కశ్మీర్‌పై బహుపరాక్‌!

కశ్మీర్‌పై బహుపరాక్‌! - Sakshi


కశ్మీర్‌ ఉద్రిక్తతలు ఎడతెగకుండా సాగుతున్నకొద్దీ బయటివారు ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉంటారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెర్స్‌ చేసిన తాజా వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఇరు దేశాలూ చర్చలద్వారా కశ్మీర్‌ సమస్య పరిష్కరించుకునేలా ఒప్పించడం కోసమే పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో మూడుసార్లు, ప్రధాని నరేంద్రమోదీతో రెండుసార్లు మాట్లాడానని ఆయన చెప్పు కున్నారు. ఆయన దీన్ని మధ్యవర్తిత్వం నెరపడంగా చెప్పడం లేదు. సమస్యను వారే మాట్లాడుకుంటారని అంటున్నారు. అయితే అమెరికా ఇంతకు మించి మాట్లా డింది.


ఆమధ్య ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తమ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ‘ఒప్పందాలు కుదర్చడంలో ఉన్న అసాధారణ నైపుణ్యం’ కశ్మీర్‌ సమస్య పరి ష్కారానికి దోహదపడుతుందని ప్రకటించారు. సరిగ్గా పాకిస్తాన్‌ కోరుకుంటున్నది ఇదే. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారకుండా చూస్తే...కశ్మీర్‌ కల్లోలం ఎప్పటికీ ఆగకపోతే ప్రపంచ దేశాలు తన దారికి వస్తాయని, భారత్‌పై ఒత్తిడి తెస్తాయని ఆ దేశం అనుకుంటోంది. కనుకనే ఈ రెండు అంశాల్లోనూ మన దేశం అత్యంత జాగరూకతతో అడుగులేయాల్సిన అవసరం ఉంటుంది.



మునుపటితో పోలిస్తే అంతర్జాతీయ పరిస్థితుల్లో గణనీయంగా మార్పు లొచ్చాయి. మూడేళ్లనాడు బీజేపీని విజయపథంలో నడిపించిన ‘అబ్‌కీ బార్, మోదీ సర్కార్‌’ నినాదాన్ని పుణికిపుచ్చుకుని ట్రంప్‌ కూడా అధ్యక్ష ఎన్నికల్లో భార తీయ అమెరికన్లను ఆకర్షించారు. చాలా విషయాల్లో మోదీ, ట్రంప్‌ అభిప్రాయాలు కలుస్తున్నాయి గనుక ఆయన వైఖరి మనకే అనుకూలంగా ఉంటుందని కొందరు అంచనా వేశారు. కానీ ట్రంప్‌ ఫక్తు వ్యాపారవేత్త. ఆయనకు భారత్‌–పాక్‌ల మధ్య ఉన్న కశ్మీర్‌ వివాదం రియల్‌ఎస్టేట్‌ గొడవగా కనిపిస్తున్నట్టుంది. బిల్డర్‌గా స్థలా లను సేకరించడం కోసం రకారకాల వ్యక్తులతో మాట్లాడటం, ఒప్పించడం ట్రంప్‌ కున్న చిరకాల అనుభవం. దాన్నే మైక్‌ పెన్స్‌ ‘అసాధారణ నైపుణ్యం’గా లెక్కేశారు.


ఆయనే కాదు... ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉంటున్న నికీ హెలీ రెండు నెలలక్రితం ఆ మాదిరే మాట్లాడారు. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తగ్గడం కోసం రెండు పక్షాలతో చర్చించి మధ్యవర్తి పాత్ర పోషిస్తామని ఆమె చెప్పారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలు లేకుండా చూడటమే తమ ధ్యేయమన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఇటీవల మన దేశ పర్యటనకొచ్చినప్పుడు కూడా మధ్య వర్తిత్వం ప్రతిపాదన చేశారు. ఇలా పాక్‌ ఎప్పటినుంచో చేస్తున్న వాదనలకు అను కూలంగా లేదా దాని అభిప్రాయాలకు చేరువగా ఉండే మాటలు వినబడటం క్రమేపీ పెరుగుతున్నదని వీటన్నిటినీ గమనిస్తే అర్ధమవుతుంది.

 

 ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ జరిగినప్పుడల్లా కశ్మీర్‌ సమస్యను లేవనెత్తడం, ఆ వివాదంలో జోక్యం చేసుకుని పరిష్కరించమని కోరడం పాకిస్తాన్‌కు రివాజు. అన్ని సందర్భాల్లోనూ మన దేశం ఆ వాదనను ఖండిస్తూ వస్తోంది. కశ్మీర్‌ విషయంలో రెండు దేశాల మధ్యా వివాదం ఉన్న సంగతిని మనం కాదనడం లేదు. చారిత్రక వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్క రించుకుందామని మన దేశం ప్రతిపాదిస్తూనే ఉంది. అయితే అందుకోసం సరిహద్దుల్లో శాంతి నెల కొనాలని, రాష్ట్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పనులు మానుకోవాలని అంటోంది.


ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి ప్రయత్నం జరిగిన ప్రతిసారీ పాక్‌ ఏదో రకంగా దానికి గండికొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అదే సమయంలో వీలు దొరికినప్పుడల్లా ఈ సమస్యలో అంతర్జాతీయ జోక్యం అవ సరమంటూ డిమాండ్‌ చేస్తోంది. భారత రాజ్యాంగ పరిధిలో కశ్మీరీల ఆకాంక్షలను సాకారం చేస్తామని గతంలో ప్రధానులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, వాజపేయి, మన్మోహన్‌సింగ్‌ పలుమార్లు చెప్పారు. వాజపేయి అయితే జమ్ము– కశ్మీర్‌ సహా ఎనిమిది అంశాలపై సమగ్ర చర్చలు జరపడానికి లాహోర్‌కు బస్సు దౌత్యం నెరపారు.

 

అదృష్టవశాత్తూ మన దేశంలో పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా కశ్మీర్‌ సమస్యపై వాటన్నిటిదీ ఒకటే మాట. కేంద్రంలో ఏ పార్టీ లేదా కూటమికి చెందిన ప్రభుత్వాలున్నా ఆ సమస్యపై మూడో పక్షం జోక్యాన్ని నిర్ద్వంద్వంగా వ్యతి రేకిస్తూనే వస్తున్నాయి. జమ్మూ–కశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలన్నిటిదీ ఇదే వైఖరి. రాజకీయంగా ఈ స్థాయిలో ఏకాభిప్రాయం ఉన్నప్పుడు రాష్ట్రంలో అంతర్గ తంగా ప్రశాంత పరిస్థితులు ఎందుకు నెలకొల్పలేకపోతున్నారు? రాష్ట్రంలోని నొవాత్తా జిల్లాలోని మసీదు వెలుపల శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న డీఎస్‌పీ ఒకరిపై బుధవారం గుంపు దాడిచేసి అత్యంత పాశవికంగా కొట్టి చంపిన ఉదంతం అక్కడ నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంది.


గత కొన్ని నెలలుగా అక్కడ ఆందోళనలు సాగుతున్నాయి. భద్రతాబలగాలపై దాడులు, ఉద్యమాలు ఆగడం లేదు. ఇదిలా రావణకాష్టంలా మండుతున్నకొద్దీ ప్రపంచంలో అందరి దృష్టీ దానిపై కేంద్రీకృతమవుతుంటుంది. పాకిస్తాన్‌కు, కశ్మీర్‌లో ఉద్రిక్తతలను రెచ్చగొడు తున్న శక్తులకు మరింత ఊతమిస్తుంది. జమ్మూ–కశ్మీర్‌లో పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయని అందరూ ఆశపడ్డారు. అది లేకపోగా పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. పీడీపీ నాయకురాలు, ముఖ్యమంత్రి మెహబూబా అటు కేంద్రాన్ని తన ఆలోచనలతో ప్రభావితం చేయలేకపోతున్నారు.



ఇటు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని చక్కదిద్ద లేకపోతున్నారు. చెప్పాలంటే ఆమెకు ఇరువైపులా విశ్వసనీయత లేకుండా పోయిందన్న అభిప్రాయం కలుగుతుంది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గమనించి అయినా కశ్మీర్‌లో ప్రశాంతత నెలకొనేలా చూడటం, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పర్చడం తక్షణావసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆ దిశగా అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. లేనట్టయితే కశ్మీర్‌పై గట్టెర్స్‌ మొదలుకొని ఎర్డోగాన్‌ వరకూ ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూనే ఉంటారు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top