‘సంప్రదాయత’కు నోబెల్ పట్టం


మళ్లీ నోబెల్ బహుమతుల రుతువు వచ్చేసింది. ప్రపంచంలో భిన్నరంగాల్లో అత్యుత్తములను ఎంచి పురస్కారాలను ప్రకటించే ఈ ప్రక్రియ ఎప్పటిలానే వైద్య శాస్త్రంతో ప్రారంభమైంది. ఈసారి ముగ్గురు శాస్త్రవేత్తలు తు యుయు (చైనా), విలి యం కాంప్‌బెల్ (ఐర్లాండ్), సతోషి ఒమురా(జపాన్)లను ఉమ్మడిగా ఆ బహుమతికి ఎంపిక చేశారు. ఈ పురస్కారంతోపాటు నోబెల్ ఎంపిక కమిటీ ఇచ్చే 9.6 లక్షల డాలర్లలో సగభాగం మహిళా శాస్త్రవేత్త యుయు కూ, మిగిలిన సగభాగం మిగిలిన ఇద్దరు శాస్త్రవేత్తలకూ లభిస్తుందని కమిటీ ప్రకటించింది. ఈ ముగ్గురూ వైద్య శాస్త్రంలో చేసిన కృషీ... దాని ఫలితాలూ ఎన్నదగినవి. మానవాళికి పరాన్న జీవుల ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈ ముగ్గురూ కొత్త ఔషధాలను కనిపెట్టారు. ఇందువల్ల మలేరియా, ఫైలేరియా, రివర్ బ్ల్రైండ్‌నెస్ వంటి వ్యాధులను అరికట్టేందుకు వీలైంది. వారి పరిశోధన మూలాలు సంప్రదాయ విధానంలో ఉండటం గమనార్హమైన అంశం.

 

 మిగిలిన శాస్త్రాలకూ, వైద్య శాస్త్రానికీ మధ్య మౌలికంగా తేడా ఉంది. మిగిలిన శాస్త్రాల్లో ఏ అంశంపైన అయినా దాదాపు ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. కనీసం అనంతరకాలంలో జరిగే పరిశోధనల్లో కొత్త అంశాలు వెల్లడయ్యే వరకూ అప్పటికున్న నిర్ధారణలు కొనసాగుతాయి. వైద్య శాస్త్రంలో అలా కాదు. ఏక కాలంలో సమాంతరంగా వేర్వేరు స్రవంతులుంటాయి. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు అల్లోపతి వైద్యం ఆధునిక వైద్య విధానమై...శతాబ్దాలుగా జనావళిలో ప్రబలంగా ఉంటున్న సంప్రదాయ వైద్య విధానాలు, ఇతర చికిత్సా పద్ధతులు ‘ప్రత్యామ్నాయ విధానాలు’గా ముద్రేయించుకుని మిగిలిపోయాయి.

 

 ఇవన్నీ సమాంతరంగా కొనసాగుతున్నాయి. సంప్రదాయ వైద్య విధానాలను విస్మరించడంవల్ల అవి తగినంతగా ఎదగలేకపోయాయి. రోగాలను అదుపు చేయడంలో చురుకుదనమూ... శస్త్ర చికిత్సా విధానాలుండటం, నిరంతర పరిశోధనలు అల్లోపతి ప్రధాన స్రవంతి వైద్య విధానంగా మారడానికి దోహదపడ్డాయి. ఆ విధానంలో ఇమిడి ఉండే లాభార్జన కూడా దాని విస్తరణకు తోడ్పడింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వైద్య విధానాలు అల్లోపతి దెబ్బకు దాదాపు కొన ఊపిరితో మిగిలాయి. చైనా వైద్య విధానం, యునానీ, హోమియో, ఆయుర్వేదం వంటివి ఇంకా కనిపిస్తున్నాయిగానీ...శతాబ్దాలుగా పరంపరగా వస్తున్న రకరకాల చికిత్సా విధానాలు కనుమరుగవుతున్నాయి. ఇంట్లో దొరికే దినుసులతో, పెరట్లో లభించే మొక్కలు, పూవులు, చెట్ల ఆకులతో, బెరళ్లతో చేసే వైద్యం ఇప్పుడు తెలిసినవారెంతమంది? ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని ఆస్పత్రులు జనాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. అల్లోపతి వైద్యం అంగడి సరుకైంది. కొనుక్కోగలిగినవారికే ప్రాణాలు దక్కుతాయి.  

 

   ఇతర శాస్త్రాల్లా కాకుండా వైద్య శాస్త్రం నేరుగా మానవ శరీరంతోనూ, దానికొచ్చే రుగ్మతలతో వ్యవహరించేది కనుక ఆ శాస్త్రంతో మనుషులందరిదీ నిత్యానుబంధం. ఫలితంగా ప్రతివారికీ ఎంతోకొంత అనుభవ జ్ఞానం లభిస్తుంది. మిగిలిన శాస్త్రాల విషయంలో ఇది సాధ్యం కాదు. కానీ పరంపరగా వస్తున్న అనుభవ జ్ఞానాన్ని గుర్తించి, ఆదరించే పాలక వ్యవస్థలున్నప్పుడే అది మరింతగా రాణింపునకు వస్తుంది. యుయుకు అలాంటి ప్రోత్సాహం లభించింది. చైనాలో సాంస్కృతిక విప్లవం ఉధృతంగా సాగుతున్న ఆరో దశకం చివరిలో అప్పటి చైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ మావో జెడాంగ్ మలేరియా వ్యాధిని అరికట్టేందుకు నెలకొల్పిన పరిశోధనా ప్రాజెక్టులో పాలుపంచుకోవడంవల్లనే యుయు నోబెల్ పురస్కారానికి అర్హమైన వినూత్న ఆవిష్కరణ  చేయగలిగారు. ఆనాడు ఒకపక్క అమెరికా సేనలతో, మరోపక్క దక్షిణ వియత్నాం సేనలతో పోరాడుతున్న తమ సైన్యానికి మలేరియా పెను సమస్యగా మారిందని గుర్తించిన ఉత్తర వియత్నాం ప్రధాని హో చి మిన్...దాన్ని అరికట్టడానికి సాయం చేయమని మావోను అభ్యర్థించారట. ఫలితంగా ఆ ప్రాజెక్టు ఆవిర్భవించింది. ఈ ప్రాజెక్టులో రెండు విభాగాలున్నాయి.

 

 మలేరియాను అరికట్టేందుకు అప్పటికే వినియోగిస్తున్న రసాయనాలను మేళవించి కొత్త ఔషధాన్ని కనుగొనడానికి ఒక విభాగం... సంప్రదాయ వైద్య విధానాలపై దృష్టి నిలిపి, మూలికలతో ఔషధాన్ని రూపొందించే పనిలో మరో విభాగం నిమగ్నమయ్యాయి. యుయు నేతృత్వంలోని బృందం శతాబ్దాలుగా వాడుకలో ఉన్న 2,000 రకాల ఔషధ యోగాలను అధ్యయనం చేసి, 640 మూలికల లక్షణాలను జల్లెడపట్టి...క్రీస్తు పూర్వం 340 నాటి తాళపత్రాలను సైతం పరిశోధించి అత్యుత్తమమైన ఆర్టిమేసినిన్ అనే ఔషధాన్ని తయారుచేశారు. అప్పటికే క్లోరోక్విన్, క్వినైన్ వంటి మందులకు లొంగకుండా పోయిన మలేరియా కారక సూక్ష్మజీవి యుయు దెబ్బతో అదుపులోనికొచ్చింది. ఈ మాత్రం మనం చేయలేమా అని వందలాదిమంది శాస్త్రవేత్తలు వేలాది సింథటిక్ సమ్మేళనాలతో రాత్రింబగళ్లు ప్రయోగాలు చేసినా అవన్నీ వ్యర్థంగా మిగిలిపోయాయి. అచ్చం యుయు బృందం తరహాలోనే అమెరికా సాగించిన పరిశోధనలు దారీ తెన్నూ దొరక్క ఆగిపోయాయి. యుయు విశిష్టతేమిటో వీటినిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడామె ఆవిష్కరణ ఏటా లక్షలాదిమంది ప్రాణాలను కాపాడుతోంది. గత పదిహేనేళ్లలో మలేరియా మరణాలు 60 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది.

 

 పాత అంతా చెత్త అని కొట్టిపారేయని తత్వం ఒక కొత్త ఆవిష్కరణకు తావిచ్చింది. బహుశా దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించి విజయం సాధించిన కమ్యూనిస్టు పార్టీ పాలక వ్యవస్థగా ఉండకపోతే ఇది సాధ్యమయ్యేది కాదేమో! మన ఆయుర్వేదంలో, ఇతర మూలికా వైద్యాల్లో కూడా అపారమైన జ్ఞాన సంపద ఉంది. దాన్ని వెలికితీయగలిగితే, అందుకు అవసరమైన పరిశోధనలకు ప్రోత్సాహమిస్తే మెరుగైన, ప్రామాణికమైన ఔషధాలు అందుబాటులోకి వస్తాయి. యుయు సాధించిన నోబెల్ బహుమతి ఆ దిశగా ఆలోచించడానికి దోహదపడాలని ఆశిద్దాం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top