వర్షార్పణం

వర్షార్పణం - Sakshi

– మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలు

– ఆందోళనలో అన్నదాతలు

– జిల్లావ్యాప్తంగా ధ్వంసమైన రహదారులు

 

జంగారెడ్డిగూడెం :

మెట్టలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటలు నీటమునిగి దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. కళ్లాలపై ఆరబెట్టిన మొక్కజొన్న కండెల నుంచి మొలకలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. అర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి. ప్రధానంగా మెట్ట, ఏజెన్సీ మండలాల్లో వరి, మినుము, వేరువనగ, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా, ఎర్రకాలువ ఉధతికి తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాల్లో వరి ముంపునకు గురైంది. ప్రాథమికంగా జిల్లాలో 3 వేల ఎకరాల్లో వరి, 1,600 ఎకరాల్లో మినుము, సుమారు 100 ఎకరాల్లో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. అలాగే కళ్లాలపై ఉన్న మొక్కజొన్న తడిసి మొలకెత్తింది. 

 

రహదారులు ఛిద్రం

భారీ వర్షాలు, వరద ఉధతికి రోడ్లు కొట్టుకుపోవడమే కాకుండా, కాలువలు ప్రవహించిన చోట గండ్లు పడ్డాయి.జిల్లాలో సుమారు 280 కిలోమీటర్ల మేర ఆర్‌ అండ్‌ బీ రోడ్లు ధ్వంసమైనట్టు ఆ శాఖాధికారులు అంచనా వేశారు. తాత్కాలికంగా మరమ్మతులు చేయాలంటే కిలోమీటరుకు రూ.లక్ష చొప్పున రూ.2.80 కోట్లు అవసరమవుతాయని చెబుతున్నారు. ఇవే రోడ్లను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలంటే రూ.250 కోట్లు అవసరమని పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్‌ విభాగానికి సంబంధించి 50 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. వీటిని పునరుద్ధరించాలంటే రూ.9 కోట్లు అవసరమని అంచనా వేశారు. తాత్కాలిక మరమ్మతులు చేయడానికి రూ.3 కోట్లు, అనంతరం శాశ్వత ప్రాతిపదికన రోడ్లు వేసేందుకు రూ.6 కోట్లు అవసరమవుతాయని చెబుతున్నారు. 

 

రైతుల్లో ఆందోళన

మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే చాలాచోట్ల పంటలు నీటిలో నానుతున్నాయి, కొన్నిచోట్ల పంటలు కొట్టుకుపోవడంతోపాటు ఇసుక మేటలు వేశాయి. ఇంకా భారీ వర్షాలు పడితే పంటలు పూర్తిగా దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

 
Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top