హిందీ పెత్తనం

హిందీ పెత్తనం


విశిష్ట తెలుగు కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వాతంత్రోద్యమ సమయంలో హిందీ భాషా పెత్తనాన్ని ప్రశ్నించారు. ఆ ఉద్యమంలో పనిచేస్తున్నవారు మహాత్మా గాంధీ నుంచి, కాంగ్రెస్‌ నుంచి ఈ విషయంలో స్పష్టత సాధించాలని కోరారు. దక్షిణాది ప్రజల్లో హిందీ విషయంలో ఉన్న అనుమానాలనూ, భయా లనూ ఇది చాటుతుంది. స్వాతంత్య్రం వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత హిందీకి వ్యతి రేకంగా దక్షిణాది రాష్ట్రాలు... మరీ ముఖ్యంగా తమిళనాడు ఏ స్థాయిలో భగ్గు మన్నాయో అందరికీ తెలుసు. దీన్నంతటినీ మరిచి అప్పుడప్పుడు కేంద్రంలోని పాల కులు హిందీకి ‘ఎలాగైనా’ అగ్రాసనం సాధించిపెట్టాలని పరితపిస్తున్నారు.


అందులో భాగంగానే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రుల అధికారిక ప్రసంగాలన్నీ ఇకపై హిందీలోనే ఉండాలన్న పార్లమెంటరీ కమిటీ సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇటీవల ఆమోదముద్ర వేశారు. అధికార భాషకు చెందిన ఆ కమిటీ మొత్తంగా 117 సిఫార్సులు చేస్తే వాటిల్లో కొన్నిటిని ప్రణబ్‌ ఆమోదించారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ లోనూ, అన్ని కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లోనూ ఎనిమిది నుంచి పదో తరగతి వరకూ హిందీని తప్పనిసరి పాఠ్యాంశం చేయాలన్నది అందులో ఒకటి. అంతేకాదు... ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా జారీ చేసే టిక్కెట్లు ఇకపై హిందీలో ఉండబోతున్నాయి.




మన దేశం బహు భాషల నిలయం. జనాభా గణన సమయంలో సేకరించిన వివరాలు దేశంలో 122 భాషలున్నాయని లెక్కేస్తే పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సొసైటీ (పీఎల్‌ఎస్‌) 780 భాషలున్నాయని తేల్చింది. నిజానికి ఈ సంఖ్య 1,000 దాటి ఉండొచ్చని కొందరి అంచనా. దేశంలో 60 శాతంమంది హిందీయేతర భాషలు మాట్లాడుతున్నారు. మిగిలిన 40 శాతంమందిలో అందరూ ‘స్వచ్ఛమైన’ హిందీ మాట్లాడరు. హిందీకి దగ్గరగా ఉన్న బ్రజ్‌భాష, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వీవంటి 49 రకాల పలుకుబడులు వారి నోట వెంట వెలువడతాయి. మరి ఏ ప్రాతిపదికన హిందీ భాషకు ఇంతటి ప్రాధాన్యం ఇవ్వదల్చుకున్నారో పాలకులే చెప్పాలి.


1959 మొదలుకొని ఇంతవరకూ అధికార భాషకు చెందిన పార్లమెంటరీ కమిటీలు తొమ్మిది నివేదికలను సమర్పించాయి. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం హిందీ భాష వినిమయాన్ని పెంచడం కోసమంటూ చేసిన ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మెట్రిక్, ఆ పైస్థాయి అభ్యర్థులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరిగా ఉండాలన్నది ఆ ప్రతిపాదనల్లో ఒకటి. యూపీఏ ప్రభుత్వానికి తమ పార్టీయే నేతృత్వం వహిస్తున్నా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆ ప్రతి పాదనలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. వాటిని అమల్లోకి తెస్తే హిందీ భాషా ప్రాంతాల అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందుతారని, ఇతర రాష్ట్రాల వారు తీవ్రంగా నష్టపోతారని... ఇది తమకు సమ్మతం కాదని చెప్పారు.




ప్రజలు దేశంలో కాదు... భాషలో నివసిస్తారని తత్వవేత్త ఎమిల్‌ సియోరాన్‌ అంటాడు. ఏ భాషా ప్రాంతం వారైనా మరో భాష పెత్తనాన్ని సహించలేరు. భాష అధికారానికీ, ఆధిపత్యానికీ చిహ్నంగా మారితే అంగీకరించరు. తమ భాషా సంస్కృ తులను ఆ భాష నాశనం చేస్తుందన్న భయాందోళనలు జనంలో అలుముకుం టాయి. ఒకే భాష మాట్లాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం తమ మాటనూ, పలుకు బడినీ కించపరుస్తున్నారని తెలంగాణ ప్రాంత వాసులు ఆరోపించడం... విభజనో ద్యమానికి గల కారణాల్లో అదొకటి కావడం మరిచిపోకూడదు. తమ భాషపైనా, మాండలికంపైనా, సంస్కృతిపైనా ప్రజలకుండే మక్కువ అలాంటిది.


దేశంలో హిందీ ధగధగలాడాలని, అది జాతీయ భాషగా వెలుగులీనాలని ఉత్తరాది నేతలు కోరు కోవడం ఈనాటిది కాదు. స్వాతంత్య్రోద్యమ సమయంలోనే దాన్ని ‘ఉమ్మడి భాష’గా ప్రకటింపజేయడానికి జాతీయ కాంగ్రెస్‌లో ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ ఎన్‌జీ రంగా వంటి తెలుగు నేతలు వాటిని గట్టిగా ప్రతిఘటిం చారు. మద్రాసు ప్రెసెడె న్సీగా ఉన్నప్పుడే తమిళ గడ్డపై హిందీ వ్యతిరేకోద్యమం సాగింది. వీటిని మరువ రాదు. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులు సలహా పూర్వకమైనవే తప్ప ఆదేశాలు కాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెబుతు న్నారు. ఈ విషయంలో ఆర్డినెన్స్‌ జారీచేసే ఉద్దేశం లేదంటున్నారు. మంచిదే. కానీ సీబీఎస్‌ఈ సిలబస్‌లో, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీని తప్పనిసరి చేయడం లోని అంతరార్ధమేమిటి? ఇందువల్ల ఇతర భాషా సంస్కృతులవారు నష్టపోయే అవకాశం లేదా?




హిందీ భాషపై ఆ ప్రాంతవాసులకుండే అభిమానాన్ని, భావోద్వేగాలను ఎవ రైనా అర్ధం చేసుకుంటారు. అయితే అది నేర్చుకుతీరాలని ఇతరులపై ఒత్తిడి తీసుకు రావడం... ఆ భాషకూ, ఉత్తీర్ణతకూ...ఆ భాషకూ, ఉద్యోగానికీ... ఆ భాషకూ, పదో న్నతికీ లంకె పెట్టడం ఎవరూ సహించరు. ఇతర ప్రాంతాలవారికి హిందీ తప్పనిసరి కావాలనేవారు ఇతర భాషల్లో దేన్నయినా ప్రాథమికంగానైనా నేర్చుకునే ప్రయత్న మైనా చేసిన దాఖలాలున్నాయా? ఏ భాష అయినా సహజ పద్ధతుల్లో వికసించాలి. వలసలు, వాణిజ్యం, వినోదం వంటివి అందుకు దోహదపడతాయి. అలాంటివన్నీ ఇప్పటికే హిందీ భాషా వ్యాప్తిని తగినంతగా పెంచాయి. హిందీ చలనచిత్రాలు, టెలివిజన్‌ సీరియల్స్, ఇతర వినోద కార్యక్రమాలు పాలకుల ప్రమేయం లేకుండానే ఆ పని చేస్తున్నాయి.


ఇప్పటికిప్పుడే అది రాజభాషగా ఊరేగాలన్న ఆత్రుత దీన్నం తటినీ దెబ్బతీస్తుంది. ఇంతకూ హిందీ జాతీయ భాష కాదు. రాజ్యాంగం గుర్తించిన 22 అధికార భాషల్లో అదొకటి మాత్రమే. కాకపోతే దానికి తొలి స్థానం ఇచ్చారు. 1965కల్లా ఇంగ్లిష్‌ స్థానంలో హిందీని రాజభాష చేయాలని రాజ్యాంగ నిర్ణాయక సభలో సంకల్పించినా దక్షిణాదిన హిందీ వ్యతిరేకోద్యమం ఉధృతంగా సాగడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. జనం భాషనూ, వారి సంస్కృతినీ, వారి సంప్రదా యాలనూ, వారి పలుకుబడిని గౌరవించడం అవసరం. పెత్తందారీ పోకడలు, ఏక పక్ష నిర్ణయాలు, అధికార శాసనలు ఏ భాషనూ విస్తరింపజేయలేవు సరికదా... దానిపై అయిష్టతను పెంచుతాయి. పాలకులు దీన్ని గుర్తుంచుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top