‘ప్రత్యామ్నాయం’లో బీటలు

‘ప్రత్యామ్నాయం’లో బీటలు - Sakshi


కేంద్రంలో అధికార పక్షమైన ఎన్డీయేకు బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడాలని ఆశించేవారికి కీలక రాష్ట్రాలైన యూపీ, బీహార్‌లలో వారం రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాలు నిరాశ కలిగిస్తాయి. అలాగే ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కిం చుకుని త్వరలో జరిగే పంజాబ్, గోవా ఎన్నికల్లో సత్తా చూపాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తీరు కూడా విస్మయపరుస్తుంది. గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పాలన సాగడానికి దోహదపడిన అంశాల వంటివే ఇప్పుడు ఎన్డీయేకు కూడా ఉప యోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. బిహార్‌లో నిరుడు నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమిని ఏర్పరిచి ఘన విజయం సాధించి ఎన్డీయేను ఖంగు తినిపించిన జనతాదళ్(యూ)-ఆర్జేడీల మధ్య పొరపొచ్చాలు బయల్దే రాయి.



వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ‘కుటుంబ పాలనే’ కొనసాగుతున్నా అక్కడ కూడా కుమ్ములాటలు తప్పలేదు. ఇక ఢిల్లీలో పాలన సాగిస్తున్న ఆప్... చికున్‌గున్యా విజృంభించి ఇప్పటికే 11మంది ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. వెను వెంటనే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాల్సిన ప్రభుత్వం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పైనా, కేంద్రంపైనా ఆరోపణలు చేసి చేతులు దులుపుకోవాలని చూసింది. అందరూ విమర్శించాక కదిలింది. అంతేకాదు... నైతిక వర్తనకు సంబం ధించి రోజుకో నేతపై వస్తున్న ఆరోపణలతో అది ఊపిరాడని స్థితిలో పడింది. మహిళలతో అభ్యంతరకర చిత్రాలు, అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు, లంచం తీసుకున్నారన్న నిందలు వరసగా బయటికొచ్చాయి. ఈ స్థితిలో పంజాబ్, గోవా ఎన్నికల్లో అది ఏమేరకు నెగ్గుకు రాగలదన్న సందేహాలు తలెత్తుతున్నాయి.



బిహార్‌కు సంబంధించి జేడీ(యూ)-ఆర్జేడీల మధ్య అంతర్గతంగా సాగుతున్న వివాదాలు ఆర్జేడీకి చెందిన మాజీ ఎంపీ షాబుద్దీన్ జైలు నుంచి విడుదల కావడంతో బహిరంగమయ్యాయి. నితీష్‌కుమార్ ‘తన సీఎం’ కాదంటూ షాబుద్దీన్ చేసిన వ్యాఖ్యలను లాలూ నిర్ద్వంద్వంగా ఖండించకపోవడంతో ఇది మొదలైంది.  ఇరు పార్టీల వైపునుంచి ఇతర నేతలు కూడా బహిరంగ ప్రకటనలు చేస్తుండటంతో ఇదింకా కొనసాగడం ఖాయమని అర్ధమవుతోంది. అంతా సర్దుకుంటుందని లాలూ చెబుతున్నా అదంత సులభమేమీ కాదు. బిహార్ రాజకీయాల్లో మొదటినుంచీ పరస్పరం కత్తులు నూరుకోవడంలో సిద్ధహస్తులైన నితీష్, లాలూ నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో  సన్నిహితులు కావడం, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అందరినీ దిగ్భ్రమపరిచింది. వారిద్దరూ తమ చెలిమి శాశ్వతమన్న అభిప్రాయాన్ని కలగ జేశారు. కానీ గత కొన్ని నెలలుగా ఆ రెండు పార్టీల మధ్యా చిన్నా చితకా అంశాల్లో విభేదాలు రావడాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. షాబుద్దీన్ ఆ పరిస్థితిని మరికాస్త తీవ్రం చేశారు.



ఒకప్పుడు అరాచకానికి ఆనవాలుగా పేరొందిన బిహార్... 2005లో నితీష్ ఏలుబడిలోకొచ్చాక అలాంటి నిందల్ని దాదాపు తుడిచేసుకో గలిగింది. అంతక్రితం మానవాభివృద్ధి సూచీలో ఎప్పుడూ అట్టడుగున ఉండే ఆ రాష్ట్రం చకచకా పుంజుకుంది. హత్యలతో, అవ్యవస్థతో ‘జంగిల్‌రాజ్’గా ఉండేది కాస్తా క్రమేపీ మెరుగైంది. నితీష్-లాలూ సన్నిహితమైనప్పుడు తిరిగి ‘జంగిల్‌రాజ్’ సాక్షాత్కారమవుతుందేమోనన్న అనుమానాలు చాలామందిలో వ్యక్తమయ్యాయి. నేరచరితగల చాలామంది నేతలు ఆర్జేడీలో ఉండటమే అందుకు కారణం. ఇప్పుడు నితీష్‌పై వ్యాఖ్యలు చేసిన షాబుద్దీన్‌పై దాదాపు 40 కేసులున్నాయి. వీటిల్లో చాలా భాగం కిడ్నాప్‌లు, హత్యలు, అక్రమ వసూళ్లు వగైరా కేసులే. షాబుద్దీన్ విడుదలైన మర్నాడే ఆయన ప్రధాన అనుచరుడిగా పేరున్న మహ్మద్ కైఫీ... లాలూ పెద్ద కుమారుడు, రాష్ట్ర ఆరోగ్యమంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌తో ఉన్న చిత్రాలు వెల్లడ య్యాయి. నేర చరితుడిగా పేరొందిన ఒక వ్యక్తి కారణంగా మహా కూటమికి పగుళ్లు వస్తున్నాయంటే... అది ఏ పునాదులపై ఉందో, ఎంత బలహీనంగా ఉందో అర్ధమ వుతుంది.



ఇద్దరు బద్ధ శత్రువుల చెలిమి బెడిసికొట్టడంవల్ల బిహార్ అలా ఉన్నదనుకుంటే కుటుంబ కుమ్ములాటలతో యూపీలో సమాజ్‌వాదీ నీరసిస్తున్నది. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు ఆయన బాబాయ్‌లతో ఏర్పడ్డ తగాదాలు ఇప్పుడు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అఖిలేష్‌తో బాబాయ్‌లు ఢీ అంటే ఢీ అనడం...వారికి ములాయం అండదండలుండటం ఇప్పుడు సమస్యగా మారింది. నిజానికిది కుటుంబ తగాదా కాదని, ‘బయటినుంచి’ వచ్చినవారివల్లే పొరపొచ్చాలు వస్తున్నా యని అఖిలేష్ అంటున్నారు. ఆ ‘బయటి’ వ్యక్తి వేరెవరో కాదు...ములాయం మిత్రుడు అమర్‌సింగ్. ఒకప్పుడు ములాయంకు ఎంతో సన్నిహితంగా మెలిగి పార్టీనుంచి కొన్నేళ్ల క్రితం వెళ్లిపోయిన అమర్‌సింగ్ ఈమధ్యే పార్టీలో చేరారు.



అప్పటినుంచీ కలహాలు ముదురుతున్నాయి. కుమారుడిపై ఆగ్రహించిన ములాయం ఆయన్ను పార్టీ అధ్యక్షుడిగా తొలగించి తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌కు అప్పగిస్తే...శివ్‌పాల్ వద్దనున్న కీలక శాఖలను అఖిలేష్ తప్పించారు. అందుకు నిరసనగా ఆయన మంత్రి పదవిని వదులుకున్నారు. యూపీలో కొంతకాలంగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ బలం పుంజుకోవడం కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే ముజఫర్‌నగర్ మారణకాండను ఆపడంలో, గోరక్షణ పేరుతో సాగుతున్న అరాచకాలను అడ్డుకోవడంలో వైఫల్యాలు మూటగట్టుకున్న అఖిలేష్ సర్కారును ఈ కుమ్ములాటలు మరింత బలహీనపరుస్తాయి.



కొన్నాళ్లక్రితం బీజేపీని దీటుగా ఎదుర్కొనగల శక్తులుగా, ప్రత్యామ్నాయంగా కనిపించిన ఈ పార్టీల నేతలు అనేకానేక సమస్యలతో, చిక్కుముళ్లతో సతమత మవుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే కోలుకోలేని స్థితిలో పడగా మిగిలిన పార్టీలు కూడా కొత్త కొత్త అవరోధాలు సృష్టించుకుంటూ అడుగు ముందుకేయలేక పోతున్నాయి. అక్కడక్కడ తలెత్తుతున్న సమస్యలతో సతమతమవుతున్న బీజేపీకి ఈ పరిణామాలు సహజంగానే అనుకూలంగా మారతాయి. ప్రజల విశ్వసనీయత కోల్పోయాక మిగిలేదేమీ ఉండదని ఈ పార్టీలు గుర్తించి దిద్దుబాటుకు సిద్ధపడక పోతే భవిష్యత్తు అగమ్యగోచరమే.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top