జన జీవన వారధి

జన జీవన వారధి - Sakshi


ఈశాన్య ప్రాంతవాసుల చిరకాల కోరిక ఫలించింది. అస్సాంలోని ధోలా–సదియాల మధ్య బ్రహ్మపుత్ర ఉప నది లోహిత్‌పై నిర్మించిన 9.15 కిలోమీటర్ల వారధికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. దేశంలోనే అతి పెద్ద దైన ఈ వంతెన అనేక విధాల ఎన్నదగినది. దీనికి సదియా గడ్డపై జన్మించిన ప్రముఖ అస్సామీ జానపద గాయకుడు స్వర్గీయ భూపేన్‌ హజారికా పేరు పెట్టారు. ఇది ఈశాన్య ప్రాంతంలోని రెండు రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గించడం మాత్రమే కాదు... ఆ రెండు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకూ రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తుంది.



ఈశాన్య భారతంలో మన రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అరుణా చల్‌–చైనా సరి హద్దుల్లోని దిన్‌జాన్‌లో ఉన్న సైనిక విభాగానికి కేవలం మూడు గంటల వ్యవధి లోనే సైనిక బలగాలనూ, భారీ రక్షణ సామగ్రినీ తరలించడానికి ఈ వంతెన వల్ల వీలు కలుగుతుంది. అస్సాంలోని తిన్‌సుకియా పట్టణానికి సమీ పంలోని సదియా దగ్గర మొదలై అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుకు దగ్గర్లోని ధోలా దగ్గర ముగుస్తుంది. ముంబై మహా నగరంలో 5.6 కిలోమీటర్ల నిడివిలోని బాంద్రా–వోర్లీ సాగర వారధి మాత్రమే ఇంతవరకూ దేశంలో అతి పెద్దది కాగా ఇప్పుడు ఈ వంతెన దాన్ని మించిపోయింది. తూర్పు టిబెట్‌లో పుట్టి అరుణాచల్‌ గుండా ప్రవహించి అస్సాంలో ప్రవేశించే లోహిత్‌ నది సదియా వద్ద విశాలమై బ్రహ్మపుత్రగా మారి ఆ తర్వాత 1,450 కిలోమీటర్లు ప్రయాణించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.   



నదులు దాహార్తినీ, క్షుద్భాధనూ తీర్చడంతోపాటు మనిషికి నాగరికతనూ నేర్పుతాయి. కానీ వాటితోపాటే నదీ తీర ప్రాంతవాసులకు ఇబ్బందులూ ఉంటాయి. రోజువారీ పనులు చేసుకోవడానికి లేదా జీవనం సాగించడానికి స్థాని కులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చదువుల మాట చెప్పనవసరమే లేదు. వారంలో ఎన్ని రోజులు చదువు సాగుతుందో చెప్పడం కష్టమే. ఎగువ అస్సాం పట్టణమైన తిన్‌సుకియా కళాశాలలో చదువుకోదల్చుకున్న సదియా మారుమూల గ్రామం విద్యార్థులు తెల్లారుజామున నడక ప్రారంభించి 12 కిలోమీటర్లు నడిచి నదీ తీరానికెళ్తే అక్కడి నుంచి పడవ ప్రయాణం సాగించాలి.



ఆ తర్వాత మరిన్ని కిలోమీటర్లు నడిచి తిన్‌సుకియాకు చేరాల్సివస్తుంది. చదువు ముగించుకుని ఇంటికి రావాలన్నా మళ్లీ ఇన్ని కష్టాలూ పడాలి. వీటి సంగతలా ఉంచి అసలు పడవలపై ప్రయాణమే ప్రాణాంతకమైనది. అవి కూడా తగినన్ని లేక జనం ఇబ్బందులు పడే వారు. 50, 60 మందిని తీసుకెళ్లే పడవ నిండిందంటే మరో పడవ కోసం వేచి ఉండక తప్పదు. ఉన్నట్టుండి వరదలొస్తే ఎటువారు అటే మిగిలిపోవాలి. అత్య వసర పనులున్నా, ప్రాణాపాయ స్థితి ఏర్పడినా మరో తోవ ఉండదు. సాయంత్రం 4.30 గంటలకు ఆఖరు పడవ ప్రయాణిస్తుంది. మళ్లీ మర్నాడు ఉదయం వరకూ వేచి ఉండకతప్పదు.



ధోలా–సదియాల మధ్య నిత్యం 5,000మంది ప్రజలు పడ వల్లో రాకపోకలు సాగించేవారు. రోజూ దాదాపు 70 ట్రక్కులు, వంద కార్లు పడవ లపై వెళ్లేవి. ఇందుకు 150 పడవలు అందుబాటులో ఉండేవి. సైనిక సిబ్బంది తరలినప్పుడల్లా ఇవన్నీ వారి సేవలకే అంకితం. స్థానికులు నిత్యం ఈ ఇబ్బం దుల్ని ఎదుర్కొనక తప్పదు. తమ గోడు ఎవరికి చెబితే తీరుతుందో కూడా వీరికి తెలి యదు. ఇప్పుడు ప్రారంభమైన వారధి ఈ కష్టాలన్నిటికీ ముగింపు పలకబోతోంది.



ధోలా–సదియా వారధి మన ఇంజనీరింగ్‌ పనితనానికి కూడా చిహ్నం. వంతెన నిర్మించిన ప్రాంతం తరచు భూకంపాలు వచ్చే జోన్‌లో ఉంది. ఈ వంతెనకున్న 182 స్తంభాలనూ దాన్ని దృష్టిలో ఉంచుకునే నిర్మించారు. ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై సరయ్‌ఘాట్, కోలియాభోమోరా, బొగిబీల్‌ ఘాట్‌ల వద్ద వంతెనలు పూర్తయ్యాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రారంభించిన వంతెన నాలుగోది. అటు ప్రజలకూ, ఇటు రక్షణ సిబ్బందికి ఉపయోగపడే వంతెన నిర్మా ణానికి కూడా ఎన్ని అవరోధాలుంటాయో తెలుసుకోవాలంటే ధోలా– సదియా చరిత్రను స్పృశించాలి. 1980లో తొలిసారిగా స్థానికులు తమ ప్రాంతానికి వంతెన కావాలని ప్రభుత్వాధికారులకు విన్నవించుకున్నారు.



1985లో కేంద్ర ప్రభుత్వం ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌(ఆసు), అసోం జాతీయతావాది యువ ఛాత్ర పరిషత్‌లతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఈ వంతెన నిర్మిస్తామన్న హామీ ఉంది. అయితే అది మరో పన్నెండేళ్లకుగానీ ఒక కొలిక్కి రాలేదు. 1997–98లో హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ వంతెన మంజూరైంది. అయితే 2002లో వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు హయాంలో పనులు ప్రారం భమయ్యాయి. ఆ తర్వాత వంతెనకు బోలెడు గడువు తేదీలు వచ్చాయి... వెళ్లాయి. వందల కోట్ల రూపాయల మేర ప్రాజెక్టు వ్యయం పెరుగుతూ వచ్చింది.



2007లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక మళ్లీ చురుకుదనం వచ్చింది. ప్రాజెక్టు వ్యయంలో 75 శాతాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ, మిగిలింది రైల్వే శాఖ పంచుకున్నాయి. అయినా అవరోధాలు షరా మామూలే. 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చేనాటికి 65 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన నిర్మాణం పూర్తి కావడానికి మరో మూడేళ్లు పట్టింది. వేలాదిమంది ప్రజల జీవన్మరణ సమస్య తీరడమే కాదు... దేశ రక్షణకు సైతం వినియోగపడే ఒక వంతెనకు మూడు దశాబ్దాల సుదీర్ఘకాలం పట్టడమే వింత నుకుంటే... దీని నిర్మాణం ఘనత తమదంటే తమదని కాంగ్రెస్, బీజేపీలు తగు వులాడుకోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.



కేంద్రంలో అధికారంలో కొచ్చి మూడేళ్లు, అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. వారధి ప్రారంభోత్సవానికి ఈ సందర్భాన్ని ఎన్నుకోవడంలోనే బీజేపీ రాజకీయ చతురత కనబడుతుంది. తామొచ్చాక ఈశాన్యంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదన్న అభి ప్రాయం కలగజేయడమే దీని పరమార్ధం అనిపిస్తుంది. ఎవరి ఉద్దేశాలు ఏమైనా ఈ వారధి స్థానికులకు ప్రాణప్రదం. దేశానికి గర్వకారణం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top