స్నేహంలో నూతనాధ్యాయం

నరేంద్ర మోదీ-బరాక్ ఒబామా - Sakshi


 అమెరికా అధ్యక్షుడు ఒబామా మూడురోజుల భారత పర్యటన ముగిసింది. విదేశాలకు వెళ్లినప్పుడు దేశం మొత్తం తన  పర్యటనపైనే దృష్టి పెట్టేలా... తన గురించే చర్చించుకునేలా చేసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటినుంచీ కృతకృత్యుల వుతున్నారు. ఇప్పుడు ఒబామా వంటి అగ్రరాజ్య అధినేత గణతంత్ర దినోత్సవానికి వచ్చిన సందర్భాన్ని సైతం మోదీ అదే స్థాయిలో ఉపయోగించుకున్నారు. జాతీయ మీడియా మొత్తం ఒబామా పర్యటన గురించే చర్చించేలా చేయగలిగారు. అయిదేళ్ల క్రితం నాటి ఒబామా పర్యటననూ, ప్రస్తుత పర్యటననూ పోల్చిచూస్తే ఈ వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నిజానికి ఆ సమయంలో ఒబామా అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీపడాలన్న సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడాయన వచ్చే ఏడాది ఆ పదవి నుంచి వైదొలగబోతున్నారు. అయినా సరే ఈ పర్యటనకొచ్చిన ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ పాలన సమయంలో పదేళ్లనాడు కుదిరిన పౌర అణు ఒప్పందం అతీ గతీ తేల్చకుండా పదవినుంచి తప్పుకున్నారన్న అపప్రద తనకు అంటకుండా చూసుకోవడం ఒబామాకు అవసరం. అదే సమయంలో భారత్‌లో తమ వ్యాపారాభివృద్ధికి దోహదపడ్డారని అమెరికన్ కార్పొరేట్ ప్రపంచం అనుకోవడం ముఖ్యం. ఈ పర్యటనద్వారా ఒబామాకు ఆ రెండూ సమకూరాయనుకోవచ్చు. అదే సమయంలో చొరవతో వ్యవహరించి మూలనబడిన అణు ఒప్పందానికి కదలిక తీసుకురావడమేకాక, భారీ మొత్తంలో విదేశీ పెట్టుబడులు రావడానికి దోహదపడిన నేతగా మోదీకి గుర్తింపు వచ్చింది. అయితే, అణు పరిహారచట్టానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేయదల్చు కున్నారో ఇంకా తేలాల్సి ఉంది.  సంయుక్త భాగస్వామ్యంలో రక్షణ పరికరాల ఉత్పత్తి చేయడానికి, ఇరుదేశాలమధ్యా ఇప్పటికే ఉన్న రక్షణ ఒప్పందాన్ని మరో పదేళ్లపాటు పొడిగించడానికి అంగీకారం కుదిరింది. రెండో రోజు ద్వైపాక్షిక వాణిజ్య బంధం మరింత విస్తరించేందుకు వీలుకల్పించే పలు ఒప్పందాలపై సంతకాలయ్యాయి. మొత్తం 400 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు, రుణాలు సమకూరేలా చూస్తామని ఒబామా ప్రకటించారు. అంతేకాక తమకూ, చైనాకూ మధ్య వాణిజ్యం 56,000 కోట్ల డాలర్లున్నదని ద్వైపాక్షిక వాణిజ్యం ఆ స్థాయికి పెరిగేలా ఇరు దేశాలూ కృషి చేయాలన్నారు.



 ఇరు దేశాధినేతల మధ్యా శిఖరాగ్ర సమావేశం జరిగి నాలుగు నెలలే అయినా... గణతంత్ర దినోత్సవానికి రావాలన్న మోదీ ఆహ్వానాన్ని అంగీకరించి అందుకనుగుణంగా అమెరికా కాంగ్రెస్‌లో తన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగాన్ని ముందుకు జరుపుకొని ఒబామా భారత్‌కు వచ్చారు. రాజ్‌పథ్‌లో మన దేశం ప్రదర్శించిన సైనిక పాటవాన్ని, భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని, ముఖ్యంగా సాయుధ దళాల కవాతులో మహిళలు పాల్గొనడాన్ని ఒబామా ఎంతో ఆసక్తిగా చూశారు. అయితే, ఇరుదేశాలమధ్యా అమ్మకందారు, కొనుగోలుదారు సంబంధాలు కాకుండా అంతకుమించిన అనుబంధం ఏర్పడాలని... అందుకోసం అమెరికా రక్షణ పరికరాల సంస్థలు ఇక్కడే కర్మాగారాలు నెలకొల్పి వాటిని తయారుచేయాలని మోదీ అభిప్రాయపడుతున్నారు. అందుకు తగినట్టుగా ఆయన ఇప్పటికే రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచబోతున్నట్టు ప్రకటించారు. అమెరికా నుంచి అందుకు సానుకూలమైన స్పందన లభిస్తుందా అన్నది చూడాలి. ఆసియాలో చైనా, జపాన్‌ల తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం మనదే. ఆసియా ఖండంలో చైనాకు దీటుగా ఎదిగేలా భారత్‌ను ప్రోత్సహించడం వ్యూహాత్మకంగా కూడా అమెరికాకు అవసరం. కనుక అమెరికా ఈ విషయంలో మనకు అనుకూలంగా వ్యవహరించవచ్చునన్న అంచనాలున్నాయి. ఆసియా పసిఫిక్, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో శాంతి, సుస్థిరత, వికాసానికి ఇరు దేశాల సన్నిహిత భాగస్వామ్యం అత్యంత అవసరమని భావిస్తున్నట్టు నేతలిద్దరూ చేసిన సంయుక్త ప్రకటనను గమనిస్తే ఈ విషయంలో అమెరికా స్పష్టతతోనే ఉన్నదని అర్ధమవుతుంది. అయితే, ఇది చైనాను అప్రమత్తం చేస్తుందనడంలో సందేహం లేదు. చైనా అధికారిక మీడియాలో వెలువడిన వ్యాఖ్యానంలో దీని ఛాయలు కనిపించాయి. చైనా, రష్యాలతో భారత్‌కున్న సంబంధాలను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా చూస్తున్నదని చైనా మీడియా హెచ్చరించింది కూడా. సాధారణంగా నేరుగా దేన్నీ చెప్పడం అలవాటులేని చైనా నాయకత్వం తన మనోభావాలను వ్యక్తంచేయడానికి అక్కడి మీడియాను ఉపయోగించుకుంటుంది. అంతేకాదు...సరిగ్గా మన గణతంత్ర దినోత్సవం రోజునే బీజింగ్ పర్యటనకెళ్లిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది.



 మొదటి రెండురోజులూ మోదీతోనే కనబడిన ఒబామా చివరిరోజు మాత్రం సిరిఫోర్ట్ ఆడిటోరియంలో జరిగిన సభలో తన సతీమణితోపాటు పాల్గొని ‘చాలా విషయాలే’ మాట్లాడారు. బహుశా మొదటి రెండురోజులూ చెప్పడం కుదరనివన్నీ అక్కడ మాట్లాడినట్టున్నారు. ‘మత విశ్వాసాలపరంగా చీలిపోనంతకాలమూ మీరు విజయం సాధిస్తార ’ని హితవు పలికారు. నచ్చిన మతాన్ని, కోరుకున్న విశ్వాసాన్ని అనుసరించే, ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని కూడా అన్నారు. ఘర్‌వాపసీ వంటి వివాదాస్పద కార్యక్రమాలు సాగిన నేపథ్యంలో ఒబామా వ్యాఖ్యలను చురకలనుకోవాలో, సున్నితంగా చేసిన సూచనలనుకోవాలో...వీటితో సంబంధంలేని సాధారణ వ్యాఖ్యలనుకోవాలో వినేవారి రాజకీయ విశ్వాసాలనుబట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరికి తోచినట్టు వారు అనుకునే తరహాలోనే ఒబామా ఉదాహరణలున్నాయి. ఆయన విస్కాన్సిన్ గురుద్వారాలో కొన్నేళ్లక్రితం జరిగిన దాడిని ప్రస్తావించారు. తన చర్మం రంగు కారణంగా తాను అమెరికాలో వివక్షను ఎదుర్కొన్న సంగతిని గుర్తుచేసుకున్నారు. మొత్తానికి ఒబామా మూడురోజుల పర్యటన భారత్-అమెరికా సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించింది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top