జర్మనీతో అనుబంధం


యూరప్‌లో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మెరిసిపోతున్న జర్మనీతో భారత్‌కు మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల అధినేతల మధ్యా శిఖరాగ్ర సమావేశం జరగడంతోపాటు 18 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. వీటిలో రక్షణ, భద్రత, ఇంటెలిజెన్స్, రైల్వే రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. కాలుష్య రహిత ఇంధన వనరులు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలాంటి అంశాల్లోనూ రెండు దేశాలూ మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

 

 ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే జర్మనీ సంస్థలకు సత్వరం అనుమతులు లభించే ప్రక్రియను అమలు చేయడంపై ఒప్పందం కుదరింది. వచ్చే అయిదేళ్లలో భారత్‌లో సౌరశక్తి రంగంలో వివిధ ప్రాజెక్టుల అమలుకు వంద కోట్ల యూరోలు (రూ. 7,300 కోట్లు) వెచ్చించాలని జర్మనీ నిర్ణయించింది. ఆర్నెల్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలో పర్యటించారు. ఆ సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ‘మేకిన్ ఇండియా’ను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాల సమయంలో మన దేశం చొరవతో న్యూయార్క్‌లో జరిగిన జీ-4 దేశాల సమావేశంలో మెర్కెల్ పాల్గొన్నారు.  

 

 అయితే ఇరుదేశాలమధ్యా ఇటీవలికాలంలో ఏర్పడిన కొన్ని పొరపొచ్చాల ప్రభావమూ ఈ సమావేశాలపై ఉందని చెప్పాలి. కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాషా బోధనను నిలిపేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిరుడు నవంబర్‌లో జారీచేసిన ఉత్తర్వు జర్మనీకి అసంతృప్తి కలిగించింది. ఇలా హఠాత్తుగా, ఏకపక్షంగా నిలిపేయడం తగదని పిల్లల తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇది అనవసర వివాదం. సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉండటంతోపాటు ఆ రంగంలో అత్యుత్తమ శ్రేణి విద్యాబోధన చేస్తున్న జర్మనీ యూనివర్సిటీల్లో ఉన్నతస్థాయి చదువుల కోసం వెళ్లాలని ఇంజనీరింగ్ పట్టభద్రులు తహతహలాడతారు. వారు జర్మన్ భాష నే ర్చుకోవడం తప్పనిసరి. అలాంటపుడు విద్యాలయాల్లో ఆ భాషా బోధనను తొలగించడం సరైన నిర్ణయం కాదు. మెర్కెల్ వినతి మేరకు కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్  భాషా బోధనకు మన దేశం అంగీకరించింది. అదే సమయంలో తమ దేశంలో సంస్కృతంతోపాటు పలు భారతీయ భాషల బోధనకు జర్మనీ కూడా అంగీకరించింది. ఇక జీవీకే ఫార్మా సంస్థ ఔషధాల క్లినికల్ పరీక్షల ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ మొన్న ఆగస్టులో 700 ఔషధాల అమ్మకాలపై ఈయూ నిషేధం విధించడం పర్యవసానంగా తలెత్తిన వివాదం మరొకటి.

 

 దీనికి నిరసనగా మన దేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) చర్చల నుంచి వైదొలగింది. మేథో హక్కులు, ఆటోమొబైల్ రంగంలో విధిస్తున్న టారిఫ్‌లు, ఈయూ ఎగుమతి చేసే వైన్, డైరీ ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు వంటి అంశాల్లో ఏర్పడిన వివాదాలు సద్దుమణిగే  దశలో ఈ ఔషధ అమ్మకాల నిషేధం సమస్య వచ్చిపడింది. ఈ విషయంలో చొరవ తీసుకుని ఈయూకు నచ్చజెప్పాలని, ఔషధ అమ్మకాలపై విధించిన నిషేధం తొలగింపజేయటంతోపాటు ఎఫ్‌టీఏ చర్చలు పునఃప్రారంభం కావడానికి చర్యలు తీసుకోవాలని మెర్కెల్‌ను మోదీ అభ్యర్థించారు. ఎఫ్‌టీఏపై అంగీకారం కుదిరితే అది భారత్, జర్మనీలకు మాత్రమే కాదు... ఈయూకి సైతం  మేలు చేస్తుంది. ఎనిమిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న ఎఫ్‌టీఏ చర్చలు ఏదో ఒక అంశంలో ఇబ్బందులు తలెత్తి నిలిచిపోతున్నాయి. ఈయూతో ఎఫ్‌టీఏపై అంగీకారం కుదిరితే ప్రధాన దేశమైన జర్మనీలో మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా జర్మనీ పెట్టుబడులు, ఆ దేశ ఉత్పత్తులు వెల్లువలా వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌టీఏ విషయంలో మెర్కెల్ ఏమేరకు తోడ్పడతారన్నది చూడాల్సి ఉంది.

 

 ఇక పరస్పర న్యాయ సహాయ ఒప్పందం(ఎంఎల్‌ఏటీ) కుదుర్చుకోవడం విషయంలో జర్మనీ ఆసక్తి ప్రదర్శించలేదని చెబుతున్నారు. భారత్‌లో ఉగ్రవాద నేరాలకు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడి జర్మనీలో తలదాచుకునే నేరస్తులను అప్పగించడానికి...అలాగే అక్కడ నేరాలు చేసి మన దేశంలో ఉంటున్నవారిని పంపించేందుకు ఈ ఒప్పందం అవకాశం ఇస్తుంది. అయితే మన దేశ చట్టాల్లో మరణశిక్షలు ఉండటంవల్ల దీన్ని కుదుర్చుకోవడం సాధ్యపడదని జర్మనీ తేల్చిచెప్పింది. జర్మనీ మరణశిక్షల్ని రద్దు చేయడమేకాక అలాంటి శిక్షలు అమలు చేసే దేశాలకు నేరస్తుల్ని అప్పగించడంలో సహకరించరాదన్న నియమం పెట్టుకుంది. ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఉమ్మడిగా కృషి చేయాలని మోదీ, మెర్కెల్   నిర్ణయించారు. ఈ ఉమ్మడి ప్రకటన ఉక్రెయిన్ వివాదాన్ని ప్రస్తావించడం గమనార్హం.

 

 అక్కడి సంక్షోభాన్ని నివారించడానికి జరిగే దౌత్యపరమైన చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని రెండు దేశాలూ స్పష్టం చేశాయి. వాస్తవానికి ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరును...ముఖ్యంగా క్రిమియాను అది విలీనం చేసుకోవడాన్ని జర్మనీ గట్టిగా వ్యతిరేకిస్తున్నది. రష్యాతో ఉన్న సాన్నిహిత్యంవల్ల మన దేశం మాత్రం ఆ అంశంలో అనిర్దిష్టంగానే ఉంది. అయినప్పటికీ ‘అన్ని దేశాల సార్వభౌమత్వానికీ, వాటి ప్రాదేశిక సమగ్రతకూ భారత్, జర్మనీలు గట్టిగా మద్దతిస్తున్నాయని’ ఉమ్మడి ప్రకటన స్పష్టంచేసింది. ఇప్పటికైతే రెండు దేశాలమధ్యా కుదిరిన ఒప్పందాలు మౌలికంగా ఆర్థికాంశాలకు సంబంధించినవే. ఇవి వ్యాపార, వాణిజ్య రంగాలకు విస్తరించాల్సి ఉంది. మిగిలిన యూరప్ దేశాలు ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్న ప్రస్తుత దశలో భారత్‌తో చెలిమి అత్యంత ముఖ్యమని జర్మనీ భావిస్తున్నది. కనుక భవిష్యత్తులో రెండు దేశాలమధ్యా బహుళ రంగాల్లో దృఢమైన బంధం ఏర్పడగలదని ఆశించవచ్చు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top