ఉగ్రవాదంపై పోరు ఇలాగేనా?!

ఉగ్రవాదంపై పోరు ఇలాగేనా?! - Sakshi


 పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు పాఠశాలపై దాడిచేసి 132 మంది పిల్లలతోసహా 145 మందిని పొట్టనబెట్టుకుని ఆరు రోజులవుతున్నది. వారి క్రౌర్యాన్ని, ఉన్మాదాన్ని మరచిపోవడం పాకిస్థాన్‌కు ఇప్పట్లో సాధ్యం కాదు. ఆ దుర్మార్గం జరిగిన వెంటనే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పాక్‌నుంచి మాత్రమే కాదు...అఫ్ఘాన్‌నుంచి, ఆమాటకొస్తే ఈ ప్రాంతంనుంచే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆ సందర్భంగా ఆయన ప్రకటించారు.


మరణశిక్షలపై దేశంలో ఉన్న మారటోరియాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత పాక్ పరిణామాలను గమనిస్తే ఉగ్రవాదంపై ప్రకటించిన యుద్ధం అక్కడ సవ్యమైన దిశలో వెళ్తున్నదా అనే సందేహం కలుగుతుంది. 2008లో ముంబై ఉగ్రవాద ఘటనకు కుట్రపన్నిన ఉగ్రవాది లఖ్వీకి పెషావర్ విషాదం జరిగిన మూడు రోజులకే రావల్పిండి కోర్టు బెయిల్ మంజూరుచేసింది. దీనిపై ఇంటా,బయటా తీవ్ర నిరసనలు వెలువడ్డాక అతన్ని ప్రజా భద్రత చట్టంకింద మూడు నెలలు నిర్బంధంలోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరోపక్క ఉగ్రవాద ఘటనల్లో మరణశిక్ష పడినవారికి ఆ శిక్షను అమలు చేయడమూ ప్రారంభమైంది. పాక్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌పై హత్యాయత్నం చేసిన నలుగురు ఉగ్రవాదులను వెనువెంటనే ఉరితీశారు.


అదే కేసులో ముద్దాయిలైన మరో నలుగురికి కూడా మరణశిక్ష అమలుచేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు... ఈ వారంలో 500 మంది ఉగ్రవాదులకు ఉరి బిగించబోతున్నట్టు ఒక అధికారి చెప్పారు. పాకిస్థాన్‌లో మొత్తం 8,261 మంది ఉరిశిక్ష పడిన ఖైదీలున్నారు. వీరిలో 30 శాతంమంది...అంటే దాదాపు 2,580 మంది ఉగ్రవాద ఉదంతాల్లో దోషులుగా తేలినవారు. పాకిస్థాన్‌లో 2002 తర్వాత 60,000 మంది ఉగ్రవాదుల దుశ్చర్యకు బలైపోయారు. అయితే, మారటోరియం ఎత్తేశాక ప్రభుత్వం ముందుగా ఉరిశిక్షకు ఎంపిక చేసుకున్నవారంతా ముషార్రఫ్‌పై దాడికి దిగినవారే కావడం కేవలం యాదృచ్ఛికమేనా అనే సందేహం సహజంగానే తలెత్తుతుంది.


పెషావర్ ఘటన నేపథ్యంలో ఉగ్రవాదులపై పాక్ సైన్యానికి ఆగ్రహావేశాలున్న మాట నిజమే. వారొక్కరికి మాత్రమే కాదు...ప్రపంచం మొత్తమే ఆ దుర్గార్గులను శిక్షించాలని కోరుకుంటున్నది. ఈ పన్నెండేళ్లలో ఉగ్రవాదుల ఆగడాలకు బలైపోయిన 60,000 మందికి చెందిన కుటుంబాల వారూ అదే కోరుకుంటున్నారు. మరణశిక్ష అమలులోని మంచిచెడ్డల మాట అలా ఉంచి అసలు దాన్ని అమలు చేయడానికి ఎంపిక చేసుకున్న విధానం ఎలాంటిదో ఒకసారి పాక్ సరిచూసుకోవాలి.



 పాక్ సైన్యానికి ఉగ్రవాదం విషయంలో స్పష్టత లేదు. ‘ఒక దేశం ఉగ్రవాదులుగా ముద్రవేసినవారు మరో దేశం దృష్టిలో దేశభక్తులు కావొచ్చ’ని దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్వయంగా ముషార్రఫ్ అన్నారు. మన దేశంలో దాడులకు దిగుతున్నవారినుద్దేశించి ఆయన ఆ మాటలన్నారు. అలాంటి అభిప్రాయం ఉండబట్టే పాక్ సైన్యం కొన్ని ఉగ్రవాద గ్రూపులకు అండగా నిలుస్తున్నది. వారికి ఆయుధాలు, శిక్షణ వంటివి ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. భారత- పాక్‌ల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడుతుందనుకున్న ప్రతిసారీ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ గ్రూపులను రంగంలోకి దించి మారణకాండకు కారణమవుతున్నది. ఇటు రాజకీయ వ్యవస్థ కూడా మతాన్ని, రాజకీయాలనూ కలగాపులగం చేయడంవల్ల...మతం బోధించే అంశాలను వక్రీకరించడంవల్లా దాదాపు అన్ని స్థాయిల్లోనూ ఉగ్రవాదులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.


 


తాము బలంగా ద్వేషించే మతస్తులపైనో, దేశంపైనో ఉగ్రవాదులు దాడులకు దిగినప్పుడు సంబరపడే స్థితి ఈ వాతావరణంవల్ల ఏర్పడింది. ఇదే పెషావర్‌లో నిరుడు సెప్టెంబర్‌లో ఆల్ సెయింట్స్ చర్చిలో ఇద్దరు మానవ బాంబులు తమను తాము పేల్చుకున్నప్పుడు వందమందికిపైగా మరణించారు. ఆ ఉదంతంపై ఇంతరకూ సరైన చర్యలు లేవు. ఇకపై తమకు మంచి తాలిబన్లు, చెడ్డ తాలిబన్లు అనే విచక్షణ ఉండబోదని షరీఫ్ ఇప్పుడు ప్రకటించి ఉండొచ్చుగానీ ఇలాంటి వాతావరణం అంత సులభంగా మారదు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)పై పాక్ సైన్యం చర్యలు తీసుకుంటున్న మాట వాస్తవమే అయినా అది ఇప్పటికీ  జమా ఉద్ దవా, లష్కరే తొయిబా, హక్కానీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో తనకున్న బాంధవ్యాన్ని తెగదెంపులు చేసుకోలేదు.

 


తమ అస్తవ్యస్థ విధానాల పర్యవసానంగా ఏర్పడిన సంక్షోభంనుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, ఇరుగు పొరుగు దేశాల్లో అలజడులు సృష్టించడానికి పాకి స్థాన్‌లోని పాలకవర్గం ఆదినుంచీ ఇలాంటి గ్రూపులను ప్రోత్సహిస్తుంటే...పనిలో పనిగా తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి సైన్యం కూడా ఉగ్రవాదులను చేరదీస్తున్నది. ఇది వికటించిన కారణంగానే పెషావర్‌లో ఉగ్రవాదుల కదలికలపై ఉప్పందించే వారు లేకుండా పోయారు. దీన్నంతటినీ సరిచేయకుండా ఆదరా బాదరాగా ఉరిశిక్షల అమలు ప్రారంభించడంవల్ల సాధించాలనుకుంటున్నదేమిటో పాక్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి.


సైన్యమూ, భద్రతావ్యవస్థ, ప్రభుత్వం లోని సమస్త విభాగాలూ ఇకనుంచి అయినా పారదర్శకతతో, జవాబుదారీతనంతో పనిచేయాలి. ఇంతవరకూ తమవైపుగా జరిగిన తప్పులను చిత్తశుద్ధితో సమీక్షించు కుని సరిచేసుకోవాలి. భారత్, అఫ్ఘాన్‌వంటి దేశాలతో కలిసి పనిచేయాలి. ఇవేమీ చేయకుండా కొన్ని ఘటనలకు పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీసి, ఎంచుబడిగా కొన్ని ఉగ్రవాద ముఠాలపై మాత్రమే గురిపెట్టి చర్యలకు ఉపక్రమించడంవల్ల సరైన ఫలితాలు రావు. ఉగ్రవాదంపై జరగాల్సిన విస్తృత పోరాటాన్ని కుదించడంలోని ప్రమాదాన్ని పాకిస్థాన్ గ్రహించుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top