త్యాగాల శిఖరం!

త్యాగాల శిఖరం!


ప్రపంచంలోనే అతి ఎత్తయిన, అతి భయంకరమైన యుద్ధ క్షేత్రం సియాచిన్ మంచు పర్వత శ్రేణి మరోసారి చర్చల్లోకి వచ్చింది. వారంరోజుల క్రితం హఠాత్తుగా విరుచుకుపడిన మంచు తుపానులో చిక్కుకుని తొమ్మిదిమంది భారత సైనికులు మృత్యువాతపడటం... వారితోపాటే మంచు దిబ్బల్లో కూరుకుపోయినా ఆరు రోజుల తర్వాత సజీవంగా బయటపడిన మరో సైనికుడు లాన్స్ నాయక్ హను మంతప్ప ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించడం అందరిలోనూ విషాదాన్ని నింపింది. మృత్యువు ఎలా ఉంటుందో చూసిన వారెవరూ ఉండరు.... కానీ సియాచిన్ మంచు పర్వతశ్రేణిపై దేశ రక్షణలో నిమగ్నమై ఉండే సైనికులు అనుక్షణమూ దాన్ని బహుళ రూపాల్లో దర్శిస్తుంటారు.

 

 అది శత్రు సైనికుల మెరుపుదాడిగా ఉండొచ్చు... గంటకు 170 కిలోమీటర్లు లేదా అంతకన్నా పెను వేగంతో విరుచుకుపడే తుపాను రూపంలో ఉండొచ్చు... కొద్దిసేపటి ముందు వరకూ నడవడానికి, సేద తీరడానికి అనువైన ప్రాంతమనుకు న్నది కాస్తా పూనకం వచ్చినట్టు విరిగిపడి మింగేసే మంచుఖండం రూపంలోనైనా రావొచ్చు. వరదగా పోటెత్తి కబళించవచ్చు. చావుకీ, బతుక్కీ మధ్య వెంట్రుకవాసి దూరం మాత్రమే ఉండే సియాచిన్‌లో మృత్యువు ఏ రూపంలోనైనా పలకరించ వచ్చు. ఏ క్షణమైనా కాటేయవచ్చు.

 

వలస పాలన భారత్, పాకిస్తాన్‌లకు వదిలివెళ్లిన అనేకానేక చిక్కుముడుల్లో సియాచిన్ ఒకటి. కశ్మీర్ విషయంలో ఏదో మేర అంగీకారం కుదిరి అక్కడ నియంత్రణ రేఖ అంటూ ఒకటి ఉందిగానీ సియాచిన్ మంచు పర్వతశ్రేణిపై ఆ మాత్రం స్పష్టత కూడా లేదు. ఇరుగుపొరుగు దేశాలతో మనకున్న దాదాపు 15,200 కిలోమీటర్ల సరిహద్దుల్లో కశ్మీర్‌వైపే 1,600 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది. అందులో ఈ మంచు పర్వతశ్రేణి అత్యంత కీలకమైనది. తొలినాళ్లలో రెండు దేశాలూ పట్టించుకోని ఈ ప్రాంతం కేవలం పాకిస్తాన్ చర్యల కారణంగా మూడు దశాబ్దాల తర్వాత ప్రాముఖ్యతను పొందింది. ఎక్కడా ప్రస్తావనకు రాలేదు గనుక తమదేనన్న ధోరణితో సియాచిన్‌ను తమ మ్యాప్‌లలో చూపడం, ఆ ప్రాంతాన్ని సందర్శించగోరే పర్వతారోహకులకు అనుమతులనీయడంవంటి చర్యలతో అది మన దేశాన్ని రెచ్చగొట్టింది. ఆ తర్వాత చాన్నాళ్లకు 1984లో మన దేశం ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరిట సైనిక చర్య నిర్వహించి దాన్ని స్వాధీనంలోకి తీసుకోవాల్సి వచ్చింది. మన ధాటికి పాక్ సైన్యం వెనక్కి తగ్గాల్సివచ్చింది. సియాచిన్‌లో మనమూ ఉన్నామంటూ తమ పౌరులకు పాక్ చెప్పుకోవచ్చుగానీ...భారత్, పాక్, చైనా సరిహద్దులు కలిసే సాల్టోరా పర్వత శిఖరంలో ఆ మూల ఇందిరా కాల్ మొదలుకొని ఇటు గ్యోంగ్ లా వరకూ గల విస్తారమైన ప్రాంతమంతా మన సైన్యం అధీనంలోనే ఉంది. ఈ పర్వత శిఖరానికి దిగువన మాత్రమే పాకిస్తాన్ సైనిక శిబిరాలుంటాయి.

 

ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో సియాచిన్‌లో కర్త్యవ నిర్వహణకు అంకితమయ్యే జవాన్లకు అవసరమైన సదుపాయాలు ఉండటం లేదని 2008లో కాగ్ నివేదిక బయటపెట్టినప్పుడు అందరిలోనూ ఆగ్రహావేశాలు కలిగాయి. ముఖ్యంగా సైనికులకు పంపే దుస్తులు చినిగి ఉంటున్నాయని...వాడి పారేసిన వాటినే రీసైకిల్ చేసి అందిస్తున్నారనీ ఆ నివేదిక వెల్లడించాక అప్పటి యూపీఏ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలెట్లింది. తక్కువ ఎత్తుగల ప్రాంతాల్లో జవాన్లకు కఠోరమైన శిక్షణనిచ్చి, అందులో ప్రావీణ్యం సంపాదించినవారినే సియాచిన్‌కు పంపించడం, దీర్ఘకాలం వారిని అక్కడ ఉండకుండా చూడటంవంటి చర్యలతో తొలినాళ్లతో పోలిస్తే మరణాల సంఖ్య, అనారోగ్యంబారిన పడేవారి సంఖ్య కాస్త తగ్గింది. అయితే ప్రకృతి తీసే దొంగ దెబ్బనుంచి తప్పించుకోవడం మాత్రం జవాన్లకు సాధ్యం కావడంలేదు.  

 

దాదాపు 20,000 అడుగుల ఎత్తులో, ఎప్పుడూ -45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉండే ఈ ప్రాంతం మనుషులుండటానికి అసాధ్యమైనది. శత్రు భయం లేనట్టయితే... వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది కానట్టయితే పట్టించు కోనవసరం లేని ప్రాంతం. అటు పాకిస్తాన్‌తోనూ, ఇటు చైనాతోనూ ఎన్నో చేదు అనుభవాలున్నాయి గనుక దీన్ని అలా వదిలేయడం సాధ్యం కావడం లేదని మన ప్రభుత్వం చెబుతున్న మాట. కార్గిల్, తంగ్‌ధార్ ప్రాంతాల్లో మన ఉదాసీనత ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో, ఎంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోవలసివచ్చిందో అందరికీ తెలుసు. అధీన రేఖ వద్ద నిత్యం అడపా దడపా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అలాగే 1992 తర్వాత చొరబాట్లు పెరిగి కశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చరిల్లింది.

 

సియాచిన్‌లో శత్రు దాడిలో మరణించేవారి సంఖ్య కన్నా అతి శీతల గాలులకు తట్టుకోలేకా, మంచు చరియలు విరిగి పడటంవల్లా చనిపోయేవారి సంఖ్యే ఎక్కువ. సియాచిన్‌లో ఏటా సగటున పదిమంది సైనికులు మరణిస్తారని గణాంకాలు చెబుతున్నాయి. మనకంటే దిగువన ఉన్నా పాక్ సైనికుల మరణాలు సగటున 30 వరకూ ఉన్నాయి. గత నాలుగేళ్లలో మన సైనికులు 869 మంది అక్కడ మృత్యువాతపడ్డారు.  ఇదే కాలంలో అక్కడి సైనిక కార్యకలాపాల కోసం మొత్తంగా రూ. 7,505 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగేళ్లక్రితం మంచు దిబ్బల్లో కూరుకుపోయి 130మంది పాక్ సైనికులు మరణించినప్పుడు ఈ ప్రాంతంలో అసలు సైనిక స్థావరాలే లేకుండా ఇరు దేశాలూ ఒక అవగాహనకు రావాలన్న ప్రతిపాదన బలంగా వచ్చింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ ఆష్ఫాక్ కయానీ సైతం దీన్ని ప్రతిపాదించారు.

 

అయితే పరస్పర అపనమ్మకం, గత అనుభవాలు దీన్ని సాకారం కానీయడం లేదు. ఇరు దేశాలమధ్యా ఉన్న సంబంధాలు మెరుగుపడకపోగా అంతకంతకూ క్షీణిస్తుండటం మరో కారణం. ఒక దశలో సియాచిన్, సర్‌క్రీక్ వంటి చిన్న చిన్న వివాదాలను పరిష్కరించుకుందామని కూడా పాకిస్తాన్ సూచించింది. అయితే కశ్మీర్, ఉగ్రవాదం వంటి పెను సమస్యలు పరిష్కారమైనప్పుడే సియాచిన్ కూడా ఒక కొలిక్కి వస్తుందన్నది మన దేశం అభిప్రాయం. అయినవాళ్లకి దూరంగా, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక సియాచిన్‌లో జవాన్లు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివి. అక్కడ సైన్యం అవసరంలేని శాంతియుత పరిస్థితులు నెలకొనాలని అందరూ ఆశిస్తారు.

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top