విద్వేషమే భాషగా..


సంపాదకీయం

 

 వానాకాలం వచ్చేసరికి కప్పల బెకబెకలు వినిపించినట్టు ఎన్నికల సీజన్‌లో నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు హోరెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఎన్ని హెచ్చరికలు చేసినా లక్ష్యపెడుతున్న దాఖలాలు కనబడవు. దొరికిపోయిన నాయకులు తామన్న దానిలో తప్పేమున్నదని లేదా అననేలేదని దబాయిస్తుంటే... రోజుకొకరు కొత్తగా ఆ జాబితాలో వచ్చి చేరుతున్నారు. పర్యవసానాలు ఏమైనాగానీ మతం పేరునో, ప్రాంతంపేరునో ఓటర్లను రెచ్చగొట్టాలి... తాము అత్యధిక మెజారిటీతో నెగ్గి అందలాలు అధిరోహించి తరించాలన్నది ఇలాంటి నేతల లక్ష్యంగా కనబడుతున్నది. ముజఫర్‌నగర్ మత విద్వేషాలతో నెత్తురోడి, ఈనాటికీ వేలాదిమంది సహాయ శిబిరాల్లో చస్తూ బతుకుతూ కాలం వెళ్లదీస్తుంటే బీజేపీ నేత అమిత్ షా ఆ ప్రాంతానికెళ్లి అక్కడి జాట్ కులస్తులను ఉద్రేకపరుస్తూ మాట్లాడతారు. ‘ఇది పగ, పరువుకు సంబంధించిన అంశం.



నిద్రాహారాలు లేకుండా బతకొచ్చు. కానీ, అవమానానికి గురైతే బతకలేం. అందువల్లే ప్రతీకారం తీర్చుకోవాల’ంటూ రెచ్చగొడతారు. ‘కార్గిల్ యుద్ధంలో దేశం విజయం సాధించిందంటే అందుకు కారణం హిందూ సైనికులు కాదు...ముస్లిం జవాన్లే’నని ఎస్పీ నేత ఆజంఖాన్ మరోచోట మాట్లాడతారు. ‘హిందువులు నివసించే ప్రాంతాల్లో ముస్లింలు ఆస్తులు కొనుగోలు చేయకుండా నిరోధించాలి. ఇలా కొనుగోలు చేయడానికి ప్రయత్నించేవారిని రాళ్లతో, టైర్లతో, టమాటాలతో ఎదుర్కోండి’ అని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా పిలుపునిస్తారు. ‘మోడీకి ఓటేయనివారు పాకిస్థాన్‌కు పోవాలి. అలాంటివారిని ద్రోహులుగా పరిగణించాలి’అని బీజేపీ బీహార్ నేత గిరిరాజ్ సింగ్ చెబుతారు. ‘మోడీని ఖండఖండాలుగా నరుకుతాన’ని యూపీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి బీరాలు పోతాడు. ఈ జాడ్యం బీజేపీ, కాంగ్రెస్, ఎస్‌పీలాంటి పార్టీలకే కాదు...ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కూడా సోకినట్టు కనబడుతోంది. ఆ పార్టీ నాయకురాలు షాజియా ఇల్మీ ఇంకో అడుగు ముందుకేశారు. ‘ముస్లింలు ప్రతిసారీ సెక్యులర్‌గా ఉండిపోతున్నారు. తమకు నచ్చిన పార్టీకి, నాయకులకు ఓటేస్తున్నారు. ఈసారి అలా కాదు...వారు కూడా మతతత్వవాదులుగా మారాలి. తమ మతంవారికే ఓటేయాలి’ అని నూరిపోయడానికి ప్రయత్నిస్తూ వీడియోకు చిక్కారు. తాను ముస్లిం గనుక, పోటీలో ఉన్నాను గనుక తనకు ఓటేయమని చెప్పడం ఆమె ఉద్దేశం కావొచ్చు.



ఇప్పుడున్న పార్టీలన్నీ అధికారం కోసం నానా గడ్డీ కరుస్తున్నాయని, తాము వారందరికీ భిన్నంగా ఉంటామని హామీ ఇచ్చిన ఆప్ సైతం ఇలాంటి ధోరణుల్లోనే కొట్టుకుపోతున్నదని ఆమె ప్రసంగాన్ని గమనిస్తే అర్ధమవుతుంది.షాజియా మాటలతో విభేదిస్తున్నామని చెప్పిన ఆప్ ఆమెపై చర్య మాత్రం తీసుకోబోమని చెప్పింది. ఈ ప్రసంగాలన్నిటికీ వీడియో ఆధారాలున్నాయి. అవి యూట్యూబ్ వంటి మాధ్యమంలో ఎప్పటికప్పుడు అందుబాటులోకొస్తున్నాయి. అయినా కొందరు నేతలు తమ గొంతును అనుకరించి విషయాన్ని మార్చేశారని ఆరోపిస్తున్నారు. మరికొందరు ‘అందులో తప్పేముంద’ని దబాయిస్తున్నారు. ఇంకొందరు తమ మాటల్లోని అంతరార్ధం వేరని సమర్ధించుకునే ప్రయత్నంచేస్తున్నారు.

 

ఇలాంటి ప్రసంగాలు తన దృష్టికొచ్చినప్పుడు ఎన్నికల సంఘం స్పందిస్తున్నది. విద్వేషాన్ని రెచ్చగొడుతున్న నేతలకు నోటీసులు జారీచేసి సంజాయిషీ కోరుతున్నది. వారు ఇచ్చే జవాబు తర్వాత ఒక హెచ్చరికలాంటిది చేసి అక్కడితో ఆ వ్యవహారానికి ముగింపు పలుకుతున్నది. మరోపక్క ఆ తరహా నేతలపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలవుతున్నాయి. నేర శిక్షాస్మృతికింద కేసులు నడుస్తున్నాయి. ఎన్నో ఏళ్లు గడిచాక చివరకు అలాంటి కేసులు వీగిపోతున్నాయి. బహుశా అందువల్లే కావొచ్చు... కొందరు ఏం మాట్లాడేందుకైనా జంకడం లేదు. ఏమవుతుందిలే అనే భరోసాతో ఉంటున్నారు. ఈ పరిస్థితి మరికొందరు నాయకులకు ప్రేరణనిస్తున్నది. తాను మాట్లాడినదానిలో తప్పేమున్నదని షాజియా ఇల్మీ అనడం ఇందుకే. ఎన్నికల నియమావళికి చట్టబద్ధత ఉన్నట్టయితే, ఎన్నికల సంఘం వెనువెంటనే చర్య తీసుకోగలిగితే ఈ పరిస్థితి ఉండదు.



 అసలు ఇలా విద్వేషపూరిత ప్రసంగాలు చేసే నేతలపై చర్య తీసుకునేందుకు రాజ్యాంగంలోని 324వ అధికరణ ఎన్నికల సంఘానికి అధికారమిస్తున్నది. ఈ అధికరణకింద సంబంధిత పార్టీకి ఉండే జాతీయ పార్టీ హోదాను రద్దు చేయడం లేదా దాని గుర్తింపును రద్దుచేయడంవంటి చర్యలు తీసుకోవచ్చు. కానీ, ఇంతవరకూ ఎన్నికల సంఘం ఈ అధికారాన్ని వినియోగించలేదు. మరోపక్క ఈ తరహా ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునో చెప్పమని ఈమధ్యే లా కమిషన్‌ను సుప్రీంకోర్టు కోరింది. భిన్న మతాలు, కులాలు ఉన్న మన దేశంలో ఈ విద్వేషపూరిత ప్రసంగాలు ఎంతటి చేటు తీసుకురాగలవో నిరూపించడానికి ఎన్నెన్నో ఉదంతాలున్నాయి. ఈ అనుభవాల దృష్ట్యా నైనా కదలిక రావాలి. విద్వేషాలను, ఉద్రేకాలను రెచ్చగొడుతున్నవారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఈ విషయంలో ఇక ఉపేక్షించడం మంచిది కాదు.



పార్టీలన్నీ నోరు పారేసుకునే అలవాటున్న నేతలను గుర్తించి  నియంత్రించాలి. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన వెంటనే ఆ మేరకు ప్రతి పార్టీ హామీ పత్రాన్ని అందజేసేవిధంగా నిబంధన విధించాలి. ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘన జరిగినా ఎన్నికల సంఘం కఠిన చర్యకు పూనుకోవాలి. ప్రజలు సైతం వదరుబోతు నాయకులను, పార్టీలనూ తిరస్కరించేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. అప్పుడు మాత్రమే విద్వేష ప్రసం గాలను అదుపుచేయడం సాధ్యమవుతుంది. ప్రశాంత వాతావరణాన్ని ధ్వంసంచేస్తున్నవారినుంచి సమాజానికి రక్షణ లభిస్తుంది.

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top