గుణపాఠం


ప్రజాభీష్టానికి ఏ పాలకుడైనా తలొగ్గవలసిందే. చట్టసభల్లో ఉండే బలంతో ఏమైనా చేయగలమనుకుంటే కుదరదు. భూసేకరణ చట్టానికి సవరణలు తీసుకొస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ కథ ముగిసినట్టేనని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చేసిన ప్రకటన ఈ సంగతినే రుజువు చేసింది.  కేంద్ర కేబినెట్ గత డిసెంబర్‌లో తొలిసారి ఈ సవరణలు చేయడానికి పూనుకున్నప్పటినుంచీ అందుకు సంబంధించి మూడు దఫాలు ఆర్డినెన్స్‌లు జారీ అయ్యాయి. ఒక ఆర్డినెన్స్ మురిగిపోయిన వెంటనే మరో ఆర్డినెన్స్ తీసుకురావడంద్వారా కేంద్రం ఆ సవరణలకు ప్రాణ ప్రతిష్ట చేస్తూనే ఉంది. అధికారం చేతికందిన మరుక్షణం ఎన్‌డీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టంపై దృష్టి సారించింది. ఆ చట్టాన్ని సవరిస్తే తప్ప దేశంలో పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టులు రావడం సాధ్యం కాదన్నది. పాలకులు అలా అనుకోవడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక చట్టం అమలులోని సాధకబాధకాలేమిటో వారికే బాగా తెలుస్తాయి. అయితే వాటి వివరాలను పార్లమెంటు ముందు పెడితే...చర్చకు చోటిస్తే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంలోని మంచిచెడ్డలేమిటో అందరికీ తెలిసేవి. చివరకు సవరణ బిల్లు ఏమవుతుందనేది వేరే విషయం. వాస్తవానికి మూడోసారి ఆర్డినెన్స్ జారీ చేయడానికి ముందు భూసేకరణ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. అయితే విపక్షానికి మెజారిటీ ఉన్న రాజ్యసభలో అందుకు సంబంధించిన ప్రయత్నం వీగిపోయింది. బిల్లు ప్రస్తుతం సంయుక్త కమిటీ ముందు పరిశీలనలో ఉంది. ఈలోగానే మోదీ 'మన్ కీ బాత్' ద్వారా భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయబోమని చెప్పారు. సారాంశంలో ఆ సవరణలు పార్లమెంటు ప్రమేయం లేకుండా ఆర్డినెన్స్‌ల ద్వారా కొన్నాళ్లు అమల్లో ఉండి...పార్లమెంటు ప్రమేయం లేకుండానే కనుమరుగయ్యాయి!




 భూసేకరణకు సవరణలు తలపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనలకూ, ఇప్పుడు ఉపసంహరించుకుంటూ చేసిన వాదనలకూ మధ్య పొంతన లేదు. 2014 చిట్టచివరిలో కేంద్ర కేబినెట్ భూసేకరణ ఆర్డినెన్స్‌కు పచ్చజెండా ఊపింది. అప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం. భూసేకరణ చట్టం కారణంగా పారిశ్రామికీకరణ మూలనబడిందని ఆయన చెప్పారు. గ్రామాల్లో రోడ్లేయాలన్నా, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నా, నీటి పారుదల సౌకర్యం కల్పించాలన్నా ఆ చట్టం పెద్ద అడ్డంకిగా తయారైందని  తెలిపారు. రైతుల ప్రయోజనాలకూ, పారిశ్రామికాభివృద్ధికీ మధ్య సమతూకం ఉండేలా చూడటమే తమ ధ్యేయమన్నారు. తాము జారీ చేస్తున్న ఆర్డినెన్స్ ఏకకాలంలో 'రైతు అనుకూల, పారిశ్రామిక అనుకూల' ధోరణులతో ఉన్నదని చెప్పారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏమంటున్నారు? రైతు అనుకూల వైఖరితోనే దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు చెబుతున్నారు. భూసేకరణ ఆర్డినెన్స్ జారీ, దాని ఉపసంహరణా...రెండూ రైతు అనుకూలమే ఎలా అవుతాయి? ఇందులో ఏదో ఒకటి మాత్రమే రైతుకు అనుకూలమై, రెండోది వ్యతిరేకం కావాలి.  కేవలం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఏకైక ఉద్దేశంతో మాత్రమే మోదీ ఈ ప్రకటన చేశారని విపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ వద్ద సమాధానం ఏది?  




 భూసేకరణ చట్టాన్ని యథాతథంగా అమలు చేయడమే కాదు...మరో 13 చట్టాల ద్వారా జరిగే భూసేకరణకు కూడా ఆ చట్టంలోని పరిహారమే వర్తించేలా చర్యలు తీసుకుంటూ నోటిఫికేషన్ జారీచేసినట్టు నరేంద్ర మోదీ చెప్పారు. కనుక 2013 భూసేకరణ చట్టంలోని నిబంధనలే జాతీయ రహదార్ల చట్టం, విద్యుత్ చట్టం, రైల్వే చట్టం, గనుల చట్టం వగైరాలకింద సేకరించే భూముల విషయంలోనూ ఇకపై వర్తిస్తాయన్నమాట! మంచిదే. వాస్తవానికి భూసేకరణ చట్టంలోనే ఆ మేరకు హామీ ఉంది. 2014 డిసెంబర్‌కల్లా ఆ పని పూర్తవుతుందని అది పూచీపడింది. రైతులందరూ అందుకోసం ఎదురుచూస్తుండగా ఎన్‌డీఏ సర్కారు అప్పట్లో హఠాత్తుగా ఆర్డినెన్స్ బాటపట్టింది. ఆర్డినెన్స్‌ను రైతులు, పలు ప్రజా సంఘాలు ఇంతగా వ్యతిరేకించడానికి కారణం ఉన్నది. పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు(పీపీపీ), రక్షణ రంగం, గ్రామీణ మౌలిక వసతుల వంటి అవసరాలకు భూములు సేకరించేటపుడు భూ యజమానుల నుంచి అనుమతి అవసరం లేదని ఆర్డినెన్స్ పేర్కొంది. పీపీపీల విషయంలో భూమి సేకరిస్తే భూ యజమానుల్లో 70 శాతం మంది, ప్రైవేటు ప్రాజెక్టుల విషయంలో 80 శాతంమంది అంగీకారం తప్పనిసరన్న చట్టంలోని నిబంధనను ఆ ఆర్డినెన్స్ తొలగించింది. అలాగే ఆయా ప్రాజెక్టులకు సామాజిక ప్రభావ అంచనా(ఎస్‌ఐఏ) ఉండితీరాలన్న నిబంధనను కూడా తోసిరాజంది. అయితే మూడో ఆర్డినెన్స్ జారీకి ముందు ఎన్‌డీఏ సర్కారు ఈ రెండు అంశాల్లోనూ తన తప్పిదాన్ని గ్రహించింది. జూలై నెలలో సెలెక్ట్ కమిటీలోని బీజేపీ సభ్యులు ఆ నిబంధనలు యథాతథంగా కొనసాగాలంటూ సవరణలు ప్రతిపాదించారు. ఇలా ఒక మెట్టు దిగిన బీజేపీ చివరకు పాత చట్టమే సరైందని చేతులు దులుపుకుంది. అంతమాత్రాన ఆ చట్టంలో సరిచేయాల్సినదేమీ లేదని చెప్పడానికి వీల్లేదు. భూములు కోల్పోయేవారికి మార్కెట్ విలువపై పట్టణాల్లో అయితే రెండు రెట్లు, గ్రామాల్లో అయితే నాలుగు రెట్లూ పరిహారం ఇస్తామన్న నిబంధన అస్పష్టంగా ఉన్నదని సామాజిక ఉద్యమకారులు ఎప్పటినుంచో అంటున్నారు. మార్కెట్ విలువను ఏ ప్రాతిపదికన లెక్కేస్తారో చట్టంలో స్పష్టంగా ఉండాలని కోరారు. అలాగే 'ప్రజా ప్రయోజనం' అంటే ఏమిటో చట్టం నిర్వచించాలని అడిగారు. చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి అంశాలపై దృష్టి సారించాలి. అలాగే దీన్నొక గుణపాఠంగా స్వీకరించి ప్రజా ప్రాధాన్యత ఉన్న అంశాలపై పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవాలి తప్ప ఆర్డినెన్స్‌ల బాట పట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గుర్తించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top