెప్పాను. వాళ్లేమీ ఎగై్జట్‌ కాలేదు.
‘‘ఇంకొక్క రోజు మీరు క్వొశ్చన్లు అడిగితే నా కస్టడీ కంప్లీట్‌ అవుతుంది కదా’’ అని అడిగాను.
‘‘మేము క్వొశ్చన్లు అడిగితే కస్టడీ కంప్లీట్‌ కాదు. నువ్వు ఆన్సర్లు చెబితే కస్టడీ కంప్లీట్‌ అవుతుంది. అప్పుడు కూడా కంప్లీట్‌గా కంప్లీట్‌ కాదు. నువ్వు చెప్పే ఆన్సర్లకు మళ్లీ మేము నీకు క్వొశ్చన్లు వేయకుండా ఉండాలి. అప్పుడు కంప్లీట్‌ అవుతుంది’’ అన్నారు.
‘‘మీరు మళ్లీ మళ్లీ క్వొశ్చన్లు వేయకుండా,  ఒకేసారి నేను ఆన్సర్లన్నీ చెప్పేస్తే.. అప్పుడు కస్టడీ కంప్లీట్‌ అవుతుందా?’’ అని అడిగాను.
‘‘అప్పుడు కూడా కంప్లీట్‌ కాదు’’ అన్నారు.
‘‘అదేంటీ’’ అన్నాను
‘‘క్వొశ్చన్‌ వేసినప్పుడు చెప్పిందే ఆన్సర్‌. క్వొశ్చన్‌ అడక్కుండా చెప్పింది ఆన్సర్‌ కిందికి రాదు’’ అన్నారు.
‘‘మరి దేని కిందికి వస్తుంది?’’ అన్నాను.
‘‘క్వొశ్చన్‌లెస్‌ ఆన్సర్‌ కిందికి వస్తుంది. క్వొశ్చన్‌కి ఆన్సర్‌ లేకపోయినా డిపార్ట్‌మెంట్‌ సహిస్తుంది కానీ, క్వొశ్చన్‌ లేని ఆన్సర్‌ని అస్సలు టాలరేట్‌ చెయ్యదు’’ అన్నారు.
‘‘మీ డిపార్ట్‌మెంట్‌ ఇంకా.. ఏమేం టాలరేట్‌ చెయ్యదు?’’ అని అడిగాను.
కోపంగా చూశారు! ‘కస్టడీలోకి మేము నిన్ను తీసుకున్నామా? నువ్వు మమ్మల్ని తీసుకున్నావా?’ అన్నట్లుంది ఆ చూపు.
ఆ చూపు నాకు నచ్చలేదు.
శశీ ఆంటీ జైలుకు వెళ్లకుండా ఉంటే, పార్టీ సింబల్‌ని ఎలక్షన్‌ కమిషన్‌ ఎత్తుకెళ్లకుండా ఉంటే, పళనిస్వామికి, పన్నీర్‌సెల్వంకి కొంచెమైనా బుద్ధీజ్ఞానం ఉండి ఉంటే.. నేను ఇవాళ పోలీసు కస్టడీలో ఉండడం కాదు, మొత్తం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌నే నా పొలిటికల్‌ కస్టడీలోకి తీసుకుని ఉండేవాడిని!

-మాధవ్‌ శింగరాజు

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top