ఆలస్యంగానైనా...

ఆలస్యంగానైనా... - Sakshi


భారత ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత రెండేళ్లకు నరేంద్ర మోదీ తొలిసారిగా సోమవారం మీడియాతో మాట్లాడటం ఆహ్వానించదగిన మార్పు. దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపైన, పలు వివాదాస్పద అంశాలపైన ప్రధాని అభిప్రాయాలను ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్న సమయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి బదులు ఆయన ఒక ప్రైవేటు టీవీ చానల్‌తో మాట్లాడాలని భావించడం ఆశ్చర్యకరమే. ఏది ఏమైనా ఎన్‌ఎస్‌జీ నుంచి ఉగ్రవాదం వరకు, విదేశాంగ విధానం నుంచి వివిధ సామాజిక ఆర్థిక సమస్యల వరకు పలు అంశాలు ఆ ఇంటర్వ్యూలో చర్చకు వచ్చాయి. అయితే రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బీజేపీ పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్యంస్వామి చేసిన వ్యాఖ్యాలపై ప్రధాని స్పందనే పతాక శీర్షికలకు ఎక్కడం విశేషం.



రాజన్ దేశభక్తిని శంకించడాన్ని మోదీ ఖండించడమేగాక, ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన ప్రశంసనీయమైన కృషిచేశారని స్పష్టం చేశారు. రాజన్‌కు రెండో దఫా అవకాశం ఇవ్వరాదంటూ సాగిన ప్రచారానికి, తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేయగలిగారు. యూపీఏ హయాం నాటి రాజన్‌పైనే గాక ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రహ్మణ్యం, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శాంతికాంత దాస్‌లపైన కూడా స్వామి దాడి సాగించారు. తమ పార్టీకే చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు బాధ్యతారహితంగా రాజేసిన దుమారాన్ని మోదీ కేవల ప్రచార విన్యాసాలుగా కొట్టిపారేసి, మీడియా అలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వరాదని హితవు పలికారు. సంచలనాత్మకతకు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే ప్రముఖులకు ప్రాధాన్యాన్నిచ్చే ధోరణి మీడియాలో ఉన్న మాట వాస్తవమే. అలాంటి పెడ ధోరణులకు దూరంగా ఉండాల్సిన బాధ్యత మీడియాపై ఉన్నదనేదీ వాస్తవమే.

కానీ నూట ఇరవై ఐదు కోట్ల ప్రజలను పాలించే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పార్టీకి తమ నేతలు, ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణాయుతంగా వ్యవహరించేట్టు చేయవలసిన బాధ్యత లేదా? రాజన్‌ను రెండో దఫా గవర్నర్‌గా నియమించడంపై రెండు నెలలుగా అవాంఛనీయమైన రభస జరుగుతుండగా మిన్నకుండి... మరో దఫా ఆ బాధ్యతలను స్వీకరించేది లేదని ఆయన ప్రకటించిన తర్వాత ప్రధాని నోరు విప్పడంలోని ఔచిత్యం ఏమిటనే సందేహం తలెత్తదా? ఆలస్యంగానైనా ప్రధాని ఆర్‌బీఐ గవర్నర్‌పై, ఉన్నతాధికారులపై అధికార పార్టీ నేతలు నోరు పారేసుకోరాదనే హెచ్చరికను పంపడం ఆహ్వానించదగిన పరిణామాలు.



స్వామి విషయంలోలాగే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్న కొందరు మంత్రులు, బీజేపీ నేతల విషయంలో కూడా మీడియా వారిని పట్టిం చుకోకపోతే, వారిని హీరోలను చేయకపోతే వారే దారికి వస్తారని ప్రధాని హితవు చెప్పడం, ఈ సమస్యకు కూడా అభివృద్ధే పరిష్కారమని సరిపుచ్చడం విభ్రాం తికరం. అలాంటివారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేశంలోని మైనారిటీలలో ప్రత్యేకించి ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంచుతున్న వాస్తవాన్ని ఇలాంటి దాటవేతలు కప్పిపుచ్చలేవు. అందుకు రుజువన్నట్టుగా ఈనెల 10న హరియాణాలో గోమాం సాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గోసంరక్షణ కార్యకర్తలు పట్టుకుని చితగ్గొట్టి, గోమూత్రాన్ని తాగించి, పేడ తినిపించిన హేయమైన ఘటన వీడియో తాజాగా వెలుగు చూసింది. గత ఏడాది గోమాంసం తిన్నారన్న ఆరోపణపై ఒక వ్యక్తిని కొట్టి చంపేసిన దాద్రీ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన తదుపరి రక్షణ స్థితిలో పడ్డట్టనిపించిన ప్రభుత్వం, బీజేపీ ఆ తదుపరి పట్టనట్టు వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతమౌతున్నాయి.



అందుకు మీడియా కారణం గానే హీరోలవుతున్నారని ప్రధాని అంటున్న నేతలే ఆజ్యం పోస్తున్నారు. అధికార పార్టీలో అంతర్మథనం, పునరాలోచన అవసరమైన ఒక పెద్ద సమస్యను కేవలం మీడియాకు సంబంధించిన సమస్యగా చూపడం ద్వారా ప్రధాని దేశానికి అనుద్దేశ పూర్వకంగానే అయినా తప్పుడు సంకేతాలను పంపారు. యువత, ప్రత్యేకించి పట్టణ, విద్యాంతులైన యువత ఇలాంటి వైషమ్యపూరిత, సంఘర్షణాత్మక వాతా వరణాన్ని కోరుకోవడం లేదు. ప్రధానే అన్నట్టు 30 ఏళ్ల తర్వాత ప్రజలు కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వానికి పట్టంగట్టారు. మోదీ తెస్తానన్న మార్పులో విశ్వాసం ఉంచారు. పట్టణ, విద్యావంతులు సహా యువత మోదీపై ఆశలను పెట్టుకుంది.



2014 ఎన్నికల్లో బీజేపీ దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ ఓట్లతో, కేవలం 31 శాతం ఓట్లతో లోక్‌సభలోని 520 స్థానాలలో 283 స్థానాలను గెలుచుకోగలిగింది. 18-22 ఏళ్ల ప్రాయంలోని నవ యువత 47 శాతం మోదీకి ఓటు చేశారని అంచనా. ఏటా కోటి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామన్న వాగ్దానాన్ని యువత విశ్వసించింది. అది కష్టసాధ్యమైన లక్ష్యమే అయినా  ఆ కొలబద్దతోనే వారు మోదీ పని తీరును చూస్తారు. కాగా,  2014-15లో కేవలం 5,00,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తే,  2015-16లో ప్రథమార్థ భాగంలో మరింత అధ్వానంగా అది 95,000కు దిగజారింది. 2019 ఎన్నికల నాటికి 12.5 కోట్ల మంది కొత్త ఓటర్లు కీలక తీర్పరులుగా మారనున్నారు. విదేశీ పర్యటనలకే ప్రాధాన్యాన్నిస్తూ జాతీయ సమస్యలపై దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారనే విమర్శలను ప్రధాని తరచుగా ఎదుర్కోవాల్సి వస్తోంది.



అందుకు తగ్గట్టుగానే మోదీ ఇంటర్వ్యూలో విదేశాంగ విధానం, గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న ఆర్థికరంగ మెరుగుదల, ఆహార ద్రవ్యోల్బణాన్ని, ప్రత్యేకించి అనూహ్యంగా పెరిగిన పప్పుల ధరలను నియంత్రించడంపై ప్రధాని భరోసాను కల్పించలేకపోయారు. విదేశాలలో దాచిన నల్లధనాన్ని రప్పించి భారత పౌరులు ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15,00,000 జమ చేస్తామన్న బీజేపీ వాగ్దానంపై సైతం మోదీ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. పైగా గత ప్రభుత్వం వైఫల్యాలను ఏకరువు పెట్టారు. బ్యాంకుల మొండి బకాయిలవల్ల మన బ్యాంకింగ్ వ్యవస్థకు ఉన్న ముప్పు ఆరు నెలల కంటే నేడు మరింత పెరిగిందని తాజా ఆర్‌బీఐ ఫైనాన్సియల్ స్టెబిలిటీ రిపోర్ట్ పేర్కొంది. మన బ్యాంకింగ్ వ్యవస్థను కుంగదీసున్న ఈ మొండి బకాయిలపై ప్రధాని ప్రభుత్వ వైఖరిని స్పష్టపరచలేదు. ఏదిఏమైనా మీడియా ద్వారా ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ దిశగా ప్రధాని మోదీ వేసిన ఈ తొలి అడుగును స్వాగతించాల్సిందే.

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top