పోలవరం ప్రాజెక్టు ఎవరి స్వప్నం?

పోలవరం ప్రాజెక్టు ఎవరి స్వప్నం? - Sakshi


మనసులో మాట


కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్‌ నేత డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు


పోలవరం తన కలల ప్రాజెక్టు అని చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధం అని, నాటి ప్రధాని దేవేగౌడ ఈ ప్రాజెక్టుకు  అత్యంత సుముఖంగా ఉన్నప్పటికీ ఆయన కోరిన ప్రకారం ప్రాజెక్టు అంచనాలు, మార్పులు గురించి వివరాలు పంపించకుండా తాత్సారం చేసింది చంద్రబాబేనని సీనియర్‌ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. ప్రధానితో మీటింగులో ఎర్రన్నాయుడు కూడా ఉన్నారని, తర్వాత తొమ్మిదేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం వివరాలు కేంద్రానికి  పంపలేదని దీన్ని బట్టి పోలవరం ఎవరి కలో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. నేను నిప్పు, నిజాయితీ.. రాజకీయాల్లో నేను తప్పే చేయను అని బాబు చెప్పిన స్వోత్కర్ష ఓటుకు కోట్లు కేసులో మునిగిపోయిందని, ఆ నీతి నిజాయితీ దెబ్బకే అన్నీ వదులుకుని హైదరాబాద్‌ నుంచి పారిపోయారని హేళన చేశారు. ఎన్టీఆర్‌ మరో ఆరు నెలలు బతికి ఉంటే రాష్ట్ర చరిత్ర, బాబు చరిత్ర కూడా తేలిపోయేదంటున్న దగ్గుబాటి అభిప్రాయాలు  ఆయన మాటల్లోనే..




రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు కదా. ఎలా ఫీలవుతున్నారు?

రాజకీయాలకు దూరంగా ఉండటం ఏదో గొప్ప అని నేను భావించడం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడూ బాగానే అనిపించింది. లేనప్పుడు కూడా బాగానే అనిపిస్తోంది. రాజకీయాల్లోంచి నేను సంతృప్తిగా.. అంటే ఏ మచ్చా లేకుండా, అన్ని పనులూ నిర్వహించి మంచి అనిపించుకుని బయటకి వచ్చాను అనే తృప్తితోటే నేను జీవిస్తున్నాను.




మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సన్నివేశం ఏది?

రామారావుగారిని పదవి నుంచి దించేసిన తర్వాత, ఏది ఎలా ఉన్నా నేనుచేసిన పని కరెక్టు కాదు. ఆయన ఒక ఉన్నతమైన శక్తి. జాతికి ప్రతీక ఆయన. ఎన్ని రకాలుగా ఆయన తప్పు చేసి ఉన్నా, నాకు అవి ఇష్టం లేకపోయినా నేను అటువంటి దానిలో భాగస్వామ్యం కావడం అనేది నా జీవితంలోనే అసహ్యకరమైన విషయంగా భావిస్తున్నాను.




ఎన్టీరామారావుకు పార్టీ పెట్టమని మీరు ఎప్పుడూ చెప్పలేదా?

ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టాలని ఎవరన్నా చెప్పడమంటే అంతకంటే హాస్యాస్పదమైన అంశం ఉండదు. అంతకంటే అబద్ధం కూడా ఉండదు.




పార్టీ పెట్టాలని ఎన్టీఆర్‌కి తానే సలహా ఇచ్చానని బాబు మొన్ననే అన్నారే?

బాబు రోజూ చెప్పేవన్నీ నిజాలేనా? ప్రతి రోజూ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే కదా. పార్టీని నేను పెట్టమన్నాను అని చెప్పడం అంటేనే పచ్చి అబద్ధం. 1982 మార్చి 29న హైదరాబాద్‌లో రామకృష్ణా సినీ స్టూడియోలో తాను పార్టీ పెడుతున్నట్లుగా ఎన్టీఆర్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 11న తొలి మహానాడును నిర్వహించారు. మహానాడు పూర్తయ్యాక బాబును నేను స్వయంగా కలిసి పార్టీలోకి వచ్చి ఆర్గనైజేషన్‌ వ్యవహారాలు చూసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుం దని ఆహ్వానించాను. దానికి ఆయన కాదన్నారు.


మీకు పార్టీ పెట్టేంత ఇది ఉందా అనేశారు. పార్టీ నడపడానికి ఖర్చులు ఎలా వస్తాయి. ఆయన డబ్బులు తీయరు అనేశారు. రామారావు డబ్బులు పెట్టరు అనేదే చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అభిప్రాయం. బాబు అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేం అనేది వారి విశ్వాసం. దాన్నే బాబు వ్యక్తం చేశారు.




లేటుగా టీడీపీలోకి వచ్చిన బాబు ముందుకెళ్లిపోయారు.. మీరేమో వెనుకబడిపోయారు?

పార్టీలోకి తను ఎలా వచ్చాడో అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోయాక అక్కడ ఉండలేక వెంటనే టీడీపీలో చేరిపోయాడు. రాజకీయాల్లోకి మాది ఒకరకమైన ఎంట్రీ. బాబుది మరొక రకమైన ఎంట్రీ. తనకు అప్పటికే అధికారం ఏమిటో తెలుసు. ఏం చేయాలో తెలుసు. మేమేమో వ్యవస్థను బాగు చేయాలి అనే సంకల్పంతో పార్టీలోకి వచ్చాము. జయప్రకాష్‌ నారాయణ్‌ ఉద్యమంలో భాగమై డబ్బుల్లేకుండా రాజకీయాలు చేయొచ్చు అని నమ్మి వచ్చినవాళ్లం. కానీ బాబుకు రాజకీయమే జీవనం. దాని కోసం ఏదైనా చేయగలడు. ఎలాంటి సాహసానికైనా పూనుకోగలడు.




ఏమైనా చేయగలడు అంటే అడ్డగోలు పనులు కూడా చేస్తాడనా?

ఎందుకు చేయడు? మహానాడు, మినీమహానాడు అంటూ రకరకాలుగా సభలు పెట్టేవారు. ప్రతి సంవత్సరం మహానాడు పెట్టడం ఏమిటి, డబ్బు దండగ, దుబారా అనేది మా అభిప్రాయం. కానీ తాను మహానాడులు, మినీమహానాడులు పెట్టడానికి ఉత్సాహం చూపేవాడు. కాంగ్రెస్‌లో ఒక పని తీరు ఉండేది. నాయకులు వస్తారు. మీటింగు పెడతారు. దానికయ్యే ఖర్చులకు అందరూ ఊరిమీద పడతారు. డబ్బులు కలెక్ట్‌ చేస్తారు. డేరాలు కట్టడం, భోజనాలు పెట్టడం ఇలాంటివాటికే కాకుండా అదనంగా కూడా వసూలు చేస్తారు. టీడీపీలో కూడా ఇలా మహానాడులు, మినీనాడులు పేరు చెప్పేది. ఊరుమీద పడేది.


ఇదేమిటన్నది 1987వరకు నాకు అర్థం కాలేదు. ఆ ఏడాది రామారావు గారు అలా విజయవాడలో జరిపిన మహానాడు కోసం వసూలు చేసిన మొత్తం తన ముందు హుండీలో వేయండి అది ఎవరికీ ఇవ్వవద్దు, నా స్వాధీనంలో ఉంచుకుంటాను అని ప్రకటించారు. అందరూ హుండీలో వేశారు. లెక్కిస్తే మహానాడు ఖర్చులు పోను 60 లక్షల రూపాయలు మిగిలింది. అంటే అంతకుముందు మహానాడుల సందర్భంగా మిగిలిన డబ్బుకు లెక్కా జమా లేదు. ఆ 60 లక్షలు పెట్టి గండిపేటలో పార్టీ ఆఫీసు కొన్నారు.




మరి అంతకుముందు వసూలు చేసిన డబ్బులు ఏమైనట్లు?

డబ్బుతో ముడిపడిన రాజకీయాలు అలా ఉంటాయి అని చెప్పడానికే ఇదంతా ఉదాహరణగా  చెప్పాను.




అంతకుముందంతా బాబే మహానాడులను నిర్వహించారా?

సందేహమేముంది. వందశాతం కరెక్ట్‌ అది. 1989లో మహానాడును హైదరాబాదులో నేను స్వయంగా నిర్వహించి దాంట్లో 35 లక్షలు మిగిల్చి ఆ మొత్తాన్ని రామారావు గారికి ఇచ్చాను. మహానాడుకు నా ఆధ్వర్యంలో పెట్టిన ఖర్చు 15 లక్షలు. దాతలిచ్చిన దాన్ని పేర్లతో సహా తెలిపి ఆయన ముందు పెట్టాను.




పోలవరం నిజంగా చంద్రబాబు కలేనా?

పోలవరానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఉంది. దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై ఒక సమావేశం జరిగింది. వడ్డే వీరభద్రరావు అనే టీడీపీ ఎమ్మెల్యే ఆ సమావేశానికి హాజరయ్యారు. జలవనరుల మంత్రి, ప్లానింగ్‌ శాఖ మంత్రి, ప్లానింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ మధుదండావతే, ఎర్రన్నాయుడు, ఇంకా ప్లానింగ్, ఫైనాన్స్‌ శాఖ కార్యదర్శులతో ప్రధాని మీటింగ్‌ పెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలు, వాటిలో మార్పుల గురించిన వివరాలు పంపించమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని (బాబు సీఎం) అడుగుతున్నాం కానీ ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు ఎలాంటి స్పందనా అందలేదు.


మీరు వెంటనే ఆ వివరాలు పంపిస్తే ప్రాజెక్టు మంజూరు చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను అని ఆరోజు ప్రధాని దేవేగౌడ స్వయంగా ప్రకటన ఇచ్చారు. ఆ నాటి మీటింగులో ఎర్రన్నాయుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి పోలవరం ఎవరి కలో?




లోకేశ్‌ను ఎమ్మెల్సీ చేయడం, మంత్రి పదవి ఇవ్వడంపై మీ అభిప్రాయం?

దాంట్లో ఏముందండీ, అది మన సొంత వ్యవహారం కదా.




ఎన్టీఆర్‌ పుత్రులకు పదవి ఇవ్వడం వారసత్వమైనప్పుడు లోకేశ్‌ది వారసత్వం కాదా?

ఎన్టీ రామారావు దగ్గర నుంచి మేం తీసేసుకోవచ్చు. కానీ మా దగ్గర నుంచి ఇంకొకరు తీసేసుకోకూడదు. అదీ విషయం.




బాబు మాట మాట్లాడితే నేను నిప్పు, నిజాయితీ... అంటుంటారు కదా?

ఓటుకు కోట్లు కేసు మాటేంటి? ఆ తర్వాతే కదా హైదరాబాద్‌ నుంచి పారిపోయింది?

(దగ్గుబాటితో ఇంటర్వూ  పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)

https://goo.gl/PYhkkj

https://goo.gl/eBKHq8

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top