‘నంబర్ వన్’ సైనా!

సైనా నెహ్వాల్ - Sakshi


సంపాదకీయం



 లక్ష్యంపై గురి చెదరనీకుండా దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే ఎలాంటి విజయమై నా పాదాక్రాంతమవుతుందని ప్రపంచ బాడ్మింటన్‌లో నంబర్ వన్ స్థానం సాధిం చిన సైనా నెహ్వాల్ నిరూపించింది. భారత బాడ్మింటన్‌లో సైనా ఇప్పటికే అనేక ‘తొలి రికార్డుల’ను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ పతకం దగ్గరనుంచి సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్స్ వరకూ ఆమె ఖాతాలో ఉన్న ఘనతలు ఎన్నెన్నో! ఇప్పుడు సాధించిన ‘నంబర్ వన్’ ఆమె కీర్తి కిరీటంలో కలికితురాయి. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం మినహా సైనా సాధించాల్సిన ప్రత్యేక ఘనతలు లేవనే చెప్పాలి.



 గత పదేళ్లలో బ్యాడ్మింటన్ అంతా చైనా చుట్టూనే తిరుగుతూ ఉంది. పురుషుల విభాగంలో లీ చోంగ్ వీ రూపంలో ఓ మలేసియా క్రీడాకారుడు చైనాకు చెక్ పెడుతు న్నా... మహిళల విభాగంలో మాత్రం అలాంటి తిరుగులేని స్టార్ రాలేదు. క్రమంగా ఈ పరిస్థితిలో సైనా మార్పు తీసుకొచ్చింది. చైనీయులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఓపెన్ టైటిల్‌ను వారి గడ్డపైనే గెలిచి వారికి షాకిచ్చింది. సైనా గెలుపును ఇప్పటికీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడిక నంబర్‌వన్ ర్యాంక్‌నూ కైవసం చేసుకుంది.  ఈ పరిణామం చైనీయులకు ఆందోళన కలిగించేదే. ఈ ఏడాది చాలా టోర్నీలు ఉన్నాయి. సైనాను ఓడించడానికి చైనీయులు కచ్చితంగా మరింత మెరు గ్గా సన్నద్ధమై వస్తారు. వాటి సంగతలా ఉంచి సైనా విశిష్టత గురించి చెప్పుకోవాలి. చైనా క్రీడాకారిణులు బ్యాడ్మింటన్‌లో కొన్ని ప్రమాణాలు నెలకొల్పారు. వాటిని క్రమంగా అందుకుంటూనే భారత బ్యాడ్మింటన్‌లో సైనా కొత్త ప్రమాణాలను నెల కొల్పింది. ఒకప్పటి పరిస్థితి ఎలా ఉన్నా... ప్రస్తుతం భారత్‌లో మహిళల బ్యాడ్మిం టన్ మంచి జోరు మీదుంది. సింధుతో పాటు రితూపర్ణదాస్, రుత్విక శివాని లాంటి యువ క్రీడాకారిణులు అందమైన భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ సైనా ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తూ ప్రమాణాలను నిర్దేశించింది. చైనా ఓపెన్, ఒలింపిక్ పతకం, ప్రపంచ నంబర్‌వన్... ఇవన్నీ సాధించడం ద్వారా వీరికి లక్ష్య నిర్దేశం చేసింది.



 భారత బ్యాడ్మింటన్‌లో వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. సైనా చుట్టూ కూడా ఇవి ముసురుకున్నాయి. అయితే తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ గోడకు కొట్టిన బంతిలా మరింత వేగంగా ఎదుగుతూ వస్తోంది. గోపీచంద్ శిక్షణలో అంతర్జాతీయ యవనికపై మెరిసిన సైనా... నిరుడు విమల్ కుమార్ దగ్గర శిక్షణ కోసం బెంగళూ రుకు వెళ్లింది. అక్కడే అప్పటి నుంచి శిక్షణ కొనసాగిస్తోంది. అయితే దీన్ని కూడా బ్యాడ్మింటన్ ప్రపంచం భూతద్దంలో చూసింది. గోపీతో విభేదాల వల్లే సైనా బెంగ ళూరుకు వెళ్లిపోయిందనే ప్రచారం ఉంది. మెరుగైన శిక్షణ కోసం వెళ్లాననడం తప్ప సైనా ఈ వదంతులకు జవాబివ్వలేదు. ఆమె అటు వెళ్లాక భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)లోని కీలక వ్యక్తులకు సైనా దూరమైనట్లు కనిపించింది. ఇటీవల విజయవాడలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో సైనా ఆడకపోవడం వివాదానికి దారి తీసింది. నిజానికి సైనా సీనియర్ నేషనల్స్ ఆడి ఐదారేళ్లయింది. ఓ స్థాయికి వెళ్లిన తర్వాత పెద్ద టోర్నీలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా నేషనల్స్‌ను పెద్ద క్రీడా కారులు పెద్దగా పట్టించుకోరు. అయితే ఈసారి సైనా మీద కోర్టుకెళతామని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. నిజానికి సైనా హైదరాబాద్ హబ్‌లోనే ఉండి ఉంటే ఈ బెదిరింపు వినిపించేది కాదేమో! ఇలాంటి వివాదాలను పట్టించుకోకుండా సైనా తన సత్తాను చూపింది.



  విమల్ కుమార్ దగ్గరకు వెళ్లాక సైనా ఆటతీరు కూడా మారింది. గతంతో పోలిస్తే ఆమె స్మాష్‌లలో వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ విషయంలో బాగా మెరుగైంది. అనుభవంతోపాటు సరైన మార్గనిర్దేశం ద్వారా ఇవన్నీ వస్తాయి. అదే సమయంలో తన వద్ద మరే స్టార్ ప్లేయర్ లేరు గనుక కోచ్ కూడా పూర్తి సమ యాన్ని సైనాకు కేటాయించగలుగుతున్నారు. గడ్డు పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం కోల్పో ని క్రీడాకారులు గొప్ప విజయాలు సాధిస్తారు. సైనా నెహ్వాల్ దీన్ని నిరూపించింది. నిజానికి ఈ ఏడాది క్రీడాకారులందరికీ అత్యంత కీలకం. వచ్చే ఏడాది జరిగే ‘రియో ఒలింపిక్స్’కు దీన్ని సన్నాహక సంవత్సరంగా క్రీడాకారులు పరిగణిస్తున్నారు. ఈసా రి సైనా కొత్త సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రి టైటిల్‌తో పాటు ఇండియా ఓపెన్ సూపర్‌సిరీస్ టైటిల్ గెలిచింది. ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది. దాదాపు తొమ్మిదేళ్లు సైనా పడ్డ కష్టానికి ఇది ప్రతిఫలం. ఇదే జోరును కొనసాగిస్తే ప్రపంచ చాంపియన్‌షిప్ విజయం కూడా కష్టమేం కాదు. అయితే సైనా నంబర్‌వన్ ర్యాంక్ రావడంలో చైనా క్రీడాకారిణుల పరోక్ష సాయం కూడా ఉంది. మొన్నటిదాకా ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న లీ జురెయ్ వరుసగా నాలుగు పెద్ద టోర్నీల్లో ఆడలేదు. ఇది కూడా సైనాకు కలిసొచ్చింది. ఇకముందు చైనీయులు మరింత బలంగా దూసుకొస్తారు. ఈ సవాల్‌కు ఆమె సిద్ధం కావాలి.



 ఇండియన్ ఓపెన్‌లో పూర్తి ఫిట్‌నెస్ లేకుండానే సైనా ఆడింది. గాయంతో ఇబ్బంది పడుతున్నా... ఈ టోర్నీలో విజయం ప్రస్తుతం సైనాకు అవసరం. నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోవడంతో పాటు... సొంతగడ్డపై జరిగే ఏకైక సూపర్ సిరీస్‌నూ ఒక్కసారి కూడా గెలవని లోటును తీర్చుకోవడం ఆమె లక్ష్యాలు. ఇండియన్ ఓపెన్‌తో ఆమె ఈ రెండు లక్ష్యాలనూ ఒకేసారి సాధించింది. ఇండియన్ ఓపెన్‌లో శ్రీకాంత్ విజయం గురించి కూడా చెప్పుకోవాలి. భారత్‌నుంచి ఏడాది కాలంగా పురుషుల విభాగంలో తను చాలా నిలకడగా ఆడుతున్నాడు. గత ఏడాది చైనా ఓపెన్‌లో లిన్‌డాన్‌పై విజయం సాధించిన ఈ యువ షట్లర్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. ఆల్ ఇంగ్లండ్ తొలి రౌండ్‌లో ఓడినా వెంటనే కోలుకుని స్విస్ ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. తాజాగా ఇండియన్ ఓపెన్‌లోనూ టైటిల్ సాధించి సీజన్‌లో రాబోయే టోర్నీలకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top