ట్రంప్‌కు భంగపాటు

ట్రంప్‌కు భంగపాటు


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని సాధించేందుకు తోడ్పడిన వ్యూహమే ట్రంప్‌కు ఇప్పుడు శాపంగా మారినట్టుంది. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌తో మంగళవారం జరిగిన తొలి సంవాదంలో ఆయన ఘోరంగా విఫల మయ్యారు. ప్రారంభంలో చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా ఉన్నట్టు కనబడిన ట్రంప్... కాసేపటికే చెప్పదల్చుకున్నదేమిటో, చెబుతున్నదేమిటో తెలియని అయో మయ స్థితికి చేరుకున్నారు.

 

 అసహనంతో, ఉద్రేకంతో ఊగిపోయారు. దాదాపు ఏడాదిపాటు పార్టీలో ప్రత్యర్థులను నోర్మూయించిన వ్యక్తే... మెజారిటీ ప్రతినిధుల అభిమానాన్ని సంపాదించిన వ్యక్తే ఇప్పుడు పేలవంగా మిగిలిపోవడం తొలి రౌండ్ చర్చల్లో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అమెరికా ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య మూడు దఫాలు సాగే సంవాదాలకు ఎంతో ప్రాముఖ్యముం  టుంది. మొదటి, చివరి రౌండ్లలో అధ్యక్ష అభ్యర్థులు, రెండో రౌండ్‌లో ఉపాధ్యక్ష అభ్యర్థులు చర్చల్లో పాల్గొంటారు. వాగ్యుద్ధాలు సాగుతాయి. పక్కా సమాచారంతో, తర్కంతో వెళ్లి ప్రత్యర్థిని గుక్క తిప్పుకోకుండా చేయడానికి అభ్యర్థులు ప్రయ  త్నిస్తారు.

 

 ఏ దేశంలో ఎన్నికలైనా అక్కడి ఆర్ధిక, రాజకీయ సమస్యల చుట్టూ తిరుగుతాయి. నిరుద్యోగం, అధిక ధరలు, సంక్షేమంలాంటి అంశాలకే అవి పరిమి తమవుతాయి. అమెరికాలో కూడా ఆంతరంగిక సమస్యలు ప్రస్తావనకు రావడం, వాటిపట్ల ఆయా పార్టీల వైఖరులపై విమర్శలు, సమర్థనలు ఉండటం సాధా రణమే. అయితే అది అక్కడితో ఆగదు. ప్రపంచం బాధ తన బాధ అనుకోవడం అమెరికాకు రివాజు. అందుకే ప్రపంచ పటంలోని మారుమూల దేశాలు, వాటిపట్ల అధికార పక్షం సాఫల్య వైఫల్యాలు ఈ చర్చల్లోకి చొరబడతాయి. ప్రపంచ భద్రత తన భుజస్కంధాలపై ఉన్నదని ఆ దేశం నమ్మడమే ఇందుకు కారణం.

 

 దేశాధ్యక్ష ఎన్నికల్లో తాము ఏ వైఖరి తీసుకోవాలో, ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవడానికి ఈ చర్చలు పౌరులకు ఉపయోగపడతాయి. ప్రధానంగా అధ్యక్ష అభ్యర్థుల మధ్య సాగే చర్చల్ని మూడు నుంచి ఏడు కోట్లమంది పౌరులు వీక్షిస్తారని ఒక అంచనా. ఈసారి వీక్షకుల సంఖ్య పది కోట్లకు చేరిందని చెబుతున్నారు. అయితే ఈ చర్చల అనంతరం ప్రకటించే ఫలితాలే ఎన్నికల్లో కూడా ప్రతిఫలిస్తాయని చెప్పలేం. అలాగే మొదటి రౌండ్ తరహా ఫలితాలే మిగిలిన రెండు రౌండ్ల లోనూ ఉంటాయని చెప్పడం కూడా కష్టమే. ఇరాక్‌పై దురాక్రమణకు దిగి దేశాన్ని అన్నివిధాలా దివాలా తీయించిన రిపబ్లికన్ పార్టీని 2008 ఎన్నికల్లో ఒబామా సునాయాసంగా ఓడించగలిగారు. ఆయన నల్లజాతీయుడంటూ రిపబ్లికన్లు జాత్య హంకార ధోరణులను రెచ్చగొట్టినా ఫలితం లేకపోయింది.

 

 ఆ ఎన్నికకు ముందు జరిగిన చర్చల్లో ఒబామా నాయకత్వ పటిమ వెల్లడైంది. ఆయన ముందు రిపబ్లికన్ అభ్యర్థి జాన్ మెకైన్ వెలవెలబోయారు. 2012లో రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినప్పుడు ఒబామాకు కాస్త కష్టమే అయింది. మొదటి రౌండ్ బహిరంగ చర్చలో ఆయన రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీని అధిగమించలేకపోయారు. ఒబామాకు 43 శాతంమంది మద్దతు లభిస్తే రోమ్నీవైపు 49 శాతంమంది మొగ్గు చూపారు. దాన్నుంచి కోలుకుని మిగిలిన రెండు రౌండ్లలోనూ ఒబామా, ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థి జోయ్ బిడెన్‌లిద్దరూ విజేతలుగా నిలిచారు.

 

  ఈసారి ఎన్నికలకు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడలేని ఆకర్షణనూ తీసుకొచ్చారు. తాను ప్రత్యర్థులపై పిడుగులు కురిపిస్తున్నానని, కోలుకోలేని దెబ్బతీస్తున్నానని ఆయన అనుకున్నారు. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు సైతం ఆయనైతేనే విజయాన్ని ఖరారు చేస్తారన్న అతి విశ్వాసానికి పోయారు. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదని ఇప్పుడు తొలి రౌండ్ చర్చలు పూర్తయ్యాక వెలువడిన ఫలితాలు చెబుతున్నాయి. చర్చల తీరును చూసిన విశ్లేషకులు ట్రంప్ ఎన్నిసార్లు హిల్లరీ మాటలకు అడ్డం వచ్చారో, ఆమె అలా వారించిన సందర్భాలెన్నో లెక్కలుగట్టారు. ట్రంప్ 51సార్లు, హిల్లరీ కేవలం 17సార్లు అలా చేశారని తేల్చారు.

 

 అయితే మహిళ కావడం వల్లనేమో... హిల్లరీ చాలా సున్నితంగా ఆ పని చేశారు. ట్రంప్ అబద్ధా లను, ముఖ్యంగా మహిళల విషయంలో ఆయన చేసిన దుర్వ్యాఖ్యానాలను గుర్తు చేయడానికే ఆమె జోక్యం చేసుకున్నారు. పర్యావరణం ప్రమాదంలో పడిందనడం వెనక చైనా కుట్ర ఉన్నదని తాను ఎన్నడూ అనలేదని... మహిళలను కించపరుస్తూ మాట్లాడలేదని ట్రంప్ చెప్పడం అందరినీ నిర్ఘాంతపరిచింది. కెమెరాల సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు అనలేదని బుకాయించడం ట్రంప్‌లోని భీరువును బయటపెట్టింది. ట్రంప్ తీవ్ర స్వరంతో విరుచుకుపడటాన్ని, వెనకా ముందూ చూడకుండా తోచినట్టు మాట్లాడటాన్ని హిల్లరీ చాలాసార్లు చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. తన ప్రసంగానికి అడ్డొస్తున్న ట్రంప్ కోసం ఆమె కొన్నిసార్లు మాట్లాడటం ఆపేశారు. ఇలా అడ్డుతగలడం సరికాదని సమన్వయకర్త పలుమార్లు ట్రంప్‌కు గుర్తు చేయాల్సివచ్చింది.

 

 తనను తాను సంబాళించుకోవడానికి, పద్ధతిగా మెలగడానికి ట్రంప్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. మహిళలపై ఆధిపత్యం చలాయించాలన్న మగ మన స్తత్వమే ఈ మాదిరి ధోరణికి కారణమని చర్చకు ముందు కొందరు మానసిక శాస్త్రవేత్తలు తేల్చారు. 2000 సంవత్సరంలో హిల్లరీ సెనేట్‌కు పోటీ పడినప్పుడు ఆమె ప్రత్యర్థి రిక్ లజియో మాట్లాడిన తీరును సైతం వారు ప్రస్తావించారు. ఇది అతని ఓటమికి కారణమైందని కూడా గుర్తుచేశారు. కానీ ఇలాంటి అభిప్రాయాలు సైతం ట్రంప్‌ను మార్చలేకపోయాయి.

 

 ఆయన తనకలవాటైన రీతిలో చెలరేగి పోయారు. ఫలితంగా వైఫల్యం మూటగట్టుకున్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్న ప్పుడు హిల్లరీ తీసుకున్న నిర్ణయాలను, వివిధ అంశాల విషయంలో ఆమె అనుసరించిన విధానాలను విమర్శించడానికి, లోపాలను ఎత్తి చూపడానికి అవ కాశం ఉన్నా ట్రంప్ తన మరుగుజ్జు మనస్తత్వంతో వాటి జోలికి పోలేకపోయారు. కనీసం ఇప్పుడైనా ట్రంప్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించకపోతే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లకు వరసగా మూడోసారి కూడా భంగపాటు తప్పదని తొలి రౌండ్ చర్చలు గమనిస్తే అర్ధమవుతుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top