ఒక పెంకుటిల్లు....

ఒక పెంకుటిల్లు.... - Sakshi

 గుడిసె ఉంటే నష్టం లేదు. కలో గంజో. రేషన్ బియ్యమో. ఉపాధి హామీ 

 పథకమో. ఉంటే సరే. లేకపోయినా సరే. అడిగేవారే లేరు. బంగ్లా! 

 అయ్య బాబోయ్. నౌకర్లు చాకర్లు కార్లు కారిడార్లు కరెన్సీ నోట్లు డాగ్స్ గేట్స్ గూర్ఖాస్. అడిగేవారే లేరు. హూ డేర్స్!

 

 కాని ఈ పెంకుటిల్లు ఉందే!

 ఏం వొదినా పిల్లకు ఇంకా పెళ్లి చేయలేదేం!

 ఏం బావగారూ అబ్బాయికి ఇంకా ఉద్యోగం పడలేదా.

 ఏవయ్యా సుబ్బారావ్. అమ్మను ఆస్పత్రిలో చూపించకపోతే ఎలాగయ్యా?

 ఏమమ్మా మహలక్ష్మమ్మ... కోడల్ని అలా రాచి రంపాన పెట్టకపోతే నాల్రోజులు పుట్టింటికి పంపొచ్చు కదా.

 కెమెరాలు పెట్టినట్టే. గేట్లో. వాకిలిలో. హాలులో. పెరట్లో. అందరికీ అన్ని తెలిసిపోతాయి. అందరికీ అన్నీ కావాలి. అందరూ అన్నింటి మీదా తీర్పు చెప్తారు. సమాజం అంటే ఇంకేమిటి? ఈ పేదోళ్లు? కాదు. ఈ డబ్బున్నోళ్లు? కానే కాదు.

 

 సమాజం అంటే ఈ దేశంలో అచ్చంగా మధ్యతరగతి.

 నలుగురూ ఏమైనా అంటారు... అనంటే మధ్యతరగతిని చూసి 

 మధ్యతరగతివారు ఏమైనా అంటారనే.

 నలుగురిలో పరువు పోవడం అంటే మధ్యతరగతి వారి పరువు మధ్య

 తరగతివారి మధ్యన పోవడం అనే.

 

 నలుగురూ అంటే ఒక పెంకుటిల్లు.

 నలుగురూ అంటే ఇప్పుడు బహుశా ఒక టూ బెడ్‌రూమ్ ఫ్లాట్. కథ ఏం మారలేదు. కాకుంటే అప్పట్లో అందరూ కలిసి ఒక చూరు కింద ఉండేవాళ్లు. ఇప్పుడు? కొడుకు కోడలు పట్నంలో. తల్లిదండ్రులు ఊళ్లో. తమ్ముడు ఇంకో చోట. చెల్లెలు మరెక్కడో.

 

 కాని కథ మారిందా?

 అన్నయ్యా... బావగారి ఉద్యోగం పోయింది ఒక పదివేలు సర్దు. ఏరా... డాక్టర్లు ఆపరేషన్ అంటున్నారు ఏం చేస్తావ్? చెల్లెలి పెళ్లి బాధ్యతే లేనట్టుగా ఎవర్నో చేసుకుంటే సరా... ఇప్పుడెలా? అవే కథలు. గతంలో రెండు మూడు వేలకు ప్రాణాలు లేచిపోయేవి. కుటుంబాలు కూలిపోయేవి. మనుషులు శలభాల్లా మాడిపోయేవారు. ఇప్పుడు- ఒక రెండు మూడు లక్షల మొత్తం ఒక మధ్యతరగతి కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయగలదు. పేకమేడలా కూల్చేయగలదు. ఒక్క కాలేజీ ఫీజు చాలు ఒక తండ్రిని బికారిని చేయడానికి. నన్ను చదివించలేనివాడివి ఎందుకు కన్నావు నాన్నా... కొడుకు ఎస్‌ఎంఎస్ పెడితే చాల్దూ... 

 మోసుకెళ్లడానికి ఒక ఒన్నాట్ ఎయిట్.

 

 కొమ్మూరి వేణుగోపాలరావు ‘పెంకుటిల్లు’ నవల 1956లో వచ్చింది. మధ్యతరగతి జీవితాన్ని చూసి చూసి, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాల్ని కాచి వడపోసి, మధ్యతరగతి బాదరబందీలతో వేగి వేగి, మధ్యతరగతి జీవితాల్లోని కాసిన్ని వెసులుబాటుల్ని- చిర్నవుల్ని- దేవుడు కరుణిస్తే కాసింత కోలుకోవటాలనీ- చూసి చూసి ఆయన రాసిన నవల ఇది. ఇంతకీ ఈ నవలలో ఏముంది? అబ్బ. చెప్పాలంటే దుఃఖం వస్తుంది. కాసింత వయసు వచ్చినవారికి బాల్యం అంతా కళ్ల ముందు తిరుగుతుంది. కాసింత టౌన్లలో గడిపినవారికి తాము నివసించిన వీధో, తాము చూసిన పక్కిల్లో, తమకు తారసపడిన కుటుంబమో, తమ మేనమామో, అన్నింటికి మించి తమ ఇల్లు... అవును... తమ పెంకుటిల్లే గుర్తుకు వస్తుంది.

 

 పనేం లేని నాన్న. ఆయనకు అణకువగా ఉండే అమ్మ. ఇంటి బాధ్యతను నెత్తిన  పెట్టుకున్న బాధ్యత గలిగిన అన్న. అన్నీ తెలిసి సహనంగా అందంగా ఆదరువుగా ఇంటికి ధైర్యలక్ష్మిగా ఉండే (పెళ్లికాని) చెల్లెలు. ఒక చిన్న తమ్ముడు. కొన్ని బాకీలు. రెండు కుర్చీలు. ఒక ముసలామె. చేదబావి. ఆ పూట గడిచి. గుట్టుగా బతుకుదామనుకొని. కాని డబ్బు కష్టాలు. జబ్బులనీ పెళ్ళిళ్లనీ ప్రమాదాలనీ... ఒక తరం అలా అలా బతికింది అనుకుంటే ఇంకో తరం చతికిల పడుతుంది. ఇంకో తరం కోలుకుంది కదా 

 అనుకుంటే ఆ పై తరం. అలాంటి కథే ఇది.

 

 కాని కొమ్మూరి వేణుగోపాలరావు గట్టిగా నమ్మిన విషయం ఒకటి ఉంది. కష్టపడాలి. రికామీగా ఉండరాదు. బాధ్యతల నుంచి పారిపోరాదు. పరిస్థితులకు దాసోహం అనరాదు. కష్టం ఒక్కటే, జాగ్రత్త ఒక్కటే, బాధ్యత ఒక్కటే మధ్యతరగతిని కొద్దో గొప్పో కష్టాల నుంచి దూరం పెడుతుంది. పెంకుటిళ్లను కాపాడుతుంది.

 

  ఆయన గ్రహించిన మరో విషయం ఉంది. మధ్యతరగతి వాళ్లు 

 అవినీతి చేయక్కర్లేదు. జరిగిన అవినీతిని కప్పెడితే చాలు. తప్పు చేయక్కర్లేదు. తప్పును చూసీ చూడనట్టు ఉంటే చాలు. బలహీనతలను అప్రయోకత్వాలను ఒకరు కాకపోయినా మరొకరు కాచుకున్నా చాలు. ఏదో గడిచిపోతుంది. ఏం చేస్తాం మరి చాలీచాలని బతుకు. ఈ బతుకులో ఇంతకు మించి తెగించలేము.

ఇది ఎంత శక్తిమంతమైన నవల అంటే ఇది చదువుతున్నంత సేపూ ఇందులోని జీవితాన్ని మనం జీవిస్తాం. ఇందులోని పాత్రలు చిదంబరం, శారదాంబ, నారాయణ, ప్రకాశరావు, రాధ, శకుంతల, చిన్న తమ్ముడు వాసు... వీళ్లందరి జీవితాల్లో జరిగే ఘటనలు కొన్ని లిప్తలపాటైనా మన ఊహాలోకంలో మన అనుభూతిలోకి వస్తాయి. సానుభూతి కలుగుతుంది. నిస్సహాయంగా అనిపిస్తుంది. వాళ్లు కొంచెం బాగుపడే పరిస్థితి వస్తే అమ్మయ్య అనిపిస్తుంది.

 

 ఈ నవల మొదలులో ఇంటి ముంగిట్లో చాలా చెత్త ఉందని చెప్తాడు రచయిత. ఆ చెత్తను తొలగించే శ్రద్ధ ఎవరికీ లేదు. (ఆనాడు) మధ్యతరగతి బలం దాని సంఖ్యే. 

 నలుగురూ నాలుగు చేతులేస్తే ఆ చెత్త పోతుంది. నలుగురూ నాలుగు చక్రాలుగా మారితే ఇంటి బండి నడుస్తుంది. అది ముఖ్యం. ఆ ఇల్లు అలా నిలబడి ఉండటం ముఖ్యం. ఉన్న పెంకుటిల్లునో, ఏదో ఒక నీడనో, రాజీవ్ స్వగృహనో, సెకండ్ హ్యాండ్ టూ బెడ్రూమ్ ఫ్లాట్‌నో పొందాలని వెంపర్లాడే మధ్యతరగతి కాంక్ష ఉందే- అది ఆ నవలలో ఉండే మనుషులకీ ఈనాటి మనుషులకీ మారలేదు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ‘పెంకుటిల్లు’ నవలలో పొలాన్నయినా అమ్ముకున్నారుగాని ఇంటిని మాత్రం అమ్ముకోలేదు.

 ఎందుకంటే మధ్యతరగతి వారు ముఖం దాచుకోవడానికి ఒక ఇల్లు అవసరం.

 

 ఆ ఇల్లే గనక లేకపోతే వారి బతుకు నరకం.

 టైమ్ మిషన్‌లో కూచుని పాతరోజుల్లో ప్రయాణించాలనుకునేవారు ఈ నవలను చదివి బయటపడటానికి ఒకటి రెండు రోజులు పడుతుంది. కొంత విస్తృతి ఉన్నా, కొంత పధకం ప్రకారం గమనం లేకున్నా, శరత్ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా ఇది అసలు సిసలు తెలుగు నవలే!

 మధ్యతరగతి వాళ్లది అని చెప్పుకోవడానికి ఒకే ఒక మంచి నవల!

 చెక్కు చెదరని పాత కట్టుబడి!
Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top