యూరప్‌తో కరచాలనం

యూరప్‌తో కరచాలనం - Sakshi


యూరప్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగడం, అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ చేతికి అధికారం రావడంలాంటి పరిణామాలతో అంతర్జాతీయంగా ఏర్పడ్డ అయోమయ వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌ ఖండంలోని జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్‌ దేశాల్లో పర్యటనకు సోమవారం బయల్దేరి వెళ్లారు. ఆ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను దృఢపరుచుకోవడంతోపాటు పెట్టు బడులు ఆహ్వానించడం కూడా ఈ పర్యటన ప్రధానోద్దేశం. మంగళవారం భారత్‌– జర్మనీల మధ్య రైల్వేలు, సైబర్‌ రంగం, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో పలు ఒప్పందాలు, అవగాహనలు కుదిరాయి.



ఇటీవలికాలంలో యూరప్‌ ఖండం ప్రత్యేకించి జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌ తదితర దేశాలు ఉగ్రవాద ఉదంతాల వల్ల ఎన్నో నష్టాలు చవిచూశాయి. మనది కూడా ఉగ్రవాద బాధిత దేశమే. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి సమష్టిగా పనిచేయడం ఎంతో అవసరం. మోదీ పర్యటన ఆ కోణంలో కూడా ఎంతో ముఖ్యమైనది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం కృషి చేస్తున్న మనకు జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాల మద్దతు కీలకమైనది. ఈ అంశాల్లో మన పట్ల ఒక సానుకూల దృక్పథం ఏర్పర్చడానికి ఈ పర్యటన దోహదపడుతుంది.



అలాగే అమెరికా–చైనాల మధ్య, అమెరికా–రష్యాల మధ్య ఉన్న సంబంధాలు కొత్త మలుపు తిరగడం, ఆ సంబంధాలపై ఇంకా అస్పష్టత కొనసాగుతుండటం వల్ల యూరప్‌లో ప్రధాన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌లతో, అదే ఖండంలోని ఇతర దేశాలతో మరింత సాన్నిహిత్యం నెరపడం ముఖ్యం. ప్రచ్ఛన్న యుద్ధ దశలో ఆ ఖండం తూర్పు, పశ్చిమ యూరప్‌లుగా విడిపోయింది. మొదటిది సోవియెట్‌ యూనియన్‌ అనుకూల శిబిరంతో, రెండోది అమెరికాతో ప్రయాణించాయి. సోవియెట్‌ పతనం తర్వాత తూర్పు, పశ్చిమ యూరప్‌లు ఏకమయ్యాయి. తొలి దశలో సోవియెట్‌తో సన్నిహితంగా ఉన్న మన దేశం మారిన కాలమాన పరిస్థి తులకు తగినట్టు వ్యవహరించింది. అటు ఈయూతో, ప్రత్యేకించి జర్మనీ, ఫ్రాన్స్‌ లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటు రష్యాతో చెలిమిని కొన సాగించింది.



కానీ క్రమేణా ఇదంతా మారుతూ వచ్చింది. అంతర్జాతీయ రంగంలో మనకు విశ్వసనీయ మిత్ర దేశంగా ఉన్న రష్యా మనతో తనకున్న సంబంధాలను యధాతథంగా కొనసాగిస్తూనే చైనాతో దగ్గరయ్యే దిశగా అడుగులేయడం ప్రారం భించింది. అంతేకాదు... పాకిస్తాన్‌తో మైత్రి నెరపేందుకు సిద్ధపడింది. నిరుడు గోవాలో జరిగిన బ్రిక్స్‌ దేశాల సదస్సు సందర్భంగా పాక్‌కు చెందిన రెండు ఉగ్ర వాద సంస్థల పేర్లను ప్రస్తావించాలని కోరినా రష్యా పెడచెవిన పెట్టింది. అంత క్రితం 2014లో పాకిస్తాన్‌కు ఆయుధాల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని తొలగిం చింది. నాలుగు సైనిక హెలికాప్టర్లను అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది తొలిసారి పాకిస్తాన్‌ డే సైనిక పేరేడ్‌లో రష్యా దళాలు పాల్గొన్నాయి. ఉక్రెయిన్‌లోని క్రిమియాను విలీనం చేసుకున్నాక తనకు నాటో దేశాలతో ఏర్పడ్డ వైషమ్యాల నేపథ్యంలోనే రష్యా ఈ కొత్త ఎత్తుగడలకు తెరతీసింది.



తన ప్రయోజనాల కోసం రష్యా తీసుకుంటున్న ఈ చర్యలన్నీ మనల్ని ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టే శాయి. ఎందుకంటే  చైనా, పాకిస్తాన్‌లతో మనకు సరిహద్దు వివాదాలున్నాయి. అవి రెండూ తరచు మన ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక అమెరికా–రష్యాల మధ్య ఉన్న సంబంధాల్లో ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. ట్రంప్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేతిలో కీలుబొమ్మగా భావించేవారు ఇప్పుడు అమెరికాలో చాలా మంది ఉన్నారు. కానీ ఆయన దాన్ని నిరూపించుకుంటారా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికైతే అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌ఏ), ఇతర సంస్థలు ట్రంప్‌–పుతిన్‌ సంబంధాలపై ఆధారాలు తవ్వితీసే పనిలోబడ్డాయి.



ట్రంప్‌–పుతిన్‌ సంబంధాల కారణంగా యూరప్‌ దేశాల్లో అమెరికాపై అప నమ్మకం ఏర్పడింది. దానిపై ఆధారపడటం తగ్గించి సొంత దోవ వెతుక్కోవడం ఉత్తమమని ఆ దేశాలు భావిస్తున్నాయి. ఆసియా వరకూ చూస్తే చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ట్రంప్‌ చేస్తున్న యత్నాలు మనతోపాటు జపాన్, ఇతర ఆసియా దేశాలను కూడా అయోమయంలోకి నెడుతోంది. ఇవన్నీ చివరకు ఎటు దారితీస్తాయో తెలియకపోయినా స్పష్టత ఏర్పడే వరకూ వేచి ఉండటం కూడా మంచిది కాదు. అందువల్లే అటు యూరప్‌ దేశాలు, ఇటు భారత్, జపాన్‌ తదితర ఆసియా దేశాలు కొత్త పొత్తుల కోసం సహజంగానే ప్రయత్నిస్తున్నాయి.



వీటితోపాటు ఈయూ నుంచి బ్రిటన్‌ తప్పుకోవాలని నిర్ణయించాక ఈయూ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అందువల్ల భారత్‌లాంటి పెద్ద దేశంతో సహకారం పెంచుకోవాలని జర్మనీ భావిస్తోంది. అందువల్ల సహజంగానే అది నరేంద్ర మోదీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూసింది.  రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరగబోయే అంతర్జాతీయ ఆర్ధిక సదస్సులో కూడా మోదీ పాల్గొనబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది వ్యాపా రవేత్తలు పాలుపంచుకునే ఆ సదస్సు భారత్‌లో పెట్టుబడులను కోరడానికి మంచి వేదిక అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతోపాటు పుతిన్‌తో మోదీ జరపబోయే ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత సంబంధాల సమీక్ష కూడా ఉంటుంది.



వ్యాపార, వాణిజ్య, రక్షణ, అణు రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాధినేతలూ చర్చిస్తారు. 2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 3,000 కోట్ల డాలర్లకు చేరుకోవాలని ఇరు దేశాలూ లక్ష్యంగా నిర్ణయించుకున్నా అది ప్రస్తుతం దాదాపు 800 కోట్ల డాలర్ల వద్దే ఆగిపోయింది. శరవేగంతో మారిపోతున్న అంతర్జాతీయ పరిణామాల్లో స్నేహం శాశ్వతం కానట్టే శత్రుత్వం కూడా శాశ్వతం కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం, క్షీణిస్తున్న సంబం ధాలను పునరుద్ధరించుకోవడం, ఉన్న సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడం అవసరం. ఈ నేపథ్యంలో ప్రధాని యూరప్‌ దేశాల పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top