మద్యం షాపులకు ‘వేలం’వెర్రి

మద్యం షాపులకు ‘వేలం’వెర్రి - Sakshi

ఏలూరు అర్బన్‌ :  నగరంలో శుక్రవారం జిల్లాలోని మద్యం షాపులకు సంబం«ధించి ఎక్సైజ్‌ శాఖ నిర్వహించిన వేలం పాట జాతరను తలపించింది. రానున్న రెండేళ్ల కాలానికి సంబంధించి గతంలో అమలు చేసిన మద్యం పాలసీకి భిన్నంగా ప్రభుత్వం తాజాగా వేలం నిర్వహణకు ఆదేశాలిచ్చింది. వ్యాపారులు తాము దక్కించుకున్న దుకాణాన్ని మండలం, నగర పంచాయతీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ పరిధిలో ఎక్కడైనా నిర్వహించుకునేందుకు అనుమతించింది. దీంతో వ్యాపారులు దుకాణాలు దక్కించుకునేందుకు భారీగా పోటీ పడ్డారు. ఒక వ్యాపారి కనీసం రెండుకు మించి దుకాణాలకు నాలుగు నుంచి ఐదు దరఖాస్తులు పెట్టుకోవడంతో ఎక్సైజ్‌శాఖకు దరఖాస్తుల రూపేణా భారీ ఆదాయం సమకూరింది. 

జిల్లాలో 474 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా ఏలూరు యూనిట్‌లోని 236 షాపులకు 5,762 దరఖాస్తులు రాగా వాటి ద్వారా రూ.35.54 కోట్లు, భీమవరం యూనిట్‌లోని 238 షాపులకు గాను 237 షాపులకు 3,706 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.21 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో గడిచిన 30వ తేదీన వెరిఫికేషన్‌ పూర్తి చేసుకుని వ్యాపారులు లాటరీకి అనుమతి పొందారు. శుక్రవారం స్థానిక వట్లూరు పంచాయతీ పరిధిలోని శ్రీ కన్వెన్షన్‌ హాలులో ఎక్సైజ్‌ శాఖ ఏర్పాటు చేసిన లాటరీ కార్యక్రమానికి వీరంతా హాజరయ్యారు. ఎక్సైజ్‌శాఖతో పాటు రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రారంభమైన లాటరీ కార్యక్రమాన్ని జేసీ షరీఫ్‌ ప్రారంభించగా అనంతరం డీఆర్వో కె.హైమవతి కొనసాగించారు. ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ వైబీ భాస్కరరావు, ఏలూరు భీమవరం యూనిట్‌ల సూపరింటెండెంట్‌లు వై.శ్రీనివాసచౌదరి, కె.శ్రీనివాస్‌ పర్యవేక్షించారు. లాటరీ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసేందుకు డీసీ భాస్కరరావు చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లాటరీ ప్రక్రియనంతా వ్యాపారులు పరిశీలించేలా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభంకాగా రాత్రి 9 గంటలకు కేవలం నూరు దుకాణాలకు మాత్రమే లాటరీ పూర్తయ్యింది. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ లాటరీని రాత్రి ఏ సమమయానికైనా పూర్తి చేస్తామని వెల్లడించారు. కాగా జిల్లావ్యాప్తంగా మద్యం వ్యాపారులు అనేకమంది కార్లలో తరలిరావడంతో వాటి సంఖ్య వందల సంఖ్య దాటిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు.  

 
Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top