న్యాయదేవత ఓర్పు, తిరగబడిన తీర్పు

న్యాయదేవత ఓర్పు, తిరగబడిన తీర్పు - Sakshi


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా సూర్యనెల్లి కేసును సమీక్షించారు. కేరళ హైకోర్టు 2005లో ఇచ్చిన తీర్పును తూర్పార బట్టారు. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ 2013 జనవరి 31న కేసును తిరిగి కేరళ హైకోర్టుకు పంపారు. సుప్రీం ఆదేశంతో కేరళ హైకోర్టు కేసును మళ్లీ విచారించింది.

 

 న్యాయం అనేది ఏకపక్షంగానే ఉండదు.. రెండో పక్షం వైపూ ఉంటుంది-- అంటారు రూజ్‌వెల్ట్. ఎన్నికల హడావుడిలో ఎవరికీ పట్టకుండా పోయింది గానీ లేకుంటే దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరిగి ఉండాల్సిన వార్తల్లో ఇదొకటయ్యేది. ఈ కేసు విషయంలో న్యాయం ఆలస్యమైందే తప్ప తిరస్కారానికి గురి కాలేదు. సుమారు 18 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయికి న్యాయం జరిగింది అనే కన్నా దక్కిందనడం సబబు. తనపై సాక్షాత్తూ ఓ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవడమే కాకుండా 35 మంది నిందితుల్లో 34 మందికి శిక్ష సబబే అని తీర్పు వచ్చింది.

 

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా సూర్యనెల్లి గ్రామానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసది. 1996లో నమోదయిన ఈ కేసు అనేక మలుపులు, మరకలు మిగిల్చింది. ఈ కేసు 1996 ఎన్నికలు మొదలు నిన్న మొన్నటి వరకు నలుగురి నోళ్లల్లో నానుతూనే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పీజే కురియన్ పేరు ఈ కేసులో ప్రస్తావనకు వచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది. అపహరణకు గురయిన ఆ బాలిక కేరళ, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో అత్యాచారానికీ, అవమానాలకూ గురయింది.



 ఆ అమ్మాయి ప్రియుడిగా భావిస్తున్న యువకుని మొదలు బ్రోకర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు ఎందరెందరో ఈ కేసులో నిందితులు. 40 మందిపై కేసు నమోదయితే 2000వ సంవత్సరం సెప్టెంబర్ 6న తీర్పు ఇచ్చిన ప్రత్యేక కోర్టు 35 మందికి కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షపై హైకోర్టుకు వెళ్లిన నిందితుల్లో 34 మంది 2005లో నిర్దోషులుగా విడుదలయ్యారు. జస్టిస్ కేఏ అబ్దుల్ గఫూర్, ఆర్.బసంత్‌తో కూడిన హైకోర్టు బెంచ్ ఒక్కర్ని మాత్రమే దోషిగా తేల్చింది. ఆమె సమ్మతి లేకుండానే లైంగిక కలయిక జరిగిందన్న దానికి సాక్ష్యాధారాలు లేవని కోర్టు ఆనాడు పేర్కొంది. అందువల్ల ఆమెపై చట్టవిరుద్ధంగా అత్యాచారం జరిగిందనడానికి వీలు లేదని, పైగా చట్టం పేర్కొంటున్న మైనర్ వయసు -16 ఏళ్లు- దాటిపోయిందని, శారీరక కలయిక ఇష్టపూర్వకంగానే జరిగిందంటూనే ఆ అమ్మాయిని బాల్య వేశ్యగా అభివర్ణించింది. ఆ అమ్మాయి తప్పించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ వినియోగించుకోలేదని, 40 రోజుల్లో 37 మంది 67 సార్లు అత్యాచారం చేశారనడాన్నీ కోర్టు తోసిపుచ్చింది.- దారితప్పిన ఆ అమ్మాయి అన్నీ తెలిసే ఈ ప్రయాణం చేసిందని, నిందితులు చేసిన తప్పల్లా ఆ యువతిని వ్యభిచారిగా భావించి ఆమెతో వెళ్లడమేనని పేర్కొంది.



 ఆమెను బాల్య వేశ్యగా పరిగణించడానికి చాలా సాక్ష్యాధారాలున్నాయని, అటువంటి యువతితో లైంగిక సంబంధం అనేది అత్యాచారం కిందకు రాదని ఈ డివిజన్ బెంచ్ తేల్చింది. అంతేకాకుండా ఆ అమ్మాయిని దారితప్పిన బాలికగా అభివర్ణించింది. ఈ తీర్పును ప్రాసిక్యూషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే బాధితురాలికి కేరళ వామపక్ష ప్రభుత్వం ఇచ్చిన గుమస్తా ఉద్యోగం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో జైల్లో పెట్టించింది. ఎన్నో అవమానాలకు గురయింది. ఇదిలా కొనసాగుతున్న దశలోనే 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు సుప్రీంకోర్టు ముందుకువచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్భయ చట్టంతో బాధితురాలి తరఫున పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాలు మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కాయి. బాధితురాలికి న్యాయం చేయమని అభ్యర్థించాయి. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా సూర్యనెల్లి కేసును సమీక్షించారు.

 కేరళ హైకోర్టు 2005లో ఇచ్చిన తీర్పును తూర్పారబట్టారు. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ 2013 జనవరి 31న కేసును తిరిగి కేరళ హైకోర్టుకు పంపారు. సుప్రీం ఆదేశంతో కేరళ హైకోర్టు కేసును మళ్లీ విచారించింది.



  ఈసారి జస్టిస్ కేటీ శంకరన్, జస్టిస్ ఎంఎల్ జోసఫ్ ఫ్రాన్సిస్‌తో కూడిన డివిజన్ బెంచ్ కేసును చేపట్టింది. ఇదే కోర్టుకు చెందిన మరో బెంచ్ చేసిన ప్రతికూల వ్యాఖ్యలన్నింటినీ ఉపసంహరించింది. మొత్తం నిందితులందర్నీ దోషులుగా తేల్చింది. ఇన్నేళ్లూ బాధితురాలు పడిన క్షోభను మాటల్లో వర్ణించలేం. కేసు మొదలయినప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లయితే కోర్టు ఆమెపై ప్రతికూల వ్యాఖ్యలు చేసేనాటికి 24 ఏళ్ల యువతి. బాధితురాలయిన ఈ యవతిపై కోర్టు చేసిన వ్యాఖ్యల నుంచి ఉపశమనం కలగడానికి మరో 9 ఏళ్లు పట్టింది. అత్యాచారాల కేసుల విచారణలో వచ్చిన మార్పుకు ఈ ఉదంతం ప్రత్యక్ష నిదర్శనమైతే అందుకు కచ్చితంగా దోహదం చేసింది మాత్రం ఢిల్లీ యువతి నిర్భయ కేసు. ఢిల్లీ సంఘటనలో ఆ యువతి మరణించి ఉండవచ్చు గానీ ఆమె పేరిట వచ్చిన నిర్భయ మాత్రం సజీవమే... హక్కుల సంఘాల విజయమే...

 ఎ.అమరయ్య, హైదరాబాద్

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top